మంత్రిమండలి
డీ నోటిఫైడ్ సంచార, పాక్షిక సంచార వర్గాల కోసం అభివృద్ధి, సంక్షేమ బోర్డు ఏర్పాటుకు కేబినెట్ అనుమతి
Posted On:
19 FEB 2019 8:57PM by PIB Hyderabad
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర కేబినెట్ డీనోటిఫైడ్ సంచార, పాక్షిక సంచార తెగలకు (డిఎన్ సి) అభివృద్ధి, సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయడానికి అనుమతించింది.
పూర్వాపరాలు...
సమాజంలో అత్యంత నిరాదరణకు గురవుతున్న వర్గాలకు చెందిన పౌరుల ప్రయోజనాలు కాపాడడానికి ఎన్ డిఏ ప్రభుత్వం పూర్తి కట్టుబాటు ప్రకటించింది. దేశంలో అత్యంత నిరాదరణకు గురవుతున్న వర్గాల్లో డీనోటిఫైడ్ సంచార, పాక్షిక సంచార తెగల (డిఎన్ సి) వారున్నారు. సమాజంలో వీరిపై ఎవరి దృష్టి ఎక్కువగా పడదు. ఈ కారణంగా వారిని అందరూ నిర్లక్ష్యానికి గురి చేస్తూ ఉంటారు. అధిక శాతం మంది డిఎన్ టిలు ఎస్ సి, ఎస్ టి, ఒబిసిల్లో ఉన్నారు. వారెవరికీ ఎస్ సి, ఎస్ టి, ఒబిసి ప్రయోజనాలేవీ అందుబాటులో ఉండవు.
ఇంతవరకు లాంఛనంగా ఏ రకమైన వర్గీకరణలోకి రాని డీనోటిఫైడ్ గానే ఉండిపోయిన, సంచార, పాక్షిక సంచార తెగలను గుర్తించేందుకు ప్రభుత్వం నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ అధ్యక్షతన ఒక కమిటీ ఏర్పాటు చేయడానికి అనుమతి ఇచ్చింది.
2014 జూలైలో ప్రభుత్వం మూడు సంవత్సరాల కాలపరిమితితో డీనోటిఫైడ్, సంచార, పాక్షిక సంచార తెగల జాతీయ కమిషన్ (ఎన్ సిడిఎన్ టి) ఏర్పాటు చేసింది. ఇలాంటి తెగల కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేపట్టదగిన సంక్షేమ చర్యలను సూచించడం, రాష్ర్టాల వారీగా డీనోటిఫైడ్, సంచార, పాక్షిక సంచార తెగలను గుర్తించడం ఈ కమిషన్ లక్ష్యం. 2015 జనవరి తొమ్మిదో తేదీన పని చేయడం ప్రారంభించిన ఈ కమిషన్ 2018 జనవరి ఎనిమిదో తేదీన ప్రభుత్వానికి తన నివేదిక అందించింది.
ఈ తెగల సంక్షేమం కోసం ఒక శాశ్వత కమిషన్ ఏర్పాటు చేయాలని సిఫారసు చేసింది. ఎస్ సి, ఎస్ టి, ఒబిసిల్లో ఇప్పటికే ఎక్కువ మంది డిఎన్ టిలు భాగం అయినందు వల్ల ఈ శాశ్వత కమిషన్ అభివృద్ధి కార్యక్రమాలను అమలు బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఉండదని, షెడ్యూల్డు కులాల జాతీయ కమిషన్, షెడ్యూల్డు తెగల జాతీయ కమిషన్ , ఒబిసిల జాతీయ కమిషన్ నిర్వహించే విధులకు భిన్నంగా ఫిర్యాదుల విచారణ, పరిష్కారం వ్యవహారాలు పర్యవేక్షించడం దీని బాధ్యత కావాలని కూడా తన సిఫారసుల్లో పేర్కొంది. ఇందుకు అనుగుణంగానే సొసైటీల రిజిస్ర్టేషన్ చట్టం, 1860 కింద సామాజిక న్యాయం, సాధికారత మంత్రిత్వ శాఖ పర్యవేక్షణలో డీనోటిఫైడ్, సంచార, పాక్షిక సంచార తెగలకు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలుకు అభివృద్ధి, సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది.
కొన్ని కమ్యూనిటీల గుర్తింపు ఇంకా పూర్తి చేయనందు వల్ల కమిషన్ రూపొందించిన రాష్ర్టాల స్థాయి తెగల జాబితా పరిపూర్ణం కాదని, అందుకే దానికి మరింత విలువ చేకూర్చాలని కూడా ఆ నివేదిక సూచించింది.
**
(Release ID: 1565466)
Visitor Counter : 210