• Sitemap
  • Advance Search
Social Welfare

నేషనల్ అకడమిక్ డిపాజిటరీ (ఎన్ఏడీ)

प्रविष्टि तिथि: 07 JUL 2026 19:17 PM

విద్యారంగంలో డిజిటల్ ప‌రిపాల‌నా పురోగతి
 


అకడమిక్ రికార్డుల నిర్వహణ ప్రస్తుత స్థితి
ప్రపంచంలోనే అతిపెద్ద, వైవిధ్యభరితమైన విద్యా వ్యవస్థలలో భార‌త్‌ ఒకటిగా నిలిచింది. దేశంలో సుమారు 14.71 లక్షల పాఠశాలలు(2024-25 నాటికి), 1420 విశ్వవిద్యాలయాలు, 53,583 కళాశాలలు, 16,795 స్వతంత్ర విద్యా సంస్థలు, 280 పరిశోధన, అభివృద్ధి సంస్థలు ఉన్నాయి. ఈ సంస్థలన్నీ కలిసి ప్రతి సంవత్సరం డిగ్రీలు, డిప్లొమాలు, సర్టిఫికెట్లు, మార్కుల జాబితాలు, మూల్యాంకన నివేదికలతో కూడిన కోట్లాది అకడమిక్ రికార్డులను సృష్టిస్తున్నాయి.

ఇంత భారీ మొత్తంలో కాగితపు అకడమిక్ రికార్డులను నిర్వహించడం చాలా సమయం, ఖర్చుతో కూడుకున్న పని. ఇది అసమర్థతకు దారితీస్తుంది. భౌతిక పత్రాలు పోగొట్టుకోవడానికి, పాడవడానికి, నకిలీలు సృష్టించడానికి ఆస్కారం ఉంటుంది. అదే సమయంలో మాన్యువ‌ల్‌గా చేసే ధ్రువీకరణ ప్రక్రియలు విద్యార్థులు, విద్యా సంస్థలు, యజమానులు, ఇతర భాగస్వాములకు ఆలస్యాన్ని కలిగిస్తాయి.

జాతీయ విద్యా విధానం(ఎన్ఈపీ)-2020 మరింత సరళమైన, విద్యార్థి కేంద్రిత, బహుళ విభాగాలు కలిగిన విద్యా వ్యవస్థను నిర్మించాలని ఆకాంక్షిస్తోంది. మల్టిపుల్ ఎంట్రీ-మల్టిపుల్ ఎగ్జిట్(ఎంఈఎంఈ), నేషనల్ క్రెడిట్ ఫ్రేమ్‌వర్క్(ఎన్‌సీఆర్ఎఫ్‌), అకడమిక్ బ్యాంక్ ఆఫ్ క్రెడిట్స్(ఏబీసీ) వంటి కార్యక్రమాల ద్వారా సరళమైన అభ్యాస మార్గాలను, జీవితకాల విద్యను సాధ్యం చేస్తోంది. విద్యార్థులు వివిధ విద్యా సంస్థలు, విద్యా దశల్లో నేర్చుకునే అంశాలను నిరంతరం జమ చేసుకుంటున్న నేపథ్యంలో, సురక్షితమైన, పరస్పరం అనుసంధానమయ్యే, సులభంగా అందుబాటులో ఉండే అకడమిక్ రికార్డుల వ్యవస్థ అవసరం ఎంతో కీలకంగా మారింది.

ఈ సంస్కరణలకు మద్దతుగా, ప్రభుత్వం నేషనల్ అకడమిక్ డిపాజిటరీ(ఎన్ఏడీ)ని ప్రవేశపెట్టింది. ఇది అకడమిక్ ధ్రువపత్రాల డిజిటల్ నిల్వ, ధ్రువీకరణ, ప్రామాణీకరణ, జారీ కోసం ఉద్దేశించిన దేశవ్యాప్త వ్యవస్థ. అకడమిక్ రికార్డులను సురక్షితమైన డిజిటల్ డిపాజిటరీలో ఉంచడం ద్వారా విద్యార్థులు తమ ధ్రువపత్రాలను జారీ చేసిన సంస్థల నుంచి భౌతిక పత్రాలు తీసుకోనవసరం లేకుండా ఎప్పుడైనా, ఎక్కడైనా పొందడానికి ఎన్ఏడీ వీలు కల్పిస్తుంది. ఇది యజమానులు, విద్యాసంస్థలు, ఇతర సంస్థలకు ధ్రువీకరణ ప్రక్రియను సులభతరం చేస్తుంది. ప్రామాణికమైన డిజిటల్ రికార్డుల ద్వారా మోసాల ముప్పును గణనీయంగా తగ్గిస్తుంది.

