ఆయుష్
కోవిడ్ -19 మహమ్మారి నేపథ్యంలో రోగ నిరదోధక శక్తిని బలోపేతం చేసుకోవడానికి మార్గాలు
Posted On:
10 APR 2020 9:38PM by PIB Hyderabad
కరోనా మహమ్మారిపై పై చేయి సాధించడానికిగాను ఆయుష్ మంత్రిత్వశాఖ పలు రోగ నిరోధక శక్తిని పెంచే మార్గాలను తెలియజేస్తూ అడ్వయిజరీని విడుదల చేసంది. తరతరాలుగా ఆయుర్వేద వైద్యం సూచిస్తున్న మార్గాలను ప్రజలకు వివరించింది. మార్చి 31న ఆయుష్ విడుదల చేసిన ఈ అడ్వయిజరీలో స్థూలంగా కింది అంశాలను తెలియజేసింది.
రోగం వచ్చిన తర్వాత చికిత్స తీసుకోవడం కంటే అది రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవడం మంచిదని, కోవిడ్ -19 వైరస్ ను ఎదుర్కోవడానికి ఇంతవరకూ మందులు లేవు కాబట్టి జాగ్రత్తలు తీసుకోవడం మంచిదని ఆయుష్ మంత్రిత్వశాఖ స్పష్టం చేసింది.
ఆరోగ్యంగా, సంతోషంగా జీవించడానికిగాను ప్రకృతిలోనే మనకు అనేక మార్గాలున్నాయని ఆయుర్వేద శాస్త్రం ఎప్పటినుంచో చెబుతోంది.
దినచర్య, రుతుచర్యల (ఆయా రుతువుల ప్రకారం చేసే పనులు) ప్రకారం నడుచుకొని ముందు జాగ్రత్తలు తీసుకోవాలని ఆయుర్వేదం చెబుతోంది. ఆయుర్వేద అనేది ప్రధానంగా మొక్కల ఆధారంగా అభివృద్ధి చెందిన శాస్త్రం. మనిషి తనను తాను చైతన్యపరుచుకుంటూ, రోగ నిరోధకశక్తిని బలోపేతం చేసుకోవడం ఎలాగనేది ఆయుర్వేద గ్రంధాలలో వివరించారు.
ఎవరికి వారు ఈ ముందు జాగ్రత్తలను తీసుకోవడంద్వారా తమలోని రోగ నిరోధకశక్తిని బలోపేతం చేసుకోవచ్చు. ఇందుకుగాను ఆయుష్ మంత్రిత్వశాఖ సూచనలు, సలహాలు ఇలా వున్నాయి
1. ఎప్పుడు దాహమేసినా గోరు వెచ్చని నీరు తాగండి. ప్రతిరోజూ యోగాసనాలు, ప్రాణాయం, ధ్యాన్యం చేయండి. కనీసం 30 నిమిషాలపాటు ఈ పనులు చేయండి.
2. ఇక వంటల్లో పసుపు, జీరా, దనియాలు, వెల్లుల్లి తప్పకుండా వుండేలాచూడగలరు.
3. ప్రతి రోజూ ఉదయం ఒక టీ స్పూను చ్యవన ప్రాస తినాలి. మధుమేహ వ్యాధి వున్న వారు చక్కెర లేని చ్యవన ప్రాసను తీసుకోవాలి.
తులసి, దాల్చిన చెక్క, నల్ల మిరియాలు, శొంఠి, ఎండు ద్రాక్ష మొదలైనవాటితో చేసిన ఆయుర్వేద తేనీరును రోజుకు ఒకసారిగానీ, రెండుసార్లుగానీ తాగండి. అవసరమనుకుంటే మీ అభిరుచినిబట్టి బెల్లం లేదా తాజా నిమ్మరసాన్నికలుపుకోగలరు.
150 మిల్లీ లీటర్ల పాలల్లో అర స్పూను పసుపు కలుపుకొని రోజుకు ఒకసారిగానీ, రెండుసార్లుగానీ తాగండి.
4. నువ్వుల నూనె లేదా కొబ్బరి నూనె లేదా నెయ్యిని ముక్కుల దగ్గర పట్టించండి. ఈ పని ఉదయం సాయంత్రం చేయండి.
ఒక టేబుల్‌స్పూన్ నువ్వుల లేదా కొబ్బరి నూనెను తీసుకొని నోటిలో వేసుకొని రెండు మూడు నిమిషాలపాటు పుక్కిలించి తర్వాత మూసేయాలి. ఆ వెంటనే నోటిని గోరు వెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఈ పనిని రోజుకు ఒకటి రెండు సార్లు చేయవచ్చు.
5. పొడి దగ్గు వుంటే పుదీనా ఆకులనుగానీ లేదా కారవే విత్తనాలనుగానీ కలిపి నీటి ఆవిరిని రోజుకు ఒకసారి పీల్చుకోవాలి.
లవంగాల పొడిని బెల్లంలోగానీ లేదా తేనెలో గానీ కలుపుకొని రోజుకు రెండు మూడు సార్లు తీసుకుంటే దగ్గు లేదా గొంతు గరగరనుంచి ఉపశమనం లభిస్తుంది. దగ్గు ఎక్కువగా వుంటే తప్పకుండా వైద్యులను సంప్రదించాలి.
కరోనా వైరస్ మహమ్మారిని అరికట్టడానికిగాను ఆయుష్ మంత్రిత్వశాఖ విడుదల చేసిన సూచనలు సలహాల ప్రకారం పలు రాష్ట్ర ప్రభుత్వాలు ఈ సంప్రదాయ చికిత్సా మార్గాలను అనుసరిస్తూ ప్రజల్లో చైతన్యం పెంచుతున్నాయి. రోగ నిరోధక శక్తిని పెంచుకోవాలని కోరుతున్నాయి.
(Release ID: 1613176)
Visitor Counter : 545