57th International Film Festival of India 2026
20 – 28 Nov 2026

ఇఫీ-2026లో వైవిధ్యమైన చిత్రీకరణ శైలితో సార్వత్రిక మానవ భావోద్వేగాలను ఆవిష్కరించిన ‘ది బ్లాక్ సీ’

మనుషుల కోరికలు, వాటి వల్ల కలిగే ఫలితాలను ఈ సినిమా చూపిస్తుంది: దర్శకుడు అలాద్దీన్ ముస్తఫా

నాడు పోస్టు చేయడమైనది: 24 NOV 2026 1:12PMby PIB Hyderabadరిలీజ్ ఐడి: 2340878Views: 3

గోవాలో జరుగుతున్న 57వ భారత అంతర్జాతీయ చలన చిత్రోత్సవం సందర్భంగా అరబిక్ భాషా చలనచిత్రం 'ది బ్లాక్ సీ' సినీబృందం ఈరోజు ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (పీఐబీ) మీడియా సెంటర్‌లో మీడియాతో మాట్లాడింది. డెబ్ల్యూ దర్శకుడు అలాద్దీన్ ముస్తఫా, నిర్మాత హందీ సమీహ్, ఫిల్మ్ ఎడిటర్, ఎగ్జిక్యూటివ్ నిర్మాత మోటాజ్ నాషీ పాత్రికేయులతో మాట్లాడుతూ.. ఈ చిత్రాన్ని రూపొందించిన నేపథ్యం, సార్వత్రిక ప్రాముఖ్యత, ఎడిటింగ్ విభాగంలో అనుసరించిన ప్రత్యేక శైలి పట్ల అనుభవాలను పంచుకున్నారు.

ఈ 'ది బ్లాక్ సీ' కథను ఎంచుకోవటం వెనకున్న స్ఫూర్తి గురించి దర్శకుడు అలాద్దీన్ ముస్తఫా మాట్లాడారు. ఇఫీ వేదికపై తన చిత్రాన్ని ప్రదర్శించటం, అరబ్ సంస్కృతికి చెందిన కథను అంతర్జాతీయ వేదికపైకి తీసుకురావటం ఎంతో ఆనందంగా ఉందని చెప్పారు. ఈ చిత్రం ప్రధాన ఇతివృత్తాన్ని వివరిస్తూ... ఎలాగైనా లక్ష్యాలను సాధించాలనే తపనతో వ్యక్తులు ప్రయత్నించినప్పుడు, అదుపులేని మానవ కోరికలు హద్దుమీరే విధానాన్ని ఈ చిత్రం విశ్లేషిస్తుందని తెలిపారు. ఆశయాలను నెరవేర్చుకునేందుకు మనుషులు ఎంతటి తీవ్రమైన చర్యలకైనా సిద్ధపడటంపై ఈ సినిమా ప్రశ్నిస్తుందని ఆయన వివరించారు.

చలన చిత్రోత్సవంలో ఒక ఈజిప్షియన్ చిత్రాన్ని భారతీయ, అంతర్జాతీయ ప్రేక్షకుల ముందుకు తీసుకురావటంపై అడిగిన ప్రశ్నకు నిర్మాత హందీ సమీహా స్పందించారు. ఆ కథలోని భిన్న సంస్కృతుల సారూప్యతను ప్రత్యేకంగా ప్రస్తావించారు. 'ది బ్లాక్ సీ' అరబిక్ భాషలో నిర్మించిన ఈజిప్షియన్ చిత్రం అయినప్పటికీ ఏ ఒక్క సంస్కృతికో, ప్రాంతానికో పరిమితం కాదని ఆయన పేర్కొన్నారు. "ఇది వివిధ దేశాల ప్రజలందరిలోనూ ఉండే ఉమ్మడి భావాలను ప్రతిబింబిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న మానవులందరికీ ఒకే రకమైన ప్రాథమిక ఆకాంక్షలు ఉంటాయి. ఇదే ఈ చిత్రాన్ని భారతదేశంతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులకు చేరువ చేస్తుంది" అని అన్నారు.

