విద్యుత్తు మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

న్యూఢిల్లీలో విద్యుత్ మంత్రుల రెండు రోజుల సమావేశం ప్రారంభం

రాబోయే రెండు దశాబ్దాల్లో విద్యుత్ రంగంలో రూ.200 లక్షల కోట్ల పెట్టుబడులకు అవకాశం

భాగస్వాముల సమష్టి కృషి అవసరం: శ్రీ మనోహర్ లాల్

నాడు పోస్టు చేయడమైనది: 27 NOV 2026 12:40PM by PIB Hyderabad

న్యూఢిల్లీలో రెండు రోజుల పాటు జరిగే విద్యుత్ శాఖ మంత్రుల సదస్సు ఇవాళ ప్రారంభమైంది. ఈ సదస్సు (నవంబర్ 27 నుంచి 28, 2026 తేదీల్లో జరిగే)లో 28 రాష్ట్రాలు, 8 కేంద్రపాలిత ప్రాంతాలకు చెందిన విద్యుత్ శాఖ మంత్రులు, ఉన్నతాధికారులు, విద్యుత్ నియంత్రణ మండలి ప్రతినిధులు పాల్గొంటున్నారు. కేంద్ర విద్యుత్, గృహనిర్మాణ, పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీ మనోహర్ లాల్ ఈ సదస్సుకు అధ్యక్షత వహిస్తున్నారు. జాతీయ స్థాయిలో ఇలాంటి సదస్సు చివరిసారిగా 2024లో జరిగింది.

భారత విద్యుత్ రంగంలోని ప్రధాన విధానపరమైన ప్రాధాన్యతలు, అమల్లో ఎదురవుతున్న సవాళ్లపై కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాల మధ్య చర్చలకు ఈ సదస్సు వేదికగా నిలుస్తుంది. ఇంధన భద్రతను బలోపేతం చేయటం, విద్యుత్ మౌలిక సదుపాయాలను మెరుగుపరచటం ఈ రంగంలో సంస్కరణలను వేగవంతం చేయటంపై ఈ సదస్సులో ప్రధానంగా చర్చలు జరుగుతాయి.

సదస్సులో పాల్గొన్న రాష్ట్రాల విద్యుత్ శాఖ మంత్రులు, ఇతర ప్రముఖులకు శ్రీ మనోహర్ లాల్ స్వాగతం పలికారు. ఈ సందర్భంగా విద్యుత్ రంగాన్ని అభివృద్ధి చేసేందుకు కేంద్రం, రాష్ట్రాలు కలిసి పనిచేయాల్సిన అవసరాన్ని స్పష్టం చేశారు. విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచటం, పునరుత్పాదక ఇంధనాన్ని అనుసంధానించటం, జాతీయ గ్రిడ్‌ను బలోపేతం చేయటంలో భారత్ గణనీయమైన పురోగతి సాధించిందని అన్నారు. మన ప్రయాణంలోని తదుపరి దశలో విద్యుత్ రంగ ప్రణాళికల పట్ల మరింత సమగ్ర విధానాలను అనుసరించాల్సిన అవసరం ఉందని... ఇందులో విద్యుత్ ఉత్పత్తి, నిల్వ, సరఫరా, పంపిణీ వంటి వాటిని ఒకే వ్యవస్థలోని అంతర్గత భాగాలుగా ప్రణాళికాబద్ధంగా రూపొందించాలని తెలిపారు. వినియోగదారులకు ఎంతో ప్రయోజనం చేకూర్చే స్మార్ట్ మీటర్లను రాష్ట్రాలు తప్పనిసరిగా అమలు చేయాల్సిన అవసరాన్ని తెలియజేశారు. రాష్ట్రాల సహకారం, కేంద్ర విద్యుత్ మంత్రిత్వశాఖ తీసుకున్న చర్యల ఫలితంగా సుదీర్ఘ కాలం తర్వాత డిస్కంలు లాభాల బాట పట్టాయని మంత్రి తెలిపారు.

రాబోయే రెండు దశాబ్దాల్లో దేశ విద్యుత్ రంగంలో రూ. 200 లక్షల కోట్ల పెట్టుబడి అవకాశాలు ఉన్నాయని, దీన్ని సాకారం చేసేందుకు భాగస్వాములందరూ కలిసి పనిచేయాల్సిన ఆవశ్యకతను వివరించారు. ఈ లక్ష్యాన్ని సాధించేందుకు ప్రైవేట్ రంగంతో కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందని అన్నారు.

2024-25 ఆర్థిక సంవత్సరంలో డిస్కంలు మొత్తంగా పీఏటీ ఆర్జించినందుకు రాష్ట్రాలు, డిస్కంలను శ్రీ మనోహర్ లాల్ అభినందించారు. మన డిస్కంల ఆర్థిక స్థితిని మరింత బలోపేతం చేసేలా చూడాలని, ఈ పురోగతి కొనసాగేందుకు వీలుగా విధానాలు, కార్యకలాపాలు, నియంత్రణల్లో అవసరమైన మార్పులు చేయాలని చెప్పారు.

