రక్షణ మంత్రిత్వ శాఖ
కోవిడ్ -19 మహమ్మారి నిరోధ కార్యక్రమాల్లో ఎన్ సిసి సేవలు
Posted On:
06 APR 2020 3:58PM by PIB Hyderabad
కరోనా వైరస్ ( కోవిడ్ -19) మహమ్మారిని నిరోధించే కార్యక్రమాల్లో నేషనల్ కాడెట్ కార్ప్స్ ( ఎన్ సిసి) కు చెందిన సీనియర్ డివిజన్ క్యాడెట్స్ సేవలు కావాలని కోరుతూ సివిల్ మరియు పోలీసు విభాగాలనుంచి వినతులు అందుతున్నాయి. ఈ మేరకు ఎన్ సిసి కి సంబంధించివారు కొందరు ఈ రోజునుంచే తమ సేవలను మొదలుపెట్టారు. రక్షణ శాఖ ఇప్పటికే ఎక్సర్ సైజ్ ఎన్ సిసి యోగ్ దాన్ కార్యక్రమం కింద ఎన్ సిసి క్యాడెట్లకు తాత్కాలిక ఉద్యోగాలను కల్పిస్తోంది. దీనికి సంబంధించి మార్గదర్శకాలను కూడా విడుదల చేశారు. ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు , మునిసిపల్ విబాగాలు చేపట్టే సహాయ చర్యల్లో వీరు సేవలు అందిస్తారు.
లద్దాహ్ కేంద్ర పాలిత ప్రాంత అధికారులు, మధ్యప్రదేశ్ లోని నీముచ్ ఎస్పీ, బిలాస్ పూర్ కలెక్టర్ తమకు ఎన్ సిసి క్యాడెట్ల సేవలు కావాలని కోరారు. కొంత మందికి తాత్కాలిక ఉద్యోగం కల్పించగా మరికొంత మందిని వాలంటీర్లుగా నియమించుకొని వారికి కోవడి్ -19పై పోరాటానికి సంబంధించి తగిన శిక్షణ అందిస్తారు.
పంజాబ్, హర్యానా, హిమాచల్ ప్రదేశ్ మరియు ఛత్తీస్ గడ్ డైరెక్టరేట్ పరిధిలోని ఎన్ సిసి క్యాడెట్ల సేవలు కావాలని కోరుతూ హిమాచల్ ప్రదేశ్ కంగ్రా జిల్లా డిప్యూటీ కమిషనర్ వినతిపత్రం ఇచ్చారు. తమ నగరం పరిధిలో ప్రజల మధ్యన భౌతిక దూరముండేలా చూడడానికిగాను పోలీసు శాఖకు వీరి సేవలను ఉపయోగించుకుంటామని డిప్యూటీ కమిషనర్ తెలిపారు.
అలాగే తమిళనాడుకు చెందిన కాంచీపురం జిల్లా పోలీసు అధికారులు, పుదుచ్ఛేరి అధికారులు అక్కడి ఎన్ సిసి సేవలను వాడుకుంటున్నారు. ఉత్తరప్రదేశ్ లోని బలరాంపూర్ జిల్లా అధికారులు కూడా అక్కడి గోరఖ్ పూర్ ఎన్ సిసి గ్రూప్ ప్రధన కార్యాలయంకు ఉత్తరం రాసి అక్కడి ఎన్ సిసి సేవలను కోరారు. ఇప్పటికే కొంతమంది క్యాడెట్లు సేవలను ప్రారంభించారు.
మేఘాలయ రాష్ట్రంలోని తూర్పు ఖాసి హిల్స్ జిల్లాలో అక్కడి పోలీసులకు ఎన్ సిసి క్యాడెట్లు సేవలందిస్తున్నారు. రేషన్ పంపిణీలోను, పారిశుద్ధ్య కార్యక్రమాల్లోను వారు సాయం చేస్తున్నారు.
హెల్ప్ లైన్ లేదా కాల్ సెంటర్లలోను, సహాయక సామగ్రి పంపిణీలోను, మందులు, ఆహారం ఇంకా ఇతర అత్యవసర వస్తువుల పంపిణీలోను, కమ్యూనిటీ సహాయంలోను, డాటా నిర్వహణలోను, క్యూలను, ట్రాఫిక్ ను నిర్వహించడంలోను, సిసిటివి కంట్రోల్ రూములలో సేవలందించడానికి ఎన్ సిసి క్యాడెట్లను ఉపయోగించుకుంటున్నారు.
రాష్ట్ర లేదా జిల్లా అధికారులు ఆయా ఎన్ సిసి డైరెక్టరేట్లకు వినతి పత్రాలు రాసి ఎన్ సిసి సేవలను పొందవచ్చు. ఆయా డైరెక్టరేట్ల, గ్రూప్ ప్రధాన కార్యాలయాలు, యూనిట్ స్థాయి విభాగాలు ఆయా ప్రభుత్వాలతో వివరంగా మాట్లాడి ఎన్ సిసి సేవలు అందేలా చూస్తాయి. క్షేత్రస్థాయి పరిస్థితులకు అనుగుణంగానే ఆయా ప్రాంతాల్లో ఎన్ సిసి క్యాడెట్లకు విధులను కేటాయించడం జరుగుతుంది.
(Release ID: 1611716)
Visitor Counter : 227