Farmer's Welfare

ప్రధానమంత్రి ధన్-ధాన్య కృషి యోజన (పీఎం-డీడీకేవై)

प्रविष्टि तिथि: 10 OCT 2026 16:29 PM

100 జిల్లాల్లో లక్షిత‌ వ్యవసాయాభివృద్ధికి ఏడాది



జిల్లా స్థాయి చర్యలతో వ్యవసాయ రంగంలో మార్పు
విభిన్న ప్రాంతాలు, రైతు స‌మాజాల్లో భారత వ్యవసాయ రంగానికి అపార అవకాశాలు ఉన్నాయి. అయితే సమృద్ధమైన సామర్థ్యం ఉన్నప్పటికీ అనేక ప్రాంతాలు తక్కువ ఉత్పాదకత, సరిపోని సాగునీటి సదుపాయాలు, పరిమిత రుణ లభ్యత, పంట కోత అనంతర మౌలిక సదుపాయాల కొరత వంటి సమస్యలను ఎదుర్కొంటున్నాయి. ఫలితంగా ఆయా ప్రాంతాలు పూర్తి వ్యవసాయ సామర్థ్యాన్ని అందుకోలేక ఆర్థికాభివృద్ధిలో వెనుకబడుతున్నాయి.

ఈ లోటుపాట్లను పరిష్కరించి, లక్ష్య ఆధారిత చర్యల ద్వారా 100 ఆకాంక్షిత వ్యవసాయ జిల్లాలను అభివృద్ధి చేయాలని పీఎం ధన్-ధాన్య కృషి యోజన (పీఎం-డీడీకేవై) లక్ష్యంగా పెట్టుకుంది. జిల్లాలవారీ అవసరాలను పరిష్కరించడం ద్వారా ఉత్పాదకత, సాగునీరు, రుణ లభ్యత, పంట కోత అనంతర మౌలిక సదుపాయాల్లో కొత్త అవకాశాలను అందుబాటులోకి తీసుకురావడానికి ఈ పథకం తోడ్పడుతుంది. ఆరేళ్ల కాలానికి పీఎం-డీడీకేవైను కేంద్ర మంత్రివర్గం 2025 జూలై 16న ఆమోదించింది. గౌరవ ప్రధానమంత్రి 2025 అక్టోబర్ 11న పథకాన్ని అధికారికంగా ప్రారంభించారు. ఈ ఏడాది అక్టోబర్ 11న పథకం తొలి వార్షికోత్సవాన్ని జరుపుకుంటోంది.

2025–26 నుంచి ప్రారంభమైన ఈ ఆరేళ్ల కార్యక్రమం 100 ఆకాంక్షిత వ్యవసాయ జిల్లాల్లో వ్యవసాయం, అనుబంధ కార్యకలాపాలను సమూలంగా మార్చడంపై దృష్టి సారిస్తోంది. తక్కువ ఉత్పాదకత, తక్కువ పంటల సాంద్రత, తక్కువ వ్యవసాయ రుణ పంపిణీ అనే మూడు కీలక సూచికల ఆధారంగా ఈ జిల్లాలను గుర్తించారు. ప్రతి రాష్ట్రం, కేంద్రపాలిత ప్రాంతంలో నికర సాగు విస్తీర్ణం, నిర్వహణలో ఉన్న కమతాల వాటాను కూడా ఎంపిక సమయంలో పరిగణనలోకి తీసుకున్నారు. ప్రతి రాష్ట్రం నుంచి కనీసం ఒక జిల్లాను ఎంపిక చేశారు.

స్థానిక వ్యవసాయ ప్రాధాన్యాలకు అనుగుణమైన చర్యలు చేపట్టేందుకు 11 మంత్రిత్వ శాఖలు, విభాగాలకు చెందిన 36 కేంద్ర పథకాలు, రాష్ట్ర ప్రభుత్వ పథకాలు, ప్రైవేటు రంగ భాగస్వామ్యాన్ని సమన్వయం చేస్తూ ఈ పథకాన్ని అమలు చేస్తున్నారు.