సదస్సు ప్రధాన ఎజెండాను వివరిస్తూ... వనరుల సమృద్ధి (ఆర్ఏ) ప్రణాళికల అమలు, ఇంధన నిల్వ వ్యవస్థలను వేగంగా ఏర్పాటు చేయటం, అంతర్రాష్ట్ర, రాష్ట్ర స్థాయి విద్యుత్ సరఫరా సమస్యలు, విద్యుత్ పంపిణీ సంస్థల (డిస్కంల) ఆర్థిక స్థిరత్వం, స్మార్ట్ మీటరింగ్, ఫీడర్ల విభజన, గృహ విద్యుదీకరణకు ప్రాధాన్యతనిస్తూ పునరుద్ధరించిన పంపిణీ రంగ పథకం (ఆర్డీఎస్ఎస్) అమలు, అణు విద్యుత్ కేంద్రాలకు సంబంధించిన అంశాలపై కేంద్ర విద్యుత్ మంత్రిత్వశాఖ, రాష్ట్రాలు, ఇతర భాగస్వాముల మధ్య పరస్పర చర్చలు, లోతైన సమీక్షలు ఉంటాయని ఆయన తెలిపారు.

కేంద్ర విద్యుత్ శాఖ సహాయమంత్రి శ్రీ శ్రీపాద యెస్సో నాయక్ ప్రసంగించారు. ఈ సదస్సులో పాల్గొంటున్న రాష్ట్రాలు, యూటీలు అనుభవాలను పంచుకోవాలని కోరారు. ఇందులో భాగంగా విధానాల అమల్లో ఎదురవుతున్న ఇబ్బందులు, నియంత్రణ పరమైన అంశాలు, కేంద్ర ప్రభుత్వం నుంచి మరింత మద్దతు, చర్యలు తీసుకోవాల్సిన రంగాల గురించి వివరించాలని సూచించారు. విధాన రూపకల్పన నుంచి వాటిని సమర్థవంతంగా అమలు చేయటం, మౌలిక సదుపాయాల కల్పన నుంచి స్పష్టమైన ఫలితాలను సాధించటం దిశగా, విడివిడిగా చేపట్టే చర్యల నుంచి సమగ్రమైన, సుస్థిరమైన విద్యుత్ రంగం దిశగా మనందరి దృష్టి మళ్లాలని మంత్రి అన్నారు.

సదస్సులో పాల్గొన్న వారిని ఉద్దేశించి కేంద్ర విద్యుత్ మంత్రిత్వశాఖ కార్యదర్శి శ్రీ పంకజ్ అగర్వాల్ మాట్లాడారు. వికసిత్ భారత్ @ 2047 లక్ష్య సాధనలో భాగంగా కేవలం ఇంధన భద్రతకే పరిమితం కాకుండా నిజమైన ఇంధన స్వావలంబన దిశగా అడుగులు వేయాలన్నదే ప్రధానమంత్రి నుంచి అందిన కీలక మార్గదర్శకమని పేర్కొన్నారు. గతేడాది రికార్డు స్థాయి వృద్ధిని నమోదు చేసిందని ఆయన తెలిపారు. ప్రస్తుతం భారతదేశ స్థాపిత విద్యుత్ సామర్థ్యం సుమారు 563 జీడబ్ల్యూకు చేరుకుందని, ఇందులో 55 శాతానికి పైగా శిలాజేతర ఇంధన వనరుల నుంచే లభిస్తోందని వివరించారు. గడిచిన 12 నెలల్లో సుమారు 60 గిగావాట్ల అదనపు సామర్థ్యాన్ని సమకూర్చుకోగా... అందులో 87 శాతం శిలాజేతర వనరుల నుంచే వచ్చిందని వెల్లడించారు.

నవంబర్ 28న జరగనున్న కార్యక్రమంలో రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండళ్లు (ఎస్‌ఈఆర్‌సీలు) నిర్వహించనున్న ఫోరమ్ ఆఫ్ రెగ్యులేటర్స్ సంయుక్త సమావేశం ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది. విద్యుత్ రంగానికి సంబంధించిన అంశాలపై చర్చించేందుకు రాష్ట్రాల విద్యుత్ శాఖ మంత్రులు, ఎస్‌ఈఆర్‌సీ ఛైర్‌పర్సన్లు, రాష్ట్రాల విద్యుత్, ఇంధన శాఖ కార్యదర్శులు, కేంద్ర మంత్రిత్వశాఖ ఉన్నతాధికారులు ఈ సమావేశంలో పాల్గొంటారు.

కేంద్ర విద్యుత్ మంత్రిత్వశాఖ ఉన్నతాధికారులతో పాటు సదస్సులో పాల్గొంటున్న వివిధ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ప్రతినిధులు కూడా ఈ సమావేశానికి హాజరవుతారు.

***


(రిలీజ్ ఐడి: 2342978) సందర్శకుల సూచీ సంఖ్య : : 6
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , Marathi , हिन्दी , Bengali , Bengali-TR , Tamil , Kannada