మంత్రిమండలి

ఢిల్లీ లోని అలీపుర్ లో గల ఢిల్లీ క్షీర పథకం యాజమాన్యం లోని 1.61 ఎక‌రాల భూభాగాన్ని కిసాన్ మండీ స్థాపన కై స్మాల్ ఫార్మర్స్ అగ్రిబిజినెస్ కన్సార్శియమ్ కు లీజు కు ఇచ్చే ప్రతిపాదన కు ఆమోదం తెలిపిన మంత్రివర్గం

Posted On: 13 FEB 2019 9:28PM by PIB Hyderabad

ఢిల్లీ మిల్క్ స్కీమ్ యాజ‌మాన్యం లో ఢిల్లీ లోని అలీపుర్ లో ఉన్న ఖ‌స్ రా నంబ‌రు 91/15 లోని 1.61 ఎక‌రాల భూభాగాన్ని స్మాల్ ఫార్మ‌ర్స్ అగ్రి బిజినెస్ క‌న్సార్శియమ్ ( ఎస్ఎఫ్ఎసి)కి లీజు కు ఇవ్వాల‌నే ప్ర‌తిపాద‌న‌ కు ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ అధ్యక్షత న స‌మావేశ‌మైన కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది.  లీజు కు ఇచ్చే నేల‌ లో కిసాన్ మండీ ని ఏర్పాటు చేయ‌డానికి వీలు గా ఈ నిర్ణ‌యం తీసుకున్నారు.

ఈ లీజు 30 సంవ‌త్స‌రాల‌ పాటు కొన‌సాగుతుంది. 10-9-2014 నుండి 09-09-2044 వ‌ర‌కు చెల్లుబాట‌వుతుంది.  ప్ర‌తి నెలా లీజు కింద ఇచ్చే అద్దె 100 రూపాయలు గా ఉంటుంది.  10-9-2014 నుండి ప్ర‌తి సంవత్సరం అద్దె ను ప‌ది శాతం వంతు న పెంచడం జరుగుతుంది.  ప్ర‌తి ఏడాది ఆరంభం లో ఆ సంవత్సరం మొత్తాని కి క‌లిపి జ‌న‌వ‌రి 31వ తేదీకల్లా ఈ అద్దె ను చెల్లించవలసి వుంటుంది.

ప్ర‌భావం
 
ఎస్ఎఫ్ఎసి ఏర్పాటు చేసే కిసాన్ మండీ అనేది ఫార్మ‌ర్స్ ప్రొడ్యూస‌ర్స్ ఆర్గ‌నైజేశన్స్ (ఎఫ్ పి ఓ లు)కు, రైతుల కు అద‌నంగా మార్కెట్ అవ‌కాశాన్ని క‌ల్పించే వేదిక కానుంది.  ఈ మండీ ద్వారా ఢిల్లీ / ఎన్ సిఆర్ ప్రాంతం లోని  పండ్లు, కూర‌గాయ‌ల‌ను టోకు వ్యాపారుల కు, రీటేల్ వ్యాపారుల‌ కు  విక్రయించవ‌చ్చు.  దీని వ‌ల్ల రైతుల‌ కు, వినియోగ‌దారుల‌ కు ల‌బ్ధి చేకూరుతుంది.

కిసాన్ మండి ప్రత్యేక‌త‌లు :-

ఈ మండీ నుండి అమ్మ‌కాలు కొనసాగించే వారు త‌ప్ప‌కుండా త‌మ పేర్ల‌ను న‌మోదు చేసుకోవాలి.  అంటే ఎఫ్ పి ఒ లు /పంట‌ల ను పండించే రైతు సంఘాలు మాత్ర‌మే ఇక్క‌డ త‌మ పేర్ల‌ను న‌మోదు చేసుకుంటాయి.  మ‌ధ్య‌వ‌ర్తుల ప్ర‌మేయం లేకుండానే రీటేల్, హోల్ సేల్ వ్యాపారులు, హోట‌ల్, కేట‌రింగ్ నిర్వాహ‌కులు, నివాస గృహ స‌ముదాయాల సంస్థ‌ లు, సాధార‌ణ వినియోగ‌దారులు ఇక్క‌డ‌ కు వ‌చ్చి కూర‌గాయ‌లు, పండ్లు కొనుగోలు చేస్తారు.
 
