ప్రధాన మంత్రి కార్యాలయం
ఆరోగ్యరంగ సిబ్బందికి ప్రధాని అభినందనలు
Posted On:
24 MAR 2020 7:53PM by PIB Hyderabad
కోవిడ్ -19 మహమ్మారిపై పోరాటంలో బాగంగా నిస్వార్థపూరిత సేవలను అందిస్తున్న వైద్య రంగ సిబ్బందికి ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ తన హృదయ పూర్వక అభినందనలు తెలియజేశారు. మీరు చూపుతున్న పట్టుదల, సంకల్పబలం చూసిన తర్వాత ఈ పోరాటంలో మనం తప్పకుండా విజయం సాధించగలమనే నమ్మకం ఏర్పడిదంటూ ప్రధాని అన్నారు. టెలీ కన్సల్టేషన్ల ద్వారా అందించే చికిత్సను భారీస్థాయిలో ఉపయోగించుకోవాలనే ప్రతిపాదనల్ని పరిశీలిస్తామని అన్నారు. వైరస్‌పై పోరాటంలో ఆరోగ్య రంగ సిబ్బంది, వైద్యుల భద్రతకు సంబంధించి ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యతనిస్తోందని ప్రధాని స్పష్టం చేశారు.
ఆరోగ్య, వైద్యరంగానికి సంబంధించిన వైద్యులు, నర్సులు, ల్యాబ్ టెక్నీషియన్లు మొదలైనవారితో ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. కోవిడ్ 19 మహమ్మారి నిరోధానికి భారతదేశంలోని వైద్యరంగ నిపుణులు అందిస్తున్న నిస్వార్థపూరిత సేవలు అమోఘమైనవని ఈ సందర్భంగా ప్రధాని ప్రశంసించారు. జనతా కర్ఫ్యూ సందర్భంగా దేశం మొత్తం ఒక తాటిపై నిలిచి వారి సేవలకు సంఘీభావం ప్రకటించిందని ప్రధాని అన్నారు. అలాగే వైద్యరంగ సిబ్బందికి సంబంధించిన కుటుంబాలు కూడా తాము అందిస్తున్న సహకారం ద్వారా దేశసేవలో భాగమయ్యారని వారి సహకారం అత్యంత ముఖ్యమైనదని ప్రధాని కొనియాడారు.
ప్రస్తుతం దేశం ముందు వున్న సవాల్ కనీ వినీ ఎరగనిది అని ఇది చారిత్రాత్మకమైనదని ప్రధాని అన్నారు. ఈ సమయంలో దేశ ప్రజలందరూ ఆరోగ్య, వైద్య రంగ సిబ్బందిపై తమ ఆశలు పెట్టుకున్నారని ప్రధాని స్పష్టం చేశారు. వారి నైతికబలానికి ఎలాంటి హానీ జరగకుండా ఈ మహా సవాల్ ను ఎదుర్కోవాల్సి వుందని ప్రధాని అన్నారు.
ఆరోగ్య, వైద్యరంగ సిబ్బందికి తమ ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని, వారు వైరస్ బారినపడకుండా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటూ ప్రజలకు సేవలందించాలని ప్రధాని కోరారు. కోవిడ్ 19 వైరస్ రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఏం చేయాలి? ఏం చేయకూడదు? తదితర అంశాలపై ప్రజలకు చైతన్యం కలిగించాలని, అలాగే స్వీయ నిర్బంధ ప్రాధాన్యతను ప్రజలకు తెలియజేయాలని చికిత్సలు ఎక్కడ లభిస్తాయనే విషయాన్ని కూడా ప్రజలకు వివరించాలని ప్రధాని కోరారు.