 



ప‌థ‌కం అమలు కోసం పరిపాలనా వ్యవస్థ
పీఎం-డీడీకేవై అమలుకు మూడంచెల వ్యవస్థ ఉంది:
- జిల్లా స్థాయి: జిల్లా కలెక్టర్/డీఎం నేతృత్వంలోని డిస్ట్రిక్ట్ ధన్-ధాన్య కృషి యోజన సమితి, జిల్లా కార్యాచరణ ప్రణాళికను రూపొందించి అమలు చేస్తుంది.
- రాష్ట్ర స్థాయి: రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నేతృత్వంలోని స్టేట్ ధన్-ధాన్య కృషి యోజన సమితి, జిల్లా ప్రణాళికలను సమీక్షించి పర్యవేక్షిస్తుంది.
- జాతీయ స్థాయి: రెండు కమిటీలు పథకాన్ని పర్యవేక్షిస్తాయి. నేషనల్ ఎగ్జిక్యూటివ్ కమిటీకి కేంద్ర వ్యవసాయం, రైతు సంక్షేమ శాఖ మంత్రి నేతృత్వం వహిస్తారు. నేషనల్ మానిటరింగ్ కమిటీకి డీఏ అండ్ ఎఫ్‌డబ్ల్యూ కార్యదర్శి నేతృత్వం వహిస్తారు.

జిల్లా కార్యాచరణ ప్రణాళికలు
- ప్రాథమిక స్థితి, సమస్యల నిర్ధారణ విశ్లేషణ ఆధారంగా జిల్లా కార్యాచరణ ప్రణాళికలను (డీఏపీలు) రూపొందిస్తారు. స్థానిక వ్యవసాయ అవసరాలను గుర్తించి, సంబంధిత కేంద్ర, రాష్ట్ర పథకాల సమన్వయం ద్వారా వాటిని పరిష్కరించే చర్యలను ఈ ప్రణాళికల్లో పొందుపరుస్తారు. ఫలితాల ఆధారిత లక్ష్యాలు, వార్షిక మైలురాళ్లు, సంబంధిత పథకాలతో అనుసంధానించిన చర్యలను డీఏపీలు నిర్దేశిస్తాయి.
- సంబంధిత వార్షిక కార్యాచరణ ప్రణాళికల్లో చేర్చేందుకు డీఏపీలను ఆయా రాష్ట్ర శాఖలకు పంపిస్తారు. తద్వారా అవసరమైన అనుమతులు, నిధుల విడుదలకు మార్గం సుగమమవుతుంది.
- 36 పథకాలకు సంబంధించిన 121 సూచికల ద్వారా పురోగతిని పర్యవేక్షిస్తారు. వీటిలో 74 కార్యసాధన సూచికలు, 47 ఫలిత సూచికలు ఉన్నాయి. కార్యసాధన సూచికల్లో జిల్లాల పనితీరుకు పీఎం-డీడీకేవై డ్యాష్‌బోర్డ్ ద్వారా ప్రతి నెల ర్యాంకులు కేటాయిస్తారు: https://pmddky.niti.gov.in/

