ఉప రాష్ట్రపతి సచివాలయం
కరోనా వైరస్ పై భారతదేశం సాధించబోయే విజయం ప్రపంచవ్యాప్త పోరాటంలో ప్రధాన పాత్ర పోషిస్తుంది : ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు
Posted On:
31 MAR 2020 5:39PM by PIB Hyderabad
కరోనా వైరస్ పై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్న పోరాటం ప్రశంసనీయంగా వుందని ఉప రాష్ట్రపతి శ్రీ వెంకయ్య నాయుడు అన్నారు. జాతీయ స్థాయిలో విదించిన లాక్ డౌన్ మొదటివారం విజయవంతమైందని రాబోయే రెండు వారాలు మరింత కీలకంగా మారనున్నాయని ఆయన అన్నారు.
ప్రజలు ఒకరికొకరు భౌతిక దూరం పాటిస్తూ నిత్యావసర వస్తువులను కొనుగోలు చేయడం ఇందుకోసం ఆయా మార్కెట్ల దగ్గర, షాపుల దగ్గర ఏర్పాట్లు చేయడం, రైల్వే వ్యాగన్లను ఐసోలేషన్ వార్డులుగా చేయాలనే నిర్ణయం తీసుకోవడం, అలాగే కొంత మంది శాస్త్రవేత్తలు, సంస్థలు కోవిడ్ 19 టెస్టులను రూపొందించడం, వెంటిలేటర్ల కోసం ఏర్పాట్లు చేయడం ..ఇలా అనేక విధాలుగా కరోనాపై యుద్ధం జరుగుతోందని ఉపరాష్ట్రపతి అన్నారు. భారతదేశం తీసుకుంటున్న అన్ని రకాల చర్యలకు ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు లభిస్తున్నాయని మనం ఇతరులకు ఆదర్శంగా నిలుస్తున్నామని ఆయన అన్నారు.
ఇంత పెద్ద స్థాయిలో లాక్ డౌన్ ప్రకటించినప్పుడు కొన్ని సమస్యలు తలెత్తడం సాధారణమేనని అందులో వలస కార్మికుల సమస్య, రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు వున్నాయని వీటిని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే పరిష్కరిస్తాయనే నమ్మకం తనకు వుందని ఆయన అన్నారు. లాక్ డౌన్ మొదటి వారంలో దేశవ్యాప్తంగా నిత్యావసరాలకు ఎలాంటి కొరతా ఏర్పడలేదని వాటిని చక్కగా అందుబాటులోకి తేవడం అభినందనీయమని అన్నారు. రాబోయే రెండు వారాలు ప్రజలు మరిన్ని జాగ్రత్తలు తీసుకొని ప్రభుత్వానికి సహకరించాలని ఆయన కోరారు.
అత్యధిక జనాభా కలిగిన భారతదేశంలో అందుబాటులో వున్న ఆరోగ్య, వైద్య మౌలిక సదుపాయాలను పరిగణలోకి తీసుకున్నప్పుడు వైరస్ పై జరిగే పోరాటంలో మనం సాధించే విజయం ప్రపంచవ్యాప్త పోరాటంలో కీలకంగా మారనున్నదని ఉపరాష్ట్రపతి అన్నారు. ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల ప్రజల ఆరోగ్యంపై, ఆర్థిక పరిస్థితులపై ఈ వైరస్ తీవ్ర ప్రభావం చూపుతోందని ఈ సమయంలో భారతీయులు తమ తోటి ప్రజలకు అండగా నిలుస్తూ భారతీయ ధర్మం ప్రకారం నడుచుకోవాలని ఉపరాష్ట్రపతి పిలుపునిచ్చారు. తద్వారా ఈ ప్రపంచ సంక్షోభంపై విజయం సాధించాలని కోరారు.
మానవాళి ప్రస్తుతం ఎదుర్కొంటున్న ఈ సంక్షోభ పరిస్థితుల్లో అందరమూ ఐకమత్యంగా నిలవాలని, మేధావులు, ఇతరులు తమ భేదాభిప్రాయాలను పక్కన పెట్టి మంచి సలహాలతో ముందుకు రావాలని ప్రభుత్వాలకు సహకరించాలని ఈ సవాల్‌ను సమర్థవంతంగా ఎదుర్కోవాలని కోరారు.
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల చర్యలను అభినందనించిన శ్రీ వెంకయ్యనాయుడు లాక్ డౌన్ విధించాలని నిర్ణయం తీసుకోవడం ఎంతో కష్టంతో కూడుకున్నదని అయినా తప్పనిసరిపరిస్థితుల్లో తీసుకున్నారని...ఈ పోరాటం ఎంతకాలముంటుందో తెలియడం లేదని ప్రజలంతా తమ సంపూర్ణ సహకారాలను కొనసాగించాలని కోరారు. మొదటి వారం లాక్ డౌన్ ఫలితాలతో రానున్న రెండువారాల లాక్ డౌన్ పట్ల ఆశలు పెరిగాయని ఆయన అన్నారు.
