ఆర్థిక సంఘం
15వ ఆర్ధిక సంఘం తన సలహా మండలి తో సమావేశమైంది.
Posted On:
24 APR 2020 7:01PM by PIB Hyderabad
15వ ఆర్ధిక సంఘం (XV ఎఫ్.సి.) 2020 ఏప్రిల్ నెల 23, 24 తేదీలలో తన సలహా మండలితో ఆన్ లైన్ సమావేశాలు నిర్వహించి, కమీషన్ ఎదుర్కొంటున్న వివిధ సమస్యలపై చర్చించింది. ఈ సమావేశానికి XV ఎఫ్.సి. చైర్మన్ శ్రీ ఎన్.కె. సింగ్ అధ్యక్షత వహించగా, కమీషన్ కు చెందిన సభ్యులందరూ, సీనియర్ అధికారులు హాజరయ్యారు. సలహా మండలి నుండి డాక్టర్ సాజిద్ జెడ్.చినోయ్; డాక్టర్ ప్రాచి మిశ్రా; శ్రీ నీలకంఠ్ మిశ్రా; డాక్టర్ ఓంకార్ గోస్వామి 2020 ఏప్రిల్ 23వ తేదీన సమావేశంలో పాల్గొన్నారు. డాక్టర్ అరవింద్ విర్మాణి; డాక్టర్ ఇందిరా రాజారామన్; డాక్టర్ డి.కె.శ్రీవాస్తవ; డాక్టర్ ఎమ్. గోవిందరావు; డాక్టర్ సుదీప్తో ముండ్లే; డాక్టర్ కృష్ణమూర్తి సుబ్రమణియన్ 2020 ఏప్రిల్, 24వ తేదీన సమావేశంలో పాల్గొన్నారు. 2020-21 సంవత్సరానికి గాను XV ఎఫ్.సి. తన నివేదిక సమర్పించిన అనంతరం, సలహా మండలి సమావేశం కావడం ఇది రెండో సారి.
భారత ఆర్ధిక వ్యవస్థపై కోవిడ్ మహమ్మారి, జాతీయ లాక్ డౌన్ ల ప్రభావం కారణంగా దేశీయ కార్యకలాపాలు క్షీణించాయనీ, వ్యాపార సంస్థలు, ఆర్ధిక సంస్థల్లో నగదు లావాదేవీలు తగ్గాయనీ, అలాగే ప్రపంచ వ్యాప్తంగా నెలకొన్న ఆర్ధిక మాంద్యం కారణంగా భారీతయ వస్తువులకు ప్రపంచ డిమాండ్ తగ్గిపోయిందనీ సలహామండలి సభ్యులు ప్రస్తావించారు. 2020 మర్చి నెలకు ముందు ప్రతిపాదించిన వాస్తవ జి.డి.పి. వృద్ధి రేటును తిరిగి పూర్తిగా సమీక్షించి, గణనీయంగా దిగువకు సవరించవలసిన అవసరం ఉందని ఏకగ్రీవంగా సభ్యులందరూ సూచించారు. ఆర్ధిక వ్యవస్థ లాక్ డౌన్ నుండి బయటపడిన తర్వాత, కార్మికుల సామర్ధ్యం వినియోగం, మధ్యవర్తుల సరఫరా పునరుద్ధరణ, నగదు చలామణీ, ఉత్పత్తికి డిమాండు అనే విషయాలపై రికవరీ ఆధారపడి ఉంటుంది. అందువల్ల, కోవిడ్ యొక్క ఆర్ధిక ప్రభావం తీవ్రత కాలక్రమేణా నెమ్మదిగా తగ్గుతుంది.
