మైనారిటీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ
కరోనా మహమ్మారి వ్యాప్తిని దృష్టిలో ఉంచుకుని పవిత్ర రంజాన్ మాసంలో లాక్‌డౌన్, సామాజిక దూరం మార్గదర్శకాలను కచ్చితంగా పాటించాలిః మంత్రి ముక్తార్ అబ్బాస్ నఖ్వీ
- ఈ నెల 24 నుంచి ప్రారంభం కానున్న పవిత్ర రంజాన్ మాసం
- ఇంట్లోనే ప్రార్థనలు, ఇతర మతపర ఆచారాలను నిర్వహిస్తున్న మంత్రి ముక్తార్ అబ్బాస్ నఖ్వీ
Posted On:
13 APR 2020 5:07PM by PIB Hyderabad
కరోనా మహమ్మారి విసురుతున్న ప్రమాదకరమైన సవాళ్లను దృష్టిలో ఉంచుకుని పవిత్ర రంజాన్ మాసంలో భారత ముస్లింలు లాక్‌డౌన్ మరియు సామాజిక దూరం మార్గదర్శకాలను నిజాయితీతో కచ్చితంగా పాటించాలని కేంద్ర మైనారిటీ వ్యవహారాల మంత్రి ముక్తార్ అబ్బాస్ నఖ్వీ సోమవారం విజ్ఞప్తి చేశారు. ఈ నెల 24 నుంచి పవిత్ర రంజాన్ మాసము ప్రారంభం కానున్న నేపథ్యంలో ఆయన మాట్లాడుతూ ముస్లిం సోదరులు ఇంటిలోనే ఉంటూ ఇతర అన్ని మతపరమైన ఆచారాలను నిర్వహించుకోవాలని ఆయన కోరారు.
చాలా ముస్లిం దేశాల్లో సామాజిక సమావేశాలు బంద్..
కోవిడ్-19 మహమ్మారి వ్యాప్తి నేపథ్యంలో ప్రపంచ వ్యాప్తంగా సౌదీ అరేబియాతో సహా చాలా ముస్లిం దేశాలు రంజాన్ సందర్భంగా మతపరమైన ప్రదేశాలలో సామూహిక సమావేశాలను నిలిపివేసిన విషయాన్ని అందరూ గమనించాలని మంత్రి ముక్తార్ అబ్బాస్ నఖ్వీ సూచించారు.
దేశంలోని రాష్ట్ర వక్ఫ్ బోర్డుల నియంత్రణ సంస్థ సెంట్రల్ వక్ఫ్ కౌన్సిల్ ఛైర్మన్ కూడా అయిన మంత్రి ముక్తార్ అబ్బాస్ నఖ్వీ మాట్లాడుతూ దేశవ్యాప్తంగా ఉన్న రాష్ట్ర వక్ఫ్ బోర్డుల పరిధిలో దాదాపు 7 లక్షలకు పైగా రిజిస్టర్డ్ మసీదులు, ఈద్గా, ఇమాంబాడా, దర్గాలు మరియు ఇతర మత సంస్థలు ఉన్నాయని తెలియ జేశారు. ఇదే విషయమై తాను వివిధ మత పెద్దలు, వివిధ సామాజిక, మత సంస్థల ప్రతినిధులు, రాష్ట్ర వక్ఫ్ బోర్డుల అధికారులు మరియు ఇతర ఆఫీసు బేరర్లతో సంప్రదింపులు జరిపినట్టుగా మంత్రి తెలిపారు. ఈ అసాధరణ పరిస్థితులలో లాక్‌డౌన్, సామాజిక దూరం మార్గదర్శకాలను అమలును తీవ్రంగా పరిగణిస్తూనే నిజాయితీతో వాటి అమలు జరిగేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేసినట్టుగా తెలిపారు. కరోనా మహమ్మారిని దృష్టిలో ఉంచుకుని పవిత్ర రంజాన్ మాసంలో నిర్వహించే అన్ని మతపరమైన ఆచారాలను ప్రజలు తమతమ ఇళ్లలోనే నిర్వహించుకొనేలా చూడాలని కోరినట్టుగా తెలిపారు.
అన్ని మతపరమైన కార్యకలాపాలు రద్దు..
