57th International Film Festival of India 2026
20 – 28 Nov 2026

చిన్నారి ప్రపంచంలోకి ‘ది రివర్ ట్రైన్’ చిత్ర బృందం.. 57వ ఇఫీలో ఆసక్తికర విశేషాలు


బాల్య స్వప్నాలు, సమష్టి కృషి స్ఫూర్తిని మేళవించిన అర్జెంటీనా చలనచిత్రం

తెలియని విషయాలను అన్వేషించాలనే సార్వత్రిక ఆకాంక్షను, జీవితంలో తనదైన సొంత మార్గాన్ని వెతుక్కోవాలనే తపనను ఆవిష్కరించిన ‘ది రివర్ ట్రైన్’ చిత్రం

నాడు పోస్టు చేయడమైనది: 27 NOV 2026 7:40PMby PIB Hyderabadరిలీజ్ ఐడి: 2342969Views: 9

స్పానిష్‌ భాషా చిత్రం ‘ది రివర్‌ ట్రైన్‌’ (ఎల్‌ ట్రెన్‌ ఫ్లూవియల్‌) నిర్మాణంలో నమ్మకం, స్నేహం, సున్నితత్వం కీలక పాత్ర పోషించాయని ఆ చిత్ర నిర్మాత వాలెంటైన్‌ టోర్రే, నటి రీటా పాల్స్‌ తెలిపారు. గోవాలో జరుగుతున్న 57వ భారత అంతర్జాతీయ చలనచిత్రోత్సవం (ఐఎఫ్ఎఫ్ఐ) సందర్భంగా నేడు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో చిత్ర నిర్మాణ విశేషాలను వారు పంచుకున్నారు. లోరెంజో ఫెర్రో, లూకాస్‌ ఎ. విగ్నాలే దర్శకత్వం వహించిన ఈ 75 నిమిషాల అర్జెంటీనా స్పానిష్‌ భాషా చిత్రం, ఐఎఫ్ఎఫ్ఐ 2026 అంతర్జాతీయ పోటీ విభాగంలో భారతదేశంలో తొలిసారిగా ప్రదర్శితమైంది.

 

అర్జెంటీనాలోని పాంపాస్‌ మైదాన ప్రాంతం నేపథ్యంలో సాగే ఈ చిత్రం, తొమ్మిదేళ్ల మిలో అనే బాలుడి కథను చెబుతుంది. అతడు అర్జెంటీనా సంప్రదాయ జానపద నృత్యమైన ‘మలాంబో’లో శిక్షణ పొందుతుంటాడు. అయితే, సినిమాల ద్వారా మాత్రమే తెలిసిన బ్యూనస్‌ ఎయిర్స్‌ నగరానికి రైలులో వెళ్లాలన్నది అతడి కల. తనంతట తానుగా ప్రయాణం ప్రారంభించిన మిలోకు ఎదురయ్యే అపరిచిత వ్యక్తులు, ఒంటరితనపు క్షణాలు అతడి చుట్టూ ఉన్నవారు నిర్దేశించిన అంచనాలకు మించిన ప్రపంచాన్ని పరిచయం చేస్తాయి. బాల్యం, స్వేచ్ఛ, కలలను సాకారం చేసుకునే క్రమంలో ఎదురయ్యే సవాళ్లను ఈ ప్రయాణం ఆవిష్కరిస్తుంది.

ఈ ప్రాజెక్టు ఆరంభాన్ని గుర్తుచేసుకుంటూ, ఒక చిన్న సినిమా తీయాలని స్నేహితుల మధ్య సరదాగా మొదలైన ఆహ్వానంతో ఇది ప్రారంభమైందని టోర్రే తెలిపారు. సాధారణ ప్రయత్నంగా మొదలైన ఈ ప్రాజెక్టు పరస్పర నమ్మకం, సమిష్టి కృషితో క్రమంగా ఒక పూర్తిస్థాయి చలనచిత్రంగా రూపుదిద్దుకుని చివరకు బెర్లిన్, శాన్ సెబాస్టియన్, బ్యూనస్ ఎయిర్స్ చలనచిత్రోత్సవాల ద్వారా అంతర్జాతీయ ప్రేక్షకులను చేరుకుందని ఆయన వివరించారు.

