మంత్రిమండలి

అంతర్జాతీయ ఇంధన సంస్థ పర్యవేక్షణ కింద అత్యాధునిక మోటారు ఇంధనాలపై సంయుక్త సాంకేతిక పరిజ్ఞాన కార్యక్రమంలో భారత్ సభ్యత్వ స్వీకరణపై మంత్రిమండలికి నివేదన

Posted On: 08 NOV 2018 8:40PM by PIB Hyderabad

 అంతర్జాతీయ ఇంధన సంస్థ (IEA) పర్యవేక్షణ కింద అత్యాధునిక మోటారు ఇంధనాలపై సంయుక్త సాంకేతిక పరిజ్ఞాన కార్యక్రమం (AMF TCP)లో భారత్ 2018 మే 9వ తేదీన సభ్యత్వం స్వీకరించడం గురించి ప్రధానమంత్రి అధ్యక్షతన సమావేశమైన మంత్రిమండలికి నివేదించబడింది. అంతర్జాతీయ ఇంధన సంస్థ చట్రం కింద పనిచేసే AMF TCPకి 2017 మార్చి 30వ తేదీనుంచి భారత్ ‘సహచర’ దేశం హోదాలో కొనసాగుతూ వచ్చింది.

వివరాలు:

   రవాణా రంగంలో ఇంధన వినియోగ సామర్థ్యం పెంచడంతోపాటు ఉద్గారాల తగ్గింపు లక్ష్యంతో దేశ విపణిలో అత్యాధునిక మోటారు ఇంధనాలు/ప్రత్యామ్నాయ ఇంధనాలను ప్రవేశపెట్టే ప్రక్రియలో భాగస్వామ్యం ధ్యేయంగా కేంద్ర పెట్రోలియం-సహజవాయు మంత్రిత్వ శాఖ (MoP&NG) AMF TCP సభ్యత్వం స్వీకరించింది. ఇంధన వినియోగం అత్యధికంగాగల రంగాల్లో ఉద్గారాల తగ్గింపు దిశగా రవాణా రంగంలో వినియోగం కోసం సరికొత్త/ప్రత్యామ్నాయ ఇంధనాల విశ్లేషణ, అన్వేషణసహా పరిశోధన-అభివృద్ధి కార్యకలాపాలకు AMF TCP అవకాశాలు కల్పిస్తుంది.

   అత్యాధునిక మోటారు ఇంధనాలపై సంయుక్త సాంకేతిక పరిజ్ఞాన కార్యక్రమం కింద పరిశోధన-అభివృద్ధిలో భాగంగా ‘అనెక్స్’ పేరిట ఆయా దేశాలు సొంత ప్రయోగాలు చేపడతాయి. గడచిన కొన్నేళ్లుగా ఇటువంటి 50 ‘అనెక్స్’లను చేపట్టగా, అనేక ఇంధనాలను పరీక్షించారు. ఇప్పటిదాకా పరిశీలించిన వాటిలో పునరాభివృద్ధి చేసిన ఇంధనాలు (గ్యాసోలిన్, డీజిల్), జీవ ఇంధనాలు (ఇథనాల్, బయోడీజిల్ వగైరా), సింథటిక్ ఇంధనాల (మిథనాల్, ఫిషర్-ట్రాప్ష్, డిఎంఈ వగైరా)తోపాటు వాయు ఆధారిత ఇంధనాలను కూడా పరీక్షించారు. ఇక ప్రభుత్వ రంగంలోని చమురు మార్కెటింగ్ కంపెనీలలోనే కాకుండా ఆటోమొబైల్ పరీక్షా సంస్థలైన ARAI, CIRT, ICAT వంటివాటిలో కూడా పరిశోధన-అభివృద్ధికి సంబంధించిన అత్యాధునిక సదుపాయాలు, వనరులు ఉన్నాయి. పెట్రోలియం-సహజవాయు మంత్రిత్వ శాఖ పాలుపంచుకుంటున్న ‘అనెక్స్’ కార్యక్రమాల్లోనూ ఇవి తమవంతు సహకారం అందిస్తాయి.
   ఇంధన రంగంలో దిగుమతులను 2022నాటికి కనీసం 10 శాతందాకా తగ్గించాలని 2015నాటి ఇంధనరంగ సమ్మేళనం (ఊర్జా సంగమ్) సందర్భంగా ప్రధానమంత్రి ఆదేశించారు. తదనుగుణంగా పెట్రోలియం-సహజవాయు మంత్రిత్వ శాఖ సమగ్ర కార్యాచరణ ప్రణాళికతో ముందుకొచ్చింది. జీవ ఇంధనాలు, అత్యాధునిక/ప్రత్యామ్నాయ ఇంధనాలు, ఇంధన వినియోగ సామర్థ్యం ఈ ప్రణాళిక అమలులో ప్రధాన పాత్ర పోషిస్తాయి. ఈ కృషిని రవాణా రంగంలో ఉద్గారాల తగ్గింపు, వినియోగ సామర్థ్యం పెంపు దిశగా తగిన ఇంధనాలను ఉపయోగించడంలో సాగే కృషిని మరింత ముందుకు తీసుకెళ్లడానికి AMF TCPతో MoP&NG సాహచర్యం తోడ్పడుతుంది.

