గోవాలో జరుగుతున్న 57వ భారత అంతర్జాతీయ చలనచిత్రోత్సవంలో ప్రదర్శితమవుతున్న రెండు భిన్నమైన సినిమాల మధ్య ఒక అందమైన సారూప్యత ఉంది. కథను మెదడుతో అర్థం చేసుకునేలోపే, మనసుతో అనుభూతి చెందేలా చేయడమే ఆ రెండింటి ప్రధాన ఉద్దేశం. మానవ భావోద్వేగాలను కథనానికి ఆయువుపట్టుగా మలిచిన ఈ చిత్రాల విశేషాలను దర్శకులు తియాగో గ్వేడెస్, సుజాన్ ఆండ్రూస్ కొరియా ఇవాళ మీడియాతో పంచుకున్నారు. తమ చిత్రాలు 'అక్వీ', 'ది హంట్రెస్ (లా కాజడోరా)' నేపథ్యాలను వారు వివరించారు.
తియాగో గ్వేడెస్ దర్శకత్వం వహించిన ‘అక్వీ’ చిత్రం... ప్రముఖ రచయిత జె.ఎం. కోయెట్జీ రాసిన 'జీసస్ ట్రయాలజీ' నవలల ఆధారంగా రూపుదిద్దుకున్న ఒక కల్పిత చీకటి ప్రపంచపు కథ. ఈ చిత్రం ఐఎఫ్ఎఫ్ఐలోని 'అంతర్జాతీయ పోటీ' విభాగంలో ప్రదర్శితమవుతోంది. ఇక మెక్సికన్-అమెరికన్ దర్శకురాలు సుజాన్ ఆండ్రూస్ కొరియా తొలి చిత్రం ‘ది హంట్రెస్ (లా కాజడోరా)’ ఒక స్పానిష్ భాషా డ్రామా థ్రిల్లర్. మెక్సికోలోని సియుడాడ్ జువారెజ్ నగరంలో మహిళలపై జరిగిన వాస్తవ హింసాత్మక ఘటనల స్ఫూర్తితో ఈ సినిమాను తెరకెక్కించారు.

‘అక్వీ’: ఎంచుకున్న బంధాలతో అల్లుకున్న కుటుంబం
ప్రతిష్టాత్మక కేన్స్ చలనచిత్రోత్సవంలో 2026 మే 18న ‘అక్వీ’ చిత్రం తొలిసారి ప్రదర్శితమైంది. గోవా వేదికగా నవంబర్ 20 నుంచి 28 వరకు జరుగుతున్న ఇఫి-2026 ‘అంతర్జాతీయ పోటీ’ విభాగంలో ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ప్రముఖ రచయిత కోయెట్జీ రాసిన 'జీసస్ ట్రయాలజీ' నవలలను ఒకే సినిమాగా మలిచి దీన్ని రూపొందించారు. గతం తాలూకు జ్ఞాపకాలేవీ లేకుండా మనుషులు కొత్త జీవితాన్ని ప్రారంభించే ఒక వింత సమాజం నేపథ్యంలో ఈ కథ సాగుతుంది. అక్కడ పాత జ్ఞాపకాలను తుడిచివేసి, అందరూ ఒకే కట్టుబాటుకు లోబడి ఉండాలని బలవంతంగా శాసించే వ్యవస్థ కనిపిస్తుంది.
ఈ కొత్త ప్రపంచంలోకి అడుగుపెట్టే ప్రయాణంలో తనకు తారసపడిన డేవిడ్ అనే చిన్నారిని సైమన్ అక్కున చేర్చుకోవడంతో కథ మొదలవుతుంది. ఆ పిల్లాడికి తల్లి ప్రేమ అవసరమని భావించిన సైమన్, ఇనెస్‌ను ఆశ్రయిస్తాడు. ఆమె దానికి అంగీకరించడంతో ఆ ముగ్గురూ కలిసి ఒక విభిన్నమైన కుటుంబంగా మారుతారు. అందరూ తమ కట్టుబాట్లకే తలొగ్గాలని శాసించే ఆ సమాజం... ఆ నియమాలకు లొంగని డేవిడ్‌ను అంత సులభంగా అంగీకరించదు. తన ఊహాశక్తి, స్వేచ్ఛా కాంక్షతో డేవిడ్ తన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని ప్రశ్నిస్తాడు. ఒక బిడ్డను పెంచడం ఎన్నో ప్రశ్నలతో కూడిన అనిశ్చిత ప్రయాణమని, దానికి సులభమైన సమాధానాలు ఉండవని సైమన్, ఇనెస్ గ్రహిస్తారు.