ఈ చిత్రంలో ప్రొఫెసర్‌ పాత్ర పోషించిన నటి రీటా పాల్స్‌, గతంలో నటనలో ఎలాంటి అనుభవం లేని యువ మలాంబో నృత్యకారుడు మిలో బరియాతో కలిసి పనిచేసిన అనుభవాన్ని పంచుకున్నారు. సంప్రదాయ సినిమా షూటింగ్‌ విధానాలకు ఆ బాలుడు అలవాటు పడాలని ఆశించకుండా అతడి అవసరాలు, మనోభావాలకు అనుగుణంగా చిత్ర బృందమే తమ పని తీరును మార్చుకుందని ఆమె తెలిపారు. ఈ వెసులుబాటు వల్ల యువ నటుడు సృజనాత్మక ప్రక్రియలో కేంద్రబిందువుగా కొనసాగేందుకు అవకాశం కలిగిందని వివరించారు.

చిత్ర దృశ్య రూపకల్పన గురించి నిర్మాత వివరిస్తూ, 4:3 తెర నిష్పత్తిని ఎంచుకోవడానికి దర్శకులకు పాత తరం సినిమాలపై ఉన్న అభిమానం ఒక కారణమని తెలిపారు. అదే సమయంలో, ఈ విధానం నిర్మాణ బడ్జెట్‌ పరిమితుల్లో పనిచేసేందుకు కూడా చిత్ర బృందానికి తోడ్పడిందని చెప్పారు. చిత్రంలోని కొన్ని భాగాల్లో నలుపు -  తెలుపు దృశ్యాలను ఉపయోగించడం ద్వారా పాతకాల సినిమా వాతావరణాన్ని సృష్టించడంతోపాటు, కథనానికి కలల ప్రపంచాన్ని తలపించే ప్రత్యేకమైన అనుభూతిని అందించారని వివరించారు.

భవిష్యత్తు ప్రణాళికల గురించి శ్రీ టోర్రే మాట్లాడుతూ, ఇద్దరు సోదరుల కథాంశంతో రూపొందనున్న రోడ్‌ ఫిల్మ్‌ ‘ప్లాన్‌ డి ఫుగా’ చిత్రీకరణను 2027లో ప్రారంభించనున్నట్లు తెలిపారు. స్పెయిన్‌లో ‘ది రివర్‌ ట్రైన్‌’ చిత్రం ఇటీవలే థియేటర్లలో విడుదలైందని పేర్కొన్నారు. భవిష్యత్తులో భారతదేశంలోనూ చలనచిత్ర నిర్మాణానికి సంబంధించి భాగస్వామ్య అవకాశాలు ఏర్పడతాయని ఆశాభావం వ్యక్తం చేశారు.

మిలో ప్రయాణం ద్వారా ‘ది రివర్‌ ట్రైన్‌’ చిత్రం తెలియని ప్రపంచాన్ని అన్వేషించాలనే, జీవితంలో తమకంటూ ఒక మార్గాన్ని కనుగొనాలనే సార్వజనీన ఆకాంక్షను ప్రతిబింబిస్తుంది. సృజనాత్మక ఆశయాలకు సున్నితత్వం, సమష్టి కృషి తోడైతే చిన్న ప్రయత్నాల నుంచే అర్థవంతమైన చలనచిత్రాలు రూపుదిద్దుకోగలవని ఈ చిత్ర నిర్మాణ ప్రయాణం గుర్తుచేస్తుంది.

ఈ సమావేశానికి అనుష్క సర్కార్‌ వ్యాఖ్యాతగా వ్యవహరించారు.

Watch full Press conference here:

Read IFFILOID here: https://www.pib.gov.in/iffi/57/iffiLoid.aspx?yr=2026&lang=1&reg=48

 

* * *


Great films resonate through passionate voices. Share your love for cinema with #IFFI2026 and #StoriesWithoutBorders. Tag us @pibindia on Instagram and @PIB_India on X, and we will help amplify your festival moments!

For accredited journalists, critics, bloggers, and vloggers seeking 1-on-1 interviews with filmmakers and festival juries, write to us at:
iffi.mediadesk@pib.gov.in with the subject line: Take One with PIB.


Official Release ID: 2342969
•
Media Centre: Goa
•
Festival Dates: Nov 20 – 28, 2026