• Sitemap
  • Advance Search
Technology

డిజిటల్‌ మౌలిక సదుపాయాలతో పాలనకు సాధికారత

प्रविष्टि तिथि: 12 AUG 2026 18:34 PM

అనుసంధానమైన, పౌర కేంద్రీకృత భారత నిర్మాణం
డిజిటల్‌ ప్రజా మౌలిక సదుపాయాల(డీపీఐ) ద్వారా భారత పాలనా వ్యవస్థలో మౌలిక పరివర్తన వచ్చింది. ఒకప్పుడు విస్తృతమైన దస్త్రాలు, ప్రభుత్వ కార్యాలయాలపై ఆధారపడిన ప్రజా సేవలు ఇప్పుడు సమీకృత డిజిటల్‌ వేదికల ద్వారా అందుబాటులోకి వచ్చాయి. గత 12 ఏళ్లలో పౌరులు, ప్రభుత్వాలు, సంస్థలను డీపీఐ మునుపెన్నడూ లేని స్థాయిలో అనుసంధానించింది. పాలనను వేగవంతంగా, పారదర్శకంగా, పౌరుల అవసరాలకు మరింత స్పందించేలా మార్చింది.

భారత ఆర్థిక వృద్ధికి డిజిటల్‌ మౌలిక సదుపాయాలు కీలక స్తంభంగా కూడా ఆవిర్భవించాయి. ప్రస్తుతం భారత స్థూల దేశీయోత్పత్తిలో డిజిటల్‌ ఆర్థిక వ్యవస్థ వాటా దాదాపు 12–14 శాతంగా ఉంది. వచ్చే దశాబ్దంలో ఇది 20 శాతానికి చేరుతుందని అంచనా. భారత డిజిటల్‌ ఆర్థిక వ్యవస్థ స్థితిగతుల నివేదిక–2026 ప్రకారం.. ప్రపంచంలో ఐదో అతిపెద్ద డిజిటలీకృత ఆర్థిక వ్యవస్థగా భారత్‌ నిలిచింది. జీ20 దేశాల్లో నాలుగో స్థానాన్ని దక్కించుకుంది. భారత్‌ 80వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని జరుపుకొంటున్న వేళ, డిజిటల్‌ పాలన నిరంతర విస్తరణ సేవల పంపిణీని పటిష్ఠం చేస్తోంది. ఆర్థిక అవకాశాలకు వీలు కల్పిస్తూ వికసిత్‌ భారత్‌ లక్ష్యాన్ని ముందుకు తీసుకెళ్తోంది.

డిజిటల్‌ స్వావలంబన దిశగా భారత్‌ సాధించిన కీలక మైలురాళ్లు

ఎలక్ట్రానిక్స్‌ తయారీ: భారత స్వావలంబనకు చోదకశక్తి


మేక్‌ ఇన్‌ ఇండియా సంక‌ల్పం మార్గదర్శకత్వంలో ఎలక్ట్రానిక్స్‌ తయారీకి ప్రపంచ కేంద్రంగా భారత్‌ ఆవిర్భవించింది. ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక పథకం (పీఎల్‌ఐ), ఎలక్ట్రానిక్‌ విడిభాగాల తయారీ పథకం (ఈసీఎంఎస్‌), ఇండియా సెమీకండక్టర్‌ మిషన్‌ (ఐఎస్‌ఎం), సవరించిన ఎలక్ట్రానిక్స్‌ తయారీ క్లస్టర్ల పథకం (ఈఎంసీ 2.0) వంటి ప్రధాన కార్యక్రమాలు దేశీయ తయారీని బలోపేతం చేశాయి.
* ఎలక్ట్రానిక్స్‌ ఉత్పత్తిలో ఏడు రెట్ల వృద్ధి: ఎలక్ట్రానిక్స్‌ ఉత్పత్తి 2014–15లో ₹1.9 లక్షల కోట్ల నుంచి 2025–26లో ₹13.11 లక్షల కోట్లకు పెరిగింది.
* ఎలక్ట్రానిక్స్‌ ఎగుమతుల్లో 11 రెట్ల వృద్ధి: ఇదే కాలంలో ఎలక్ట్రానిక్స్‌ ఎగుమతులు ₹38 వేల కోట్ల నుంచి ₹4.24 లక్షల కోట్లకు పెరిగాయి.
* మూడో అతిపెద్ద ఎగుమతి రంగం: 2025–26 ఆర్థిక సంవత్సరంలో 47.96 బిలియన్‌ అమెరికన్‌ డాలర్ల ఎగుమతులతో ఎలక్ట్రానిక్‌ వస్తువులు భారత మూడో అతిపెద్ద ఎగుమతి విభాగంగా అవతరించాయి.
* ఉపాధి, మహిళల భాగస్వామ్యం: ఎలక్ట్రానిక్స్‌ తయారీ వ్యవస్థ దాదాపు 25 లక్షల ఉద్యోగాలకు ఆసరాగా నిలుస్తోంది. ఈ రంగంలోని మొత్తం ఉద్యోగుల్లో మహిళల వాటా దాదాపు 30 శాతం.

