57th International Film Festival of India 2026
20 – 28 Nov 2026

సూపర్ హీరోలకు సరికొత్త నిర్వచనం... మన మూలాలతో ముడిపడిన కథలపై అయాన్ ముఖర్జీ, బేసిల్ జోసెఫ్ ఆసక్తికర చర్చ

నాడు పోస్టు చేయడమైనది: 23 NOV 2026 7:00PMby PIB Hyderabadరిలీజ్ ఐడి: 2340750Views: 10

గోవాలో జరుగుతున్న 57వ భారత అంతర్జాతీయ చలన చిత్రోత్సవం (ఐఎఫ్ఎఫ్ఐ) వేదికగా ‘ది ఎపిక్ జానర్స్ – మైథాలజీస్, సూపర్ హీరోస్, న్యూ వరల్డ్స్’ పేరుతో ఆసక్తికరమైన ముఖాముఖి కార్యక్రమం నిర్వహించారు. భారతీయ ఘన సాంస్కృతిక వారసత్వంతో ముడిపడి ఉన్న పురాణాలు, సూపర్ హీరోలు, అద్భుతమైన కల్పిత ప్రపంచాల అపార అవకాశాలపై ప్రధానంగా చర్చ జరిగింది. ప్రముఖ పాత్రికేయురాలు పూజా తల్వార్ సమన్వయకర్తగా వ్యవహరించిన ఈ సంభాషణలో దర్శకులు అయాన్ ముఖర్జీ, బేసిల్ జోసెఫ్ పాల్గొన్నారు. సూపర్ హీరోలు, పౌరాణిక కథలను వెండితెరపైకి తీసుకురావడంలో ఎదురయ్యే సృజనాత్మకత సంబంధిత సవాళ్లు, భారతీయ జానపద కథలు, ఆధ్యాత్మికతల ప్రభావం, చలనచిత్ర కథనంలో మారుతున్న సాంకేతికత పాత్ర వంటి పలు కీలక అంశాలను ఈ సందర్భంగా వారు విశ్లేషించారు.

భారత్‌లో సూపర్ హీరో సినిమాల రూపకల్పనలో ఎదురయ్యే సవాళ్ల గురించి బేసిల్ జోసెఫ్ మాట్లాడుతూ... భారతీయ సినిమాలో సంప్రదాయబద్ధంగానే కథానాయకులను సాధారణ మనుషులకు అతీతమైన, సూపర్ హీరోలకు ఉండే లక్షణాలు గల 'లార్జర్-దాన్-లైఫ్' పాత్రలుగా చూపిస్తూ వస్తున్నారని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఒక ప్రత్యేకమైన సూపర్ హీరో సినిమాటిక్ యూనివర్స్‌ను సృష్టించడం మరింత సవాలుతో కూడుకున్న పని అని ఆయన అభిప్రాయపడ్డారు. తన చిత్రం 'మిన్నల్ మురళి' అనుభవాలను గుర్తుచేసుకుంటూ... సృజనాత్మక సవాళ్లు, బడ్జెట్ పరిమితులూ కొన్నిసార్లు వినూత్నమైన కథనానికి దారితీస్తాయని వివరించారు. 'మిన్నల్ మురళి' సినిమాలో సూపర్ హీరో ముఖానికి లుంగీ కట్టుకుని, చెప్పులు వేసుకుని పరిగెత్తే సన్నివేశాలు ఆ తరహా ఆలోచనల నుంచే పుట్టుకొచ్చాయని జోసెఫ్ తెలిపారు.

