ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

భారతరత్న డాక్టర్ భూపెన్ హజారికా శతజయంతి ఉత్సవాల ముగింపు వేడుకల్లో పాల్గొననున్న ప్రధానమంత్రి

ఈ నెల 29న ఢిల్లీలో జరగనున్న ముగింపు వేడుకలు

నాడు పోస్టు చేయడమైనది: 28 NOV 2026 3:27PM by PIB Hyderabad

డాక్టర్ భూపెన్ హజారికా శతజయంతి ఉత్సవాల ముగింపు వేడుకల్లో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ పాల్గొననున్నారు. ఈ నెల 29న సాయంత్రం 6 గంటలకు న్యూఢిల్లీలోని భారత్ మండపం వేదికగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి సభికులనుద్దేశించి ప్రసంగిస్తారు.

డాక్టర్ భూపేన్ హజారికా 1926 సెప్టెంబర్ 8న అస్సాంలోని సాదియాలో జన్మించారు. ‘సుధాకాంత’, ‘బ్రహ్మపుత్ర కవి’గా అస్సాం ప్రజలు ప్రేమగా పిలుచుకునే ఆయనకు దేశ సాంస్కృతిక చరిత్రలో ప్రత్యేక స్థానం ఉంది. ఒక దిగ్గజ గాయకులు, స్వరకర్త, గీత రచయిత, చిత్రనిర్మాత, రచయిత అయిన డాక్టర్ హజారికా... తన సృజనాత్మక రచనల ద్వారా సామాన్య ప్రజల ఆకాంక్షలకు, భావోద్వేగాలకు గళంగా మారారు. అస్సాం, ఈశాన్య ప్రాంత జానపద సంప్రదాయాల్లో పాతుకుపోయిన ఆయన సంగీతం... భాషాపరమైన, భౌగోళిక సరిహద్దులను అధిగమించి, ఆ ప్రాంతపు గొప్ప సాంస్కృతిక వారసత్వాన్ని దేశవిదేశాల్లోని ప్రేక్షకులకు అందించింది.

తన కళాత్మక కృషికి అతీతంగా... డాక్టర్ హజారికా ఒక మానవతావాది, సాంఘీక ఆలోచనాపరులు. ఆయన రచనలు సమానత్వం, మానవ గౌరవం, సాంఘీక సామరస్యం, విశ్వ సౌభ్రాతృత్వాన్ని ప్రోత్సహించాయి. ఆయన అస్సాం సాంస్కృతిక గుర్తింపును బలోపేతం చేయడానికి, భారత విభిన్న సాంస్కృతిక వారసత్వాన్ని సుసంపన్నం చేయడానికీ తోడ్పాటునందించారు. భారతీయ సంగీతం, సినిమా, సంస్కృతికి ఆయన చేసిన విశేష కృషికి గానూ... దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారం సహా అనేక ప్రతిష్ఠాత్మక పురస్కారాలను అందుకున్నారు. ఆయన మరణానంతరం 2019లో ఆయనకు దేశ అత్యున్నత పౌర పురస్కారమైన భారతరత్న పురస్కారం లభించింది.

డాక్టర్ హజారికా సంగీతం, సాహిత్యం, సినిమా, సమాజానికి చేసిన సేవలను స్మరించుకునేందుకు ఒక అవకాశాన్ని కల్పిస్తూ... ఆయన జన్మ శతాబ్ది ఉత్సవాలు 8 సెప్టెంబర్ 2025న ప్రారంభమయ్యాయి. ఈ ఉత్సవాలు ఆయన ఆదర్శాల ప్రాసంగికతను... ఆయన సృజనాత్మక ప్రతిభ శాశ్వత ఆకర్షణను... మానవత్వం, సామరస్యం, విశ్వ సౌభ్రాతృత్వంతో కూడిన ఆయన సందేశాన్నీ ప్రముఖంగా చాటిచెప్పాయి.


(రిలీజ్ ఐడి: 2343482) సందర్శకుల సూచీ సంఖ్య : : 9