రాష్ట్రపతి సచివాలయం
కోవిడ్ -19 వైరస్ వ్యాప్తి నివారణ చర్యలపై రాష్ట్రాల గవర్నర్లు, కేంద్రపాలిత ప్రాంతాల లెఫ్టినెంట్ గవర్నర్లు, పరిపాలకులతో రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి చర్చలు
Posted On:
27 MAR 2020 4:38PM by PIB Hyderabad
భారత రాష్ట్రపతి శ్రీ రాంనాథ్ కోవింద్, ఉపరాష్ట్రపతి శ్రీ ఎం. వెంకయ్య నాయుడుతో కలసి ఈరోజు (శుక్రవారం 27 మార్చి, 2020) అందరూ గవర్నర్లు, లెఫ్టినెంట్ గవర్నర్లు, పరిపాలకులతో వీడియో కాన్ఫరెన్సు ద్వారా కోవిడ్ -19 వైరస్ వ్యాప్తి వల్ల ఎదురవుతున్న సవాళ్ళను భారత ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వాలు/ కేంద్రపాలిత ప్రాంతాలు కలసికట్టుగా ఎదుర్కొనేందుకు అనుసరించవలసిన మార్గాలను, చేపట్టవలసిన చర్యలను గురించి చర్చించారు.
రాష్ట్రపతి తమ ప్రారంభోపన్యాసంలో కరోనా మహమ్మారిని వీలైనంత త్వరగా అరికట్టడానికి ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ, స్వచ్చంద మరియు మత సంస్థలకు చెందిన వాలంటీర్లను సమీకరించి వారి సేవలను ఉపయోగించుకోవాలని గవర్నర్లు, లెఫ్టినెంట్ గవర్నర్లు, పరిపాలకులను కోరారు. భారతీయ సమాజానికి అంతర్లీనంగా ఉన్న బలం “ఇతరులతో పంచుకోవడం, ఆపన్నుల సంరక్షణ” మరియు ప్రభుత్వం తీసుకునే చర్యలు సమాజంలోని అత్యంత దుర్భల వర్గాలు ముఖ్యంగా అవ్యవస్థీకృత రంగానికి చెందినవారు, దిక్కులేనివారి కడగండ్లను దూరం చేయగలవనే ఆశాభావాన్ని రాష్ట్రపతి కోవింద్, ఉపరాష్ట్రపతి నాయుడు వ్యక్తం చేశారు. ప్రపంచ దేశాలను వణికిస్తున్న మహమ్మారి వల్ల తీవ్రంగా ప్రభావితమైన రాష్ట్రాల నుంచి 14 మంది గవర్నర్లు , డిల్లి లెఫ్టినెంట్ గవర్నర్ వీడియో కాన్ఫరెన్సులో పాల్గొన్నారు.
ఉప రాష్ట్రపతి నిర్వహించిన ఈ వీడియో కాన్ఫరెన్సులో పాల్గొన్న గవర్నర్లు దేశంలో లాక్ డౌన్ అమలు సందర్భంగా అయా రాష్ట్రాల అనుభవాలను పంచుకున్నారు.
చర్చలలో రాష్ట్రాలలో కోవిడ్-19 వైరస్ పరిస్థితిని, దుర్భల వర్గాలపై ప్రత్యెక దృష్టితో రెడ్ క్రాస్ నిర్వహించిన పాత్రకు సంబంధించి చర్చలు జరిగాయి. ప్రత్యేకంగా లాక్ డౌన్ నేపధ్యంలో నావెల్ కరోనా వైరస్ వ్యాప్తి నివారణకు కేంద్రం మరియు రాష్ట్ర ప్రభుత్వాలు చేపట్టిన చర్యలకు తోడుగా పౌర సమాజం / స్వచ్చంద సంస్థలు నిర్వహించిన పాత్ర, తాజా పరిస్థితి వల్ల పుట్టుకొస్తున్న సవాళ్ళ గురించి సమావేశంలో చర్చ జరిగింది.