భారత సెమీకండక్టర్‌ వ్యవస్థ నిర్మాణం
భారత సెమీకండక్టర్‌ వ్యవస్థను బలోపేతం చేసేందుకు ₹1.27 లక్షల కోట్ల కేటాయింపుతో సెమికాన్‌ 2.0కు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఐఎస్‌ఎం 1.0 కింద ₹1.64 లక్షల కోట్ల విలువైన 12 సెమీకండక్టర్‌ యూనిట్లకు ఆమోదం ఇచ్చారు. మూడు కేంద్రాలు ఇప్పటికే వాణిజ్య ఉత్పత్తిని ప్రారంభించాయి. మరో యూనిట్‌ ఈ ఏడాది కార్యకలాపాలను ప్రారంభించే అవకాశం ఉంది.

మొబైల్‌ ఫోన్లు: వృద్ధికి ప్రధాన చోదకశక్తి

 


* ప్రపంచ మొబైల్‌ తయారీ కేంద్రం: ప్రస్తుతం ప్రపంచంలో రెండో అతిపెద్ద మొబైల్‌ ఫోన్‌ తయారీ దేశంగా భారత్‌ నిలిచింది. 2014–15 ఆర్థిక సంవత్సరంలో 153వ అతిపెద్ద ఎగుమతి వస్తువుగా ఉన్న మొబైల్‌ ఫోన్లు, 2025–26 నాటికి భారత అతిపెద్ద ఎగుమతి ఉత్పత్తిగా అవతరించాయి.
* మొబైల్‌ ఫోన్‌ ఉత్పత్తిలో 33 రెట్ల వృద్ధి: ఉత్పత్తి 2014–15లో ₹18 వేల కోట్ల నుంచి 2025–26లో ₹6.27 లక్షల కోట్లకు పెరిగింది.
* మొబైల్‌ ఫోన్‌ ఎగుమతుల్లో 165 రెట్ల వృద్ధి: ఇదే కాలంలో ఎగుమతులు ₹1,500 కోట్ల నుంచి ₹2.59 లక్షల కోట్లకు పెరిగాయి.
* ఉపాధి, మహిళల భాగస్వామ్యం: మొబైల్‌ తయారీ విభాగంలోని 12 లక్షల ఉద్యోగాల్లో మహిళల వాటా దాదాపు 70 శాతం.

మెరుగైన టెలికమ్యూనికేషన్‌ మౌలిక సదుపాయాలు
* టెలిఫోన్‌ అనుసంధానం: 
టెలిఫోన్‌ కనెక్షన్ల సంఖ్య 2014లో 93.3 కోట్ల నుంచి 2026 జూన్‌ చివరి నాటికి 134.8 కోట్లకు పైగా పెరిగింది.
* పెరిగిన టెలి-సాంద్రత: టెలి-సాంద్రత 2014లో 75.23 శాతం నుంచి 2026 జూన్‌ చివరి నాటికి 94.31 శాతానికి పెరిగింది.
* వైర్‌లెస్‌ మొబైల్‌ వినియోగదారులు: క్రియాశీల వైర్‌లెస్‌ మొబైల్‌ వినియోగదారుల సంఖ్య 2026 జూన్‌లో 120.106 కోట్లకు చేరింది.

