57th International Film Festival of India 2026
20 – 28 Nov 2026

ఆస్కార్ ఎంపిక ప్రక్రియపై విశ్లేషణ: 57వ ఐఎఫ్ఎఫ్ఐ వేదికగా ఆస్కార్ ఎంట్రీల ప్రక్రియ, ప్రపంచస్థాయి అవకాశాలపై సినిమా రూపకర్తలకు అవగాహన కల్పించిన నటాలీ వేడ్

నాడు పోస్టు చేయడమైనది: 26 NOV 2026 7:43PMby PIB Hyderabadరిలీజ్ ఐడి: 2342315Views: 6

గోవాలో జరుగుతున్న 57వ భారత అంతర్జాతీయ చలనచిత్రోత్సవాల్లో భాగంగా... ఈ రోజు కళా అకాడమీలో నిర్వహించిన ‘డీకోడింగ్ అకాడమీ అవార్డ్స్’ మాస్టర్‌క్లాస్‌లో సినిమా రూపకర్తలు, విద్యార్థులు, సినీ అభిమానులకు ఆస్కార్ అవార్డుల ఎంపికకు సంబంధించిన అనేక కీలక అంశాలపై అవగాహన కల్పించారు. అకాడమీ పురస్కారాల కోసం చిత్రాల సమర్పణ ప్రక్రియ, అర్హత ప్రమాణాలు, ప్రచార వ్యూహాలు, వర్ధమాన ప్రతిభావంతులకు అందుబాటులో ఉన్న అవకాశాలపై ఈ సమావేశంలో వివరించారు.

 

అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్‌లో మెంబర్ రిలేషన్స్, పురస్కారాల నిర్వహణ విభాగం ఉపాధ్యక్షురాలు శ్రీమతి నటాలీ వేడ్ ఈ మాస్టర్‌క్లాస్‌ను నిర్వహించారు. ఈ సందర్భంగా ఐఎఫ్ఎఫ్ఐ ఫెస్టివల్ డైరెక్టర్ శ్రీ అశుతోష్ గోవారికర్ ఆమెను ఘనంగా సత్కరించారు.

అకాడమీ పురస్కారాల పరిశీలన కోసం ఒక చిత్రాన్ని సమర్పించే సుదీర్ఘ ప్రక్రియపై చాలామంది సినిమా రూపకర్తలకు సరైన అవగాహన ఉండటం లేదని శ్రీమతి వేడ్ పేర్కొన్నారు. ప్రారంభ సమర్పణ దశ నుంచి పురస్కారాల తుది దశ వరకు ఉండే అధికారిక విధానాలు, నియమ నిబంధనలు, ఆవశ్యకతలపై సినిమా రూపకర్తలకు సంపూర్ణ అవగాహన కల్పించడం... ఆ ప్రక్రియలోని సంక్లిష్టతను తొలగించడమే ఈ మాస్టర్‌క్లాస్ ప్రధాన ఉద్దేశమని ఆమె వివరించారు. ఆస్కార్ విజేత ‘ది ఎలిఫెంట్ విస్పరర్స్’ సహా భారతీయ సినిమాకు లభించిన అంతర్జాతీయ గుర్తింపును ప్రస్తావిస్తూ... సినిమా భౌగోళిక సరిహద్దులకు అతీతమైనదని ఆమె కొనియాడారు. భారత్ సహా విశ్వవ్యాప్తంగా ఉన్న సినీ ప్రతిభావంతులందరికీ అకాడమీ వేదికగా నిలుస్తోందని ఆమె అన్నారు.

తన ప్రజెంటేషన్‌లో భాగంగా... జనరల్ ఎంట్రీ, ఉత్తమ చిత్రం విభాగాల పరిశీలనకు ఉండాల్సిన అర్హత ప్రమాణాలు, ఎంపిక మార్గాలను శ్రీమతి వేడ్ వివరించారు. అమెరికాలోని ఆరు నిర్దేశిత మెట్రోపాలిటన్ నగరాల్లో కనీసం ఏదో ఒక నగరంలో వరుసగా ఏడు రోజుల పాటు థియేటర్లలో ప్రదర్శించాల్సిన నిబంధనను గురించి ఆమె ప్రత్యేకంగా ప్రస్తావించారు. దీంతో పాటు నటన, సినిమాటోగ్రఫీ, దర్శకత్వం, ఫిల్మ్ ఎడిటింగ్, సంగీతం, సౌండ్, విజువల్ ఎఫెక్ట్స్, రచన వంటి వివిధ విభాగాల్లో పోటీ పడేందుకు ఉండాల్సిన అర్హతలనూ ఆమె చర్చించారు.

