నాడు పోస్టు చేయడమైనది:
25 NOV 2026 12:01PM by PIB Hyderabad
పంజాబ్.. తరన్‌తారన్ జిల్లాలో ‘బూహ్ హవేలియా’ గ్రామంలో ఈ రోజు ‘కిసాన్ చౌపాల్’ కార్యక్రమంలో కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమం, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శ్రీ శివ్‌రాజ్ సింగ్ చౌహాన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా రైతులతో మంత్రి ముఖాముఖి చర్చించారు. పొలాల మధ్య రైతులతో కలిసి కూర్చొని వారి సమస్యలను, వారు చేసిన సూచనలను మంత్రి విన్నారు. గడ్డి దుబ్బులను మండించకుండానే ఆధునిక పద్ధతుల్లో వ్యవసాయం చేస్తున్న ప్రగతిశీల రైతులకు, పంచాయతీలకు మంత్రి అభినందనలు తెలిపారు. ఒక పెద్ద రాజకీయ సభను నిర్వహించడానికి తాను ఇక్కడికి రాలేదని, ఒక సేవకునిగా రైతుల మధ్య కూర్చొని వారు చెప్పే మాటలను ఆలకించడానికి వచ్చానని మంత్రి స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఆయన రైతుల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని ‘‘ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన’ను పంజాబ్ ప్రభుత్వం అమలు చేయాలని కోరారు. రైతు అనుకూల విధానాలను అనుసరించడానికి, కనీస మద్దతు ధర (ఎమ్ఎస్పీ)ని చెల్లించి రికార్డు స్థాయిలో ఆహార ధాన్యాలను సేకరించడానికి మోదీ ప్రభుత్వం కట్టుబడి ఉందని కేంద్ర మంత్రి పునరుద్ఘాటించారు.

రైతులకు సేవ చేయడమే సద్గురు ఆరాధన
‘కిసాన్ చౌపాల్’ను ఉద్దేశించి కేంద్ర మంత్రి శ్రీ శివ్‌రాజ్ సింగ్ చౌహాన్ ప్రసంగిస్తూ, రైతులు పగలూ రాత్రి చెమటోడ్చి దేశ ప్రజల కడుపు నింపుతారని భావోద్వేగంతో చెప్పారు. ‘‘నేను ఒక నేతను కాను, రైతులకు సేవ చేసే వాడిని. గురు నానక్ దేవ్ జీ కూడా ఈసునసూయలను, ద్వేషాన్ని త్యజించమని, ప్రజలకు సేవ చేయమనే కదా సందేశాన్నిచ్చారు. మంత్రిపదవిని అప్పగించారంటే అహంకరించడానికి కాదు, ప్రజలకు సేవ చేయడానికి ఇచ్చారు. నా దృష్టిలో, రైతులకు సేవ చేయడమూ సద్గురు భగవాన్ను ఆరాధించడమూ ఒకటే’’ అని శ్రీ చౌహాన్ అన్నారు.

‘హరిత క్రాంతి’ నుంచి ‘ఖేత్ బచావో అభియాన్’ వైపునకు పయనం
చరిత్రాత్మక సేవలను అందిస్తున్న పంజాబ్ రైతులకు వందనాలు అని కేంద్ర మంత్రి శ్రీ చౌహాన్ అంటూ దేశం ఆహార సంక్షోభాన్ని ఎదుర్కొని, విదేశాల నుంచి ఎర్ర గోధుమను దిగుమతి చేసుకోవాల్సిన స్థితి తలెత్తినప్పుడు, హరిత క్రాంతిని తీసుకు వచ్చి దేశ ఆహార ధాన్యాల గాదెలను నింపింది పంజాబ్‌కు చెందిన రైతులేనన్నారు. అయితే ప్రస్తుతం రసాయనిక ఎరువులను, పురుగుమందులను మరీ ఎక్కువ మోతాదులో వినియోగిస్తున్న, పంట వ్యర్థాలను మండించివేస్తున్న కారణంగా ధరణి మాత స్వస్థత క్షీణిస్తోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. మనం భూసారాన్ని కాపాడుకోలేక పోయామంటే, రాబోయే తరాలు పెద్ద సంకటాన్ని ఎదుర్కోవలసి వస్తుందని మంత్రి హెచ్చరిక చేశారు. బూహ్ హవేలియా, పరిసర ప్రాంతాల రైతులు గత ఆరు సంవత్సరాలుగా వరి మోడులను తగులబెట్టకుండా ‘హ్యాపీ సీడర్’, ‘డైరెక్ట్ సీడింగ్’ పద్ధతులను అవలంబిస్తూవస్తున్నారని ఆయన వారిని అభినందించారు. ఈ గ్రామం ‘ఖేత్ బచావో అభియాన్’లో ఒక కొత్త దిశను దేశానికి చూపించిందని మంత్రి అన్నారు.