ఏడాదిగా అమలులో సాధించిన పురోగతి
పీఎం-డీడీకేవై డ్యాష్‌బోర్డ్ 2025 అక్టోబర్ చివరి వారంలో అందుబాటులోకి వచ్చింది. 100 జిల్లాల్లో పురోగతిని పర్యవేక్షించేందుకు 2025 నవంబర్ నుంచి కార్యసాధన సూచికల ఆధారంగా నెలవారీ ర్యాంకుల ప్రక్రియ ప్రారంభమైంది.
- మొత్తం 100 డీడీకేవై జిల్లాలు జిల్లా కార్యాచరణ ప్రణాళికలను సిద్ధం చేశాయి. ప్రస్తుతం వాటి అమలు కొనసాగుతోంది.
- సమీక్ష, పర్యవేక్షణ కోసం రాష్ట్ర, జిల్లా, జాతీయ స్థాయుల్లో కమిటీలను ఏర్పాటు చేశారు.
- మొత్తం 100 జిల్లాలు 2026 ఆగస్టు వరకు కార్యసాధన సూచికలకు సంబంధించిన సమాచారాన్ని సమర్పించాయి. 2025–26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఫలిత సూచికల సమాచారాన్ని కూడా అన్ని జిల్లాలు అందించాయి.
- కేంద్ర నోడల్ అధికారులు క్రమం తప్పకుండా పురోగతిని సమీక్షిస్తూ జిల్లాలకు మార్గనిర్దేశం చేస్తున్నారు.
- 2026–27, 2027–28 ఆర్థిక సంవత్సరాల్లో కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు కార్పొరేట్ సామాజిక బాధ్యత (సీఎస్ఆర్) కార్యకలాపాల కోసం డీడీకేవై జిల్లాలను దత్తత తీసుకునే అంశాన్ని డిపార్ట్‌మెంట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్‌ప్రైజెస్ చేర్చింది.
- ఆరు లక్ష్యాల పరిధిలో 100 జిల్లాల సగటు స్కోరు 2026 ఏప్రిల్‌లో 18.85 నుంచి 2026 ఆగస్టులో 46.89కు పెరిగింది. మొత్తం 28.04 పాయింట్ల మెరుగుదల నమోదైంది.
- ఇదే కాలంలో లక్ష్యాలవారీ సగటు స్కోర్లు కూడా మెరుగయ్యాయి:
  - వ్యవసాయ ఉత్పాదకత పెంపు: 1.50 నుంచి 8.08
  - పంటల వైవిధ్యం, స్థిరమైన వ్యవసాయ పద్ధతులకు ప్రోత్సాహం: 4.08 నుంచి 10.18
  - పంట కోత అనంతర నిల్వ సామర్థ్యం పెంపు: 2.14 నుంచి 5.19
  - సాగునీటి మౌలిక సదుపాయాల మెరుగుదల: 1.38 నుంచి 4.91
  - స్వల్పకాలిక, దీర్ఘకాలిక వ్యవసాయ రుణాలకు విస్తృత ప్రాప్యత: 2.40 నుంచి 6.53
  - మెరుగైన పాలన, సేవల అందజేత: 7.41 నుంచి 12.05

పథకం తొలి ఏడాదిలో రైతులు, రైతు ఉత్పత్తిదారుల సంస్థలు (ఎఫ్‌పీఓలు) అనుభవాలను పంచుకోవడానికి, కొత్త అవకాశాలను అన్వేషించడానికి వేదికలు ఏర్పడ్డాయి. 2025 డిసెంబర్‌లో నిర్వహించిన పీఎం-డీడీకేవై ఎఫ్‌పీఓ సంగమంలో 15 రాష్ట్రాలు, 33 పీఎం-డీడీకేవై జిల్లాలకు చెందిన 72కు పైగా ఎఫ్‌పీఓలు పాల్గొన్నాయి. ఉత్పాదకత, మార్కెట్ ప్రాప్యత, ఆదాయ పెంపునకు సంబంధించిన అనుభవాలను ఈ కార్యక్రమంలో పంచుకున్నారు. ప్రకృతి వ్యవసాయం, నూనెగింజలు, తేనెటీగల పెంపకం, రక్షిత సాగు, సూక్ష్మ సాగునీరు, సంస్థాగత ఆర్థిక సహాయం, డిజిటల్ వ్యవసాయం వంటి అంశాలపై కూడా చర్చించారు.

 



ధన్-ధాన్య జిల్లాల్లో ఉత్తమ విధానాలు
స్థానిక ప్రాసెసింగ్‌తో మెరుగైన ధర


పీఎం-డీడీకేవై జిల్లా అయిన మహారాష్ట్రలోని గడ్చిరోలిలో దేశాయ్‌గంజ్ ఫార్మర్స్ ప్రొడ్యూసర్ కంపెనీ లిమిటెడ్ (ఎఫ్‌పీఓ)లో 800 మంది రైతు సభ్యులు ఉన్నారు. ఈ సంస్థ గంటకు 3 టన్నుల సామర్థ్యం గల బియ్యం ప్రాసెసింగ్ యూనిట్, 900 మెట్రిక్ టన్నుల గోదాము ఏర్పాటు చేసింది. ప్రసిద్ధ జై శ్రీరామ్ బియ్యం రకానికి అందుబాటులోకి తెచ్చిన పంట కోత అనంతర మౌలిక సదుపాయాలు స్థానికంగా విలువ జోడించేందుకు, మెరుగైన ధర పొందేందుకు తోడ్పడుతున్నాయి. 2025–26 ఆర్థిక సంవత్సరంలో ఎఫ్‌పీఓ ₹1.24 కోట్ల టర్నోవర్ నమోదు చేసింది.