అంతర్జాలం, డిజిటల్‌ అనుసంధానం

 


* నాలుగు రెట్లు పెరిగిన అంతర్జాల వినియోగదారులు: అంతర్జాల చందాదారుల సంఖ్య 2014లో 25.15 కోట్ల నుంచి 2026 మార్చి చివరి నాటికి 109.2 కోట్లకు పైగా పెరిగింది.
* అందుబాటు ధరలో మొబైల్‌ డేటా: వైర్‌లెస్‌ డేటా ధర 2014లో జీబీకి ₹308 నుంచి 2026లో ₹7.51కు భారీగా తగ్గింది. దీంతో డిజిటల్‌ సేవలు మరింత చౌకగా అందుబాటులోకి వచ్చాయి.
* మొబైల్‌ బ్రాడ్‌బ్యాండ్‌ వేగం: ఊక్లా ప్రపంచ స్పీడ్‌టెస్ట్‌ సూచీ ప్రకారం.. సగటు మొబైల్‌ బ్రాడ్‌బ్యాండ్‌ డౌన్‌లోడ్‌ వేగం 2022 మార్చిలో 13.67 ఎంబీపీఎస్‌ నుంచి 2025 డిసెంబరులో 132 ఎంబీపీఎస్‌కు పెరిగింది.
* దేశవ్యాప్తంగా 5జీ విస్తరణ: ప్రస్తుతం అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని 99.9 శాతం జిల్లాల్లో 5జీ సేవలు అందుబాటులో ఉన్నాయి. 2026 జూన్‌ నాటికి 5జీ బేస్‌ ట్రాన్స్‌సీవర్‌ స్టేషన్ల సంఖ్య 5.63 లక్షలకు చేరింది.
* గ్రామీణ మొబైల్‌ అనుసంధానం విస్తరణ: బీఎస్‌ఎన్‌ఎల్‌, ఇతర ఆపరేటర్ల ద్వారా మొత్తం 6.31 లక్షల గ్రామాలకు 4జీ సేవలను విస్తరించారు.
* భారత్‌నెట్‌ కింద అనుసంధానం: 2026 జూన్‌ నాటికి 2.21 లక్షల గ్రామ పంచాయతీలు సేవలు అందించేందుకు సిద్ధంగా ఉన్నాయి. 8.5 లక్షల రూట్‌ కిలోమీటర్లకు పైగా ఆప్టికల్‌ ఫైబర్‌ కేబుల్‌ ఈ వ్యవస్థకు మద్దతు ఇస్తోంది.
* పీఎం–వాణి: ప్రజా డేటా కార్యాలయాలు, ఇతర భాగస్వాములతో కూడిన వికేంద్రీకృత వ్యవస్థ ద్వారా పీఎం–వాణి చౌకగా ప్రజా వై-ఫై సేవలను అందిస్తోంది. 2026 ఫిబ్రవరి 28 నాటికి దేశవ్యాప్తంగా 4 లక్షలకు పైగా హాట్‌స్పాట్‌లను ఏర్పాటు చేశారు. 2026 మేలో ప్రవేశపెట్టిన కొత్త సంస్కరణలతో క్యూఆర్‌ ఆధారిత ధ్రువీకరణ, 15, 30, 60 నిమిషాల వై-ఫై ప్రణాళికలు, ప్రామాణిక హాట్‌స్పాట్‌ పేర్లు అందుబాటులోకి వచ్చాయి.

6జీ యుగానికి సిద్ధమవుతున్న భారత్‌
స్వదేశీ పరిశోధన, మేధోహక్కులు, ప్రమాణాల రూపకల్పన, తదుపరి తరం టెలికాం ఆవిష్కరణలపై దృష్టి సారిస్తూ 2030 నాటికి 6జీ సాంకేతికతలో భారత్‌ను ప్రపంచ అగ్రగామి దేశాల సరసన నిలపడం భారత్‌ 6జీ విజన్‌ లక్ష్యం.

