గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

నవంబర్ 25న ప్రారంభం కానున్న నయీ చేతన 5.0

15 మంత్రిత్వ శాఖలు/విభాగాల భాగస్వామ్యంతో ఉమ్మడి అంతర మంత్రిత్వ శాఖల అడ్వయిజరీ, హింస రహిత గ్రామాల కార్యక్రమంపై కుదిరిన నాలుగు పక్షాల అవగాహన ఒప్పందం ఆవిష్కరణ

నాడు పోస్టు చేయడమైనది: 23 NOV 2026 10:28AM by PIB Hyderabad

మహిళలపై హింస నిర్మూలన అంతర్జాతీయ దినోత్సవాన్ని పురస్కరించుకుని, గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ అమలు చేస్తున్న జాతీయ లింగ సమానత్వ ప్రచార కార్యక్రమం ‘నయీ చేతన – పహల్ బద్లావ్ కీ’ అయిదో విడత 2026 నవంబర్ 25న ప్రారంభం కానుంది. దీన్‌దయాల్ అంత్యోదయ యోజన–జాతీయ గ్రామీణ జీవనోపాధి మిషన్ (డీఏవై-ఎన్ఆర్ఎల్‌ఎం) పరిధిలో నెల రోజుల పాటు జరిగే ఈ ప్రచార కార్యక్రమం 2026 నవంబర్ 25 నుంచి డిసెంబర్ 23 వరకు దేశవ్యాప్తంగా అమలవుతుంది.

కేంద్ర మహిళా, శిశు అభివృద్ధి శాఖ మంత్రి శ్రీమతి అన్నపూర్ణ దేవి సమక్షంలో గ్రామీణాభివృద్ధి, వ్యవసాయం, రైతు సంక్షేమ శాఖ మంత్రి శ్రీ శివరాజ్ సింగ్ చౌహాన్ ఈ జాతీయ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. ఈ కార్యక్రమానికి గ్రామీణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి శ్రీ కమలేష్ పాశ్వాన్, ఈ ప్రచారంలో భాగస్వామ్యం పంచుకుంటున్న మంత్రిత్వ శాఖల ఉన్నతాధికారులు, రాష్ట్ర ప్రభుత్వాల ప్రతినిధులు, అభివృద్ధి భాగస్వాములు, దేశవ్యాప్తంగా ఉన్న సామాజిక సంస్థల మహిళా నాయకులు కూడా హాజరవుతారు.

ఈ కార్యక్రమం జరిగే ప్రదేశం భారత రత్న సీ సుబ్రమణ్యం ఆడిటోరియం, ఎన్ఏఎస్‌సీ కాంప్లెక్స్, దేవ్ ప్రకాశ్ శాస్త్రి మార్గ్, పూసా, న్యూఢిల్లీ–110012. మధ్యాహ్నం రెండు గంటలకు ప్రారంభమవుతుంది.

నయీ చేతన 5.0 ఇతివృత్తం – ‘‘అవకాశం నుంచి స్వీయ నిర్ణయాధికారం వరకు: వికసిత భారత్ కోసం జీవనోపాధి, సమాన అవకాశాల ద్వారా మహిళా సాధికారత’’. ఇది ఆర్థిక సాధికారత, జీవనోపాధిలో భాగస్వామ్యం, స్వతంత్ర నిర్ణయాలు తీసుకోవడంలో అవకాశాలు, రవాణా సౌకర్యాలు మహిళలకు అందుబాటులో ఉండాల్సిన అవసరాన్ని తెలియజేస్తుంది.

పరస్పరం అనుసంధానమై ఉన్న నాలుగు రంగాలపై సారించిన దృష్టి

నయీ చేతన 5.0 విధానంలో ప్రధానాంశంగా మహిళల ఆర్థిక సాధికారత ఉంది. ఈ విధానం పరస్పరం అనుసంధానమై ఉన్న నాలుగు రంగాలపై దృష్టి సారిస్తుంది. అవి... మహిళలను ఆర్థిక భాగస్వాములుగా గుర్తించడం, ఆస్తులపై మహిళల హక్కులు – వాటిపై వారికున్న నియంత్రణను బలోపేతం చేయడం, సురక్షితమైన రవాణా సౌకర్యాలను ప్రోత్సహించడం, వేతనం లేని సంరక్షణ పనిని పునఃపంపిణీ చేయడం. జీవనోపాధి అవకాశాలను, మార్కెట్లను, ఆర్థిక సేవలను, బహిరంగ ప్రదేశాలను, అత్యవసరమైన సేవలను పొందడంతో పాటు స్వేచ్ఛగా, సురక్షితంగా, స్వతంత్రంగా ప్రయాణించడంలో మహిళలకు ఎదురవుతున్న అవరోధాలను పరిష్కరించడంపై ప్రత్యేక దృష్టి సారిస్తుంది.  అవగాహనను కల్పించడంతో పాటుగా మహిళల ఆర్థిక భాగస్వామ్యం, ఏజెన్సీ, నిర్ణయాధికారంలో సమన్వయ చర్యలు చేపట్టి, కొలవదగిన మెరుగుదలలు సాధించడమే ఈ ప్రచారం లక్ష్యం.