సాధారణ మనుషుల్లోనే అసాధారణ శక్తులు దాగి ఉంటాయనే ఆలోచనే తనను తొలుత సూపర్ హీరో జానర్ వైపు ఆకర్షించిందని అయాన్ ముఖర్జీ వెల్లడించారు. పాశ్చాత్య ఫాంటసీ కథల నుంచి స్ఫూర్తి పొందిన చిత్రాలకు భారతీయతను ఆపాదించడంలో ఎదురయ్యే సవాళ్ల గురించి ఆయన చర్చించారు. 'హ్యారీ పోటర్' వంటి కథల పట్ల తనకున్న అభిమానం కారణంగా... 'బ్రహ్మాస్త్ర' చిత్ర ప్రారంభంలో కొన్ని పాశ్చాత్య ఛాయలు కనిపించాయని ఆయన అంగీకరించారు. రచనా దశలోనే భారతీయ ఆధ్యాత్మిక అంశాలను మేళవించడం వల్ల ఆ సినిమాకు ఒక ప్రత్యేకమైన భారతీయ గుర్తింపు లభించిందని ఆయన వివరించారు.

చలనచిత్ర నిర్మాణంలో సహజత్వం ప్రాముఖ్యతను ప్రముఖంగా ప్రస్తావిస్తూ... దర్శకులు సినిమాను కృత్రిమంగా చూపించే ప్రయత్నం చేయకుండా తమ పాత్రలకు, తమ ఆలోచనలకు నిజాయితీగా కట్టుబడి ఉండాలని బేసిల్ జోసెఫ్ సూచించారు. కథనంలో సరళత్వం, సృజనాత్మక నిజాయితీ ఎంతో అవసరమని స్పష్టం చేసిన ఆయన.. సినిమాను ఆధునికంగా, ఆకర్షణీయంగా చూపించే క్రమంలో ఎప్పటికీ తమ సొంత గుర్తింపు విషయంలో రాజీ పడకూడదని పేర్కొన్నారు.

'బ్రహ్మాస్త్ర' చిత్ర నిర్మాణ అనుభవాలను గుర్తుచేసుకుంటూ... సాంకేతికత, నిర్వహణ పరంగా అది ఎంతో సవాలుతో కూడుకున్న ప్రాజెక్ట్ అని అయాన్ ముఖర్జీ పేర్కొన్నారు. పరిమితుల మధ్య పనిచేయడం వల్ల దర్శకులు సాధారణ పద్ధతులకు భిన్నంగా ఆలోచించి, మరింత సృజనాత్మకమైన పరిష్కారాలను కనుగొనే వీలు కలుగుతుందనీ ఆయన అభిప్రాయపడ్డారు. సృజనాత్మక సవాళ్లు అడ్డంకులుగా కాకుండా, కొత్త ఆవిష్కరణలకు ఉత్ప్రేరకాలుగా మారతాయని అయాన్ ముఖర్జీ వివరించారు.

పురాణాలు, జానపద కథలతో భారత్‌కు ఉన్న లోతైన అనుబంధం గురించీ ఈ సంభాషణలో లోతుగా చర్చించారు. భారతీయ ప్రేక్షకులు చిన్నప్పటి నుంచే దైవశక్తులు, అసాధారణ సామర్థ్యాలకు సంబంధించిన కథలను వింటూ పెరిగారని బేసిల్ జోసెఫ్ పేర్కొన్నారు. పాశ్చాత్య దేశాలకు చెందిన ప్రజాదరణ పొందిన కథనాల్లో పౌరాణిక సూపర్ హీరోల ప్రస్తావన అంతగా ఉండదనీ, భారత్‌లో మాత్రం కష్టకాలంలో ప్రజలను రక్షించి ఆదుకునే దైవస్వరూపుల సుదీర్ఘ సంప్రదాయం ఉందని ఆయన వివరించారు. పురాణాలు, జానపద కథల అపారమైన భాండాగారం అందుబాటులో ఉండటంతో.. దర్శకులు కొత్త సినీ ప్రపంచాలను సృష్టించే క్రమంలో సహజంగానే తమ బాల్యంలో విన్న కథలు, అనుభవాల నుంచి స్ఫూర్తి పొందుతారని బేసిల్ జోసెఫ్ అన్నారు.

