శాస్త్ర విజ్ఞాన- సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ

ఇన్ ఫ్లూయెంజా మరియు కోవిడ్-19 వంటి వైరస్ ల వ్యాప్తిని అరికట్టేందుకు బహుముఖ పూతను అభివృద్ధి చేసిన జె.ఎన్.సి.ఏ.ఎస్.ఆర్.

" మన పరిశోధనా సంస్థలు తమ విజ్ఞానాన్ని సవాళ్లతో కూడిన ఉపయోగకరమైన చర్యలుగా ఎక్కువగా మారుస్తున్నాయి. జె.ఎన్.సి.ఏ.ఎస్.ఆర్. రూపొందించిన ఈ ఉత్పత్తి అందుకు ఒక బలమైన ఉదాహరణ" -- ప్రొఫెసర్ అశుతోష్ శర్మ, కార్యదర్శి, డి.ఎస్.టి.


సరళమైన సాంకేతిక పరిజ్ఞానం కారణంగా దీనిని వినియోగించడానికి నైపుణ్యం కలిగిన సిబ్బంది అవసరం లేదు. కోవిడ్-19 కు వ్యతిరేకంగా పరీక్షించడానికి అనువైనదిగా ఇది ఇప్పటికే నిర్ధారించబడింది.

Posted On: 06 APR 2020 4:12PM by PIB Hyderabad

 

శాస్త్ర, సాంకేతిక శాఖ (డి.ఎస్.టి.) కింద స్వయం ప్రతిపత్తి సంస్థ, బెంగళూరు లోని జవహర్ లాల్ నెహ్రూ ఆధునిక శాస్త్రీయ పరిశోధనా కేంద్రం ( జె.ఎన్.సి.ఏ.ఎస్.ఆర్.) అభివృద్ధి చేసిన ఒక సూక్ష్మజీవుల వ్యతిరేక పూత, తీవ్రమైన ఇన్ఫెక్షన్లకు మూలకారణమైన, ప్రాణాంతకమైన  ఇన్ ఫ్లూయెంజా వైరస్ వ్యాప్తిని అరికట్టడంలో అద్భుతమైన ఫలితాలను ఇచ్చింది.    కోవిడ్-19 కు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా కొనసాగుతున్న పోరుకు తోడ్పడే ఈ పూత ను మరింత అభివృద్ధి చేయడానికి డి.ఎస్.టి. లో ఒక విభాగమైన సైన్స్ అండ్ ఇంజినీరింగ్ పరోశోధనా మండలి తోడ్పడుతోంది. 

 

 

ఇన్ ఫ్లూయెంజా  వైరస్ (కప్పబడిన వైరస్) ను 100 శాతం నాశనం చేయడంలో తన సామర్ధ్యాన్ని నిరూపించుకున్న ఈ పూత, కోవిడ్-19 వంటి మరో కప్పబడిన వైరస్ ను కూడా నాశనం చేయడంలో సమర్ధంగా పనిచేస్తుందని భావిస్తున్నారు. సరళమైన సాంకేతిక పరిజ్ఞానం కారణంగా దీనిని వినియోగించడానికి నైపుణ్యం కలిగిన సిబ్బంది అవసరం లేదు. కోవిడ్-19 కు వ్యతిరేకంగా పరీక్షించడానికి అనువైనదిగా ఇది ఇప్పటికే నిర్ధారించబడింది.  ఇది సమర్ధంగా పనిచేస్తుందని రుజువైతే, వైద్యులు, నర్సులు ఉపయోగించే మాస్కులు, గౌన్లు, గ్లోవ్స్, ఫేస్ షీల్డ్స్ వంటి అనేక పి.పి.ఈ. లపై దీనిని పూయవచ్చు. తద్వారా వారికి రక్షణ, భద్రత కల్పించవచ్చు.  కోవిడ్-19 పై వారు మరింత సమర్ధవంతంగా పోరాటం చేయడానికి ఇది ఉపకరిస్తుంది.  