2020 నుంచి ఎన్ఏడీ వ్యవస్థ డిజిలాకర్ ద్వారా అమలవుతోంది. డిజిటల్ ఇండియా కార్యక్రమంలో భాగంగా 2015 జూలై 1న ప్రారంభమైన డిజిలాకర్.. అకడమిక్ ధ్రువపత్రాల జారీ, యాక్సెస్ కోసం క్రియాశీల డిజిటల్ వేదిక‌గా పనిచేస్తోంది. దీని పరిధిలోనే ఎన్ఏడీ పనిచేస్తుంది. ఈ వ్యవస్థలో మూడో భాగం కూడా ఉంది - అదే ఆటోమేటెడ్ పర్మనెంట్ అకడమిక్ అకౌంట్ రిజిస్ట్రీ(అపార్‌), అకడమిక్ బ్యాంక్ ఆఫ్ క్రెడిట్స్‌(ఏబీసీ). ఇవి విద్యార్థుల క్రెడిట్ స్కోర్‌లను నిర్వహిస్తూ, ఒక విద్యాసంస్థ నుంచి మరొక విద్యాసంస్థకు మారడాన్ని సులభతరం చేస్తాయి. ఈ మూడు భాగాలు కలిసి సురక్షితమైన అకడమిక్ రికార్డుల నిర్వహణ కోసం ఒక సమగ్ర వ్యవస్థను సృష్టిస్తాయి. ఎన్ఏడీ ప్రభుత్వ ఈ-సనద్ సేవతో కూడా అనుసంధానమై ఉంది. ఇది విద్యాసంబంధిత, ఇతర అధికారిక పత్రాల ఎలక్ట్రానిక్ ధ్రువీకరణ, అటెస్టేషన్, అపోస్టిల్ సేవలను సాధ్యం చేస్తుంది. ఈ అనుసంధానం విదేశాలలో ఉన్నత విద్య, ఉపాధి లేదా ఇతర అవకాశాలను కోరుకునే భారతీయ పౌరులకు పత్రాల ధ్రువీకరణను సులభతరం చేస్తుంది.

ఎన్ఏడీ పరిధిలో కేంద్ర, రాష్ట్ర, ప్రైవేట్, డీమ్డ్ విశ్వవిద్యాలయాలు, సీబీఎస్‌ఈతో పాటు ఇతర పాఠశాల బోర్డులు, జాతీయ ప్రాధాన్యత కలిగిన సంస్థలు, ఇతర ఉన్నత విద్యా సంస్థలు నమోదు చేసుకుంటాయి. ఇందులో విద్యార్థులు, ఇతర అకడమిక్ అవార్డుల గ్రహీతలు, విద్యా సంస్థలు/బోర్డులు/అర్హత అంచనా సంస్థలు, బ్యాంకులు, దేశీయ-విదేశీ ఉపాధి కంపెనీలు, ప్రభుత్వ సంస్థల వంటి ధ్రువీకరణ సంస్థలు భాగస్వాములుగా ఉన్నాయి.



ఎన్ఏడీ పాలనా నిర్మాణం
విద్యా మంత్రిత్వ శాఖ ఎన్ఏడీకి మాతృ మంత్రిత్వ శాఖగా బాధ్యత వహిస్తుంది. డిజిలాకర్ ద్వారా ఎన్ఏడీని అమలు చేయడానికి యూనివ‌ర్సిటీ గ్రాంట్స్‌ కమిషన్(యూజీసీ)ని నోడల్ ఏజెన్సీగా ఇది నియమించింది. ఈ వ్యవస్థ పటిష్టమైన చట్టపరమైన, నియంత్రణ నిర్మాణంతో కూడిన సమన్వయ పాలనా చ‌ట్రం ద్వారా పనిచేస్తుంది. విద్యా సంస్థలు ధ్రువీకరించిన డిజిటల్ అకడమిక్ రికార్డులను జారీ చేస్తాయి. విద్యార్థులు వీటిని సురక్షితంగా పొంద‌వ‌చ్చు. ఇతరులతో పంచుకోవచ్చు. ఇతర సంస్థలు వీటిని వేగంగా, నమ్మకంగా ధ్రువీకరించుకోవచ్చు. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్-2000 ప్రకారం అన్ని డిజిటల్ ధ్రువపత్రాలు చట్టబద్ధమైనవి, భౌతిక పత్రాలతో సమానమైన చట్టపరమైన హోదాను కలిగి ఉంటాయి.

