హోం మంత్రిత్వ శాఖ
కోవిడ్ -19 నిరోధం కోసం విధించిన లాక్ డౌన్ సమయంలో నిత్యావసర వస్తువుల పంపిణీ ఎలాంటి ఇబ్బందులు లేకుండా కొనసాగేందుకు వీలుగా రాష్ట్రాలకు కేంద్ర హోం శాఖ వివరణ
Posted On:
03 APR 2020 10:57PM by PIB Hyderabad
లాక్ డౌన్ సందర్భంగా కేంద్ర మంత్రిత్వశాఖలు, విభాగాలు, రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు అమలు చేయడానికిగాను కేంద్ర హోంశాఖ మార్గదర్శకాలను విడుదల చేసిన సంగతి తెలిసిందే. వీటిని మొదట మార్చి 24న విడుదల చేయడం జరిగింది. ఆ తర్వాత వీటిలో మార్చి 25ను, 26న, ఏప్రిల్ 2న మార్పులు చేర్పులు చేయడం జరిగింది.
అయితే వీటి అమలుకు సంబంధించి క్షేత్ర స్థాయిలో అనేక సమస్యలు ఎదురవుతూ వచ్చాయి. మినహాయింపులకు సంబంధించి వివిధ రకాల వ్యాఖ్యానాలు చేయడం జరిగింది. తద్వారా నిత్యావసర వస్తువుల పంపిణీ సులువుగా సాగక అనేక ఇబ్బందులు ఏర్పడ్డాయి. ఈ మార్గదర్శకాలకు సంబంధించి సలహాలను కోరడం జరిగింది. ఈ పరిణామాల నేపథ్యంలో వీటికి సంబంధించి ఆయా రాష్ట్రాల ప్రధాన కార్యదర్శకులకు కేంద్ర హోంశాఖ కార్యదర్శి శ్రీ అజయ్ కుమార్ ఉత్తరం రాశారు. క్షేత్ర స్థాయి సమస్యలకు సంబంధించి ఆయన వివరణ ఇచ్చారు.
లేబరేటరీలకు సంబంధించి తీసుకుంటే వాటిని లాక్ డౌన్ నిబంధనలనుంచి మినహాయించడం జరిగింది. కోవిడ్ 19 నమూనాలను ప్రైవేటు లేబరేటరీలలో కూడా పరీక్షించవచ్చు. నమూనాలను సేకరించడానికిగాను తాత్కాలిక కేంద్రాలను ప్రారంభించడం, ల్యాబ్ టెక్నీషియన్లను తరలించడం, నమూనాలను నమూనాల సేకరణకేంద్రాలనుంచి లేబరేటరీలకు తరలించడం మొదలైన కార్యక్రమాలను లాక్ డౌన్ నిబంధనలనుంచి మినహాయించడం జరిగింది.
ఇక నిత్యావసరాలకు సంబంధించి వాటి అమ్మకాలు ( ఇ కామర్స్ ద్వారా కూడా), ఉత్పత్తి, గిడ్డంగుల్లో పెట్టడం, అలాగే నిత్యావసరాలైన ఆహారం, కిరాణా సామాన్లు, పండ్లు, కూరగాయలు, డెయిరీ ఉత్పత్తులు, మాంసం, చేలు, పశువుల మేత, విత్తనాలు, ఎరువులు మరియు పురుగు మందులు, వ్యవసాయ ఉత్పత్తులు, మందులు, వైద్య పరికరాలు, వాటికి సంబంధించిన ముడి సరుకులు మొదలైనవాటిని లాక్ డౌన్ నిబంధనలనుంచి మినహాయించడం జరిగింది. మార్చి 29న విడుదల చేసిన హోంశాఖ కమ్యూనికేషన్లో కిరాణా వస్తువులంటే వివరణ ఇవ్వడం జరిగింది. వీటిలో ఆరోగ్య పారిశుద్ధ్యానికి సంబంధించిన ఉత్పత్తులు అంటే చేతులను శుభ్రం చేసుకునే వస్తువులు,, సబ్బులు, క్రిమిలు అంటుకోకుండా చూసే మందులు, బాడీ వాష్, షాంపూలు, నేలల్ని శుభ్రం చేసే ద్రవాలు, డిటర్జెంట్లు, టిష్యూ పేపర్లు, టూత్ పేస్టులు, నోటి దుర్వాసన పోగొట్టే ద్రవాలు, శానిటరీ ప్యాడ్లు , డయాపర్లు, ఛార్జర్ మరియు బ్యాటరీ సెల్స్ మొదలైనవి కూడా వున్నాయి.