కరోనా మహమ్మారి సవాళ్లను దృష్టిలో ఉంచుకుని దేశంలోని అన్ని దేవాలయాలు, మసీదులు, గురుద్వారా, చర్చీలలో మరియు ఇతర మత ప్రదేశాలలో అన్ని మతపరమైన కార్యకలాపాలు రద్దు చేయబడ్డాయని మంత్రి తెలిపారు. పవిత్ర రంజాన్ మాసంలో ప్రజలు ఎట్టి పరిస్థితుల్లోనూ మతపరమైన మరియు ఇతర ప్రదేశాలలో గుమిగూడకుండా చూసేందుకు సమర్థవంతమైన విధానాన్ని తీసుకోవాలని రాష్ట్ర వక్ఫ్ బోర్డులను సెంట్రల్ వక్ఫ్ కౌన్సిల్ ద్వారా సూచించినట్లు మంత్రి నఖ్వీ తెలిపారు. ఈ విషమై అవసరమైతే వివిధ మత, సామాజిక సంస్థలు, ప్రజలు, స్థానిక యంత్రాంగపు యొక్క సాయం తీసుకోవలసిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. పవిత్ర రంజాన్ మాసంలో లాక్‌డౌన్ మరియు సామాజిక దూరం నిబంధనలు కఠినంగా సమర్థవంతంగా అమలయ్యేలా మత,సామాజిక సంస్థలు మరియు వ్యక్తులు స్థానిక యంత్రాంగంతో సహకరించాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆయన అన్నారు. దేశంలోని ప్రజలు లాక్‌డౌన్ సామాజిక దూరం యొక్క మార్గదర్శకాలను సమర్థవంతంగా అనుసరిస్తున్నారని సంతృప్తి వ్యక్తం చేశారు.
షబ్-ఇ-బారాత్ సందర్భంగా చూపిన సహకారం ప్రశంసనీయం..
ఈ నెల 8,9 తేదీలలో షబ్-ఇ-బారాత్ పర్వదినం పురస్కరించుకొని ముస్లింలు ప్రత్యేక ప్రార్థనలు, మతపరమైన ఆచారాలను తమ ఇండ్లలోనే నిర్వహించుకొనేలా చేయడంలో
రాష్ట్ర వక్ఫ్ బోర్డులు, మత-సాంఘిక సంస్థలు చురుకైన, సమర్థవంతమైన మరియు సానుకూల ప్రయత్నాలు చేయడాన్ని మంత్రి ఈ సందర్భంగా ప్రశంసించారు. కరోనా మహమ్మారి వేగంగా వ్యాపిస్తున్న నేపథ్యంలో సర్కారు సూచించిన లాక్‌డౌన్, సామాజిక దూరం మార్గదర్శకాలను కఠినంగా అమలులో భారతీయ ముస్లింల సహకారం ప్రశంసనీయమని మంత్రి అన్నారు. రంజాన్ మాసం పురస్కరించుకొని దేశంలో సాంప్రదాయకంగా ముస్లిం ప్రజలు దేశవ్యాప్తంగా లక్షలాది మసీదులు, దర్గా, ఇమాంబాడా, ఈద్గా, మదర్సాలు, ఇతర మత ప్రదేశాల వద్ద ప్రార్థనలు చేయడానికి "ఇఫ్తార్"తో సహా ఇతర మతపరమైన ఆచారాలను నిర్వహించడానికి పెద్ద సంఖ్యలో సమూహంగా సమావేశమవుతారని శ్రీ నఖ్వీ వివరించారు.
ప్రజలకు అవగాహన కల్పించాలి...
పవిత్ర రంజాన్ మాసంలో ముస్లిం సోదరులు తమతమ ఇళ్లలోనే ఉంటూ అన్ని మతపరమైన ఆచారాలను నిర్వహించుకునే విధంగా తగిన అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని మంత్రి నఖ్వీ అన్నారు. మసీదులు,ఇతర మత ప్రదేశాలలో మాత్రమే కాకుండా, బహిరంగ ప్రదేశాలు, మతపరమైన ఆచారాలను నిర్వహించడానికి పవిత్ర రంజాన్ మాసంలో ముస్లింలు ఎక్కువగా
సమావేశమయ్యే అవకాశం ఉన్న ప్రదేశాలలో ఇలాంటి అవగాహన కార్యక్రమాలను నిర్వహించేలా చూడాలని ఆయన సూచించారు.
ప్రధాన మంత్రి విజ్ఞప్తికి అనూహ్య స్పందన..
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోడీ విజ్ఞప్తి మేరకు లాక్‌డౌన్ మరియు సామాజిక దూరం మార్గదర్శకాలను దేశం మొత్తం తీవ్రంగా పరిగణనలోకి తీసుకొని నిజాయితీగా అనుసరిస్తోందని మంత్రి నఖ్వీ అన్నారు. ఏ రకమైన అజాగ్రత్త అయినా మనకు, మన కుటుంబానికి, సమాజానికి మరియు మొత్తం దేశానికి హానికరమని ఆయన వివరించారు. కరోనాను అన్ని రకాల గాంభీర్యతతో, నిజాయితీగా ఓడించడానికి ప్రభుత్వం సూచిస్తున్న అన్ని మార్గదర్శకాలను పాటించాలని ఆయన కోరారు.
(Release ID: 1614093)
Visitor Counter : 247
Read this release in:
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Assamese
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam