ప్రతి కథలోనూ వాస్తవంలోని ఓ చిన్న భాగం ఉంటుంది. అలాగే ప్రతి జ్ఞాపకంలోనూ కల్పనకు ఆస్కారం ఉంటుంది. నిజ జీవిత అనుభవాలకు, సినీ కల్పనకు మధ్య ఉన్న ఈ సున్నితమైన సంబంధాన్ని విశ్లేషిస్తూ ప్రముఖ రొమేనియన్ రచయిత, దర్శకుడు, నిర్మాత బోగ్డాన్ మురేసాను గోవాలో జరుగుతున్న 57వ భారత అంతర్జాతీయ చలనచిత్రోత్సవం (ఐఎఫ్ఎఫ్ఐ)లో ‘వాస్తవం - కల్పన మధ్య సన్నని సరిహద్దులు’ అనే అంశంపై ఆసక్తికరమైన మాస్టర్‌క్లాస్ నిర్వహించారు.
సినీ అభిమానులు, విద్యార్థులు, సినీ నిపుణులతో కిటకిటలాడిన సభలో మురెసాను మాట్లాడుతూ, మనిషి జీవనంలో కథనాలకు ఉన్న ప్రాధాన్యతను, ప్రపంచాన్ని అవగాహన చేసుకోవడంలో అవి పోషించే పాత్రను విశ్లేషించారు. కథలు చెప్పడం అనేది కళాకారులకే ప్రత్యేకమైన హక్కు కాదంటూనే.. మిత్రుల మధ్య సాగే సాధారణ ముచ్చట్ల మొదలుకుని వెండితెర కథల దాకా అన్ని కథనాలూ మనలోని ఉత్సాహాన్ని పునరుత్తేజపరుస్తాయని, కొత్త కోణాలను అన్వేషించే శక్తిని ఇస్తాయని ఆయన అన్నారు.
సినిమా తీయడం అత్యంత వ్యక్తిగత ఆలోచనతో మొదలై, అందరి ఉమ్మడి అనుభూతిగా మారే ప్రక్రియ అని మురెసాను అభివర్ణించారు. “మనసులోని స్వగతం సంభాషణగా మారిన క్షణమే, ఆ చిత్రం మీ సొంతం కాకుండా అందరిదైపోతుంది” అన్నారు. ప్రేక్షకుల దృష్టికోణం తోడైనప్పుడే దర్శకుడి ఆలోచనకు పరిపూర్ణత వస్తుందని తెలిపారు. సినీ నిర్మాణం గురించి వివరిస్తూ, స్పష్టమైన కథా వస్తువు ఉండాలని సూచించారు. “నవలలో అనేక పక్కదారులు, ఉపకథలకు అవకాశం ఉంటుంది. కానీ రెండు గంటల సినిమా అలా కాదు. దాని నేపథ్యం, కథాంశం, ఇతివృత్తం అన్నీ ఒకే బలమైన ప్రధాన ఆలోచన చుట్టూ కేంద్రీకృతమై ఉండాలి” అని ఆయన స్పష్టం చేశారు.
సినిమా కథనంలో దృశ్యమానం కాని అంశాల (చెప్పని విషయాల) శక్తిని మురెసాను ప్రముఖంగా పేర్కొన్నారు. తన సినిమాలోని ఒక సన్నివేశాన్ని వివరిస్తూ, పాత్ర బాణాసంచా కాల్చే దృశ్యాన్ని తెరపై చూపకుండా, ఆ ఊహను ప్రేక్షకులకే వదిలేశానని తెలిపారు. ఇలాంటి సృజనాత్మక నియంత్రణ వల్ల ప్రేక్షకులు కథలోని భావోద్వేగాల్లో మరింతగా లీనమవుతారని ఆయన అన్నారు.