అసలు మనిషిగా ఉండటమంటే ఏమిటనే లోతైన అంశాన్ని ఈ సినిమా అన్వేషిస్తుందని దర్శకుడు తియాగో గ్వేడెస్ తెలిపారు. ప్రతి ఒక్కరూ ఆలోచించాల్సిన తాత్విక ప్రశ్నలను ఇది లేవనెత్తుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. కోయెట్జీ నవలలను సినిమాగా మలచడంపై మాట్లాడుతూ... ఆ పుస్తకాలు చదువుతున్నప్పుడు కథాంశం కంటే, ఆ కథ తనలో రేకెత్తించిన భావోద్వేగాలకే తాను ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చానని వివరించారు. ఈ విధానం వల్ల పుస్తకంలోని అసలు సారాంశం తాలూకు తీవ్రత వెండితెరపై ఒక అద్భుతమైన దృశ్య అనుభవంగా ఆవిష్కృతమవుతుందని ఆయన పేర్కొన్నారు.
కుటుంబం అంటే ఎప్పుడూ రక్తసంబంధాలతోనే ముడిపడి ఉండదని, మతం లేదా దేవుడి ప్రమేయం లేకుండా కేవలం లోతైన మానవీయ అనుభవాల ద్వారా మనుషులు ఎంచుకునే బంధాలతోనూ కుటుంబం ఏర్పడుతుందనే ఆలోచనను గ్వేడెస్ ఈ చిత్రంలో ఆవిష్కరించారు. స్పానిష్, పోర్చుగీసు భాషల్లో 'ఇక్కడ' అనే అర్థాన్నిచ్చే ‘అక్వీ’ టైటిల్ ఇదే భావాన్ని ప్రతిబింబిస్తుంది. కథలోని పాత్రలు తమ జీవితాలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకుంటున్న కొద్దీ, కెమెరా కోణాలూ విశాల దృశ్యాల నుంచి పాత్రల ముఖ కవళికల దాకా అన్నింటినీ స్పష్టంగా చూపిస్తూ... ప్రేక్షకులు ఆ పాత్రల అంతరంగాన్ని అర్థం చేసుకునేలా చేస్తాయి. ప్రేక్షకులు తమకు తోచిన రీతిలో కథను అర్థం చేసుకుని విశ్లేషించుకునే స్వేచ్ఛను ఇస్తూ... గ్వేడెస్ ఈ చిత్రంలో ఉద్దేశపూర్వకంగానే కొన్ని నిశ్శబ్ద క్షణాలను, సందిగ్ధతను వదిలేశారు. 'అక్వీ' చిత్రం వచ్చే జనవరిలో పోర్చుగల్, స్పెయిన్, ఫ్రాన్స్ దేశాల్లో ప్రదర్శితం కానుంది.
‘ది హంట్రెస్’: న్యాయం కోసం గళమెత్తిన గొంతుక
సుజాన్ ఆండ్రూస్ కొరియా రచించి, దర్శకత్వం వహించిన 2026 స్పానిష్ భాషా డ్రామా థ్రిల్లర్ ‘ది హంట్రెస్ (లా కాజడోరా)’. సియుడాడ్ జువారెజ్ నగరంలో లైంగిక దాడి బాధితురాలైన ఒక ఫ్యాక్టరీ కార్మికురాలిగా అడ్రియానా పాజ్ ఇందులో ప్రధాన పాత్ర పోషించారు. అన్యాయానికి ఎదురుతిరిగిన ఆమె స్వయంగా న్యాయం పొందే ప్రతీకార యోధురాలిగా ఎలా మారిందనేదే ఈ చిత్ర కథాంశం. మహిళలపై జరుగుతున్న వాస్తవ హింసాత్మక ఘటనలతో పాటు, 2013లో సంచలనం సృష్టించిన “డయానా, హంటర్ ఆఫ్ ది బస్ డ్రైవర్స్” ఉదంతం స్ఫూర్తితో ఈ సినిమాను రూపొందించారు. నేరస్థులకు శిక్షలు పడని వ్యవస్థలో, బస్సు డ్రైవర్లను కాల్చి చంపిన ఒక గుర్తుతెలియని మహిళా విజిలంటే చుట్టూ అల్లుకున్న యథార్థ ఘటనలే ఈ చిత్రానికి ఆధారం.

మెక్సికో, టెక్సాస్ సరిహద్దు ప్రాంతం నేపథ్యంలో సాగే ఈ చిత్రం... ఫ్యాక్టరీల్లో పనిచేస్తూ లైంగిక హింస, దోపిడీకి గురైన మహిళల చేదు అనుభవాలను కళ్లకు కడుతుంది. కేవలం 24 గంటల వ్యవధిలో నడిచే ఈ కథ... కథానాయిక ఎదుర్కొన్న అనుభవాలు, న్యాయం కోసం ఆమె సాగించిన అన్వేషణ చుట్టూ ఉత్కంఠభరితంగా తిరుగుతుంది.