కరోనా వైరస్ పై పోరాటంలో భాగంగా అభివృద్ధి చెందిన దేశాల్లో సైతం ప్రతిష్టంభన ఏర్పడిందని వారితో పోల్చితే మన దేశంలో నిత్యావసర వస్తువులకు ఎలాంటి ఇబ్బందులు కలగలేదని ఆయన అన్నారు. ఈ సంక్షోభ సమయంలో తగాదాలు మంచిది కాదని ఆయన అన్నారు.
వలస కార్మికుల సమస్యల పరిష్కారం కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉత్తమమైన నిర్ణయాలు తీసుకుంటున్నాయని ఉప రాష్ట్రపతి అన్నారు. పారిశ్రామిక సంస్థలు, కాంట్రాక్టర్లు తమ దగ్గర పని చేస్తున్న వారికి అండగా నిలవాలని ఉప రాష్ట్రపతి కోరారు.
వ్యవసాయం అనేది మనదేశానికి వెన్నెముక లాంటిది. పంటలు చేతికొస్తున్న ఈ సమయంలో ఎవరికీ ఎలాంటి ఇబ్బందులు కలగొద్దని ఆయన అన్నారు. అంతే కాదు ఆ పంటల్ని పండించిన రైతులకు గిట్టుబాటు ధరలు లభించేలా చూడాలని ప్రభుత్వాలను కోరారు. దీనికి సంబంధించి ఇప్పటికే తాను కేంద్ర వ్యవసాయశాఖ మంత్రితోను, కేబినెట్ సెక్రటరీతోను మాట్లాడినట్టు శ్రీ వెంకయ్యనాయుడు అన్నారు.
లాక్ డౌన్ సమయంలో ఇంటికే పరిమితం కావడమనేది ఒక కొత్త అనుభవం. అయితే ఈ సంక్షోభాన్ని అవకాశంగా మలుచుకొని కుటుంబ సభ్యులతో నాణ్యమైన సమయాన్ని గడపాలని ఆయన కోరారు. ఇతరుల కష్టనష్టాలను పంచుకొని సాయం చేయడమనేది మన భారతీయ ధర్మమని, కాబట్టి అవసరమైనవారికి కావలసిన సాయం చేయాలని దేశ ప్రజల్ని ఉపరాష్ట్రపతి కోరారు.
అలాగే నెటిజన్లు సోషల్ మీడియాను సమర్థవంతంగా ఉపయోగించుకోవాలని కోరారు. కరోనా వైరస్ కు సంబంధించి తప్పుదోవ పట్టించే వార్తల జోలికి పోవద్దని సరైన అవగాహనను కల్పించడంలో భాగమవుదామని ఆయన పిలుపునిచ్చారు. భయం సృష్టించడానికి బదులు ప్రజలను బలోపేతులను చేసి ఈ సవాల్ ను ఎదుర్కొనేలా చేయాలని ఆయన కోరారు.
ఈ క్లిష్ట సమంలో ప్రభుత్వాలకు ప్రజల సహకారం చాలా ముఖ్యమని ప్రజలంతా ఏకతాటిపై నిలిచి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సహకారం అందించాలని కోరారు. రాబోయే రెండువారాలు మరింత కీలకమని ఈ రెండు వారాల్లో ప్రజలు మరింత అప్రమత్తంగా వుండాలని కోరారు. వైద్యులు, పారా మెడికల్ సిబ్బంది, పోలీసు సిబ్బంది, పారిశుద్ధ్య కార్మికులు ఫ్రంట్ లైన్లో నిలబడి ఎంతో ధైర్యంగా సేవలు అందిస్తున్నారని ఈ సమయంలో వారికి ప్రజలు అన్ని విధాలా సహకారం అందించాలని ఉప రాష్ట్రపతి కోరారు.
కరోనా వైరస్ పై జరుగుతున్న పోరాటం కనీవినీ ఎరగని స్థాయిలో వుందని ఈ నేపథ్యంలో ప్రజలు ముందుకొచ్చి పిఎం కేర్స్ నిధికి విరాళాలు అందించాలని ఉప రాష్ట్రపతి కోరారు. ఇప్పటికే విరాళాలు అందించినవారికి నా హృదయపూర్వక అభినందనలు తెలియజేసుకుంటున్నాను.
ఈ సంక్షోభ సమయంలో ప్రపంచానికి మార్గదర్శకంగా భారతదేశం నిలుస్తుందని ఉప రాష్ట్రపతి దీమా వ్యక్తం చేశారు.
*****
(Release ID: 1609719)
Visitor Counter : 376