లావాదేవీ ల విష‌యం లో  విక్రేతల నుండి గాని, కొనుగోలుదారుల నుండి గాని ఎటువంటి క‌మీశన్ తీసుకోవ‌డం జ‌ర‌గ‌దు.  గోదాములు, శీత‌లీక‌ర‌ణ గిడ్డంగులు మొద‌లైన సౌక‌ర్యాల‌ ను వాడుకునే ఎఫ్ పి ఒ లు మాత్రం నామ‌మాత్ర రుసుము ను చెల్లించవలసివుంటుంది.  రీటేల్ అవుట్ లెట్ ల ద్వారా ప్రాంచైజీ న‌మూనా ప్ర‌కారం నేరు గా స‌ర‌ఫ‌రా చేసే సౌక‌ర్యం కూడా కిసాన్ మండీ లో వుంటుంది.  దీని కి సంబంధించి మొద‌ట‌ గా ఢిల్లీ మిల్క్ స్కీము కియోస్క్ ల‌ ద్వారా నిత్యావ‌స‌ర వ‌స్తువులైన ఉల్లిపాయ‌లను, బంగాళాదుంప‌లను అమ్మ‌డం జ‌రుగుతుంది.  కిసాన్ మండీ లో ఆన్ లైన్ అమ్మ‌కాల సౌక‌ర్యం తో పాటు కాల్ సెంట‌ర్ ల ద్వారా నేరు గా మార్కెట్ చేసుకొనే స‌దుపాయం కూడా ఉంటుంది. 

పూర్వరంగం

సొసైటీ ల రిజిస్ట్రేశన్ చ‌ట్టం, 1860 కింద రిజిస్ట‌ర్ సొసైటీ అయిన ఎస్ ఎఫ్ ఎ సి అనేది  కేంద్ర వ్య‌వ‌సాయ‌ శాఖ ఆధ్వ‌ర్యం లోని వ్య‌వ‌సాయ‌ రంగ స‌మాఖ్య మ‌రియు రైతుల సంక్షేమ విభాగం కింద ప‌ని చేస్తుంది.  దీని ముఖ్య ఉద్దేశ్యం పెట్టుబ‌డులు, సాంకేతిక‌త‌, విపణులు అనే వాటి ని రైతుల‌ కు సంధానించడం.  కేంద్ర వ్య‌వ‌సాయ‌ శాఖ మ‌ద్ద‌తు తో ప‌ని చేసే ఎస్ ఎఫ్ ఎసి అనేది రైతు బృందాల‌ ను స‌మీక‌రిస్తుంది.  వీటి ని ఫార్మ‌ర్స్ ప్రొడ్యూస‌ర్స్ ఆర్గ‌నైజేశన్స్ ( ఎఫ్ పి ఒ లు) అంటారు.  ఆశించిన లాభాలు పొందేందుకుగాను వీటిని మార్కెట్ లకు లింకు చేయ‌డం జ‌రుగుతుంది.  ఎస్ ఎఫ్ ఎసి అనేది దేశ వ్యాప్తం గా 650 ఎఫ్ పి ఒల‌ ను ప్రోత్స‌హిస్తోంది.  2017 డిసెంబ‌ర్ నాటి కి వీటిలో 6.60 ల‌క్ష‌ల మంది రైతులు స‌భ్య‌త్వాన్ని క‌లిగివున్నారు.  ఈ సంస్థ‌ లు గ్రామీణ‌ ప్రాంతాల లో ప‌ని చేస్తూ చిన్న, స‌న్న‌కారు రైతులు ఉమ్మ‌డి గా బేర‌మాడే శ‌క్తి ని పొందేలా త‌యారు చేస్తున్నాయి. కిసాన్ మండీ ని ప్రారంభించాల‌ని ఎస్ ఎఫ్‌ ఎ సి ప్ర‌తిపాదించింది.  ఎఫ్ పి ఒ లు, రైతు స‌మాఖ్య‌ల‌ ను హోల్ సేల్ మ‌రియు రీటేల్ క‌స్ట‌మ‌ర్ లకు లింకు చేసి పండ్లు కూర‌గాయ‌ల‌ ను నేరు గా అమ్ముకోవ‌డానికి వీలు గా కిసాన్ మండీ ని రూపక‌ల్ప‌న చేశారు.  త‌ద్వారా ఢిల్లీ  మ‌రియు రాజ‌ధాని ప్రాంతం లో నివాస‌ం ఉండే రైతులు, వినియోగ‌దారులు ల‌బ్ధి ని పొందనున్నారు.


**



(Release ID: 1564561) Visitor Counter : 110