గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ

రాష్ట్రాల గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రుల‌తో కేంద్ర గ్రామీణాభివృద్ధి, పంచాయితీరాజ్ మ‌రియు వ్య‌వ‌సాయ‌శాఖ మంత్రి శ్రీ న‌రేంద్ర సింగ్ తోమ‌ర్ వీడియో కాన్ఫ‌రెన్స్‌
మ‌హాత్మాగాంధీ గ్రామీణ ఉపాధి హామీ ప‌థ‌కం,ప్ర‌ధాన మంత్రి ఆవాస్ యోజ‌న గ్రామీణ్‌‌, ప్ర‌ధాన మంత్రి గ్రామ్ స‌డ‌క్ యోజ‌న‌, జాతీయ గ్రామీణ జీవ‌నోపాధి కార్య‌క్రమం ( ఎన్ ఆర్ ఎల్ ఎం) కింద చేప‌ట్టే ప‌నుల‌పై చ‌ర్చ‌
కోవిడ్ -19 స‌వాళ్ల‌ను ఉప‌యోగించుకొని గ్రామీణ మౌలిక స‌దుపాయాల‌ను బ‌లోపేతం చేసుకోవాల‌ని గ్రామీణ ప్రాంతాల్లో ఉద్యోగ‌ల క‌ల్ప‌న చేసుకోవాల‌ని రాష్ట్ర మంత్రుల‌కు సూచించిన కేంద్ర‌మంత్రి