పాత రికార్డు దృశ్యాలను (ఆర్కైవల్ ఫుటేజ్) చరిత్రను ఉన్నదున్నట్లు నిష్పక్షపాతంగా చూపేవిగా భావించడాన్ని మురెసాను తప్పుబట్టారు. ప్రతి కెమెరా ఒక నిర్దిష్ట కోణాన్ని మాత్రమే చిత్రీకరిస్తుందని ఆయన పేర్కొన్నారు. తన ‘ది క్రిస్మస్ గిఫ్ట్’, ‘ది న్యూ ఇయర్ దట్ నెవర్ కేమ్’ చిత్రాలను ఉదాహరణగా ప్రస్తావిస్తూ, ఆర్కైవ్ దృశ్యాలు, కల్పిత కథనాలు ఒకదానికొకటి ఎలా తోడ్పడతాయో వివరించారు. ఈ సందర్భంగా ఒక ఆసక్తికరమైన ఉదంతాన్ని పంచుకుంటూ, “వాస్తవాన్ని అర్థం చేసుకోవడానికి కల్పన ఒక సరళీకృత నమూనాగా ఉపయోగపడినప్పుడు, అది వాస్తవంలో భాగమైపోతుంది. వాస్తవం, కల్పన ఒకదానికొకటి తోడ్పడుతూ ఉంటాయి” అని ఆయన వ్యాఖ్యానించారు.
కథనాన్ని ఆవిష్కరించడంలో దృశ్య భాష పోషించే పాత్రను కూడా మురేసాను వివరించారు. రొమేనియాలో కమ్యూనిస్టు పాలన కొనసాగిన కాలం నేపథ్యంలో రూపొందించిన తన చిత్రాల్లో 4:3 ఆస్పెక్ట్ రేషియోను ఎందుకు ఉపయోగించారో తెలిపారు. ఆ కాలానికి సంబంధించిన ఆర్కైవ్ దృశ్యాలతో సమన్వయం కుదరడంతో పాటు, కథనానికి సాన్నిహిత్య భావనను, నిర్బంధ వాతావరణాన్ని కల్పించేందుకు ఈ నిష్పత్తి దోహదపడుతుందని వివరించారు. అయితే, దీనికి భిన్నంగా తన యానిమేటెడ్ లఘుచిత్రం ‘ది మెజీషియన్’లో విస్తృతమైన వైడ్‌స్క్రీన్ ఫార్మాట్‌ను ఉపయోగించినట్లు తెలిపారు. దీనివల్ల కథనంలో ఓడరేవు కూడా చురుకైన పాత్ర పోషిస్తున్న భావన కలుగుతుందని పేర్కొన్నారు.
సమకాలీన సినిమా గురించి ప్రస్తావిస్తూ, చిత్రాల అసలైన శక్తి కేవలం కథనం వేగంలోనో, అద్భుతమైన దృశ్యాల ప్రదర్శనలోనో ఉండదని మురేసాను స్పష్టం చేశారు. ముఖంలోని భావాలను, చూపుల ద్వారా వ్యక్తమయ్యే అనుభూతులను తెరపై ఆవిష్కరించడంలోనే సినిమాకు ఉన్న అసలైన వ్యక్తీకరణ శక్తి దాగి ఉందని పేర్కొన్నారు. ఈ మాస్టర్‌క్లాస్‌లో భాగంగా నిర్వహించిన ప్రశ్నోత్తర కార్యక్రమంలో చారిత్రక జీవిత చరిత్రల ఆధారంగా రూపొందించే చిత్రాలు, పురాణాలు, నిజ జీవిత వ్యక్తులను తెరపై చిత్రీకరించేటప్పుడు పాటించాల్సిన నైతిక బాధ్యతలు వంటి అంశాలపై చర్చ జరిగింది. ఇటీవల ఒక ప్రముఖ వ్యక్తి జీవిత చరిత్ర ఆధారంగా సినిమా దర్శకత్వం వహించాలంటూ తనకు వచ్చిన ప్రతిపాదనను ప్రస్తావిస్తూ, ఒక వ్యక్తి జీవితంలోని కీలక ఘట్టంపై దృష్టి సారించడం ద్వారా, ఆయన జీవితాన్ని పూర్తిగా ఆవిష్కరించే ప్రయత్నం కంటే మరింత లోతైన వాస్తవాలను వెల్లడించవచ్చని మురేసాను అభిప్రాయపడ్డారు.
తాత్విక ధోరణిలో ప్రసంగాన్ని ముగిస్తూ.. వారసత్వంగా వచ్చిన దృక్పథాలను అధిగమించి, విస్తృత ప్రపంచంతో మమేకమవ్వాలని, ఆపై మరింత ధైర్యం, స్పష్టతతో తిరిగి తమ మూలాల వైపు పయనించాలని కథకులకు ఆయన పిలుపునిచ్చారు.
Read IFFILOID here: https://www.pib.gov.in/iffi/57/iffiLoid.aspx?yr=2026&lang=1®=48
***