రహదారి రవాణా, హైవేల మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

అత్యుత్తమ ప్రమాణాలతో జాతీయ రహదారుల అభివృద్ధి వల్ల సైనిక విమానాల ల్యాండింగ్‌కు వెసులుబాటు

నాడు పోస్టు చేయడమైనది: 26 NOV 2026 1:20PM by PIB Hyderabad

గుజరాత్‌లోని పటాన్‌ వద్ద అమృత్‌సర్‌ - జామ్‌నగర్‌ ఆర్థిక కారిడార్‌ (ఎన్‌హెచ్‌–754ఏ)పై 2026 నవంబర్‌ 24న భారత సైన్యానికి చెందిన నాలుగు విమానాలు విజయవంతంగా ల్యాండ్‌ అయ్యాయి. ఈ ప్రదర్శన ద్వారా తగిన విధంగా అత్యుత్తమ ప్రమాణాలతో రూపకల్పన చేసిన జాతీయ రహదారులు  అత్యవసర, వ్యూహాత్మక అవసరాలతో సహా ప్రత్యేక కార్యకలాపాలకు కూడా ఉపయోగపడగలవని నిరూపితమైంది.

భారత సైన్యానికి చెందిన ‘టీమ్‌ మౌంటెన్‌ ఈగల్స్‌’ బృందంలోని రెండు ఫిక్స్‌డ్‌ వింగ్‌ మైక్రోలైట్‌ విమానాలు, రెండు పవర్డ్‌ హ్యాంగ్‌ గ్లైడర్లు ఈ ప్రదర్శనలో పాల్గొన్నాయి. మిలిటరీ కాలేజ్‌ ఆఫ్‌ టెలికమ్యూనికేషన్‌ ఇంజినీరింగ్‌ (ఎంసీటీఈ), మోవ్‌లోని ఆర్మీ అడ్వెంచర్‌ నోడల్‌ సెంటర్‌ (ఏఏఎన్‌సీ) నిర్వహించిన ‘వింగ్స్‌ ఆఫ్‌ వాలర్‌ అండ్‌ యూనిటీ ఎక్స్‌పెడిషన్‌ - 2026’లో భాగంగా ఈ విమానాలు కాండ్లా విమానాశ్రయం నుంచి బయలుదేరాయి.

ఈ ప్రదర్శనను విజయవంతంగా నిర్వహించినందుకు భారత సైన్యానికి చెందిన ‘టీమ్‌ మౌంటెన్‌ ఈగల్స్‌’ బృందానికి, జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (ఎన్‌హెచ్ఏఐ)కు, సంబంధిత అధికారులందరికీ కేంద్ర మంత్రి శ్రీ నితిన్‌ గడ్కరీ అభినందనలు తెలిపారు.

కారిడార్‌ నిర్మాణంలో ఇంజినీరింగ్‌ సామర్థ్యం

సంబంధిత రహదారి మార్గాన్ని 170 మిలియన్‌ స్టాండర్డ్‌ యాక్సిల్స్‌ (ఎంఎస్ఏ) ట్రాఫిక్‌ భారాన్ని తట్టుకునేలా రూపొందించారు. ఇందులో 550 మి.మీ. మందంతో పేవ్‌మెంట్‌ పొరను, 500 మి.మీ. మందంతో సబ్‌గ్రేడ్‌ పొరను నిర్మించారు. ఈ రహదారిపై విమానాలు విజయవంతంగా ల్యాండ్‌ కావడం ద్వారా కారిడార్‌ నిర్మాణంలో ఉన్న ఇంజినీరింగ్‌ సామర్థ్యం వెలుగులోకి వచ్చింది. అలాగే, తగిన సాంకేతిక పరిశీలనలు, నిర్వహణ అవసరాల అంచనా, అవసరమైన భద్రతాపరమైన అనుమతులకు లోబడి, అనువైన జాతీయ రహదారుల మార్గాలను ప్రత్యేక అవసరాలకు కూడా వినియోగించుకునే అవకాశాలు ఉన్నాయని ఈ ప్రదర్శన రుజువు చేసింది.

***


(రిలీజ్ ఐడి: 2342264) సందర్శకుల సూచీ సంఖ్య : : 7
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , Marathi , हिन्दी , Bengali , Bengali-TR , Tamil , Kannada