ప్రపంచ మహమ్మారిని ఎదుర్కొనేందుకు మహారాష్ట్ర యంత్రాంగం చేపట్టిన చర్యలను గవర్నర్ శ్రీ భగత్ సింగ్ కోషియారి సంక్షిప్తంగా వివరించడంతో సమావేశం మొదలైంది. కేరళ గవర్నర్ శ్రీ ఆరిఫ్ మహమ్మద్ ఖాన్ రాష్ట్ర ప్రభుత్వం, స్వచ్చంద సంస్థలు, వైద్యులు , పారా మెడికల్ సిబ్బంది మరియు పోలీసులు సమన్వయంతో వ్యవహరించి కేరళ ప్రజలు సామాజిక దూరం పాటించేలా చేశారని అన్నారు. ఈ సందర్భంగా ఆయన ఒక ద్విపద చదివి సామాజిక దూరం ప్రాముఖ్యతను వివరించారు. “యమ్ హీ బెసబబ్ న ఫిరా కరో, కిసీ శాం ఘర్ భీ రహ కరో” దాని అర్ధం “పని లేకుండా తిరగొద్దు, ఇంటిలో ఉండండి” అని. అంతేకాక కేరళలో 1800 మంది విశ్రాంత వైద్యులు, వైద్య విద్యార్ధులు అవసరమైతే స్వచ్చందంగా తమ సేవలు అందించేందుకు ప్రభుత్వం వద్ద నమోదు చేసుకున్నారని, క్వారంటైన్ లో ఉన్న వారికి సలహాలు ఇవ్వడానికి 375 మంది మానసిక వైద్యుల సేవలను ఉపయోగించుకున్నట్లు చెప్పారు. కేరళలో ఉపయోగించిన ఈ వినూత్న ప్రక్రియ ఇతర రాష్ట్రాలకు ఆచరణీయమని అన్నారు.
కర్నాటక గవర్నర్ శ్రీ వాజు భాయి వాలా మహమ్మారిని ఎదుర్కోవడానికి సమాజం సమష్టిగా ప్రదర్శించిన శక్తి ప్రశంసనీయమని అన్నారు. రెడ్ క్రాస్ సొసైటీకి చెందిన 8000 మంది వాలంటీర్లు ప్రజలలో వైరస్ గురించ జాగృతి కలుగజేస్తున్నారని అన్నారు. అక్షయ పాత్ర అనే సామాజిక సంస్థ రాష్ట్రవ్యాప్తంగా ఆహార పొట్లాలను పంచుతూ క్రియాశీలక పాత్ర పోషిస్తోందని అన్నారు.
అన్ని సవాళ్ళను ఎదుర్కొనేందుకు రాష్ట్రం సిద్ధంగా ఉందని హరియానా గవర్నర్ శ్రీ సత్యదేవ్ నారాయణ ఆర్య అన్నారు.
లాక్ డౌన్ అమలుకు, ప్రజల సమస్యలను తీర్చడానికి రాష్ట్ర ప్రభుత్వం, ఇతర సంస్థలు పూర్తి సమన్వయంతో పని చేస్తున్నాయని డిల్లి లెఫ్టినెంట్ గవర్నర్ శ్రీ అనిల్ బైజాల్ అన్నారు. ఉన్నత స్థాయిలో లెఫ్టినెంట్ గవర్నర్, డిల్లి ముఖ్యమంత్రి ప్రతిరోజూ సమావేశమై పరిస్థితిపై సమీక్షిస్తున్నట్లు తెలిపారు. సహాయక చర్యలు సమన్వయంతో జరుగుతున్నాయని అన్నారు.
గుజరాత్ గవర్నర్ శ్రీ ఆచార్య దేవ్ వ్రత్ రాష్ట్రంలో క్వారంటైన్ కు అవసరమైన సౌకర్యాలను పెంచుతున్నట్లు తెలిపారు. అందరి సమన్వయంతో ఈ సవాలును ఎదుర్కొంటున్నట్లు వివరించారు.
రాష్ట్రంలో అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు తెలంగాణ గవర్నర్ డాక్టర్ తమిలిసై సౌందర రాజన్ తెలిపారు. కోవిడ్-19 గురించి ప్రజలలో జాగృతి కలుగజేయడానికి సామజిక మాధ్యమాలను విస్తృతంగా ఉపయోగిస్తున్నట్లు ఆమె తెలియజేశారు. రాజ్ భవన్ చుట్టుపక్కల నివసించే 800 కుటుంబాలకు ఆహారం అందించేందుకు రాజ్ భవన్ చర్యలు తీసుకొందని గవర్నర్ తెలిపారు. మహమ్మారి తీవ్రతను గురించి ప్రజలలో జాగృతి కలిగించేందుకు నటులు, కళాకారులు, రచయితలు, మేధావుల సహాయం తీసుకోవలసిందిగా ఉపరాష్ట్రపతి శ్రీ వెంకయ్య నాయుడు గవర్నర్ కు సూచించారు.
