గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ

దేశంలో కోవిడ్ -19 స‌వాలును ధీటుగా ఎదుర్కొంటున్న‌ ఎన్‌ఆర్‌ఎల్‌ఎం స్వయం సహాయక బృందం నెట్‌వర్క్

కోవిడ్ -19 వ్యాప్తిని అరిక‌ట్టడంలో స‌హాయ‌ప‌డ‌డానికి, వినూత్న కమ్యూనికేషన్ , ప్రవర్తన మార్పు సాధనాలను ఉపయోగించుకుంటున్న‌ స్వయం సహాయక సంఘాల మ‌హిలు

Posted On: 12 APR 2020 4:15PM by PIB Hyderabad

కోవిడ్ -19 మ‌హ‌మ్మారి ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఆరోగ్య ప‌రంగా మున్నెన్న‌డూ లేని అత్య‌వ‌స‌ర ప‌రిస్థితిని క‌ల్పించింది. మ‌న దేశంలో ఎన్నో అనుమానిత కేసుల‌ను ప‌రీక్షిస్తున్నారు, క్వారంటైన్‌కు పంప‌డ‌మో లేక  చికిత్స చేయ‌డమో చేస్తున్నారు. కోవిడ్ -19 వ్యాప్తిని అరిక‌ట్టాలంటే ఈ వ్యాధి ల‌క్ష‌ణాల‌ను , కార‌ణాల‌ను అర్థం చేసుకోవాలి. అంతే కాదు, త‌గిన వ్య‌క్తిగ‌త ప‌రిశుభ్ర‌త అల‌వ‌ర‌చుకోవ‌డం, భౌతికంగా సామాజిక దూరాన్ని పాటించ‌డం ప్ర‌స్తుత అవ‌స‌రం.

గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ కు చెందిన దీన్‌దయాల్ అంత్యోదయ యోజన-జాతీయ గ్రామీణ జీవనోపాధి మిషన్ (DAY-NRLM) కింద దేశవ్యాప్తంగా గ‌ల‌ సుమారు 63 లక్షల స్వయం సహాయక బృందాల (ఎస్‌హెచ్‌జి) లో 690 లక్షల మంది మహిళా సభ్యులు ఉన్నారు. వీరు  త‌గిన ప్రేర‌ణ‌, ఉత్సాహం, చిత్త‌శుద్ది తో క‌మ్యూనిటీ స్థాయిలో ఏర్ప‌డిన సామాజిక , ఆర్థిక  అవసరాలను తీరుస్తూ వ‌స్తున్నారు..

ఈ మ‌హిళ‌లు జీవ‌నోపాధి కార్య‌క‌లాపాలు, ప్ర‌జ‌ల‌లో అవ‌గాహ‌న క‌ల్పించే కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించ‌డం ద్వారా సామాజిక మార్పు తీసుకురావ‌డం,  ప్ర‌కృతి విప‌త్తుల స‌మ‌యంలో ముందుండి స్పందించ‌డం చేస్తుంటారు. ప్ర‌స్తుత సంక్షోభ స‌మ‌యంలో, ఈ స్వ‌యం స‌హాయ‌క బృందాల స‌బ్యులు కోవిడ్ -19 వ్యాప్తిని అరిక‌ట్ట‌డానికి అవ‌కాశం ఉన్న ప్ర‌తి మార్గంలోనూ త‌మ‌వంతు పాత్ర పోషిస్తూ క‌మ్యూనిటీ యోధులుగా సేవ‌లు అందిస్తున్నారు.