చట్టపరమైన, నియంత్రణ ఫ్రేమ్‌వర్క్
ఈ వ్యవస్థ బలమైన చట్టపరమైన పునాదితో పనిచేస్తుంది. వాటిలో ఇవి ఉన్నాయి:
ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్-2000 – ఎలక్ట్రానిక్ రికార్డులు, డిజిటల్ సంతకాలకు చట్టపరమైన గుర్తింపు ఇస్తుంది.
డిజిటల్ లాకర్ రూల్స్-2016 – వినియోగదారు స్పష్టమైన అనుమతితో మాత్రమే పత్రాలను పంచుకునేలా నిర్ధారిస్తుంది.
నేషనల్ ఈ-అథెంటికేషన్ ఫ్రేమ్‌వర్క్(ఎన్ఈఏఎఫ్‌) – సురక్షితమైన గుర్తింపు ధ్రువీకరణ, ప్రామాణీకరణ విధానాలను అందిస్తుంది.

నేషనల్ అకడమిక్ డిపాజిటరీ(ఎన్ఏడీ): పనితీరు ప్రక్రియ
ఎన్ఏడీ పనితీరు ఒక క్రమబద్ధమైన డిజిటల్ వర్క్‌ఫ్లోను అనుసరిస్తుంది:
* అకడమిక్ అవార్డుల సృష్టి: కోర్సు లేదా పరీక్ష పూర్తయిన తర్వాత విద్యా సంస్థలు (పాఠశాలలు, విశ్వవిద్యాలయాలు, బోర్డులు, ఇతర అధీకృత సంస్థలు) డిగ్రీలు, డిప్లొమాలు, సర్టిఫికెట్లు, మార్కుల జాబితాల వంటి అకడమిక్ అవార్డులను రూపొందిస్తాయి.
* డిజిలాకర్/ఎన‌ఏడీకి డిజిటల్ అప్‌లోడ్: విద్యా సంస్థ ఈ ధృవీకరించిన అకడమిక్ రికార్డులను డిజిలాకర్ ప్లాట్‌ఫారమ్ ద్వారా నేషనల్ అకడమిక్ డిపాజిటరీ(ఎన్ఏడీ)లోకి సురక్షితంగా అప్‌లోడ్ చేస్తుంది లేదా జారీ చేస్తుంది.
* డిజిలాకర్ ద్వారా విద్యార్థుల యాక్సెస్: జారీ చేసిన వెంటనే, డిజిటల్ అకడమిక్ పత్రాలు విద్యార్థి డిజిలాకర్ ఖాతాకు స్వయంచాలకంగా అనుసంధానమవుతాయి. అక్కడ వారు ఎప్పుడైనా వీటిని సురక్షితంగా పొందవచ్చు.
* అనుమతి ఆధారిత భాగస్వామ్యం: విద్యార్థులు డిజిలాకర్ ద్వారా స్పష్టమైన అనుమతి ఇచ్చిన తర్వాత మాత్రమే తమ అకడమిక్ రికార్డులను యజమానులు, ఉన్నత విద్యా సంస్థలు లేదా ప్రభుత్వ సంస్థలతో పంచుకోగలరు.
* అధికారుల ద్వారా ధ్రువీకరణ: అధీకృత సంస్థలు పత్రాల విశ్వసనీయతను నేరుగా ఎన్ఏడీ/డిజిలాకర్ ద్వారా ధ్రువీకరించవచ్చు. దీనివల్ల రికార్డులు అసలైనవని, ఎలాంటి మార్పులు లేనివని నిర్ధారణ అవుతుంది.
* సురక్షితమైన, శాశ్వత నిల్వ: అన్ని రికార్డులు డిజిటల్ రూపంలో సురక్షితంగా నిల్వ ఉంటాయి. ఇది భౌతిక సర్టిఫికేట్ల అవసరాన్ని తగ్గిస్తుంది. నష్టం, నష్టం వాటిల్లడం, ఫోర్జరీ వంటి ప్రమాదాలను తొలగిస్తుంది.

 



ఈ ప్రక్రియ భౌతిక పత్రాల నుండి పూర్తిగా డిజిటల్ అకడమిక్ రికార్డుల వ్యవస్థ వైపు సులభమైన పరివర్తనను నిర్ధారిస్తుంది.