యూపీఐ: నిరంతరాయ డిజిటల్‌ చెల్లింపులకు చోదకశక్తి

 


ప్రపంచవ్యాప్తంగా తక్షణ చెల్లింపు లావాదేవీల పరిమాణంలో యూపీఐ వాటా దాదాపు 50 శాతం. లావాదేవీల పరిమాణం ప్రాతిపదికన ప్రపంచంలోనే అతిపెద్ద తక్షణ చెల్లింపు వ్యవస్థగా ఇది నిలిచింది.
* లావాదేవీల పరిమాణం: 2025–26 ఆర్థిక సంవత్సరంలో ₹314.23 లక్షల కోట్ల విలువైన 24,161.69 కోట్ల లావాదేవీలను యూపీఐ నిర్వహించింది.
* భారత అతిపెద్ద డిజిటల్‌ చెల్లింపుల వ్యవస్థ: 55.49 కోట్లకు పైగా వ్యక్తులు, 6.5 కోట్ల వ్యాపారులకు యూపీఐ సేవలందిస్తోంది. ఒకే వేదికపై 731 బ్యాంకులను అనుసంధానిస్తూ ప్రపంచంలోనే అతిపెద్ద డిజిటల్‌ చెల్లింపు వ్యవస్థగా నిలిచింది.
* భారత డిజిటల్‌ చెల్లింపుల్లో యూపీఐ వాటా: 2025–26 ఆర్థిక సంవత్సరంలో దేశ డిజిటల్‌ చెల్లింపు లావాదేవీల పరిమాణంలో యూపీఐ వాటా 85 శాతంగా నమోదైంది.
* భారీగా పెరిగిన నెలవారీ లావాదేవీలు: యూపీఐ లావాదేవీలు 2016లో నెలకు 0.01 కోట్ల నుంచి 2025 నాటికి నెలకు 2 వేల కోట్లకు పైగా పెరిగాయి. దేశవ్యాప్తంగా యూపీఐని ప్రజలు ఎంత వేగంగా స్వీకరించారో ఇది తెలియజేస్తోంది.
* ప్రపంచవ్యాప్తంగా యూపీఐ: కంబోడియా, సింగపూర్‌, యూఏఈ, ఫ్రాన్స్‌, మారిషస్‌ వంటి 11 విదేశాల్లో ప్రస్తుతం యూపీఐ చెల్లింపులను అంగీకరిస్తున్నారు.

డిజిటల్‌ వాణిజ్యం
* ఓపెన్‌ నెట్‌వర్క్‌ ఫర్‌ డిజిటల్‌ కామర్స్‌ (ఓఎన్‌డీసీ): వివిధ వేదికల్లోని కొనుగోలుదారులు, విక్రేతలను అనుసంధానిస్తూ ఓఎన్‌డీసీ బహిరంగ డిజిటల్‌ వాణిజ్య వ్యవస్థను నిర్మిస్తోంది.
* 2026 జూన్‌ నాటికి ఈ వేదికలో 20 కోట్లకు పైగా కొనుగోలుదారులు, 5 లక్షల మంది విక్రేతలు ఉన్నారు. వెయ్యి నగరాల్లో సేవలు విస్తరించగా, నెలకు దాదాపు 90 లక్షల లావాదేవీలు జరుగుతున్నాయి.
* ఈ-సరస్‌, ఇండియా హ్యాండ్‌మేడ్‌తో అనుసంధానం ద్వారా 11కు పైగా కొనుగోలు యాప్‌లలో స్వయం సహాయక సంఘాలు, నేత కార్మికులు, చేతివృత్తుల నిపుణులకు మార్కెట్‌ అందుబాటు విస్తరించింది. సహాయక్‌ వాట్సాప్‌ బాట్‌ ఐదు భాషల్లో చిన్న వ్యాపారాలకు సహాయం అందిస్తోంది.
* గవర్నమెంట్‌ ఈ-మార్కెట్‌ప్లేస్‌ (జెమ్‌): ప్రభుత్వ సేకరణను పారదర్శకంగా, సమర్థంగా, కాగిత రహితంగా మార్చడం ద్వారా జెమ్‌ ఈ రంగంలో పరివర్తన తీసుకొచ్చింది.
* 2026 జూన్‌ నాటికి జెమ్‌లో స్థూల వస్తు విలువ ₹18.4 లక్షల కోట్లకు పైగా నమోదైంది. ఇందులో 2025–26 ఆర్థిక సంవత్సరంలోనే ₹5 లక్షల కోట్ల విలువైన లావాదేవీలు జరిగాయి. 11 లక్షలకు పైగా ఎంఎస్‌ఎంఈలకు ప్రభుత్వ మార్కెట్లలో ప్రవేశం కల్పించింది.
* స్వయాట్‌(మహిళలు, యువత ఆధ్వర్యంలోని సంస్థల కోసం స్టార్టప్‌ రన్‌వే) కార్యక్రమం ద్వారా అంకుర సంస్థలు, మహిళలు, యువత ఆధ్వర్యంలోని సంస్థలకు జెమ్‌లో ప్రభుత్వ కొనుగోలుదారులను నేరుగా చేరుకొనే అవకాశం కల్పిస్తూ సమ్మిళిత ప్రజా సేకరణను ప్రోత్సహిస్తున్నారు.
* 2025–26 ఆర్థిక సంవత్సరం నాటికి మహిళల ఆధ్వర్యంలోని వ్యాపారాలు ₹83,323 కోట్లు, అంకుర సంస్థలు ₹54,005.8 కోట్ల సంచిత ఆర్డర్‌ విలువను నమోదు చేశాయి. ఈ కార్యక్రమం విస్తరిస్తున్న పరిధికి ఇది నిదర్శనం.

