హోం మంత్రిత్వ శాఖ
కోవిడ్ -19 వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు సామాజిక దూరం పాటించడానికి వీలుగా ఇతర రాష్ట్రాల వలస కార్మికులకు, విద్యార్ధులకు తగిన ఏర్పాట్లు చేయాలని అన్ని రాష్ట్రాలను/ కేంద్రపాలిత ప్రాంతాలకు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ సలహా
Posted On:
27 MAR 2020 3:16PM by PIB Hyderabad
దేశవ్యాప్తంగా మూడు రోజులుగా అమలవుతున్న 21 రోజుల కోవిడ్ -19 లాక్ డౌన్ అమలుకు సంబంధించి తక్షణం తీసుకోవలసిన చర్యల గురించి కేంద్ర హోం శాఖ కార్యదర్శి అన్ని రాష్ట్రాలకు / కేంద్రపాలిత ప్రాంతాలకు లేఖలు రాశారు. ఇతర రాష్ట్రాల నుంచి వలస వచ్చి తమ రాష్ట్రంలో ఉంటున్న వ్యవసాయ కూలీలకు, పరిశ్రమల్లో పనిచేసే కార్మికులకు మరియు అవ్యవస్థీకృత రంగానికి చెందిన కార్మికులకు తగిన విధంగా ఆహారం, నివాస వసతి కల్పిచడం ద్వారా ఆదుకోవాలని సలహా ఇచ్చింది.
అదేవిధంగా ఇతర రాష్ట్రాలకు చెందిన విద్యార్ధులు, ఉద్యోగినులు మొదలగువారు ఇప్పుడు వారు ఉంటున్న వసతి గృహాలలోనే కొనసాగేలా గట్టి చర్యలు తీసుకోవాలని కూడా సూచించింది.
అవ్యవస్థీకృత రంగానికి చెందిన కార్మికుల, ముఖ్యంగా దిక్కుతోచని పరిస్థితుల్లో చిక్కుకుపోయిన, ఇబ్బందులను తీర్చడానికి రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల అధికారులు స్వచ్చంద సంస్థలు (ఎన్జీవోలు) సహా వివిధ ఏజెన్సీలను కలుపుకొని సహాయక చర్యలు చేపట్ట వలసిన అవసరం ఉందని హోం మంత్రిత్వ శాఖ లేఖలో సూచించారు. వలస కూలీలకు ఆహారం, త్రాగు నీరు, పారిశుద్ద్యం మొదలైన కనీస సౌకర్యాలతో నివాస స్థలం ఏర్పాటు చేయాలని తెలిపారు.
అంతేకాక ప్రభుత్వం ప్రజాపంపిణీ వ్యవస్థ ద్వారా ఉచితంగా ఆహార ధాన్యాలు మరియు ఇతర నిత్యావసరాలు ఉచితంగా పంపిణీ చేస్తున్న సంగతి ఈ దుర్భల బృందాలకు తెలియజెప్పాలని, ప్రజా పంపిణీ వ్యవస్థను క్రమబద్ధం చేయాలని కూడా రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలకు సూచించారు.
హోటళ్ళు, వసతి గృహాలు, అద్దె ఇళ్ళు మొదలగునవి పనిచేసేలా మరియు నిత్యావసర సరుకుల సరఫరా ఆగకుండా చూడాలని, తద్వారా వసతి గృహాలలో ఉండే విద్యార్దులకు, ఉద్యోగినులకు ఇంతకు ముందు లాగానే అన్ని సౌకర్యాలు అందేలా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని హోం మంత్రిత్వ శాఖ తెలిపింది.
నిత్యావసర సరుకుల సరఫరా, సేవల కల్పన నిశ్చయం చేసుకోవడంతోపాటు లాక్ డౌన్ ఖచ్చితంగా అమలు చేయాలనీ, కోవిడ్-19 వ్యాప్తి అరికట్టేందుకు అది తప్పనిసరి అని రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలకు లేఖలో సూచించారు.
*****
(Release ID: 1608615)
Visitor Counter : 274
Read this release in:
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Assamese
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam