ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
కోవిడ్ -19 నియంత్రణకు సంబంధించి తీసుకుంటున్న చర్యలు, ప్రస్తుత పరిస్థితి పై రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించిన కేంద్ర ఆరోగ్య , కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ హర్షవర్ధన్
Posted On:
26 MAR 2020 7:59PM by PIB Hyderabad
కోవిడ్ -19 నియంత్రణ, తీసుకుంటున్న చర్యలు , సన్నద్ధత తదితర అంశాలకు సంబంధించి కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ హర్షవర్ధన్ ఈరోజు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు, ఆరోగ్యమంత్రులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో మహారాష్ట్ర, రాజస్థాన్, తెలంగాణ, గుజరాత్, జార్ఖండ్, బీహార్, ఉత్తరప్రదేశ్, పంజాబ్, తమిళనాడు, ఢిల్లీ, మధ్యప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, జమ్ము,కాశ్మీర్, ఉ త్తరాఖండ్, ఒడిషా,హర్యానా, అరుణాచల్‌ప్రదేశ్,నాగాలాండ్, మేఘాలయ, దాద్రా నాగర్ హవేలి, లద్దాక్, మిజోరం, అండమాన్ నికోబార్ ,హిమాచల్ ప్రదేశ్, చండీఘడ్, గోవా, చత్తీస్‌ఘడ్ తదితర రాష్ట్రాలు పాల్గొన్నాయి. మంత్రిత్వశాఖకు చెందిన సీనియర్ అధికారులు, ఎన్‌సిడిసి, ఐసిఎంఆర్ అధికారులు కూడా వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు. కేరళ ఆరోగ్య శాఖ మంత్రి శ్రీమతి కె.కె. శైలజతో కూడా డాక్టర్ హర్షవర్ధన్ కు ఫోన్ చేసి మాట్లాడారు. వీడియో కాన్ఫరెన్స్‌లో ఆమె పాల్గొనలేకపోవడంతో ఆమెతో ఫోన్‌లో మాట్లాడి కేరళలో కోవిడ్ -19 పరిస్థితిపై చర్చించారు.
వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నవారినుద్దేశించి మాట్లాడుతూ డాక్టర్ హర్షవర్ధన్, కరోనా మహమ్మారిని గట్టిగా నియంత్రించడానికి సామాజిక దూరాన్ని పాటించాల్సిన ప్రాధాన్యతను నొక్కి చెప్పారు.
భారతదేశంలో కరోనా వ్యాప్తిని అరికట్టడానికి అన్ని రాష్ట్రాలూ మరింత అప్రమత్తంగా ఉండాలని, దీనిని నియంత్రించేందుకు అవకాశం ఉన్న అన్ని నియంత్రణ వ్యూహాలను పాటించాలని పిలుపునిచ్చారు.
రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు లాక్‌డౌన్‌ను పటిష్టంగా అమలు చేసేందుకు చర్యలు తీసుకోవాలని,నిత్యావసర సరకులు అందుబాటులో ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. రాష్ట్రాలలో కోవిడ్ -19 చికిత్సకు సంబంధించి ప్రత్యేక ఆస్పత్రులు ఏర్పాటు చేయాల్సిన ప్రాధాన్యత గురించి మంత్రి నొక్కి చెప్పారు. నిర్ధారిత కేసులకు ప్రొటోకాల్ ప్రకారం చికిత్స అందిచాల్సిన అవసరాన్ని, అలాగే ప్రతి కరోనా మహమ్మారి బారిన పడినవారికి అది ఎవరి ద్వారా ఎలా సంక్రమించిందో గుర్తించి, దానిపై తదుపరి చర్యలు చేపట్టాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పారు.
రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు గట్టి నిఘా చర్యలు చేపట్టాలని, ప్రత్యేకించి గత నెల నుంచి ఇండియా వచ్చిన అంతర్జాతీయ ప్రయాణికులపై దృష్టి పెట్టాలని సూచించారు. ఇందుకు తోడు హోం క్వారంటైన్ లో ఉన్న వారికి సంబంధించి పరిశీలన జరిపి , దీనిని పాటించని వారిపై చర్యలు తీసుకోవాలని సూచించారు.
కోవిడ్ -19 మహమ్మారి నియంత్రణకు సంబంధించి పదవీ విరమణ చేసిన వైద్యుల సేవలను వినియోగించుకునే అవకాశాల్ని పరిశీలించాల్సిందిగా డాక్టర్ హర్షవర్ధన్ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలను కోరారు. దీనికితోడు అంబులెన్స్ డ్రైబర్లు, కాల్ సెంటర్ సిబ్బంది, ఇ.ఎం.ఆర్ టీమ్ సభ్యులకు శిక్షణ ఇచ్చేలా చూడాలన్నారు. మరోవైపు కోవిడ్ -19 పోర్టల్ లో జిల్లాల వారీగా అంబులెన్స్ ల వివరాలను అప్‌డేట్ చేయాలన్నారు.
