నౌకారవాణా మంత్రిత్వ శాఖ

సముద్ర వ్యాపార పరిశ్రమ ప్రతినిధులతో మంత్రి శ్రీ మన్సుక్‌ మాండవీయ సమీక్ష

కొవిడ్‌-19 పరిస్థితుల తర్వాత వ్యాపార కొనసాగింపు, మార్గాలపై చర్చ
సముద్ర వ్యాపారానికి కేంద్రం ఇచ్చిన ఉపశమనాలపై ప్రతినిధుల హర్షం

Posted On: 24 APR 2020 8:37PM by PIB Hyderabad

కేంద్ర షిప్పింగ్‌ శాఖ మంత్రి ( స్వతంత్ర హోదా ) శ్రీ మన్సుక్‌ మాండవీయ, వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సముద్ర వ్యాపార పరిశ్రమ ప్రతినిధులతో మాట్లాడారు. కొవిడ్‌-19 తర్వాత ఏర్పడే సవాళ్ల నేపథ్యంలో వ్యాపార కొనసాగింపు వ్యూహాలపై చర్చించడం, సమావేశం ఏర్పాటు చేయడం ఈ వీడియో కాన్ఫరెన్స్‌ ఉద్దేశం.
 
    లాక్‌డౌన్‌ పరిస్థితుల్లోనూ ఇబ్బందులు లేకుండా నౌకాశ్రయాలను నడిపించేందుకు సమయానుగుణంగా తీసుకున్న నిర్ణయాలను, క్రియాశీలంగా వ్యవహరించిన కేంద్ర షిప్పింగ్‌ శాఖను సముద్ర పరిశ్రమ ప్రతినిధులు అభినందించారు. పరిశ్రమకు కేంద్రం ప్రకటించిన అనేక ఉపశమనాలు, పొడిగింపులను ప్రశంసించారు. లాక్‌డౌన్‌ సమయంలో పోర్టు ఛార్జీలు, సమయానికి సరుకు అందించనందుకు రవాణాదారు వసూలు చేసే రుసుములు, జరిమానాలను వసూలు చేయకూడదన్న నిర్ణయాల పట్ల కృతజ్ఞతలు తెలిపారు. ఇది పరిశ్రమకు అతి పెద్ద ఊరటనిచ్చిందని వెల్లడించారు. 

కార్యకలాపాల ప్రారంభానికి పోర్టులు పూర్తి సన్నద్ధం

    పరిశ్రమ ప్రతినిధులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా కోవిడ్ -19 పరిస్థితుల్లో సముద్ర పరిశ్రమ స్థితిపై అవగాహన ఏర్పడింది. సరకు మరియు వాహనాల కదలికల వంటి రవాణా సమస్యల విషయంలో విధానపర జోక్యం చేసుకోవాలని పరిశ్రమ ప్రతినిధులు మంత్రిని కోరారు. తీర రవాణా, ప్రపంచ నౌకానిర్మాణంలో భారతదేశ వాటాను పెంచడానికి వారు సూచనలు చేశారు. ఎప్పటిలాగే కార్యకలాపాలు ప్రారంభించడానికి భారతీయ నౌకాశ్రయాలు పూర్తి సామర్థ్యంతో సన్నద్ధంగా ఉన్నాయని మంత్రి శ్రీ మన్సుక్‌ మాండవీయ సముద్ర వ్యాపార ప్రతినిధులకు అభయం ఇచ్చారు. అయితే, కొవిడ్‌-19 కారణంగా కొన్ని సమస్యలు వచ్చాయని, విధానపర నిర్ణయాలతో వాటిని పరిష్కరించి, నిజాయితీగా అమలు చేస్తామని వెల్లడించారు. కొవిడ్‌-19 సమయాన్ని అవకాశంగా మార్చుకుని సముద్ర వ్యాపారంలో కొత్త వ్యూహాలను రూపొందించాలని మంత్రి సూచించారు. సమస్యల పరిష్కారానికి షిప్పింగ్‌ మంత్రిత్వ శాఖ అవిశ్రాంతంగా పనిచేస్తోందన్నారు. కోవిడ్ -19 పరిస్థితిలో ఓడరేవులు, పరిశ్రమలు వృద్ధి చెందడానికి ఆయన సముద్ర వ్యాపార ప్రతినిధుల నుంచి సలహాలు కోరారు.

    FICCI ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ వీడియో కాన్ఫరెన్సులో సముద్ర వ్యాపార సంస్థల ప్రతినిధులు, పోర్టులు మరియు టెర్మినల్ ఆపరేటర్లు, అంతర్గత జలరవాణా ప్రతినిధులు, లాజిస్టిక్స్, నౌకల యజమానులు, నౌకల తయారీదారులు, కస్టమ్ ఏజెంట్లు పాల్గొన్నారు.


(Release ID: 1618081) Visitor Counter : 150