ఆహార పదార్థాలు కిరాణా వస్తువులు అంటే ఏవేవీ వాటికిందకు వస్తాయనే ప్రశ్న తలెత్తినప్పుడు ప్రజలు నిత్య జీవితంలో వినియోగించేవి అని అర్థం చేసుకోవాలని ఆయా రాష్ట్ర కేంద్రపాలిత ప్రాంతాలకు సూచించడం జరిగింది.
నిత్యావసర వస్తువుల ఉత్పత్తి, వాటి నిలువ మరియు సరఫరాకు సంబంధించి జిల్లాస్థాయి అధికార సంస్థలు పాసులిస్తున్నాయి.అయితే జాతయస్థాయి వ్యాపార సంస్థలకు ఈ పాసుల విషయంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఈ ఇబ్బందిని పరిష్కరించడానికిగాను రాష్ట్ర కేంద్ర పాలిత ప్రాంత ప్రభుత్వాలు ఈ పాసులను ఇవ్వాలని సూచించడం జరిగింది. ఈ పాసుల సంఖ్యను ఎంత వీలైతే అంత తగ్గించాలని తద్వారా సమయం ఆదా అయి నిత్యావసర వస్తువుల పంపిణీ వేగంగా జరుగుతుందని కేంద్ర హోం శాఖ తెలియజేసింది.
సహాయ చర్యలు, తరలింపుకు సంబంధించి రైల్వేలు, విమానాశ్రయాలు, నౌకాశ్రయాల కార్యకలాపాలు సులువుగా సాగడానికి వీలు లేకుండా ఇబ్బందులు తలెత్తాయి. కొన్ని కేసుల్లో జిల్లా స్థాయి అధికారులనుంచి పాసులను పొందడం కష్టమైంది. దీన్ని నివారించడానికిగా రైల్వేలు, విమానశ్రయాలు, నౌకాశ్రయాలకు సంబంధించిన సంస్థలే ఈ పాసులను ఇవ్వడానికి అనుమతినివ్వడం జరిగింది. తద్వారా ఆయా కార్యకలాపాలు నిర్వహించే సిబ్బంది, కాంట్రాక్టు కార్మికులు సులువుగా ఆయా పనుల్లో పాల్గొనడం జరుగుతుంది.
వస్తువుల సరఫరాకు సంబంధించి రాష్ట్రాల మధ్యన, రాష్ట్రాల్లోను తిరగడానికి వీలుగా భారీ వాహనాలను అనుమతించడం జరిగింది. అయితే వీటిని నడుపుతున్న డ్రైవర్ దగ్గర నిబంధనలకు అనుగుణంగా వుండే డ్రైవింగ్ లైసెన్స్ వుండాలి. డ్రైవర్ తోపాటు అదనంగా ఒకరిని అనుమతిస్తారు. వస్తువులను వదిలేసిగానీ, లోడింగు చేసుకోవడానికిగాను వచ్చే భారీ వాహనం అందుకు సంబంధించిన వే బిల్లును కలిగి వుండాలి. డ్రైవర్, అదనపు వ్యక్తి తమ నివాసగృహాలనుంచి భారీ వాహనందాకా రావడానికి ఆయా ప్రాంతాల అధికారులు అనుమతించాలి.
పాసులు కలిగిన వ్యక్తులందరూ ఆరోగ్యం, శుభ్రత, భౌతిక దూరానికి సంబంధించి అన్ని నియమ నిబంధనలు అనుసరించాలి.
దీనికి సంబంధించి జిల్లా అధికారులకు, ఫీల్డ్ ఏజెన్సీలకు తగిన సమాచారం ఇవ్వాలని తద్వారా క్షేత్రస్థాయిలో ఎలాంటి సందేహాలకు తావు లేకుండా చూసుకోవాలని కేంద్ర హోంశాఖ వివరంగా పేర్కొంది.
***
(Release ID: 1610911)
Visitor Counter : 196