   భారత ప్రభుత్వం ఇటీవలే ‘జీవ ఇంధనాలు-2018’ పేరిట జాతీయ విధానాన్ని ప్రకటించింది. రెండో తరం (2G) ఇథనాల్, జీవ-పీడన సహజవాయువు, జీవ-మిథనాల్, విసర్జకాధారిత ఇంధనాలు, డీఎంఈ వగైరాలపై పరిశోధన-అభివృద్ధిపై దృష్టి సారించేలా ఈ విధానం ప్రోత్సహిస్తుంది. ఈ అత్యాధునిక ఇంధనాలను వివిధ రకాల జీవ వ్యర్థాలు... పంటల వ్యర్థాలు, పురపాలక వ్యర్థాలు, పారిశ్రామిక వ్యర్థాలు, వ్యర్థ వాయువులు, ఆహార వ్యర్థాలు, ప్లాస్టిక్ వగైరాలను వినియోగించి తయారుచేస్తారు. కొన్ని దేశాలలో ఈ అత్యాధునిక జీవ ఇంధనాలను విజయవంతంగా ప్రవేశపెట్టినప్పటికీ భారత రవాణా రంగంలో ప్రవేశపెట్టేందుకు ఇంకా ఎదురుచూడాల్సి వస్తోంది. మన దేశంలో సదరు అత్యాధునిక ఇంధనాల అభివృద్ధి ఇప్పటికీ తరుణ దశలోనే ఉండటం ఇందుకు కారణం. అందువల్ల మన ఇంధన అవసరాలను తీర్చగలిగే రీతిలో ఈ అత్యాధునిక ఇంధనాలను తక్కువ వ్యయంతో రూపొందించేలా పరిశోధన-అభివృద్ధి ప్రక్రియను మరింత విస్తృతం చేయాల్సి ఉంది. ఈ నేపథ్యంలో సమీప భవిష్యత్తులోనే మన రవాణా రంగానికి తగిన జీవ ఇంధనాలను గుర్తించడంలో AMFతో పెట్రోలియం మంత్రిత్వశాఖ సాహచర్యం దోహదపడుతుంది. ఆ మేరకు జీవ ఇంధనాల వినియోగంలో సభ్య దేశాల అనుభవం పెట్రోలియం మంత్రిత్వ శాఖకు అదనపు లబ్ధిని చేకూరుస్తుంది.

   అత్యాధునిక మోటారు ఇంధనాలపై సంయుక్త సాంకేతిక పరిజ్ఞాన కార్యక్రమం (AMF TCP)లో పాలు పంచుకోవడం వల్ల ఖర్చులలో భాగస్వామ్యంతోపాటు సమీకృత సాంకేతిక వనరులు అందుబాటులో ఉంటాయి. అలాగే పలుదేశాల కృషి ఒకే అంశంపై కేంద్రీకృతమయ్యే పరిస్థితి తప్పుతుంది. తద్వారా జాతీయ పరిశోధన-అభివృద్ధి సామర్థ్యాలు బలోపేతమవుతాయి. ఉత్తమ పద్ధతులు, పరిశోధకుల మధ్య సమన్వయం, పరిశోధనలను ఆచరణాత్మక అమలుతో ముడిపెట్టడం తదితరాలపై సమాచార ఆదానప్రదానం ఆరోగ్యకర స్థాయిలో సాగుతుంది. సభ్యదేశం హోదాలో భారత్ తన ప్రయోజనాలకు అనుగుణమైన అత్యాధునిక జీవన ఇంధనం, ఇతర మోటారు ఇంధనాలవంటి అంశాలపై పరిశోధన-అభివృద్ధి కార్యకలాపాలు చేపట్టగలుగుతుంది. శిలాజ ఇంధన దిగుమతులకు ప్రత్యామ్నాయంగా కీలకపాత్ర పోషించగల భవిష్యత్ ఇంధనాలు ఇవే కావడమే ఇందుకు కారణం.

పూర్వరంగం:

పరిశుభ్ర, మరింత ఇంధన సామర్థ్యంగల ఇంధనాల వినియోగాన్ని, వాహన సాంకేతిక పరిజ్ఞానాన్ని సభ్యదేశాల మధ్య ప్రోత్సహించే అంతర్జాతీయ వేదికగా AMF TCP వ్యవహరిస్తుంది. అత్యాధునిక మోటారు ఇంధనాలకు సంబంధించి పరిశోధన-అభివృద్ధితోపాటు వాటిని ప్రవేశపెట్టడం, సమాచార పంపిణీ తదితరాలు ఈ అంతర్జాతీయ వేదిక కార్యకలాపాల్లో భాగంగా ఉంటాయి. అలాగే రవాణా రంగ ఇంధన ఉత్పత్తి, పంపిణీ, అంతిమ వినియోగం సంబంధిత అంశాలను పరిగణనలోకి తీసుకుంటూ ఒక క్రమ పద్ధతిలో ఆయా సమస్యలపై దృష్టి సారిస్తుంది.

   అత్యాధునిక మోటారు ఇంధనాలపై సంయుక్త సాంకేతిక పరిజ్ఞాన కార్యక్రమం (AMF TCP)లో 16వ సభ్య దేశంగా భారత్ 2018 మే 9వ తేదీన చేరింది. అప్పటికే అమెరికా, చైనా, జపాన్, కెనడా, చిలీ, ఇజ్రాయెల్, జర్మనీ, ఆస్ట్రియా, స్వీడన్, ఫిన్లాండ్, డెన్మార్క్, స్పెయిన్, రిపబ్లిక్ ఆఫ్ కొరియా, స్విట్జర్లాండ్, థాయ్ లాండ్ ఇందులో సభ్యదేశాలుగా ఉన్నాయి.

**



(Release ID: 1552220) Visitor Counter : 149