దేశవ్యాప్తంగా గ‌ల స్య‌యం స‌హాయ‌క బృందాల నెట్ వ‌ర్క్‌కు ఈ వ్యాధి గురించిన వివిధ అంశాలు తెలుసు. అంతేకాదు, వ్య‌క్తిగ‌త ప‌రిశుభ్ర‌త  ,సామాజిక దూరం పాటించాల్సిన  అవ‌స‌రం గురించి వారికి తెల‌సు. ఇందుకు సంబంధించిన స‌మాచారాన్ని , ఆరోగ్య మంత్రిత్వ‌శాఖ  రూపొందించిన సూచ‌న‌లు ఆడియో విజువ‌ల్ (ఎవి) ఐఇసి మెటీరియ‌ల్‌ను దేశ‌వ్యాప్తంగా అన్ని రాష్ట్రాల‌లో గ‌ల గ్రామీణ జీవ‌నోపాధి మిష‌న్‌కు (ఎస్‌.ఆర్‌.ఎల్‌.ఎం)కు పంప‌డం జ‌రిగింది. వీటి ద్వారా వీరు ఇందుకు సంబంధించిన స‌మాచారాన్ని గ్ర‌హించారు.
దీనితోపాటు, రాష్ట్ర‌ప్ర‌భుత్వాలు త‌యారు చేసిన స‌మాచారాన్ని కూడా వాడుకుంటూ ఎస్‌.ఆర్‌.ఎల్‌.ఎం లు ఈ వ్యాధికి సంబంధంచి క‌మ్యూనిటీలో స‌రైన స‌మాచారాన్ని వ్యాప్తి చేయ‌డానికి, ముందస్తు జాగ్ర‌త్త‌ల ప్ర‌చారానికి చ‌ర్య‌లు తీసుకుంటున్నాయి. ఎస్‌.ఆర్‌.ఎల్‌.ఎం సిబ్బంది, ఎస్‌.హెచ్‌జి స‌భ్యులు అంద‌రూ వివిధ ప‌ద్ద‌తుల‌లో స్థానిక క‌మ్యూనిటీ లో ప్ర‌జ‌ల‌లో చైత‌న్యం తీసుకు వ‌స్తున్నారు. ఇందుకు టెల‌ఫోన్ కాల్స్ చేయ‌డం, గోడ‌ల మీద నినాదాలు రాయ‌డం, పాంప్లెట్లు, ఫ్ల‌య‌ర్లు పంచ‌డం, సామాజిక‌మాధ్య‌మాల‌ను విస్తృతంగా వాడ‌డం ద్వారా ప్ర‌జ‌ల‌ను చైత‌న్య‌వంతుల‌ను చేస్తున్నారు

మార్కెట్లు, ప్ర‌జాపంపిణీ వ్య‌వ‌స్థ దుకాణాలు త‌దిత‌రాల వ‌ద్ద ప్ర‌జ‌లు సామాజిక దూరం పాటించేలా చేయ‌డంలో స్వ‌యం స‌మాయ‌క బృందాల వాలంటీర్లు కీల‌క పాత్ర పోషిస్తున్నారు. త‌మిళ‌నాడులో ప్ర‌తి ప్ర‌జాపంపిణీ వ్య‌వ‌స్థ దుకాణానికీ ఇద్ద‌రు స్వ‌యం స‌హాయ‌క బృందాల వాలంటీర్ల కు  బాధ్య‌త‌లు అప్ప‌గించారు. వీరికి గ్లౌస్‌లు, మాస్క్‌లు, శానిటైజ‌ర్లు అందజేశారు. వీరు ప్ర‌జ‌లు క్యూలైన్ పాటించే విధంఆ అలాగే సామాజిక దూరం పాటించే విధంగా చ‌ర్య‌లు తీసుకోవ‌డం వీరి బాధ్య‌త‌.

వివిధ ఎస్‌.ఆర్‌.ఎల్‌.ఎంలు చేప‌ట్టిన మ‌రికొన్ని కీల‌క బాధ్య‌త‌ల‌ను కింద ప‌రిశీలిద్దాం:

కోవిడ్ -19ను ప్ర‌పంచ మ‌హ‌మ్మారిగా ప్ర‌క‌టించిన అనంత‌రం, బీహార్‌కు చెందిన జీవిక రంగంలోకి దిగి ఐసిసి మెటీరియ‌ల్ త‌యారు చేయ‌డంలో నిమ‌గ్న‌మైంది. కోవిడ్ 19 పై అవ‌గాహ‌న క‌ల్పించ‌డానికి, అలాగే దీనిని ఎదుర్కొనేందుకు తీసుకోవ‌ల‌సిన చ‌ర్య‌ల‌కు సంబంధించిన‌ మెటీరియ‌ల్ రూపొందించ‌డానికి కృషి చేసింది. జీవిక 1.4 ల‌క్ష‌ల స్వ‌యం స‌హాయక బృందాల ద్వారా చేతులు శుభ్ర‌ప‌ర‌చుకోవ‌డం, ప‌రిస‌రాల ప‌రిశుభ్ర‌త‌, క్వారంటైన్‌, ఐసొలేష‌న్‌, సామాజిక దూరం పాటించ‌డం వంటి అంశాల‌పై ఒక ప‌ద్ధ‌తి ప్ర‌కారం అవ‌గాహన క‌ల్పించేందుకు ప్ర‌య‌త్నించింది.జీవిక ఇప్ప‌టివ‌ర‌కూ ల‌క్ష‌కు పైగా కమ్యూనిటీ మెంబ‌ర్ల ఫోన్ నంబ‌ర్లు సేక‌రించింది. దీని ద్వారా కోవిడ్ -19 పై మొబైల్  వాణి ప్లాట్ ఫాం ద్వారా సందేశాల‌ను పంపుతోంది. అలాగే ప్ర‌జ‌ల నుంచి వ‌చ్చే ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానాలు ఇస్తోంది.