ప్రభుత్వం నుంచి పౌరులకు అందే సేవల్లో విప్లవాత్మక మార్పులు తెస్తున్న ఈ-పాలన కార్యక్రమాలు
1. డిజిలాకర్‌:
 భౌతిక పత్రాల స్థానంలో సురక్షితమైన డిజిటల్‌ వాలెట్‌ను డిజిలాకర్‌ అందిస్తోంది. 2026 జూలై 31 నాటికి ఈ వేదికలో 72 కోట్లకు పైగా వినియోగదారులు నమోదు చేసుకోగా, 934 కోట్లకు పైగా పత్రాలను జారీ చేశారు.

2. ఉమంగ్‌: ప్రభుత్వ సేవలకు ఏకైక డిజిటల్‌ ముఖద్వారంగా ఉమంగ్‌ మారింది. ఇందులోని సేవలు 2017లో 166 నుంచి 2026 జూలై 23 నాటికి 2,585కు పెరిగాయి. ఇదే తేదీ నాటికి లావాదేవీలు 4.6 కోట్ల నుంచి 798 కోట్లకు పైగా పెరిగాయి. డిజిటల్‌ సేవలకు లభిస్తున్న విస్తృత ఆదరణకు ఇది నిదర్శనం.

3. ఆధార్‌: సురక్షితమైన, తక్షణ డిజిటల్‌ ధ్రువీకరణ కోసం విశ్వసనీయ బయోమెట్రిక్‌ గుర్తింపు వేదికను ఆధార్‌ రూపొందించింది. ఆధార్‌ నమోదుల సంఖ్య 2010–11లో 0.42 కోట్ల నుంచి 2026 జూలై నాటికి 145 కోట్లకు పైగా పెరిగింది.

4. కామ‌న్ స‌ర్వీస్ సెంట‌ర్లు: ప్రభుత్వ కార్యాలయాలను సందర్శించాల్సిన అవసరాన్ని తగ్గిస్తూ ప్రభుత్వం నుంచి పౌరులకు అందే ఈ-సేవల కోసం కామ‌న్ స‌ర్వీస్ సెంట‌ర్లు ప్రత్యక్ష సేవా కేంద్రాలుగా పనిచేస్తున్నాయి. 2026 జూన్‌ నాటికి దేశవ్యాప్తంగా 5.16 లక్షలకు పైగా ఉమ్మడి సేవా కేంద్రాలు పనిచేస్తున్నాయి.

5. ప్రత్యక్ష ప్రయోజన బదిలీ (డీబీటీ): ఆధార్‌తో అనుసంధానించిన డీబీటీ ద్వారా 56 మంత్రిత్వ శాఖలకు చెందిన 318 పథకాల సంక్షేమ ప్రయోజనాలు లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లోకి నేరుగా చేరుతున్నాయి. దేశవ్యాప్తంగా డీబీటీ ద్వారా ₹52 లక్షల కోట్లకు పైగా బదిలీ చేశారు.