Posted On: 24 APR 2020 8:15PM by PIB Hyderabad

కోవిడ్ -19 మ‌హ‌మ్మారి వైర‌స్ కార‌ణంగా దేశ‌వ్యాప్తంగా లాక్ డౌన్ కొన‌సాగుతున్న విష‌యం తెలిసిందే. అయితే వ్య‌వ‌సాయ కార్య‌క్ర‌మాలు స‌జావుగా సాగ‌డం కోసం ఈ నెల 20నుంచి దేశంలో వైర‌స్ ప్ర‌భావం లేని ప్రాంతాల్లో కొన్ని స‌డ‌లింపులు ఇచ్చారు. ఈ నేప‌థ్యంలో వ‌చ్చిన అవ‌కాశాల‌ను ఎలా ఉప‌యోగించుకోవాల‌నే అంశంపై రాష్ట్రాల గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రుల‌తో కేంద్ర గ్రామీణాభివృద్ధి, పంచాయితీరాజ్ మ‌రియు వ్య‌వ‌సాయ‌శాఖ మంత్రి శ్రీ న‌రేంద్ర సింగ్ తోమ‌ర్ వీడియో కాన్ఫ‌రెన్స్ ద్వారా మాట్లాడారు. 
మ‌హాత్మాగాంధీ గ్రామీణ ఉపాధి హామీ ప‌థ‌కం,ప్ర‌ధాన మంత్రి ఆవాస్ యోజ‌న గ్రామీణ్‌‌, ప్ర‌ధాన మంత్రి గ్రామ్ స‌డ‌క్ యోజ‌న‌, జాతీయ గ్రామీణ జీవ‌నోపాధి కార్య‌క్రమం ( ఎన్ ఆర్ ఎల్ ఎం) కింద చేప‌ట్టే ప‌నుల‌ను వేగ‌వంతం చేయ‌డంపై రాష్ట్రాల మంత్రుల‌తో కేంద్ర మంత్రి శ్రీ తోమ‌ర్ స‌వివ‌రంగా మాట్లాడారు. 
కోవిడ్ -19 స‌వాళ్ల‌ను ఉప‌యోగించుకొని గ్రామీణ మౌలిక స‌దుపాయాల‌ను బ‌లోపేతం చేసుకోవాల‌ని గ్రామీణ ప్రాంతాల్లో ఉద్యోగ అవ‌కాశాల‌ను సృష్టించుకోవాల‌ని రాష్ట్ర మంత్రుల‌కు ఆయ‌న‌ సూచించారు. 
ఈ ఆర్ధిక సంవ‌త్స‌రంలో కేంద్ర గ్రామీణాభివృద్ధిశాఖ ఆయా రాష్ట్రాల‌కు కేంద్ర పాలిత ప్రాంతాల‌కు రూ. 36 వేల కోట్ల రూపాయ‌ల‌ను విడుద‌ల చేసింద‌ని కేంద్రమంత్రి అన్నారు. అలాగే గ్రామీణ ఉపాధి హామీ ప‌థ‌కం కింద రూ. 33, 300 కోట్ల‌ను విడుద‌ల చేసిన‌ట్టు అందులో రూ. 20, 225 కోట్ల‌ను గ‌త సంవ‌త్సరాల బ‌కాయిల‌కోసం కేటాయించిన‌ట్టు ఆయ‌న అన్నారు. పైన తెలియ‌జేసిన మొత్తం... ఈ ఏడాది జూన్ వ‌ర‌కు చేసే ఖ‌ర్చులకు స‌రిపోతుంద‌ని అన్నారు. దేశంలో గ్రామీణాభివృద్ధి కార్య‌క్ర‌మాల‌కోసం కేంద్రం ద‌గ్గ‌ర త‌గిన‌న్ని నిధులున్నాయ‌ని రాష్ట్రాల‌కు మంత్రి భ‌రోసానిచ్చారు. 
కోవిడ్ -19 కు సంబంధించి అన్ని ర‌కాల జాగ్ర‌త్త‌లు తీసుకుంటూనే రాష్ట్రాలు కేంద్ర పాలిత ప్రాంతాలు గ్రామీణాభివృద్ధి ప‌థ‌కాల‌ను వేగంగా అమ‌లు చేయాల‌ని మంత్రి శ్రీ న‌రేంద్ర సింగ్ తోమ‌ర్ కోరారు. ఉద్యోగాల క‌ల్ప‌న చేయాల‌ని, మౌలిక‌స‌దుపాయాల‌ను క‌ల్పించాల‌ని, అలాగే గ్రామీణ జీవ‌నోపాధిని బ‌లోపేతం చేయాల‌ని సూచించారు. 
గ్రామీణ ఉపాధి హామీ ప‌థ‌కం కింద చేప‌ట్టే ప‌నుల ద్వారా నీటి సంర‌క్ష‌ణ చేయాల‌ని, భూమిలో నీటి వ‌న‌రులు పెరిగేలా చూసుకోవాల‌ని, అలాగే నీటి పారుద‌ల ప‌నులు చేప‌ట్టాల‌ని చెప్పారు. ఈ ప‌నుల‌ను జ‌ల‌శ‌క్తి మంత్రిత్వ‌శాఖ‌, భూ వ‌న‌రుల విభాగాల‌‌తో క‌లిసి చేయాల‌ని అన్నారు. 
పిఎంఏవై (జి) కింద ల‌బ్ధి దారుల‌కు 3, 4 వాయిదాల‌ద్వారా ఇచ్చిన 48 ల‌క్ష‌ల నివాస గృహ యూనిట్ల‌ను పూర్తి చేయ‌డానికి ప్రాధాన్య‌త ఇవ్వాల‌ని అన్నారు. అలాగే పిఎంజిఎస్ వై కింద కేటాయించిన రోడ్డు ప్రాజెక్టుల‌కు సంబంధించి వెంట‌నే టెండ‌ర్ల‌ను ఖ‌రారు చేయాల‌ని అన్నారు.  పెండింగులో వున్న రోడ్ల నిర్మాణాన్ని పూర్తి చేయాల‌న్నారు. 
స్వయం స‌హాయ‌క బృందాల‌కు చెందిన మ‌హ‌ళ‌లు ఎన్ ఆర్ ఎల్ ఎం ప‌థకాన్ని ఉప‌యోగించుకొని మాస్కుల‌ను, శానిటైజ‌ర్ల‌ను, స‌బ్బుల‌ను త‌యారు చేయ‌డం,  క‌మ్యూనిటీ వంట‌శాల‌ల్ని నిర్వ‌హించ‌డం అభినంద‌నీయ‌మ‌ని అన్నారు. 
కేంద్ర గ్రామీణ మరియు వ్య‌వ‌సాయ‌శాఖ మంత్రి ఇచ్చిన సూచ‌న‌ల‌కు రాష్ట్రాలు, కేంద్ర‌పాలిత ప్రాంతాలు అంగీకారం తెలిపాయి. గ్రామీణ ఉపాధి హామీ ప‌థ‌కం కింద పెండింగులో వున్న వేత‌నాలు, ఇత‌ర బ‌కాయిల‌ను చెల్లించింనందుకు మ‌హారాష్ట్ర‌, జార్ఖండ్‌, త‌మిళ‌నాడు , ప‌శ్చిమ బెంగాల్ రాష్ట్రాలు కేంద్ర‌మంత్రిని అభినందించాయి. 
కేంద్ర ప్ర‌భుత్వం అండ‌తో గ్రామీణాభివృద్ధికి సంబంధించిన అన్ని ప‌థ‌కాల‌ను స‌మ‌ర్థవంతంగా అమలు చేస్తామ‌ని అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు దీమా వ్య‌క్తం చేశాయి. కేంద్ర హోంశాఖ‌, కేంద్ర ఆరోగ్య శాఖ‌, కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ‌ల మార్గ‌ద‌ర్శ‌కాల ప్ర‌కారం అన్ని ప‌నులు, కార్య‌క్ర‌మాలు చేప‌డ‌తామ‌ని చెప్పాయి. 
............

 (Release ID: 1618082) Visitor Counter : 137