కోవిడ్ - 19కు సంబంధించి ప్రజలకు సమగ్రమైన అవగాహన కలిగించాలని, అశాస్త్రీయ చికిత్సలకు, తప్పుదోవ పట్టించే సమాచారానికి వ్యతిరేకంగా ప్రజల్లో చైతన్యం ఏర్పరచాలని ప్రధాని కోరారు. ఈ సవాళ్లను ఎదుర్కోవడానికి వీలుగా ఆరోగ్యరంగ కార్యకర్తలకు, సాంకేతిక నిపుణులకు అవసరమైన శిక్షణను తక్షణమే అందించాలని ఈ సందర్భంగా ప్రధాని తన ఆకాంక్షను తెలిపారు.
ఈ క్లిష్ట పరిస్థితులను ఎదుర్కోవడానికిగాను ఈ సమయంలో స్ఫూర్తిదాయకమైన నాయకత్వాన్ని అందిస్తున్న ప్రధాని శ్రీ నరేంద్ర మోదీకి వైద్య రంగ సిబ్బంది తమ కృతజ్ఞతలు తెలియజేశారు. సంకల్పంతో, సంయమనంతో పని చేయాలనే ప్రధాని ఆకాంక్ష ఎంతో గొప్పగా వుందని ఈ సందర్భంగా వారు అన్నారు. ప్లోరెన్స్ నైటింగేల్ 200వ జయంతి సందర్బంగా దేశంలోని నర్సుల ప్రాధాన్యతను గుర్తించినందుకు ప్రధానికి నర్సులు తమ కృతజ్ఞతలు తెలిపారు.
అవసరమైన వారికి వైద్యపరమైన, మానసికపరమైన సాయం అందిస్తున్నామని ఇందుకోసం తాము చేస్తున్న కృషిని వైద్యరంగ ప్రతినిధులు వివరించారు. అలాగే క్వారంటైన్ ప్రాధాన్యత గురించి, అందుకోసం చేపడుతున్న చర్యలగురించి వారు మాట్లాడారు. కోవిడ్ 19 చికిత్సకోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేయాల్సిన ఆసుపత్రుల ప్రాధాన్యత గురించి, ఇతర విభాగాల ఏర్పాటు గురించి అలాగే ఆన్ లైన్ ద్వారా ఇచ్చే శిక్షణ మాడ్యూల్స్ గురించి వారు మాట్లాడారు. ఈ క్లిష్ట సమయంలో ప్రజలు సంయమనంతో , క్రమశిక్షణతో వ్యవహరించి వైద్య సిబ్బంది చెప్పినట్టుగా నడుచుకోవాలని వారు కోరారు.
ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొని అన్ని రకాల విలువైన సూచనలు, సలహాలు ఇచ్చినందుకు ప్రధాని అభినందనలు తెలిపారు. అలాగే టెలీ విధానం ద్వారా సంప్రదింపులు జరిపి ఇచ్చే చికిత్సలను భారీ స్థాయిలో ఉపయోగించుకోవాలనే ప్రతిపాదనల్ని ప్రభుత్వం పరిశీలిస్తుందని అన్నారు. అలాగే వైద్యరంగ సిబ్బంది భద్రతకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని స్పష్టం చేశారు. వైద్యరంగ సిబ్బంది కనబరుస్తున్న దీమాను చూసినప్పుడు ఈ యుద్ధంలో తప్పకుండా గెలుస్తామనే నమ్మకం తనలో కలిగినట్టు ప్రధాని అన్నారు.
ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కార్యదర్శి మాట్లాడుతూ వైద్యరంగ సిబ్బంది సేవలను కొనియాడారు. ప్రస్తుతం ఏర్పడ్డ పరిస్థితులను చక్కదిద్దడానికిగాను వైద్య సిబ్బంది చూపుతున్న చొరవ గురించి ఆమె మాట్లాడారు. పలు దశల్లో వస్తున్న స్పందన గురించి కూడా ఆమె వివరించారు.
ఈ కార్యక్రమంలో ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి, ప్రధాన కార్యదర్శి, క్యాబినెట్ సెక్రటరీ, ఐసిఎంఆర్ డిజి పాల్గొన్నారు.
***
(Release ID: 1608017)