ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
కోవిడ్ -19 నిరోధ చర్యలపై, తాజా పరిస్థితిపై కేంద్ర మంత్రి మండలి సమావేశం
Posted On:
25 MAR 2020 6:04PM by PIB Hyderabad
కోవిడ్ 19 మహమ్మారిని అరికట్టడానికిగాను ప్రభుత్వంఏర్పాటు చేసిన మంత్రి మండలి సభ్యులు సమావేశమై తాజా పరిస్థితిని సమీక్షించారు. కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్ హర్షవర్ధన్ ఆధ్వర్యంలో ఈ సమావేశం జరిగింది. సామాజిక దూరం ప్రాధన్యత, హోమ్ క్వారంటైన్ విధివిధానాలు, వైద్యులు ఇతర ఆరోగ్యరంగ సిబ్బందికి అందివ్వాల్సిన సహకారం తదితర అంశాలపై మంత్రి మండలి సమీక్షించింది. ఈ సమావేశంలో మండలి సభ్యులతోపాటు ఆయా మంత్రిత్వ శాఖ ప్రధాన అధికారులు కూడా పాల్గొన్నారు.
కోవిడ్ 19 నిరోధానికిగాను ఇంతవరకూ తీసుకున్న చర్యలపై మంత్రి మండలి సమగ్రంగా సమీక్షించింది. అంతే కాదు పలు రాష్ట్రాలు చేపడుతున్న చర్యలపై కూడా ఈ సమావేశం సమీక్షించింది. ఈ యుద్ధంలో విజయం సాధించాలంటే వైద్య పరంగా ఆయా రాష్ట్రాలను బలోపేతం చేయాల్సిన విషయం గురించి చర్చ జరిగింది. ఆయా రాష్ట్రాల్లో కోవిడ్ 19 చికిత్స కోసమే పని చేసే ఆసుపత్రులే ఏర్పాటు, వాటిలో వినియోగించాల్సిన పరికరాలు తదితర అంశాల గురించి చర్చ కొనసాగింది. ప్రజలకు కావలసిన నిత్యావసర వస్తువుల పంపిణీ, నిత్యావసర సేవల అందుబాటులో రాష్ట్రాలు అన్ని విధాలా జాగ్రత్తలు తీసుకోవాలని మంత్రి మండలి కోరింది.
గుజరాత్, అస్సాం, జార్ఖండ్, రాజస్థాన్, గోవా, కర్నాటక, మధ్య ప్రదేశ్, జమ్ము కాశ్మీర్ కోవిడ్ -19 నిరోధం కోసం మాత్రమే పని చేసే ఆసుపత్రులను నెలకొల్పిన విషయాన్ని ఈ సందర్భంగా అధికారులు మంత్రి మండలికి తెలిపారు. ఐసిఎంఆర్ నెట్ వర్క్ పరిధిలో 118 లాబరేటరీలు పని చేస్తున్నట్టు అధికారులు వివరించారు.
సామాజిక దూరం ప్రాధాన్యతను మరోసారి ప్రత్యేకంగా ప్రస్తావించిన కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ హర్ష వర్ధన్ కేంద్ర ఆరోగ్య శాఖ చెప్పిన విధివిధానాల ప్రకారం క్వారంటైన్ లో వున్న వారు నడుచుకోవాలని కోరారు. వివరాలు తెలియనివారు ఎవరైనా వుంటే మంత్రిత్వశాఖ వెబ్‌సైట్ లోకి వెళ్లి తెలుసుకోవచ్చని చెప్పారు.
మార్చి 21, 2020నుంచీ విదేశాలనుంచి భారతదేశానికి వచ్చినవారు 64వేల దాకా వున్నారని వీరిలో 8 వేల మందిని క్వారంటైన్ కేంద్రాల్లో వుంచామని, 56 వేల మందిని వారి వారి ఇళ్లల్లోనే క్వారంటైన్ చేశామని మంత్రి తెలిపారు. ప్రభుత్వ విధివిధానాలను, ఆదేశాలను కాదని ఎవరైనా వ్యవహరిస్తే చట్టపరంగా కఠిన చర్యలుంటాయని మంత్రి హెచ్చరించారు.
ఈ సమరంలో ముందు భాగాన నిలిచి యుద్ధం చేస్తున్న ఆరోగ్యరంగ సిబ్బందికి అందరూ సహకరించాలని, ఈ మహమ్మారికి సంబంధించి పుకార్లను వ్యాప్తి చేయాలని ఎవరైనా ప్రయత్నిస్తే కఠినమైన శిక్షలుంటాయని అన్నారు.
.........................
(Release ID: 1608246)
Visitor Counter : 151