ఉత్తమ అంతర్జాతీయ చిత్రం, డాక్యుమెంటరీ ఫీచర్, షార్ట్ ఫిల్మ్ విభాగాల్లో పోటీ పడేందుకు పాటించాల్సిన సమర్పణ నియమాలను వివరిస్తూ... గుర్తింపు పొందిన అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్స్ ద్వారా నేరుగా అర్హత పొందే మార్గాలను ఆమె తెలియజేశారు. అకాడమీ సభ్యులు సినిమాలను వీక్షించే అధికారిక వేదికైన ‘అకాడమీ స్క్రీనింగ్ రూమ్’ పనితీరు, అందుకు అవసరమైన సాంకేతిక నిబంధనలు, సమర్పణ పద్ధతులు, చెల్లించాల్సిన ఫీజుల గురించి ఈ మాస్టర్‌క్లాస్‌లో పూర్తి సమాచారం అందించారు.

 

అకాడమీ అందించే శాస్త్రీయ, సాంకేతిక పురస్కారాలను ప్రముఖంగా ప్రస్తావిస్తూ... చలనచిత్ర నిర్మాణ సాంకేతికతను ముందుకు తీసుకెళ్లే వినూత్న ఆవిష్కరణలకు లభించే గుర్తింపు గురించి శ్రీమతి వేడ్ వివరించారు. వర్ధమాన సినిమా రూపకర్తలు, స్క్రీన్‌ప్లే రచయితలకు మార్గదర్శనం చేస్తూ, వృత్తిపరమైన అవకాశాలనూ కల్పించే... అకాడమీకి చెందిన ‘గ్లోబల్ టాలెంట్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్స్’నూ ఆమె పరిచయం చేశారు. వీటిలో భాగమైన ‘స్టూడెంట్ అకాడమీ పురస్కారాలు’, స్క్రీన్‌రైటింగ్‌లో అందించే ‘నికోల్ ఫెలోషిప్స్’, మహిళల కోసం ప్రత్యేకంగా రూపొందించిన ‘అకాడమీ గోల్డ్ ఫెలోషిప్ ఫర్ విమెన్’ కార్యక్రమాల వివరాలనూ ఆమె తెలియజేశారు.

ప్రశ్నోత్తరాల కార్యక్రమంతో ఈ మాస్టర్‌క్లాస్ ముగిసింది. ఈ సందర్భంగా చిత్రాల అర్హత ప్రమాణాలు, అంతర్జాతీయ ఎంట్రీల సమర్పణ, చలనచిత్రోత్సవాల ద్వారా అర్హత సాధించే మార్గాలు, సాంకేతిక నిబంధనలపై సభికుల సందేహాలకు శ్రీమతి వేడ్ సమాధానాలిచ్చారు. సందేహాల నివృత్తి కోసం, సరైన మార్గదర్శనం కోసం నిరభ్యంతరంగా అకాడమీని సంప్రదించాలని ఆమె సినిమా రూపకర్తలను ప్రోత్సహించారు. ఆస్కార్ సమర్పణ ప్రక్రియను సులభంగా పూర్తి చేయడంలో సినిమా రూపకర్తలకు అకాడమీ ప్రతినిధులు, స్థానిక సంప్రదింపు కేంద్రాలు అవసరమైన సహాయ సహకారాలు అందిస్తాయని ఆమె స్పష్టం చేశారు.

ఇఫిలాయిడ్ (ఐఎఫ్ఎఫ్ఐఎవ్‌వోఐడి) సంచికను ఇక్కడ చదవండి: https://www.pib.gov.in/iffi/57/iffiLoid.aspx?yr=2026&lang=1&reg=48

 

***

 

Great films resonate through passionate voices. Share your love for cinema with #IFFI2026 and #StoriesWithoutBorders. Tag us @pibindia on Instagram and @PIB_India on X, and we will help amplify your festival moments!

For accredited journalists, critics, bloggers, and vloggers seeking 1-on-1 interviews with filmmakers and festival juries, write to us at:
iffi.mediadesk@pib.gov.in with the subject line: Take One with PIB.


Official Release ID: 2342315
•
Media Centre: Goa
•
Festival Dates: Nov 20 – 28, 2026