గృహ నిర్మాణం మరియు పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ

స్వచ్ఛ భారత్ మిషన్ (పట్టణ) లో భాగంగా సూరత్ నగరంలో

సంక్షోభ నివారణకు ప్రత్యేక ప్రణాళిక అమలు

Posted On: 13 APR 2020 3:34PM by PIB Hyderabad

‘డైమండ్ సిటీ’గా పేరొందిన సూరత్ నగరం చైతన్యానికి పెట్టింది పేరు.  గుజరాత్ రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి, దేశంలోని ఇతర రాష్ట్రాల నుంచి  జనం వలస రావడం వల్ల ఇండియాలో ఎంతో వేగంగా వృద్ధి చెందుతున్న నగరంగా కూడా సూరత్ పేరు గడించింది.  దేశంలో బహిరంగ మల విసర్జన నుంచి విముక్తి పొందిన కొన్ని ప్రధాన నగరాలలో సూరత్ ఒకటి. స్వచ్ఛత మార్గంలో పయనిస్తూనే సూరత్ స్పూర్తిదాయకమైన పనులు నిర్వహిస్తోంది.  కోవిడ్ -19 విశ్వ మహమ్మారి ప్రపంచ దేశాలను అతలాకుతలం చేస్తున్న సమయంలో నగర పౌరులను ఆదుకోవడంతో పాటు మొత్తం రాష్ట్రానికే సూరత్ ఆదర్శంగా నిలిచింది. మహమ్మారిని ఎదుర్కోవడానికి సూరత్ నగర పాలక సంస్థ (ఎస్ఎంసి)  అమలుచేసిన సత్వర సంక్షోభ యాజమాన్య ప్రణాళిక ఇతర నగరాలలో అమలు చేసేందుకు గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వానికి నమూనాగా మారింది. 

భౌతిక దూరం పెంచడంతో పాటు కోవిడ్ -19 వ్యాధిపై పోరాటం చేయడానికి  పాజిటివ్ వచ్చిన వారిని, వారి సంబందీకులను గుర్తించి, పరీక్ష చేసి, చికిత్స చేసే త్రివిధ పద్ధతిని  ఎస్ఎంసి అమలు చేసింది. ఇందుకోసం అనుమానిత కేసులను ముందుగా గుర్తించి పరీక్షలు జరిపారు. పాజిటివ్ కేసులకు శ్రద్ధతో చికిత్స చేశారు. 

అనుమానిత కేసుల జాడ కనిపెట్టడానికి ఏర్పాటు చేసిన ట్రాకర్ వ్యవస్థ (ఎస్ ఎం సి కోవిడ్-19 ట్రాకర్) ద్వారా ఐదు రోజుల్లో అందరినీ కనిపెట్టగలిగారు.  ఇందుకోసం ఒక వెబ్ పోర్టల్ మరియు మొబైల్ యాప్ ను ఉపయోగించారు. దాని ద్వారా విదేశాలకు వెళ్లి వచ్చిన వారిని, అంతర్ – రాష్ట్ర పర్యటనలు జరిపిన చరిత్ర ఉన్న వారిని, కోవిడ్ -19 పాజిటివ్ వచ్చిన వారితో ప్రత్యక్ష సంబంధం ఉన్న వ్యక్తులను గుర్తించారు. అంతేకాక ఎస్ఎంసి ఒక హెల్ప్ లైన్ నెంబరు 1800-123-800 ఏర్పాటు చేసింది. ఈ నెంబరుకు పౌరులెవరైనా ఫోన్ చేసి విదేశీ ప్రయాణాలు చేసినవారు లేక అనుమానితుల గురించి సమాచారం తెలియజేయవచ్చు. ఈ సమాచారాన్ని ఎస్ఎంసి  బృందం, ఆరోగ్య అధికారులు తనిఖీ చేసి నిర్దారించుకుంటారు. అదే యాప్ సహాయంతో క్వారెంటైన్ లో ఉన్న వారిని శ్రద్ధతో పరీక్షించడం, వారిలో ఏవైనా రోగ లక్షణాలు కనిపిస్తే వారిని సంప్రదించడం జరుగుతుంది.  

