హోం మంత్రిత్వ శాఖ
వలస కార్మికులు, యాత్రికులను ఆదుకోండి
-జాతీయ రహదారులపై సహాయ శిబిరాల్ని ఏర్పాటు చేయండి
-ప్రభుత్వపు సహాయ చర్యలపై తగిన ప్రచారం నిర్వహించండిః
రాష్ర్టాలకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా మార్గదర్శకాలు
Posted On:
28 MAR 2020 5:37PM by PIB Hyderabad
కరోనా వ్యాప్తిని నివారించే చర్యల్లో భాగంగా నిర్వహిస్తున్న లాక్డౌన్ కాలంలో వలస
కార్మికులను ఆదుకోవడంపై కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించింది. ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోడీ ఆదేశాల మేరకు లాక్డౌన్ కాలంలో వలస కార్మికులకు ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌షా భరోసా ఇచ్చారు. కోవిడ్-19 వైరెస్ వ్యాప్తి కట్టడికి దేశ వ్యాప్తపు సన్నద్ధత విషయాన్ని ఆయన శనివారం సమీక్షించారు. వలస కార్మికులకు అన్ని విధాలా బాసట అందించాలనే ఉద్దేశ్యంతో మోడీ ప్రభుత్వం.. లాక్డౌన్ కాలంలో స్వరాష్ర్టాలకు తిరిగి వచ్చేందుకు ప్రయత్నిస్తున్న వలస కార్మికులు, యాత్రికులు మొదలైనవారికి వెంటనే సహాయ శిభిరాలను ఏర్పాటు చేయాలని రాష్ర్టాలకు విజ్ఞప్తి చేస్తూ కేంద్రం హోం శాఖ కార్యదర్శి రాష్ట్ర ప్రభుత్వాలకు లేఖ రాశారు.
తగిన ప్రచారం నిర్వహించండి..
రాష్ర్టాలలో ఏర్పాటు చేసిన సహాయ శిబిరాలు, అందుబాటులో ఉంచిన సౌకర్యాలను గురించి తగిన ప్రచారం అవగాహన కల్పించేందుకు గాను ప్రజా ప్రచార వ్యవస్థ, ఆధునిక టెక్నాలజీ, వాలంటీర్లు, ఎన్‌జీవోల సేవలను వినియోగించుకోవాలని కేంద్రం సూచించింది. ప్రధాన మంత్రి గరీబ్ కల్యాణ్ యోజన పథకం కింద కేంద్ర ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చిన సహాయ ప్యాకేజీతో పాటు ఆయా రాష్ర్ట ప్రభుత్వాలు అందుబాటులో ఉంచిన సహాయ చర్యలను గురించి కూడా ప్రజలకు అవగాహన కల్పించాలని హోం శాఖ సూచించింది. లాక్డౌన్ సమయంలో జాతీయ రహదారులపై ప్రయాణిస్తూ నిలిచిపోయిన ప్రజల సౌకర్యార్థం రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే గుడారాలు వేసి తగిన వసతితో కూడిన సహాయ శిబిరాలను ఏర్పాటు చేయాలని కూడా హోం శాఖ రాష్ట్రాలకు సూచించింది.
లాక్డౌన్ ముగిసేంత వరకు శిబిరాలు నిర్వహించండి..
లాక్డౌన్ ముగిసేంత వరకు ఈ శిబిరాలను పూర్తి స్థాయిలో నిర్వహించేలా చర్యలను చేపట్టాలని కోరింది. ఈ సహాయ శిబిరాలను కూడా రాష్ట్రాలు కోరానా వ్యాప్తి నివారణ నిబంధనలకు అనుగుణంగా ఏర్పాటు చేయాలని హోం శాఖ పలు సూచనలు చేసింది. శిబిరాల్లో కచ్చితమైన సమాజిక దూరం, క్వారెంటైన్ లేదా ఆసుప్రతి చికిత్స అవసరమైన వారిని గుర్తించేలా తగిన వైద్య ప్రత్యేక బృందాల పర్యవేక్షణ ఏర్పాటు చేయాలని కేంద్రం సూచించింది. ఇలాంటి సహాయ శిబిరాల ఏర్పాటుకు అవసరమైన నిధులను రాష్ట్ర విపత్తుల ప్రతిస్పందన నిధుల నుంచి వాడుకొనేందుకు గాను హోం శాఖ రాష్ట్రాలకు అనుమతినిచ్చింది.
(Release ID: 1608944)
Visitor Counter : 216