57th International Film Festival of India 2026
20 – 28 Nov 2026

తల్లి ఆరాటం నుంచి చిన్నారి జీవన్మరణ పోరాటం వరకు: ఇఫీలో ప్రేక్షకుల మనసులను తాకిన ‘రహ్మా’, ‘ది ఫామ్’ సినిమాలు

మనిషి ఆధిపత్య ధోరణితో ఇతర జీవుల మనుగడకు ముప్పు: ఎలిఫ్ ఎడా

నాడు పోస్టు చేయడమైనది: 23 NOV 2026 2:21PMby PIB Hyderabadరిలీజ్ ఐడి: 2340466Views: 11

గోవా, 23 నవంబర్ 2026: మాతృత్వం, కరుణ, మానవుల బలహీనతలు, ప్రాణం విలువ వంటి అంశాలు గోవాలో జరుగుతున్న 57వ భారత అంతర్జాతీయ చలనచిత్రోత్సవం (ఐఎఫ్ఎఫ్ఐ)లో భాగంగా నిర్వహించిన విలేకరుల సమావేశంలో ప్రధానంగా చర్చకు వచ్చాయి. అంతర్జాతీయ సినిమా విభాగంలో ప్రదర్శితమైన రెండు చిత్రాలకు సంబంధించిన దర్శకులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ‘రహ్మా’, ‘ది ఫార్మ్‌’ చిత్రాలు విభిన్నమైనప్పటికీ, ఒకదానితో మరొకటి లోతైన సంబంధం కలిగిన ఇతివృత్తాలను ఆవిష్కరిస్తాయి. వ్యక్తిగత సమస్యలు, కష్టాల పరిధిని దాటి, ఇతరుల బాధలను, ఆకాంక్షలను కూడా అర్థం చేసుకోవాలని ఈ చిత్రాలు ప్రేక్షకులకు పిలుపునిస్తాయి.

 

 

ఈ విలేకరుల సమావేశంలో ‘రహ్మా’ చిత్ర రచయిత, దర్శకుడు ఫైసల్‌ సోయ్‌సాల్‌, ‘ది ఫార్మ్‌’ చిత్ర రచయిత, దర్శకురాలు ఎలిఫ్‌ ఎడా, ఆ చిత్ర ఛాయాగ్రాహకుడు ఎమ్రే పెక్‌చాకిర్‌ పాల్గొన్నారు. ఈ హృద్యమైన కథలను వెండితెరపై ఆవిష్కరించడానికి వెనుక ఉన్న సృజనాత్మక దృక్పథం, ప్రధాన ఇతివృత్తాలు, చిత్ర నిర్మాణ సమయంలో ఎదురైన అనుభవాలను దర్శకులు ఈ సందర్భంగా పంచుకున్నారు.

రహ్మా: మాతృత్వం, ఆరాటం, మానవ సంబంధాలపై హృదయాన్ని తాకే కథనం

ఫైసల్ సోయ్సల్ స్వీయ రచన, దర్శకత్వంలో తెరకెక్కిన ‘రహ్మా’ చిత్రం మాతృత్వం కోసం తపించే పురావస్తు శాస్త్రవేత్త మెర్యెమ్ భావోద్వేగ ప్రయాణాన్ని ఆవిష్కరిస్తుంది. పలు శస్త్రచికిత్సలు, ఐవీఎఫ్ ప్రయత్నాలు విఫలమై నిరాశలో కూరుకుపోయిన ఆమె భర్త ఇబ్రహీం అయిష్టతను కాదని జార్జియాలో సరోగసీ వైపు మొగ్గు చూపుతుంది. సరిగ్గా అదే సమయంలో, జీవనం కోసం ఒంటరి పోరాటం చేస్తున్న తొమ్మిదేళ్ల సిరియన్ అనాథ చిన్నారి రహ్మా తారసపడటంతో మెర్యెమ్ జీవిత గమనం మారిపోతుంది. ఆ చిన్నారి దీనస్థితిని అర్థం చేసుకున్న మెర్యెమ్‌కు, రహ్మాకు మధ్య ఏర్పడిన విడదీయరాని బంధం ఆమె వేదనకు ఊరటనిచ్చి, మనసుకు స్వాంతన కలిగిస్తుంది.

చిత్రానికి ప్రేరణ కలిగించిన అంశాల గురించి వివరిస్తూ, పిల్లలు కావాలన్న ఆకాంక్షతో దంపతులు తీవ్రంగా పోరాడుతుంటే, మరోవైపు ఎంతోమంది పిల్లలు కుటుంబ ఆదరణ లేకుండానే పెరుగుతున్నారన్న ఆలోచన నుంచి ఈ కథ పుట్టుకొచ్చిందని ఫైసల్‌ సోయ్‌సాల్‌ తెలిపారు. ‘రహ్మా’ చిత్రం ద్వారా తల్లిదండ్రుల బాధ్యతలోని భావోద్వేగ సంక్లిష్టతలను, కుటుంబం అనే పదానికి గల అసలైన అర్థాన్ని, అలాగే లోతైన మానసిక అవసరాలను మానవ సంబంధాలు ఊహించని రీతిలో ఎలా తీర్చగలవో అన్వేషించడానికి తాను ప్రయత్నించానని ఫైసల్ సోయ్సల్ వివరించారు.