కథానాయిక అనుభవించిన నిస్సహాయత, నిరాశలను ప్రేక్షకులు నేరుగా అనుభూతి చెందేలా చేయడమే తన ప్రధాన ఉద్దేశమని దర్శకురాలు కొరియా తెలిపారు. సహాయం కోసం చేసిన ఆర్తనాదాలకు ఎక్కడి నుంచీ స్పందన లేనప్పుడు... ఆమె ఎందుకు న్యాయం, ప్రతీకారాన్ని తన చేతుల్లోకి తీసుకోవాల్సి వచ్చిందో ప్రేక్షకులు అర్థం చేసుకుని సానుభూతి చూపేలా ఈ చిత్రాన్ని మలిచినట్లు ఆమె వివరించారు. మహిళలపై నేటికీ కొనసాగుతున్న నేరాలకు వ్యతిరేకంగా గళమెత్తుతూ, న్యాయం పరంగా మార్పు రావాలని పిలుపునిచ్చే చిత్రమిదని ఆమె పేర్కొన్నారు.
ఇతర ప్రాజెక్టులు చేస్తూనే ఈ సినిమాను రూపొందించడానికి తనకు పదేళ్ల సమయం పట్టిందని కొరియా తెలిపారు. సినిమా నిర్మాణం అంటే పట్టుదల, అంకితభావంతో పాటు ‘కథతోనే ప్రయాణించే’ దార్శనికతను కలిగి ఉండడం కీలకమన్నారు. సాంకేతిక బృందం, నటీనటులు, ప్రేక్షకులతో చక్కగా సంభాషించే మార్గాలను కనుగొనాలని ఈ సుదీర్ఘ ప్రయాణం తనకు నేర్పిందని ఆమె పేర్కొన్నారు. దర్శకుడు గ్వేడెస్ తరహాలోనే, తానూ కేవలం కథపైనే కాకుండా ప్రేక్షకులకు ఒక గాఢమైన ‘అనుభూతిని’ అందించడానికే ప్రాధాన్యమిచ్చానని ఆమె వివరించారు. వాస్తవ ఘటనల నేపథ్యం తెలియకపోతే అంతర్జాతీయ ప్రేక్షకులకు ఈ కథ కనెక్ట్ అవుతుందో లేదో అని తాను మొదట్లో ఆందోళన చెందినట్లు కొరియా తెలిపారు. భిన్న సంస్కృతులు, సరిహద్దులను దాటి ప్రపంచవ్యాప్త ప్రేక్షకులు కథానాయిక భయాన్ని, భావోద్వేగాలను తమవిగా భావించి స్పందించడం చూసి తనకు అటు బాధ, ఇటు వినమ్రత కలిగాయని ఆమె వెల్లడించారు.
ఈ చర్చా కార్యక్రమానికి శ్రీమతి శ్రియాంక ఛటర్జీ సమన్వయకర్తగా వ్యవహరించారు.
విశ్వజనీనమైన కథలు
ఒకటి జ్ఞాపకాలు లేని కల్పిత ప్రపంచం నేపథ్యంలో సాగితే... మరొకటి కఠోర వాస్తవాలతో కూడిన సరిహద్దు నగరంలో నడుస్తుంది. నేపథ్యాలు వేరైనా, ‘అక్వీ’, ‘ది హంట్రెస్’ చిత్రాల మూలాంశం ఒక్కటే. మెదడు కంటే ముందుగా మనసుతో మాట్లాడటం. ఇద్దరు దర్శకులూ కథాంశం కంటే 'అనుభూతి'కే పెద్దపీట వేశారు. ఆ భావోద్వేగం ద్వారానే మానవ సంబంధాలు, కుటుంబానికి సరైన అర్థం, వ్యక్తిగత స్వేచ్ఛ, న్యాయం కోసం జరిగే అన్వేషణ వంటి లోతైన ప్రశ్నలను సంధించారు. నిర్దిష్ట సాంస్కృతిక, సామాజిక మూలాలతో కూడిన కథలు సైతం భాషలు, సరిహద్దులకు అతీతంగా ప్రపంచవ్యాప్త ప్రేక్షకులకు ఎలా చేరువవుతాయో ఈ చిత్రాలు చాటిచెబుతున్నాయి. ఐఎఫ్ఎఫ్ఐ-2026 ఇతివృత్తమైన ‘విశ్వజనీన కథల’ స్ఫూర్తినీ ఈ సినిమాలు అక్షరాలా ప్రతిబింబిస్తున్నాయి.
ఇఫిలాయిడ్ (ఐఎఫ్ఎఫ్ఐఎవ్‌వోఐడి) సంచికను ఇక్కడ చదవండి:
https://www.pib.gov.in/iffi/57/iffiLoid.aspx?yr=2026&lang=1®=48
***