ఈ పరిణామాల ప్రభావం తీవ్రత ప్రభుత్వ ఆర్థికస్థితి పైన ఎంత ఉంటుందనేది చెప్పలేము. అయితే ఇది చాలా ఎక్కువగా ఉంటుందని మాత్రం చెప్పగలమని సలహా మండలి అభిప్రాయపడింది. ఆరోగ్యం, పేదలకు ఆర్ధిక సహాయం, ఇతర ఆర్ధిక పరమైన పనుల కారణంగా ప్రభుత్వంపై వ్యయ భారం గణనీయంగా పడుతుంది. ఆర్ధిక కార్యకలాపాలు తగ్గడంతో పన్నులు, ఇతర ఆదాయ వనరుల ద్వారా ఆదాయం గణనీయంగా తగ్గుతుందని మండలి సభ్యులు అభిప్రాయపడ్డారు. తద్వారా, సంక్షోభం వల్ల ఆర్ధిక ప్రతిస్పందన చాలా ఎక్కువగా ఉంటుంది. ఆర్ధిక ప్రతిస్పందన పరిమాణాన్ని చూడడం మాత్రమే ముఖ్యం కాదు, దాని పరిష్కారానికి జాగ్రత్తగా ప్రణాళిక రూపొందించాలి. ఆర్ధిక వ్యవస్థ కు మద్దతుగా ప్రభుత్వ వ్యయం పరంగా మండలి ఆర్ధిక సంఘానికి వివిధ సలహాలు సూచించింది.
దిగువ పేర్కొన్న సలహాలను పరిగణలోనికి తీసుకోడానికి ముఖ్యమైనవిగా వారు భావించారు.
(a) కోవిడ్ పరిస్థులకు ముందు నుంచీ చిన్న తరహా పరిశ్రమలు నగదు అందుబాటు లేక ఇబ్బంది పడుతున్నాయి. వాటి కార్యకలాపాల స్థాయి, నగదు తక్కువగా ఉండడంతో, అవి ఆ సమస్యను అధిగమించేందుకు వీలుగా ఒక సహాయ కార్యక్రమాన్ని రూపొందించాలి.
(b) స్లో డౌన్ వల్ల బ్యాంకింగ్ కానీ ఆర్ధిక సంస్థలు కూడా బాగా దెబ్బతిన్నాయి. దివాళా తీయకుండా ఉండడానికి, ఆర్ధిక రంగంలో ఎన్.పి.ఏ.లు ఎక్కువ కాకుండా ఉండడానికి, తగిన చర్యలు తీసుకోవాలి. పాక్షిక ఋణ హామీ వంటి చర్యలు సహకరించే అవకాశం ఉంది. ఆర్ధిక సంస్థలు సమృద్ధిగా పెట్టుబడి పెట్టే విషయంలో భారతీయ రిజర్వ్ బ్యాంకు ప్రధాన పాత్ర పోషించాలి.
(c) కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆర్ధిక పరిస్థితులను క్షుణ్ణంగా పరిశీలించవలసిన అవసరం ఉంది. ప్రస్తుతానికి సమృద్ధిగా అందజేస్తున్న సదుపాయాలు ప్రధానంగా నగదు అసమతుల్యతను నిర్వహించడానికి మాత్రమే ప్రభుత్వానికి సహాయపడతాయి. ముందుకు వెడుతున్న కొద్దీ అదనపు లోటును తీర్చడానికి మార్గాలను అన్వేషించవలసి వస్తుంది. ఈ మహమ్మారిని ఎదుర్కోడానికి అవసరమైన నిధులను రాష్ట్ర ప్రభుత్వాలకు సమృద్ధిగా అందుబాటులో ఉంచడం చాలా ముఖ్యం.
(d) వివిధ రాష్ట్రాలలో ఈ మహమ్మారి వివిధం దశల్లో ఉండడం వల్ల, ఆయా రాష్ట్రాలు వాటి ప్రభావం నుండి వివిధ సమయాల్లో బయట పడే అవకాశం ఉంది. అందువల్ల ఆయా రాష్ట్రాల పునరుద్ధరణ ప్రక్రియలు కూడా భిన్నంగా ఉంటాయని మండలి అభిప్రాయపడింది.
15వ ఆర్ధిక సంఘం తన సలహా మండలితో కలిసి అంతర్జాతీయంగానూ, దేశీయంగానూ అభివృద్ధి చెందుతున్న పరిస్థితిని ఆసక్తిగా గమనిస్తోంది.
******
(Release ID: 1618083)
Visitor Counter : 346