 

 

" ప్రాధమిక శాస్త్రాలలో మన పరిశోధనా సంస్థలు పటిష్టమైన శక్తి సామర్ధ్యాలు కలిగిన ఉత్తమ సంస్థలుగా ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందడం చాలా ఆనందంగా ఉంది. మన పరిశోధనా సంస్థలు తమ విజ్ఞానాన్ని సవాళ్లతో కూడిన ఉపయోగకరమైన చర్యలుగా ఎక్కువగా మారుస్తున్నాయి.   జె.ఎన్.సి.ఏ.ఎస్.ఆర్. రూపొందించిన ఈ ఉత్పత్తి అందుకు ఒక బలమైన ఉదాహరణ. ఉత్పత్తి రంగం నుండి తగిన సహకారం తీసుకుంటే,  మనం ఇంకా అనేక విజయవంతమైన ఉదాహరణలను సాధించగలమని చెప్పడంలో నాకు ఎటువంటి సందేహం లేదు.", అని - ప్రొఫెసర్ అశుతోష్ శర్మ, కార్యదర్శి, డి.ఎస్.టి. పేర్కొన్నారు.  

 

 

ఈ సాంకేతికతను జె.ఎన్.సి.ఏ.ఎస్.ఆర్. లో శ్రీ శ్రేయాన్ ఘోష్, డాక్టర్ రియా ముఖర్జీ, డాక్టర్ దెబాజ్యోతి బాసక్ తో కూడిన ప్రొఫెసర్ జయంత హల్దార్ బృందం అభివృద్ధి చేసింది.  శాస్త్రవేత్తలు, ఈ పూత మిశ్రమం తయారుచేయడానికి నీరు, ఇథనాల్, మిథనాల్, క్లోరోఫామ్ వంటి ఒకదానితో ఒకటి బాగా కలిసిపోయే ద్రావకాలను ఉపయోగించారు.   నీటితో కూడిన లేదా సేంద్రీయ ద్రావకాలతో తయారుచేసిన ఈ మిశ్రమాన్ని దైనందిన జీవితంలోనూ, వైద్యపరంగానూ ఉపయోగించే వస్త్రాలు, ప్లాస్టిక్, పి.వి.సి., పాలీయురేతేన్పాలీస్టైరిన్ వంటి ముఖ్యమైన వస్తువులపై ఒకే దశలో పూయడానికి ఉపయోగించవచ్చు.  ఇది ఉపయోగించిన 30 నిముషాలలో ఇన్ ఫ్లూయెంజా  వైరస్ ను పూర్తిగా నాశనం చేయడంలో ఈ పూత అద్భుతంగా పని చేస్తుంది.   మరణానికి దారి తీసే వ్యాధికారక బాక్టీరియా పొరను ఇది నాశనం చేస్తుంది. 

 

 

పరిశోధన సమయంలో,  ఈ మిశ్రమాన్ని పూసిన ఉపరితలాలు మేథీసిల్లిన్ రెసిస్టెంట్ ఎస్. ఆరెస్ (ఎమ్.ఆర్.ఎస్.ఏ.) మరియు ఫ్లూకోనజోల్ రెసిస్టెంట్ సి. అల్బికెన్స్ ఎస్.పి.పి., వంటి వివిధ ఔషధ నిరోధక బాక్టీరియా మరియు ఫంగస్ లను కూడా 30 నుండి 45 నిముషాలలో పూర్తిగా నాశనం చేయడం ద్వారా వేగవంతమైన సూక్ష్మజీవుల సంహరణ చర్యను ప్రదర్శించాయి.  ఈ మిశ్రమాన్ని పూసిన  నూలు వస్త్రాల ముక్కలు ఒక మిలియన్ బాక్టీరియా కణాలను పూర్తిగా నాశనం చేశాయి. 

 

 

వివిధ రకాల ద్రావకాలలో సులువుగా కరిగిపోడానికి వీలుగా ఎక్కువ ఖర్చు లేకుండా మూడు లేదా నాలుగు దశలలో 

సులభమైన శుద్ధీకరణ సింథటిక్ పద్దతిలో ఉపయోగించుకునే విధంగా ఈ పూత ద్రావణంలోని అణువులను రూపొందించారు.  దీనితో పాటు, ఈ ద్రావకాన్ని వివిధ రకాల ఉపరితలాలపై కూడా సులభతరమైన సాంకేతికత, సౌలభ్యంతో, నైపుణ్యం కలిగిన సిబ్బంది అవసరం లేకుండా ఉపయోగించవచ్చు. 

 

 

-------------------------------------------------------------------------------------------

మరింత సమాచారం కోసం డాక్టర్ జయంత హల్దార్  ను

దిగువ పేర్కొన్న ఈ-మెయిల్ , ఫోన్ నెంబర్లలో సంప్రదించవచ్చు :

 

ఈ మెయిల్ :  jayanta@jncasr.ac.injayanta.jnc[at]gmail[dot]com 

ఫోన్ నెంబర్ :  9449019745.)

 

 

*****


(Release ID: 1611779) Visitor Counter : 246