చట్ట, న్యాయ మంత్రిత్వ శాఖ

కోవిడ్ -19 లాక్ డౌన్ మధ్య ఆదాయపు పన్ను అప్పీలేట్ ట్రిబ్యునల్ (ఐ టి ఎ టి) ఆధ్వర్యంలో ప్రముఖ ప్రబోధకుడు శ్రీ శ్రీ రవిశంకర్ తో పరస్పర సంభాషణ, సందేహనివృత్తి

“ప్రపంచం ఎన్నో మహామ్మరులను చూసింది, మానవజాతి వాటన్నింటిని అధిగమించి నిలిచింది” అని శ్రీ శ్రీ రవిశంకర్ అన్నారు

Posted On: 11 APR 2020 3:30PM by PIB Hyderabad

విశ్వ మహమ్మారి కోరల్లో చిక్కిన ప్రపంచం ఎటూ దిక్కుతోచని స్థితిలో విలవిలలాడుతోంది. రేపటి భవిష్యత్తు ఏమిటి అనే భయం మానవాళిని పట్టి పీడిస్తోంది.  ఈ స్థితిలో ఆదాయపు పన్ను అప్పెలేట్ ట్రిబ్యునల్ (ఐ టి ఎ టి) ప్రజలందరికీ ఉపశమనం కలిగించేందుకు శుక్రవారం వీడియో కాన్ఫరెన్సు ద్వారా దేశవ్యాప్త సదస్సు నిర్వహించింది. భాగస్వాములు, వారి కుటుంబాలు, మిత్రులు మరియు దేశవ్యాప్తంగా ఆద్యాత్మిక చింతన ఉన్న వారందరికీ భౌతిక, భావప్రేరేపిత, మానసిక స్వస్థత కలిగించడం ఈ సదస్సు ఉద్దేశం. 

ప్రముఖ ప్రబోధకుడు, ఉపదేశకుడు శ్రీ శ్రీ రవిశంకర్జీ ఈ సదస్సుకు హాజరై “ ఆఫీసులో, ఇంటిలో, సమాజంలో విధులు నిర్వహిస్తూనే సంతోషంగా ఎలా ఉండవచ్చు” అనే అంశంపై ప్రవచించారు. ట్రిబ్యునల్ అధ్యక్షుడు జస్టిస్ శ్రీ పి.పి. భట్ సమావేశానికి అధ్యక్షత వహించారు.  ట్రిబ్యునల్ ఉపాధ్యక్షులు, సభ్యులు, రిజిస్ట్రీ సిబ్బంది తమ కుటుంబ సభ్యులతో కలసి సదస్సులో పాల్గొన్నారు. 

ఈ సదస్సు ప్రయోజనాన్ని సమాజంలోని అధిక సంఖ్యాకులకు కలుగజేసే ఉద్దేశంతో జస్టిస్ భట్ ఆదాయపు పన్ను బార్ అసోసియేషన్ల సభ్యులు,  ఆదాయపు పన్ను శాఖ సభ్యులు, దేశవ్యాప్తంగా ఉన్న ఇతరులను సదస్సుకు ఆహ్వానించారు. సదస్సుకు హాజరైన ఇతర మాన్యులలో వివిధ హైకోర్టుల జడ్జీలు, రిటైర్డ్ జడ్జీలు,  కేంద్ర న్యాయ శాఖ కార్యదర్శి మరియు వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు ఉన్నారు.  

  జస్టిక్ భట్ తమ స్వాగతోపన్యాసంలో గురూజీ మహానీయతను కొనియాడారు. దానివల్ల దేశంలో, విదేశాలలో లక్షలాది మంది ప్రయోజనం పొందారని ఆయన అన్నారు.  ప్రస్తుత మహమ్మారివల్ల ఉత్పన్నమైన పరీక్షా సమయంలో గురూజీ ఆద్యాత్మిక, ప్రేరణాత్మక మార్గదర్శకత్వం ఆవశ్యకతను జస్టిస్ భట్ ఉద్ఘాటించారు. ఆద్యాత్మిక,  మానవతా దృక్పథంతో గురూజీ చేసిన పనులకు గుర్తింపుగా భారత ప్రభుత్వం ఆయనను పద్మవిభూషణ్ పురస్కారంతో గౌరవించిందని జస్టిస్ భట్ తెలిపారు. 

ట్రిబ్యూనల్ ఉపాధ్యక్షులు, సభ్యులు, బార్ అసోసియేషన్ల సభ్యులు మరియు వారి కుటుంబ సభ్యులను స్వాగతిస్తూ సదస్యులకు ఆశీస్సులు మరియు సందేశం ఇవ్వాల్సిందిగా ఆయన గురూజీని కోరారు. గురుదేవ్ శ్రీ శ్రీ రవిశంకర్ తమ ప్రవచనంలో ఈ విపత్తును చూసి ప్రజలు నిరాశా, నిస్పృహలలో మునిగిపోరాదని, దానికి బదులు లాక్ డౌన్ వల్ల కలిగే మంచిని చూడాలని, దాని మరుగున ఉన్న ప్రయోజనాలను సంగ్రహించుకోవాలని అన్నారు. మహమ్మారి వల్ల మనకు అకస్మాత్తుగా మనకు ఒక విషయం అవగతమైంది. సరిహద్దులు, సంస్కృతులు, నాగరికతలు, అంతెందుకు వ్యక్తిత్వంతో సంబంధం లేకుండా వాటన్నింటిని చెరిపేసి మానవాళి ఏకత్వం గురించి మనలో జాగృతి కలిగించింది.  