విద్యావకాశాలను విస్తరిస్తున్న డిజిటల్‌ వేదికలు
* దీక్ష:
 పాఠ్యప్రణాళికతో అనుసంధానించిన సమాచారం, క్యూఆర్‌ కోడ్‌ పాఠ్యపుస్తకాలు, ఉపాధ్యాయ శిక్షణ, అందరికీ అనువైన అభ్యాస వనరులను దీక్ష అందిస్తోంది. 2026 ఆగస్టు 10 నాటికి ఇందులో 2.35 కోట్ల మంది నమోదిత వినియోగదారులు, రోజుకు 3.58 లక్షల మంది క్రియాశీల వినియోగదారులు ఉన్నారు.
* స్వయం: తొమ్మిదో తరగతి నుంచి పీజీ స్థాయి వరకు స్వయం ఉచిత కోర్సులను అందిస్తోంది. 2026 ఆగస్టు 10 నాటికి వివిధ విభాగాల్లో 20 వేలకు పైగా కోర్సులు ఈ వేదికలో అందుబాటులో ఉండగా, మొత్తం నమోదులు 6.5 కోట్లు దాటాయి.
* స్వయం ప్రభ: జీశాట్‌–15 ఉపగ్రహం ద్వారా 40 డీటీహెచ్‌ ఛానళ్లలో రోజంతా నాణ్యమైన విద్యా కార్యక్రమాలను ప్రసారం చేస్తోంది. దీంతో అంతర్జాల అనుసంధానం లేకున్నా విద్యార్థులు పాఠాలు నేర్చుకోగలుగుతున్నారు.
* పీఎం ఈ-విద్య: నిరంతరాయమైన, సమ్మిళిత అభ్యాసానికి సహకరించేందుకు దీక్ష, స్వయం, స్వయం ప్రభ, కమ్యూనిటీ రేడియో, విద్యా టెలివిజన్‌ను పీఎం ఈ-విద్య సమీకరిస్తోంది.
* ఆటోమేటెడ్‌ పర్మనెంట్‌ అకడమిక్‌ అకౌంట్‌ రిజిస్ట్రీ(అపార్‌): విద్యా రికార్డులను భద్రపరచడం, ధ్రువీకరించడం కోసం విద్యార్థులకు అపార్‌ ప్రత్యేక డిజిటల్‌ విద్యా గుర్తింపును అందిస్తోంది. 2026 జూన్‌ నాటికి 33.74 కోట్లకు పైగా అపార్‌ గుర్తింపు సంఖ్యలను రూపొందించారు.

పరీక్షల మోసాలకు వ్యతిరేకంగా పటిష్ఠ వ్యవస్థ
2026 జూలై 31న లోక్‌సభలో ప్రవేశపెట్టిన ప్రభుత్వ పరీక్షల (అక్రమ పద్ధతుల నిరోధక) సవరణ బిల్లు–2026 కఠిన శిక్షలు, నిర్దిష్ట కాలపరిమితితో కూడిన న్యాయ వ్యవస్థను ప్రతిపాదిస్తోంది. బిల్లు ప్రకారం వ్యక్తిగత నేరగాళ్లకు 5–10 ఏళ్ల కారాగార శిక్షతో పాటు ₹50 లక్షల వరకు జరిమానా విధిస్తారు. సేవా సంస్థలకు ₹5 కోట్ల వరకు జరిమానాతో పాటు ఎనిమిదేళ్ల నిషేధం విధిస్తారు. వ్యవస్థీకృత పరీక్షల మోసాలకు పాల్పడే ముఠాలకు 7–10 ఏళ్ల కారాగార శిక్షతో పాటు కనీసం ₹10 కోట్ల జరిమానా విధిస్తారు. దర్యాప్తును రెండు నెలల్లో పూర్తి చేయాలి. అభియోగపత్రం దాఖలు చేసిన మూడు నెలల్లో విచారణ ముగించాలి. హైకోర్టు స్వీకరించిన అప్పీళ్లను మూడు నెలల్లో పరిష్కరించాలి.

భారత డిజిటల్‌ శ్రామికశక్తికి ఊతం
* ఫ్యూచర్‌స్కిల్స్‌ ప్రైమ్‌: 
వేగంగా మారుతున్న నేటి డిజిటల్‌ వాతావరణంలో అత్యవసరమైన అత్యాధునిక నైపుణ్యాలను ఈ వేదిక అభ్యాసకులకు అందిస్తోంది. 2026 ఆగస్టు 10 నాటికి డిజిటల్‌ నైపుణ్యాల కోసం 34 లక్షలకు పైగా వినియోగదారులు నమోదు చేసుకున్నారు.