మెరుగైన మార్కెట్లు.. అధిక ఆదాయం

 


పీఎం-డీడీకేవై జిల్లా అయిన కర్ణాటకలోని తుమకూరులో టిప్టూర్ ఫార్మర్ ప్రొడ్యూసర్ కంపెనీ లిమిటెడ్ ఎఫ్‌పీఓలో 750 మంది రైతు సభ్యులు ఉన్నారు. ఈ సంస్థ ఫ్రాన్స్‌కు చెందిన బహుళజాతి కంపెనీకి బాల్ కొప్రాను సరఫరా చేస్తోంది. దీంతో ఎఫ్‌పీఓ రైతులకు మెరుగైన ధరలు, మార్కెట్ అవకాశాలు లభిస్తున్నాయి. 2025–26 ఆర్థిక సంవత్సరంలో ఈ ఎఫ్‌పీఓ ₹1.60 కోట్ల టర్నోవర్ నమోదు చేసింది. 2026 సెప్టెంబర్ 12 నాటికి ₹1.9 కోట్లకు పైగా విలువైన 138 టన్నులకు పైగా కొప్రాను సమీకరించింది.

స్మార్ట్ సాగునీటితో మెరుగైన వ్యవసాయ ఉత్పాదకత

 


పీఎం-డీడీకేవై జిల్లా అయిన రాజస్థాన్‌లోని జైసల్మేర్‌లో జైసల్మేర్ కృషి ఫెడ్ ప్రొడ్యూసర్ కంపెనీ లిమిటెడ్‌లో 1,236 మంది రైతు సభ్యులు ఉన్నారు. ఈ ఎఫ్‌పీఓ 2,000 ఎకరాల్లో సమగ్ర సస్యరక్షణ నిర్వహణ (ఐపీఎం) ఆధారిత జీలకర్ర సాగు చేపడుతోంది. 500 ఎకరాల్లో సౌరశక్తితో పనిచేసే స్ప్రింక్లర్ సాగునీటి వ్యవస్థను ఉపయోగిస్తోంది. ఈ కార్యక్రమం సమర్థమైన నీటి వినియోగం, పునరుత్పాదక ఇంధనం, మెరుగైన వ్యవసాయ ఉత్పాదకతను ప్రోత్సహిస్తోంది.

జిల్లాల్లో వ్యవసాయాభివృద్ధికి కొత్త ఊపు
పీఎం-డీడీకేవై 2026 అక్టోబర్ 11న తొలి ఏడాది పూర్తి చేసుకుంటోంది. ఇది జిల్లా స్థాయి లక్ష్య ఆధారిత చర్యలతో సాగిన ఏడాదికి గుర్తుగా నిలుస్తోంది. మొత్తం 100 జిల్లాల్లో జిల్లా కార్యాచరణ ప్రణాళికలు, సూచికల ఆధారిత పర్యవేక్షణ వ్యవస్థలు ప్రస్తుతం అమల్లో ఉన్నాయి. జిల్లాల ప్రత్యేక అవసరాలకు అనుగుణమైన చర్యలు క్షేత్రస్థాయిలో వ్యవసాయాభివృద్ధికి తోడ్పడుతున్నాయి. ఇప్పటివరకు సాధించిన పురోగతి రాబోయే సంవత్సరాల్లో పథకాల మధ్య మరింత బలమైన సమన్వయానికి, స్థిరమైన వ్యవసాయాభివృద్ధికి పునాది వేస్తోంది.

 

References

Prime Minister's Office

https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2177454

 

Ministry of Agriculture and Farmers Welfare

https://pmddky.niti.gov.in/aboutTheScheme

https://pmddky.niti.gov.in/

https://agriwelfare.gov.in/Documents/Guidelines/Guidelines_PM_DDKY_19092025_Final[1]_0.pdf

https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2244624

https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2201150

 

PIB Backgrounders

https://www.pib.gov.in/PressNoteDetails.aspx?id=154909&NoteId=154909&ModuleId=3&reg=48&lang=2

Click here to see pdf 

 

****

(तथ्य सामग्री आईडी: 151120) आगंतुक पटल : 7


Provide suggestions / comments
इस विश्लेषक को इन भाषाओं में पढ़ें : English , हिन्दी , Malayalam , Bengali , Assamese , Kannada