క్వారెంటైన్ లో ఉన్న వారి ఇళ్ళ నుంచి ఘన వ్యర్ధాల సేకరణకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.  ఇంటింటికీ వ్యర్ధాలను ప్రత్యేక వాహనాలలో సేకరించి జీవవ్యర్ధాల నిర్వహణకు సంబంధించిన మార్గదర్శకాల ప్రకారం విసర్జన ప్రక్రియను పూర్తి చేస్తారు. ఘన వ్యర్ధాల సేకరణతో పాటు నగర శుభ్రత కోసం పారిశుద్ధ్య చర్యలు సమర్ధవంతంగా నిర్వహిస్తున్నారు. 

స్వచ్ఛతతో పాటు నగరంలోని బహిరంగ స్థలాలలో రోగ క్రిమి నిర్మూలన పనులు కూడా ఎస్ ఎం సి చేపట్టింది. దుర్వాయువులను పోగొట్టే పనుల కోసం నగర పాలక సంస్థ మూడంచెల పద్ధతిని అమలు చేస్తోంది. ఇందుకోసం  అనుమానితులను తీసుకెళ్ళిన అంబులెన్సులు తదితర వాహనాలపై ప్రతిరోజూ రోగక్రిమి నాశక మందులు చల్లుతున్నారు. ఇందుకోసం అగ్నిమాపక దళం, తదితర ప్రభుత్వ శాఖల సహాయం తీసుకుంటున్నారు. పాజిటివ్ కేసులు ఉన్న ప్రాంతలపై ప్రత్యేక దృష్టి పెడుతున్నారు.  ఒక పాజిటివ్ కేసు ఉంటే దాన్ని కేంద్ర బిందువుగా తీసుకొని ఆ చుట్టూ పక్కల 3 కిలోమీటర్ల వరకు లేదా అధికారులు నిర్ణయించిన మేరకు వ్యాధి నిరోధక మండలంగా నిర్ణయించి ప్రత్యేకంగా మందులు చల్లే ఏర్పాట్లు చేస్తున్నారు. దాంతో పాటు ఆరోగ్య కార్యకర్తలు,  వాలంటీర్ల ద్వారా కోవిడ్-19 వ్యాధి గురించి అవగాహన కలుగజేస్తున్నారు. కోవిడ్ -19కు వ్యతిరేకంగా నగర పాలక సంస్థ చేపట్టిన, చేపడుతున్న రోజువారీ కార్యక్రమాల గురించి పత్రికా ప్రకటనలు, మీడియా సమావేశాల ద్వారా ప్రజలకు తెలియజేస్తున్నారు. అంతేకాక సామాజిక దూరం పాటించే పద్ధతుల గురించి పోస్టర్ల ద్వారా కూడా ప్రచారం చేస్తున్నారు.  చెత్త సేకరించే వాహనాలకు మైకులు బిగించి కోవిడ్-19 గురించి తీసుకోవలసిన జాగ్రత్తలను ప్రజలకు తెలియ జేస్తున్నారు.   

అన్నిరకాల పనులు, వివిధ బృందాల మధ్య సమన్వయము కోసం ఒక టాస్క్ ఫోర్సును ఏర్పాటు చేశారు.  కోవిడ్-19 మహమ్మారిని అరికట్టే పనుల్లో విధులు నిర్వహిస్తున్న వారందరినీ స్వచ్చతా యోధులుగా పరిగణిస్తున్న నగర పాలక సంస్థ వ్యక్తిగత సంరక్షణ సాధనాలను (పి పి ఇ) కూడా ఇచ్చింది. 

ప్రపంచాన్ని గడ గడ వణికిస్తున్న కరోనా వైరస్ కు వెరవకుండా సూరత్ నాయకత్వం ముందడుగు వేసి సత్వర చర్యల ద్వారా నగర పౌరుల రక్షణకు చర్యలు తీసుకొని మొత్తం దేశానికి ఆదర్శప్రాయంగా నిలిచింది. 


(Release ID: 1614120) Visitor Counter : 273