* స్కిల్‌ ఇండియా డిజిటల్‌ హబ్‌ (ఎస్‌ఐడీహెచ్‌): నైపుణ్య శిక్షణ, డిజిటల్‌ అభ్యాసం, ఉపాధి అవకాశాలను ఒకే వేదికపైకి తీసుకొస్తోంది. 2026 ఆగస్టు 2 నాటికి ఇందులో 2.01 కోట్ల నమోదులు జరిగాయి. స్వీయ వేగంతో నేర్చుకునే 3,643 కోర్సులను అందిస్తోంది. 10 లక్షలకు పైగా అవకాశాలను సృష్టించింది.

* జాతీయ ఎలక్ట్రానిక్స్‌, సమాచార సాంకేతిక సంస్థ(ఎన్‌ఐఈఎల్‌ఐటీ): దేశవ్యాప్తంగా 56 కేంద్రాలు, 9 వేలకుపైగా భాగస్వామ్య సంస్థల ద్వారా కంప్యూటర్‌ కాన్సెప్ట్స్‌పై అవగాహన, కంప్యూటర్‌ కాన్సెప్ట్స్‌ కోర్సు వంటి డిజిటల్‌ అక్షరాస్యత, నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలను ఎన్‌ఐఈఎల్‌ఐటీ నిర్వహిస్తోంది. గత మూడు ఆర్థిక సంవత్సరాల్లో 31.92 లక్షలకు పైగా అభ్యర్థులకు శిక్షణ ఇచ్చింది.

* ఇండియాఏఐ మిషన్‌: కృత్రిమ మేధ విద్య, మౌలిక సదుపాయాలు, బాధ్యతాయుత కృత్రిమ మేధ వినియోగాన్ని ఇండియాఏఐ మిషన్‌ బలోపేతం చేస్తోంది. ఇండియాఏఐ కోశ్‌ వంటి కార్యక్రమాల ద్వారా పాఠశాలలు, ఉన్నత విద్యాసంస్థలు, వృత్తిపరమైన శిక్షణ కార్యక్రమాల్లో కృత్రిమ మేధ నైపుణ్యాలను ప్రోత్సహిస్తోంది.

విస్తరిస్తున్న భారత డిజిటల్‌ ప్రస్థానం
భారత డిజిటల్‌ ప్రస్థానం పౌరులు, వ్యాపార సంస్థలు, ఇతర సంస్థలు ప్రభుత్వం, ఆర్థిక వ్యవస్థతో అనుసంధానమయ్యే విధానాన్ని మారుస్తోంది. వేగంగా విస్తరిస్తున్న డిజిటల్‌ వ్యవస్థ సేవలను వేగవంతం చేస్తోంది. పారదర్శకతను పెంచుతూ విస్తృత అందుబాటుకు వీలు కల్పిస్తోంది. ఆవిష్కరణలు, ఔత్సాహికత, సమ్మిళిత వృద్ధికి డిజిటల్‌ ప్రజా మౌలిక సదుపాయాలు బలమైన పునాదిని ఏర్పరుస్తున్నాయి. వర్ధమాన సాంకేతికతలకు పెరుగుతున్న ఆదరణ వివిధ రంగాల్లో కొత్త అవకాశాలను తెరుస్తూ ప్రపంచ డిజిటల్‌ రంగంలో భారత్‌ ఉనికిని పటిష్ఠం చేస్తోంది. డిజిటల్‌ సామర్థ్యాలు పాలనను మరింత స్పందనాత్మకంగా, సమర్థంగా, పౌర కేంద్రీకృతంగా మారుస్తున్నాయి. ఆర్థిక అవకాశాలు, సామాజిక అభివృద్ధికి సాంకేతికతను కీలక సాధనంగా ఈ పరివర్తన నిలుపుతోంది. ఈ పురోగతి అంతా డిజిటల్‌ సాధికారత కలిగిన వికసిత్‌ భారత్‌ నిర్మాణ పునాదులను బలోపేతం చేస్తోంది.

References

Ministry of Communications

Ministry of Electronics & IT

Ministry of Finance

PIB Backgrounder

Ministry of Commerce & Industry

Digital India Initiatives

State of India’s Digital Economy 2026

Empowering Governance through Digital Infrastructure

 

***

 

(तथ्य सामग्री आईडी: 150942) आगंतुक पटल : 83


Provide suggestions / comments
इस विश्लेषक को इन भाषाओं में पढ़ें : English , हिन्दी , Malayalam , Bengali , Kannada , Assamese