వ్యవసాయ రంగంలో యంత్రాల వినియోగం విషయంలో రాష్ట్ర ప్రభుత్వానికి సలహా
చర్చలో భాగంగా ప్రగతిశీల రైతులు సర్దార్ సుఖ్వీందర్ సింగ్ (కిర్తోవాల్), సర్దార్ జతిందర్ సింగ్ (ముండా పిండ్), మాజీ సర్పంచ్ సర్దార్ గుర్నామ్ సింగ్ గడ్డి దుబ్బుల నిర్వహణలో ఎదురవుతున్న వ్యావహారిక సమస్యలతో పాటు బేలర్ యంత్రాలకు సబ్సిడీకి సంబంధించిన సూచనలు చేశారు. రైతులు చేసిన సూచనలను మంత్రి సావధానంగా విని, వారిని ఢిల్లీకి పిలిపించి విస్తృతంగా చర్చిస్తామని హామీనిచ్చారు. సబ్సిడీపై అందిస్తున్న యంత్రాల విషయంలో వచ్చిన ఫిర్యాదుల పట్ల కేంద్ర మంత్రి స్పందిస్తూ, ఈ సంవత్సరం కూడా పెద్ద మొత్తాన్ని సుమారు రూ.286 కోట్ల వరకు పంట అవశేషాల నిర్వహణ (క్రాప్ రెసిడ్యూ మేనేజ్మెంట్..సీఆర్ఎమ్) కోసం రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం ఇస్తోందని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం నిధులను ఇస్తుంటే, యంత్రాలను కొనుగోలు చేయడంతో పాటు నాణ్యతను పరీక్షించవలసిన బాధ్యతలు రాష్ట్ర ప్రభుత్వానివేనని ఆయన అన్నారు. రైతులకు మంచి నాణ్యమైన యంత్రాలు అందేటట్లు చూస్తూ, ఒకవేళ అవి పాడయితే వాటి మరమ్మతుకు తగిన వ్యవస్థను ఏర్పాట్లు చేసే అంశంపైన కూడా రాష్ట్రప్రభుత్వం శ్రద్ధ తీసుకోవాలని ఆయన అన్నారు.

‘ఫసల్ బీమా యోజన’, వివిధీకరణలకు ప్రాధాన్యం
వ్యవసాయాన్ని లాభదాయక వాణిజ్య కార్యకలాపంగా తీర్చిదిద్దడానికి ఉత్పాదనను పెంచడం, వ్యయాలను తగ్గించుకోవడం, రక రకాల పంటలు సాగు చేయడం, పశుపోషణ, చేపల పెంపకం, కోళ్ల పెంపకం వంటి ఏకీకృత వ్యవసాయ పద్ధతిని అనుసరించడం అత్యవసరమని శ్రీ చౌహాన్ తెలిపారు. పంజాబ్‌లో ఇప్పటి వరకు ‘ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన’ను అమలు చేయకపోవడం నిరుత్సాహకరమని ఆయన అన్నారు. వరదల వేళ కూడా తాను ముఖ్యమంత్రికి లేఖ రాసి ఈ పథకాన్ని అమలు చేయవలసిందిగా కోరినట్లు, ఆ పథకాన్ని అమలు చేసినట్లయితే ప్రాకృతిక విపత్తులలో రైతులకు నష్టాన్ని భర్తీ చేయడానికి వీలు ఉంటుందని సూచించినట్లు శ్రీ చౌహాన్ వెల్లడించారు.
పంజాబ్‌లో కూటమితో ప్రగతి, అభివృద్ధిలలో మొదలవనున్న నూతనాధ్యాయం
కార్యక్రమం ముగిసిన తరువాత ప్రసార మాధ్యమాల ప్రతినిధులతో కేంద్ర మంత్రి శ్రీ శివ్‌రాజ్ సింగ్ చౌహాన్ మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన రైతులకు హామీనిస్తూ, వరి, గోధుమ పంటలను కనీస మద్దతు ధర చెల్లించి కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేస్తుందన్నారు. దీనికి అదనంగా, పప్పుధాన్యాలను (కంది, మసూర్, మినప) 100 శాతం కొనుగోలు చేయడానికి, పత్తిని ఎమ్ఎస్పీ చెల్లించి సేకరించడానికి మోదీ ప్రభుత్వానిది పూచీ అన్నారు. ఇదివరకటి యూపీఏ ప్రభుత్వంతో పోలిస్తే మోదీ ప్రభుత్వం అనేక రెట్లు ఎక్కువ కొనుగోళ్లు జరిపిందని, ఇది ఇకమీదట కూడా నిరంతరాయంగా కొనసాగుతుందన్నారు.
***