రైల్వే మంత్రిత్వ శాఖ

2500 బోగీల‌ను ఐసోలేషన్ కోచ్‌లుగా మార్చిన భార‌తీయ రైల్వే

- 133 ప్రాంతాల‌లో రోజుకు స‌గ‌టున 375 బోగీల మార్పిడి..

- అత్య‌వ‌సర వాడ‌కానికి 40000 ఐసోలేషన్ పడకలు సిద్ధం

- ప్రారంభ ల‌క్ష్యంలో సగాన్ని స్వ‌ల్ప కాలంలో చేరుకున్న సంస్థ‌

Posted On: 06 APR 2020 12:52PM by PIB Hyderabad

కోవిడ్‌-19 మ‌హ‌మ్మారిని ఎదుర్కోనేందుకు దేశ వ్యాప్తంగా జ‌ర‌గుతున్న ప్ర‌య‌త్నాల‌కు భార‌తీయ రైల్వే త‌న వంతు స‌హ‌కారాన్ని అందించేందుకు కృషి చేస్తోంది. జాతి ప్ర‌యోజ‌నాల కోసం సంస్థ రైల్వే కోచ్‌ల‌ను ఐసోలేష‌న్ కోచ్‌లుగా మార్చే ప‌నిని వేగ‌వంతంగా చేప‌డుతోంది. తొలి ద‌శ‌లో స‌ర్కారు ఆదేశాల‌ మేర‌కు సంస్థ 5000 కోచ్‌లను ఐసోలేష‌న్ కోచ్‌లుగా మార్చాల్సి ఉండ‌గా.. సంస్థ చాలా త‌క్కువ స‌మ‌యంలోనే దాదాపు 2500 బోగీల‌ను ఐసోలేష‌న్ కోచ్‌లుగా తీర్చిదిద్దింది. దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్ ఉండ‌డంతో మాన‌వ వ‌న‌రులు ప‌రిమితంగా అందుబాటులో ఉన్న‌ప్ప‌టికీ భార‌తీయ‌ రైల్వేకు చెందిన వివిధ జోన్లు చాలా స్వ‌ల్ప వ్యవధిలో బోగీలు ఐసోలేష‌న్ కోచ్‌లుగా మార్చే పనిని దాదాపుగా పూర్తి చేయ‌డం విశేషం. భార‌తీయ‌ రైల్వే 2500 బోగీల‌ను ఐసోలేష‌న్ కోచ్‌లుగా మార్చ‌డంతో దాదాపు 40,000 ఐసోలేష‌ల్ ప‌డ‌క‌లు అవ‌స‌ర‌మైతే కోవిడ్‌పై పోరుకు వాడుకొనేలా అందుబాటులోకి తెచ్చింది. బోగీలను ఐసోలేష‌న్ కోచ్‌లుగా మార్చేందుకు సంబంధించిన న‌మూనాల‌కు ఆమోదం ల‌భించ‌గానే దేశ వ్యాప్తంగా ఉన్న రైల్వే జోన్‌లు కోచ్‌ల మార్పిడి చర్యను త్వరిత‌గ‌తిన భార‌తీయ రైల్వే ప్రారంభించింది. రోజుకు సగటున 375 బోగీలను భారత రైల్వేలు ఐసోలేష‌న్ కోచ్‌లుగా మారుస్తున్నాయి. దేశంలోని 133 ప్రాంతాల‌లో దీనికి సంబంధించిన పనులు వేగంగా జరుగుతున్నాయి. ప్ర‌భుత్వం జారీ చేసిన  వైద్య సలహా ప్రకారం ఈ కోచ్‌ల‌లో ప‌లు అమ‌రిక‌లు చేశారు. అవసరాలు మరియు నిబంధనల ప్రకారం సాధ్యమైనంత ఉత్తమ బస మరియు వైద్య పర్యవేక్షణ నిర్ధారించేలా మార్పిడి చ‌ర్య‌లు చేప‌ట్టారు. కోవిడ్‌-19పై పోరుకు కేంద్ర ఆరోగ్య శాఖ చేప‌డుతున్న చ‌ర్య‌ల‌కు అనుబంధంగా భార‌తీయ‌ రైల్వే బోగీల‌ను ఐసోలేష‌న్ కోచ్‌లుగా మార్చే ప‌నులను చేప‌ట్ట‌డం విశేషం.



(Release ID: 1611566) Visitor Counter : 254