జ‌న చైత‌న్యానికి రంగోలి: ఉత్త‌ర‌ప్ర‌దేశ్ ఎస‌.ఆర్‌.ఎల్‌.ఎం కు చెందిన స్వ‌యం స‌హాయ‌క బృందాల స‌బ్యులు రంగోలిలు వేయ‌డంలో త‌మ స్మృజ‌నాత్మ‌క‌త‌కు ప‌దును పెట్టారు. సామాజిక దూరం పాటించాల్సిన సందేశాన్ని వారు ఈ రంగోలీల‌లో వ‌చ్చేవిధంగా చేస్తున్నారు. వీరు వాల్ పెయింటింగ్స్ ద్వారా కోవిడ్ నిరోధానికి సంబంధించి కీల‌క సందేశాల‌ను ప్ర‌చారం చేస్తున్నారు.
దిది హెల్ప్‌లైన్‌:   జార్ఖండ్‌కు చెందిన ఎస్.ఆర్‌.ఎల్‌.ఎం దీదీ హెల్ప్‌లైన్ పేరుతో 24 గంట‌లూ ప‌నిచేసే ఒక హెల్ప్‌లైన్‌ను ఏర్పాటు చేసింది. వ‌ల‌స కార్మికుల‌కు స‌హాయం చేసేందుకు దీనిని ఏర్పాటు చేశారు. వీరికి  స‌రైన స‌మాచారం దీని ద్వారా అందిస్తున్నారు. దీనివ‌ల్ల వారు త‌మ వివ‌రాల‌ను  ప్ర‌భుత్వానికి అందించ‌డానికి వీలు క‌లుగుతుంది .త‌ద్వారా వివిధ రాష్ట్రాల నుంచి వ‌ల‌స కార్మికుల‌ను తిరిగి జార్ఖండ్‌కు తీసుకురావ‌డానికి వీలు క‌లుగుతుంది.
 
న‌కిలీ వార్త‌ల‌కు చెక్‌:  కేర‌ళ‌లోని కుటుంబ శ్రీ  మ‌హిళలు, న‌కిలీ వార్త‌ల‌ను వాటి వ‌ల్ల ప్ర‌జ‌ల‌లో క‌లుగుతున్న భ‌యాందోళ‌న‌ల‌ను పోగొట్టడానికి కృషి చేస్తున్నారు. వారికిగ‌ల వాట్స్‌ప్ నెట్ వ‌ర్క్ ద్వారా ఈ ప‌నిచేస్తున్నారు.  1,16,396 మంది మ‌హిళ‌లు స‌భ్యులుగా గ‌ల వాట్స‌ప్ గ్రూప్‌ల‌తో వీరు అనుసంధాన‌మై ఉన్నారు. కుటుంబ శ్రీ మ‌హిళలు వాస్త‌వ స‌మాచారాన్ని మాత్రమే త‌మ క‌మ్యూనిటీకి పంపుతున్నారు. ఈ వేదిక‌ల‌ను వీరు కోవిడ్ -19 కు సంబంధించి ఖ‌చ్చిత‌మైన , స‌రైన స‌త్వ‌ర‌, విశ్వ‌స‌నీయ‌మైన స‌మాచారాన్ని పంప‌డానికి వినియోగిస్తున్నారు.
 ఈ స్వయం సహాయక మహిళలు స‌మాజంలో సురక్షితమైన పరిశుభ్రతా పద్ధతులను ప్రోత్సహిస్తూ, త‌మ జీవనోపాధిని నిలబెట్టుకుంటూ,  కోవిడ్ -19 వ్యాప్తి నిరోధానికి అత్యంత అంకితభావంతో కృషి చేస్తున్నారు.
దేశ‌వ్యాప్తంగా ఇలాంటి బాధ్య‌తాయుత ఎన్నో సంస్థ‌లు, ఈ క‌మ్యూనిటీల‌కు చెందిన పేద మ‌హిళ‌లు ఒక‌వైపు ఆర్థికంగా సామాజికంగా సాధికార‌త సాధిస్తూ మ‌రోవైపు క‌రోనా వైర‌స్‌పై అలుపెరుగ‌ని పోరాటం సాగిస్తున్నారు.



(Release ID: 1613654) Visitor Counter : 208