ఆస్పత్రులలో వైద్యులు, నర్సులు, ఇతర వైద్య సిబ్బంది కోరత ఏర్పడకుండా వారికి రవాణా సదుపాయాలు కల్పించాలని, ఈ విషయంలో ఎలాంటి ఆటంకాలూ ఎదురుకాకుండా చూడాలన్నారు. డాక్టర్లు, నర్సులు, ఇతర ఆరోగ్య కార్యకర్తలకు ఉమ్మడి రవాణా సదుపాయం ఏర్పాటు చేయాల్సిందిగా సూచించారు. దీనికితోడు కోవిడ్ -19 పేషెంట్ కేర్ కు సంబంధించి ఎఐఐఎంఎస్ పోర్టల్‌తో క్రియాశీల సమన్వయం కలిగి ఉండాలని అలాగే ఐఎంఎ, నర్సులు ,ఇ తర పారా మెడిక్స్ కు సంబంధించిన అసోసియేషన్లతో సమన్వయంతో పనిచేయాలని సూచించారు.
కొవిడ్ -19 మహమ్మారిని ఎదుర్కొనేందుకు దేశానికి సేవచేస్తున్న డాక్టర్లు, పారామెడకల్ సిబ్బందిని కొందరు ఇంటి యజమానులు , డాక్టర్లు, అద్దె ఇళ్లనుంచి ఖాళీ చేయిస్తున్నట్టు వస్తున్న వార్తల గురించి ప్రస్తావిస్తూ డాక్టర్ హర్షవర్ధన్, డాక్టర్లు, నర్సులు,పారామెడికల్ సిబ్బందిని ఇంటి యజమానులు, ఇళ్లనుంచి ఖాళీ చేయించకుడా రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు చర్యలు తీసుకోవాలన్నారు.
కరోనా వైరస్‌పై పోరాటంలో పాలుపంచుకుంటున్న డాక్టర్లు, పారామెడికల్ సిబ్బంది, హెల్త్ వర్కర్లకు 50 లక్షల రూపాయల ఇన్సూరెన్స్ సదుపాయాన్ని ప్రభుత్వం ఈరోజు ప్రకటించినట్టు మంత్రి తెలిపారు.
మెడికల్ కాలేజీలు, కోవిడ్ 19 సంబంధిత వస్తువుల కొనుగోలుకు ఎన్.హెచ్.ఎం పథకం కింద రాష్ట్రాలు నిధులు సమకూర్చాలని సూచించారు.
ప్రభుత్వం ప్రకటించిన 21 రోజుల లాక్‌డౌన్ సమయంలో నిత్యావసర వస్తువులు, మందులు, పరికరాల కు సంబంధించిన సరఫరాలు నిరంతరం కొనసాగేట్టు హోంమంత్రిత్వశాఖ , ఇతర విభాగాలతో కలిసి కీలక పాత్ర పోషిస్తున్నదని చెప్పారు.అన్ని అత్యవసర సేవలు అందుబాటులో ఉండే విధంగా తగిన ఆదేశాలు ఇవ్వడం జరిగిందని అన్నారు. ఫార్మసీలు ఇంటివద్దకే మందులు సరఫరా చేసే విధంగా చూడాలని రాష్ట్రాలను ఆయన కోరారు. ఇందుకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఒక నోటిఫికేషన్ జారీచేసినట్టు డాక్టర్ హర్ష వర్ధన్ తెలిపారు. క్వారంటైన్ లో ఉన్న వారి మానసిక ఆరోగ్య పరిరక్షణపై శ్రద్ధ పెట్టాల్సిన అవసరాన్ని నొక్కి చెబుతూ ఆయన, ఇప్పటికే క్వారంటైన్‌లో ఉన్న వారికోసం సైకాలజిస్టుల సేవలు అందేలా హెల్ప్‌లైన్ ఏర్పాటు చేయాలన్నారు. టెలి మెడిసిన్ కు సంబంధించిన మార్గదర్శకాలు జారీ అయ్యాయని, ఇందుకు సంబంధించి ఒకయాప్ కూడా ప్రారంభించనున్నామన్నారు. ఈ యాప్ ను ఉపయోగించి, ఇళ్ల వద్ద ఉన్న ప్రజలకు వైద్య సలహా ఇచ్చే వైద్య బృందాలను గుర్తించాల్సిందిగా డాక్టర్ హర్ష వర్ధన్ రాష్ట్రాలకు సూచించారు.
.
(Release ID: 1608441)
Visitor Counter : 231