ఇంటి లోపలే బందీలై డార్క్ సైకలాజికల్ యాప్ ఉచ్చులో చిక్కుకుపోయే పాత్రల చుట్టూ తిరిగే ఈ చిత్రంలోని సాంకేతిక, కథన శైలిపై చిత్ర ఎడిటర్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ మోటాజ్ నాషీ అభిప్రాయాలను పంచుకున్నారు. ఉద్రిక్తతను, నిర్బంధ వాతావరణాన్ని ప్రేక్షకులకు చేరవేసేందుకు రిథమ్, పేసింగ్ ఉపయోగించటం గురించి వివరించారు. చిత్రంలోని లోతైన భావాలను ప్రేక్షకులందరికీ సమర్థవంతంగా చేరవేయటమే ప్రధాన సవాలుగా నిలిచిందని ఆయన పేర్కొన్నారు. వేగవంతమైన కట్స్ కాకుండా పాత్రల్లో ప్రేక్షకులు పూర్తిగా లీనమయ్యేలా, చిత్ర నిర్మాతలు అందించాలనుకున్న ప్రధాన సందేశాన్ని అనుభూతి చెందేలా చిత్ర బృందం ఉద్దేశపూర్వకంగానే నెమ్మదిగా సాగే, ఆలోచనతో కూడిన కథన వేగాన్ని ఎంచుకుందని ఆయన తెలిపారు.

తాము రూపొందించిన చిత్రానికి లభించిన సాదర స్వాగతం పట్ల ఉత్సవ నిర్వాహకులకు, భారతీయ ప్రేక్షకులకు సినీ రూపకర్తలు కృతజ్ఞతలు తెలియజేయటంతో విలేకరుల సమావేశం ముగిసింది. ఆకట్టుకునే కథన గమనం, ఆలోచింపజేసే ఇతివృత్తంతో రూపొందిన 'ది బ్లాక్ సీ' చిత్రం, ప్రాంతీయ కథన శైలిని విశ్వవ్యాప్త మానవీయ సత్యాలతో అనుసంధానిస్తూ 57వ ఇఫీ ప్రేక్షకులకు వినూత్న సినిమాటిక్ అనుభూతిని అందిస్తుంది. ఈ విలేకరుల సమావేశానికి శ్రీమతి సృష్టి సురేష్ కుల్యే సమన్వయకర్తగా వ్యవహరించారు.

ఈజిప్టు సంస్కృతిలో వేళ్లూనుకున్నప్పటికీ, అన్ని సమాజాలకు దగ్గరగా ఉండే అంశాలను స్పృశించే 'ది బ్లాక్ సీ' చిత్రం... ఇఫీ 2026 ఇతివృత్తమైన 'విశ్వజనీన కథలు' స్ఫూర్తిని ప్రతిబింబిస్తుంది. మానవ కోరికలను సార్వత్రిక దృక్పథంతో చూడటం, కథనాన్ని నడిపించిన విలక్షణమైన శైలి ద్వారా సినిమా భాషా, సాంస్కృతిక సరిహద్దులను ఎలా అధిగమిస్తుందో ఈ చిత్రం చాటిచెబుతుంది. మనిషి జీవితంలోని ఉమ్మడి అనుభవాల ద్వారా ప్రేక్షకులందరినీ ఏకం చేస్తుంది.

Read IFFILOID here: https://www.pib.gov.in/iffi/57/iffiLoid.aspx?yr=2026&lang=1&reg=48

 

Great films resonate through passionate voices. Share your love for cinema with #IFFI2026 and #StoriesWithoutBorders. Tag us @pibindia on Instagram and @PIB_India on X, and we will help amplify your festival moments!

For accredited journalists, critics, bloggers, and vloggers seeking 1-on-1 interviews with filmmakers and festival juries, write to us at:
iffi.mediadesk@pib.gov.in with the subject line: Take One with PIB.


Official Release ID: 2340878
•
Media Centre: Goa
•
Festival Dates: Nov 20 – 28, 2026