అవసరమైతే సేవలు అందించేందుకు రాష్ట్రంలోని యూనివర్సిటీలు సిద్ధంగా ఉన్నాయని పశ్చిమ బెంగాల్ గవర్నర్ శ్రీ జగదీప్ ధన్కర్ తెలియజేశారు. అంతేకాక తమకున్న పరిమిత వనరులతో రెడ్ క్రాస్ రాష్ట్రంలో మెరుగైన సేవలు అందిస్తోందని గవర్నర్ అన్నారు.
హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ శ్రీ బండారు దత్తాత్రేయ మాట్లాడుతూ రాష్ట్రంలో రెడ్ క్రాస్ వాలంటీర్లు రేయింబవళ్ళు శ్రమిస్తూ ప్రజలకు సహాయం చేస్తున్నారని. గిరిజన జనాభా అధికంగా ఉన్న జిల్లాలలో జాగృతిని కలిగించేందుకు ప్రత్యెక కృషి చేస్తున్నారని అన్నారు.
బీహార్ రాష్ట్రం అంతర్జాతీయ సరిహద్దుకు చేరువలో కరోనా వైరస్ దాడికి అనువుగా ఉన్నప్పటికినీ వ్యాధి వ్యాప్తిని అరికట్టేందుకు బీహార్ ప్రభుత్వం పనిచేస్తున్న తీరు ప్రశంసనీయమని గవర్నర్ శ్రీ ఫగు చౌహాన్ తెలిపారు. రెడ్ క్రాస్ వాలంటీర్లు, సంస్థ అంబులెన్స్ లు జిల్లా యంత్రాంగానికి సహాయకారిగా ఉన్నాయని అన్నారు.
తమిళనాడు గవర్నర్ శ్రీ బన్వారీ లాల్ పురోహిత్ మాట్లాడుతూ నిర్మాణ కార్మికులకు ఉచితంగా భోజనం పెట్టేందుకు చర్యలు తీసుకుంటున్నామని, రాష్ట్రంలో ప్రజా పంపిణీ వ్యవస్థ కింద రేషన్ కార్డులు ఉన్న వారందరికీ రూ. 1000 చొప్పున నగదు ఇస్తామని తెలియజేశారు. అమ్మ క్యాంటిన్ల ద్వారా సబ్సిడీపై ఆహారం అందిస్తున్నామని అన్నారు. సినీ నటులు, ప్రైవేటు రంగం, మత పెద్దల సహాయం తీసుకోవలసిందిగా గవర్నర్ కు ఉపరాష్ట్రపతి సలహా ఇచ్చారు.
మధ్య ప్రదేశ్ గవర్నర్ శ్రీ లాల్ జీ టాండన్, పంజాబ్ గవర్నర్ శ్రీ వి.పి. సింగ్, రాజస్థాన్ గవర్నర్ శ్రీ కల్రాజ్ మిశ్రా కూడా తమ అనుభవాలను పంచుకొన్నారు.
డిల్లి లేఫ్తినెంటు గవర్నర్, చండీగఢ్ పరిపాలకునితో సహా పదిహేను మంది గవర్నర్లు పాల్గొన్న సమావేశాన్ని ముగిస్తూ కరోనా వైరస్ వ్యాప్తి, నివారణ, సహాయ చర్యలను ఎప్పటికప్పుడు సమీక్షించి చర్యలు తీసుకోవాలని రాష్ట్రపతి వారిని కోరారు. వివిధ రాష్ట్రాల అనుభవాల ఆధారంగా దేశంలోని ఇతర ప్రాంతాలలో నివారణ, కట్టడికి చర్యలు చేపట్టాలని పిలుపు ఇచ్చారు.
*****
(Release ID: 1608677)
Visitor Counter : 204