అది ఒకరికొకరు పరస్పరం సహాయం చేసుకోవాల్సిన ఆవశ్యకతను, మానవ జీవితంలోని సున్నితమైన అంశాలను మనమదిలో నిలిపింది.  మహమ్మారి వల్ల మానవాళి దృష్టికోణం జీవన ఉపకరణాల నుంచి జీవనం నుంచి సూక్ష్మభేదాలను అవగతం చేసుకోవడం వైపు మరలింది. దానివల్ల మనలోకి మనం తొంగిచూసే,  మనమేమిటో అర్ధం చేసుకునే మరియు జీవన శక్తి నమూనా ఏమిటో తెలుసుకునే అవకాశం ఇచ్చిందని గురూజీ తెలిపారు. ఇంధన వనరులను ఏకీకృతం చేయాలని ఆయన ఉద్ఘాటించారు.  భౌతిక, మానసిక అస్తవ్యస్తతకు దారితీసే ఎలాంటి కల్లోల్లానైన సరైనమోతాదులో ఆహారం, నిద్ర, శ్వాస మరియు ధ్యానం ద్వారా సమతౌల్యం చేయవలసిన అవసరం ఉందని ఆయన నొక్కి చెప్పారు. 

గురూజీ సందేశం తరువాత ప్రశ్నోత్తరాల కార్యక్రమం జరిగింది. కరోనా మహమ్మారిపై పోరాటం చేస్తున్న వైద్య, పారా మెడికల్ మరియు పోలీసు దళాలలో నైతికబలాన్ని, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించడానికి మార్గనిర్దేశం చేయాలని జస్టిస్ భట్ కోరగా, పని ఒత్తిడికి, వ్యక్తిగత అవసరాలకు మధ్య సమతుల్యత పాటించాలని గురూజీ అన్నారు. అంతేకాక ప్రస్తుత పరిస్థితిలో విచారంలో మునిగిపోకుండా యోగా, ధ్యానం ద్వారా ఎంతో ఊరట పొందవచ్చని ఆయన సలహా ఇచ్చారు.  ధ్యానం కూడా ఔషధం వలె పని చేస్తుందని ఆయన అన్నారు. ఈ విషయాన్ని బెంగళూరుకు చెందిన నిమ్హన్స్ సంస్థ రుజువు చేసిందని ఆయన గుర్తు చేశారు. 

మహమ్మారి శకంలో జీవితం, ఉద్యోగంలో తలెత్తే అనిశ్చితి గురించి కేంద్ర న్యాయ శాఖ కార్యదర్శి అనూప్ కుమార్ అడిగిన ప్రశ్నకు బదులిస్తూ ప్రపంచం ఎన్నో మహమ్మరులను చూసింది, మానవజాతి వాటన్నింటిని విజయవంతంగా అధిగమించి నిలిచిందని గురూజీ అందరికీ గుర్తుచేశారు. కొత్తఆశతో ముందడుగేయడంతో పాటు మన చుట్టూ ఉన్న వారికి సహాయం చేయాలని ఆయన అన్నారు. 

ట్రిబ్యునల్ ఉపాధ్యక్షుడు శ్రీ ప్రమోద్ జగ్తప్ అడిగిన ప్రశ్నకు బదులిస్తూ రోజుకు 6 నుంచి 8 గంటల నిద్రతో పాటు 15 నిముషాల యోగ ద్వారా మానవ శరీరంలోని ఏడు వ్యవస్థలు శక్తివంతమై అంతర్ శాంతి లభిస్తుందని గురూజీ తెలిపారు.   

ట్రిబ్యునల్ ఉపాధ్యక్షులు శ్రీ ఎన్. వి. వాసుదేవన్,  సుష్మా చౌలా, శ్రీ ప్రమోద్ కుమార్ టాక్స్ ప్రాక్టీషనర్ శ్రీ తుషార్ హేమాని తదితరుల ప్రశ్నలకు గురూజీ బదులిచ్చారు. 

ప్రశ్నోత్తరాల కార్యక్రమంలో ప్రేక్షకులు ఉత్సాహంగా పాల్గొన్నారు.  సాంసారిక బాధ్యతల నిర్వహణలో వ్యక్తిగత మార్గదర్శకత్వం నుంచి మానవజాతి ముఖ్యంగా భారతీయుల నైతికబలాన్ని పెంపొందించడం వరకు అనేక అంశాలపైన ప్రేక్షకులు ప్రశ్నలు సంధించారు.  ఆ తరువాత 20 నిముషాల పాటు ప్రేక్షకుల చేత ధ్యానం చేయించారు. సదస్సు ముగింపులో ట్రిబ్యునల్ డిల్లీ జోన్ ఉపాధ్యక్షుడు శ్రీ జి. ఎస్. పన్ను గురూజీకి కృతజ్ఞతలు తెలిపారు. 

 

 



(Release ID: 1613456) Visitor Counter : 232