 

ది ఫార్మ్‌: జీవం పవిత్రతను కాపాడేందుకు ధైర్యంగా నిలబడిన బాలిక

ఎలిఫ్‌ ఎడా రచించి దర్శకత్వం వహించిన ‘ది ఫార్మ్‌’ చిత్రం 12 ఏళ్ల ఇరెమ్‌ కథను ఆవిష్కరిస్తుంది. తల్లిదండ్రులను అకస్మాత్తుగా కోల్పోయిన ఆమె తనకు దూరంగా ఉంటున్న నాయనమ్మతో కలిసి ఒక పాడి వ్యవసాయ క్షేత్రంలో నివసించాల్సి వస్తుంది. పాల ఉత్పత్తిని పెంచేందుకు అప్పుడే పుట్టిన దూడలను వాటి తల్లుల నుంచి వేరు చేసే పద్ధతిని చూసి ఇరెమ్‌ కలత చెందుతుంది. తాను ప్రత్యక్షంగా చూస్తున్న ఈ క్రూరత్వాన్ని ఆమె ఏమాత్రం జీర్ణించుకోలేకపోతుంది. పశువైద్యుడి వద్ద శిక్షణార్థిగా పనిచేస్తున్న అనాథ బాలుడు హాలిద్‌ సహాయంతో గర్భంతో ఉన్న ఆవులను విడిపించేందుకు ఆమె ఎంతో పట్టుదలతో ప్రయత్నాన్ని ప్రారంభిస్తుంది.

చిత్రం వెనుక ఉన్న ప్రధాన తాత్విక దృక్పథం గురించి వివరిస్తూ, సమస్త జీవరాశుల పట్ల గౌరవభావం కలిగి ఉండటం, ఇతరులు అనుభవించే బాధను అర్థం చేసుకుని సానుభూతి చూపడం ఎంతో ముఖ్యమని ఎలిఫ్‌ ఎడా పేర్కొన్నారు. బాధను అనుభవించడంలోనే అసలైన ప్రమాదం లేదని, ఇతరులు పడుతున్న బాధ పట్ల నిర్లిప్తంగా మారిపోవడమే నిజమైన ప్రమాదమని ఆమె అభిప్రాయపడ్డారు. భూమిపై ప్రతి జీవి ప్రాణానికి ఉన్న విలువను ప్రస్తావిస్తూ, సమస్తాన్నీ తన ఆధీనంలో ఉంచుకోవాలన్న మనిషి తపన ఇతర జీవరాశులకు బాధ కలిగించే పరిస్థితులకు ఎలా దారితీస్తోందో ఆమె వివరించారు.

ఈ చిత్రం ద్వారా సాధారణంగా ఎవరికీ కనిపించని జంతువుల బాధలపై గళమెత్తాలని తాను కోరుకున్నట్లు దర్శకురాలు ఎలిఫ్‌ ఎడా తెలిపారు. చిత్ర పరిశ్రమలో మహిళా దర్శకురాలిగా తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకోవడంలో ఎదురైన సవాళ్ల గురించి కూడా ఆమె మాట్లాడారు. తమ సృజనాత్మక ఆకాంక్షలను నెరవేర్చుకునే క్రమంలో మహిళలు అదనపు ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తోందని ఆమె పేర్కొన్నారు.

‘ది ఫార్మ్‌’ చిత్ర నిర్మాణంలో తన అనుభవాలను పంచుకుంటూ ఛాయాగ్రాహకుడు ఎమ్రే పెక్‌చాకిర్‌ … ఆవులను చిత్రీకరించే సమయంలో ఎదురైన ప్రత్యేక సవాళ్ల గురించి వివరించారు. చిత్రీకరణ అనుభవాలను గుర్తుచేసుకుంటూ, ఆవుల ప్రవర్తనను, వాటి పరిసరాల్లోని సూక్ష్మమైన అంశాలను కెమెరాలో బంధించేందుకు తాను పొలాల్లోనే ఎక్కువ సమయం గడుపుతూ జంతువులకు దగ్గరగా ఉండేవాడినని తెలిపారు. కొన్ని సవాళ్లు ఎదురైనప్పటికీ, జంతువులతో కలిసి చిత్రీకరణ చేయడం సినిమా నిర్మాణ ప్రక్రియలో ఎంతో ఆనందాన్నిచ్చిన, కొత్త అనుభవాలను అందించిన భాగమని ఆయన పేర్కొన్నారు.

‘రహ్మా’, ‘ది ఫార్మ్‌’ చిత్రాలు రెండూ కరుణ, అనుబంధం, సానుభూతి వంటి విలువలను హృదయానికి హత్తుకునేలా ఆవిష్కరిస్తాయి. మన సొంత పరిస్థితులకే పరిమితం కాకుండా, ఇతరుల జీవితాలను, వారు ఎదుర్కొంటున్న కష్టాలను కూడా అర్థం చేసుకోవాలని ప్రేక్షకులకు గుర్తుచేస్తాయి.

ఈ కార్యక్రమానికి శ్రీమతి శిల్పా నీలకంఠ్‌ సమన్వయకర్తగా వ్యవహరించారు.

Read IFFILOID here: https://www.pib.gov.in/iffi/57/iffiLoid.aspx?yr=2026&lang=1&reg=48

***


Great films resonate through passionate voices. Share your love for cinema with #IFFI2026 and #StoriesWithoutBorders. Tag us @pibindia on Instagram and @PIB_India on X, and we will help amplify your festival moments!

For accredited journalists, critics, bloggers, and vloggers seeking 1-on-1 interviews with filmmakers and festival juries, write to us at:
iffi.mediadesk@pib.gov.in with the subject line: Take One with PIB.


Official Release ID: 2340466
•
Media Centre: Goa
•
Festival Dates: Nov 20 – 28, 2026