సాంకేతిక పరిజ్ఞానంలో వస్తున్న పురోగతితో విజువల్ స్టోరీటెల్లింగ్ అవకాశాలు మరింత విస్తృతం అయ్యాయనీ... దీనివల్లే భారీ కథనాలను, అద్భుతమైన కల్పిత ప్రపంచాలను వెండితెరపై సజీవంగా ఆవిష్కరించడం దర్శకులకు సాధ్యమవుతోందని అయాన్ ముఖర్జీ పేర్కొన్నారు. భారతీయ కథన సంప్రదాయంలో పురాణాలకు ఎల్లప్పుడూ సుస్థిర స్థానం ఉందని ప్రస్తావిస్తూ... ఆ పురాతన కథలను నేటి తరం ప్రేక్షకులకు సరికొత్త రీతిలో అందించడానికి సాంకేతికత ఇప్పుడు వినూత్న మార్గాలను చూపుతోందని ఆయన వివరించారు.

కృత్రిమ మేధ యుగంలో చలనచిత్ర నిర్మాణ భవిష్యత్తుపై తన అభిప్రాయాన్ని పంచుకుంటూ... ఏఐ ప్రధానంగా ఇప్పటికే ఉన్న కంటెంట్‌ను తిరిగి రూపొందిస్తుందే తప్ప, నిజంగా మౌలిక సృష్టిని చేయలేదని బేసిల్ జోసెఫ్ అభిప్రాయపడ్డారు. సాంకేతికత సృజనాత్మక అంశాలను సులభంగా అనుకరించగల ఈ రోజుల్లో... అసలైన మౌలికతకు విలువ మరింత పెరుగుతుందని ఆయన స్పష్టం చేశారు.

ఓటీటీ వేదికల వృద్ధితో భారతీయ సినిమా పరిధి విస్తరించిన అంశంపైనా వక్తలు చర్చించారు. ఒక భాషలో రూపొందిన చిత్రాలు ఇప్పుడు దేశంలోని వివిధ ప్రాంతాల్లో విశేష ఆదరణ పొందుతున్నాయనీ, ప్రేక్షకులు వాటిని తమ సొంత భాషల్లోనే చూసే వీలు కలుగుతోందని బేసిల్ జోసెఫ్ పేర్కొన్నారు. మెరుగవుతున్న ఈ సౌకర్యం... ప్రాంతీయ సినిమాలు భాషా సరిహద్దులను దాటి విస్తృత ప్రేక్షకులకు చేరువయ్యేందుకు సరికొత్త మార్గాలను అందుబాటులోకి తెచ్చిందని ఆయన అభిప్రాయపడ్డారు.

ఈ జానర్‌లో భారతీయ సినిమాల పరిణామ క్రమంపై ఈ సంభాషణ విలువైన అభిప్రాయాలను అందించింది. సాంకేతిక అవకాశాలు, సృజనాత్మక నైపుణ్యం, దేశీయ పురాణాలతో ఉన్న చిరకాల అనుబంధం ఏకమై.. అటు ఊహాత్మకంగానూ, ఇటు అచ్చమైన భారతీయతతోనూ కూడిన అద్భుత సినీ ప్రపంచాలను ఏ విధంగా సృష్టించగలవో ఈ చర్చ స్పష్టం చేసింది.

ఇఫిలాయిడ్’ (ఐఎఫ్ఎఫ్ఐఎల్‌వోఐడీ) సంచికను ఇక్కడ చదవండి:

https://www.pib.gov.in/iffi/57/iffiLoid.aspx?yr=2026&lang=1&reg=48

* * *


Great films resonate through passionate voices. Share your love for cinema with #IFFI2026 and #StoriesWithoutBorders. Tag us @pibindia on Instagram and @PIB_India on X, and we will help amplify your festival moments!

For accredited journalists, critics, bloggers, and vloggers seeking 1-on-1 interviews with filmmakers and festival juries, write to us at:
iffi.mediadesk@pib.gov.in with the subject line: Take One with PIB.


Official Release ID: 2340750
•
Media Centre: Goa
•
Festival Dates: Nov 20 – 28, 2026