ఎన్ఏడీ ముఖ్య ప్రయోజనాలు
నేషనల్ అకడమిక్ డిపాజిటరీ(ఎన్ఏడీ) సురక్షితమైన, విశ్వసనీయమైన, కాగిత రహిత చ‌ట్రాన్ని అందిస్తుంది. డిజిటల్ అకడమిక్ ధృవపత్రాలకు జీవితకాల యాక్సెస్‌ను ఇస్తుంది. విద్యార్థులు, అకడమిక్ అవార్డు గ్రహీతలు తమ రికార్డులను ఎప్పుడైనా, ఎక్కడి నుండైనా తిరిగి పొందడానికి, పంచుకోవడానికి వీలు కల్పిస్తుంది. అసలైన ధ్రువపత్రాల తక్షణ ధృవీకరణను సులభతరం చేయడం ద్వారా ఎన్ఏడీ పారదర్శకతను పెంచుతుంది. సేవలు అందించ‌డాన్ని మెరుగుపరుస్తుంది. పత్రాల మోసాల ముప్పును తగ్గిస్తుంది. ఇది అడ్మిషన్, రిక్రూట్‌మెంట్, ఇతర క్రెడెన్షియల్ ధ్రువీకరణ ప్రక్రియలను క్రమబద్ధీకరిస్తుంది. ఈ చ‌ట్రం డిజిటల్ అకడమిక్ క్రెడెన్షియల్ మేనేజ్‌మెంట్‌లో భారతదేశాన్ని ప్రపంచ అత్యుత్తమ విధానాల సరసన నిలబెడుతుంది.



విద్యార్థులు, అకడమిక్ అవార్డు గ్రహీతలు: తమ డిజిటల్ అకడమిక్ ధ్రువపత్రాలను జీవితకాలం అంతటా యాక్సెస్ చేయవచ్చు, నిల్వ చేయవచ్చు, తిరిగి పొందవచ్చు, సురక్షితంగా పంచుకోవచ్చు.



విద్యా సంస్థలు, అసెస్‌మెంట్ సంస్థలు: విశ్వవిద్యాలయాలు, పాఠశాల బోర్డులు, పరీక్షల అధికారులు, ధ్రువీకరణ సంస్థలు అసలైన డిజిటల్ అకడమిక్ రికార్డులను, అవార్డులను ఎన్ఏడీ చ‌ట్రం ద్వారా జారీ చేస్తాయి.

 



ధ్రువీకరణ సంస్థలు: యజమానులు, పాఠశాలలు, ఉన్నత విద్యా సంస్థలు, ప్రభుత్వ శాఖలు, బ్యాంకులు, లైసెన్సింగ్ అధికారులు అకడమిక్ ధ్రువపత్రాల విశ్వసనీయతను తక్షణమే ధ్రువీకరించవచ్చు. ఇది ధ్రువీకరణ సమయాన్ని, పరిపాలనా భారాన్ని తగ్గిస్తుంది.

 



భారతదేశ డిజిటల్ భవిష్యత్తులో ఎన్ఏడీ
నేషనల్ అకడమిక్ డిపాజిటరీ అనేది విద్యారంగంలో భారతదేశ డిజిటల్ ప‌రిపాల‌నా చ‌ట్రానికి మూలస్తంభం. ఇది అకడమిక్ రికార్డుల సురక్షితమైన, ప్రామాణికమైన, పరస్పరం అనుసంధానమయ్యే నిర్వహణను సాధ్యం చేస్తుంది. అనుమతి ఆధారిత యాక్సెస్, క్రెడెన్షియల్స్ రియల్ టైమ్ ధ్రువీకరణను సులభతరం చేయడం ద్వారా ఇది భౌతిక పత్రాలపై ఆధారపడటాన్ని తగ్గిస్తూనే సమర్థత, పారదర్శకత, నమ్మకాన్ని పెంచుతుంది. డిజిలాకర్ వ్యవస్థలో అంతర్భాగంగా ఎన్ఏడీ సురక్షితమైన, పౌర కేంద్రిత, డిజిటల్ శక్తితో కూడిన విద్యా వ్యవస్థను నిర్మించాలనే భారతదేశ దార్శనికతను ముందుకు తీసుకెళ్తోంది.

 

References

  1. Ministry of Electronics and Information Technology (MeitY)

https://negd.gov.in/blog/digilocker-the-digital-briefcase-for-indias-authentic-e-documents/

https://nad.digilocker.gov.in/

https://www.digilocker.gov.in/web/case-study

 

  1. Ministry of Education

https://nad.gov.in/

https://dashboard.aishe.gov.in/hedirectory/#/hedirectory

https://www.pib.gov.in/PressNoteDetails.aspx?NoteId=154950&ModuleId=3&reg=3&lang=1

  1. Ministry of External Affairs

https://esanad.nic.in/home

Click here to see PDF

 

***

(तथ्य सामग्री आईडी: 150757) आगंतुक पटल : 36


Provide suggestions / comments
इस विश्लेषक को इन भाषाओं में पढ़ें : English , हिन्दी , Bengali , Kannada , Urdu , Assamese