కార్యక్రమంలో ప్రధానాంశాలు

15 మంత్రిత్వశాఖలు/విభాగాలతో కూడిన సంయుక్త అంతర మంత్రిత్వశాఖల అడ్వయిజరీ

15 మంత్రిత్వ శాఖలు/విభాగాలు భాగస్వామ్యం పంచుకొనే సంయుక్త అంతర-మంత్రిత్వ శాఖల అడ్వయిజరీని విడుదల చేయడం ఈ జాతీయ ప్రచారం ప్రారంభ కార్యక్రమంలో ప్రధానమైనది. సమన్వయ చర్య, ఏకీకరణ ద్వారా నయీ చేతన 5.0 లక్ష్యాలను ముందుకు తీసుకెళ్లాలనే ఉమ్మడి నిబద్ధతను ఈ అడ్వయిజరీ ప్రతిబింబిస్తుంది. ఈ ప్రచారం లక్ష్యాలతో తమ పథకాలను, కార్యక్రమానలను, సంస్థాగత యంత్రాంగాలను, క్షేత్రస్థాయి వ్యవస్థలను సమన్వయం చేసుకొనేందుకు అవసరమైన విధివిధానాలు మంత్రిత్వశాఖలు, విభాగాలకు ఈ అడ్వయిజరీ అందిస్తుంది. అలాగే జాతీయ, రాష్ట్ర, జిల్లా, కమ్యూనిటీ స్థాయుల్లో సమన్వయ చర్యలను బలోపేతం చేయడానికి ప్రయత్నిస్తుంది. ముఖ్యంగా మహిళలకు జీవనోపాధి, ఆస్తులు, ఆర్థిక సేవలు, సురక్షిత రవాణా, అవసరమైన  సేవలు, సంస్థాగత సహకారాన్ని మరింత అందుబాటులోకి తీసుకురావడానికి కృషి చేస్తుంది.

హింస రహిత గ్రామ కార్యక్రమంపై చతుర్ముఖ అవగాహన ఒప్పందం

ఈ కార్యక్రమంలో, గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ, మహిళా, శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ, న్యాయ శాఖ, జాతీయ న్యాయ సేవల అథారిటీ (ఎన్ఏఎల్ఎస్ఏ)ల మధ్య హింసారహిత గ్రామ కార్యక్రమంపై కుదిరిన నాలుగు పక్షాల అవగాహన ఒప్పందాన్ని కూడా విడుదల చేస్తారు. సమాజంలో లింగ ఆధారిత హింసను నివారించే, స్పందించే సమన్వయ సంస్థాగత చర్యలకు అవసరమైన విధివిధానాలను ఈ ఎంవోయూ అందిస్తుంది.  చట్టపరమైన హక్కులపై అవగాహన, న్యాయం పొందే అవకాశం, సంస్థాగత మద్దతు, హింస లేని గ్రామాలను నిర్మించే దిశగా సామూహిక చర్యలతో సహా, సామాజిక సంస్థలు, న్యాయ సేవల అధికారులు, సంబంధిత ప్రభుత్వ యంత్రాంగాల మధ్య సమన్వయాన్ని బలోపేతం చేయడమే దీని ఉద్దేశం.

సామాజిక సంస్థలను, మహిళా నాయకత్వాన్ని బలోపేతం చేయడం

స్వయం సహాయక బృందాలు (ఎస్‌హెచ్‌జీలు), గ్రామ సంస్థలు (వీవోలు), క్లస్టర్ స్థాయి సమాఖ్యలు (సీఎల్ఎఫ్‌లు), జెండర్ రిసోర్స్ సెంటర్లు (జీఆర్‌సీలు), ఇతర సామాజిక సంస్థలతో కూడిన డీఏవై–ఎన్ఆర్ఎల్ఎం విస్తృత వ్యవస్థ... నయీ చేతన 5.0 అమల్లో కీలక పాత్ర పోషిస్తుంది. ఈ ప్రారంభోత్సవంలో సేవలు, హక్కులు, సహాయక వ్యవస్థలు, ఫిర్యాదుల పరిష్కార యంత్రాంగాలను సులభంగా పొందేందుకు వీలుగా కమ్యూనిటీ స్థాయి వేదికలుగా నూతన జెండర్ రీసోర్స్ కేంద్రాలను కూడా ప్రారంభిస్తారు. మహిళల సమష్టి చర్యలను, నాయక్కత్వాన్ని బలోపేతం చేయడంపై తమ అనుభవాలను, ఆవిష్కరణలను వివిధ రాష్ట్రాలకు చెందిన ఎస్‌హెచ్‌జీ మహిళా నాయకులు పంచుకుంటారు.

ఈ కార్యక్రమంలో భాగంగా రెండు ప్యానెల్ చర్చలను నిర్వహిస్తారు. ‘‘జెండర్ రీసోర్స్ సెంటర్లు (జీఆర్‌సీలు), వన్ స్టాప్ సెంటర్లు (ఓఎస్‌సీలు), లీగల్ సర్వీసెస్ అథారిటీ (ఎల్ఎస్ఏ), ఆరోగ్య వ్యవస్థ ద్వారా మంత్రిత్వ శాఖల సమన్వయాన్ని ముందుకు తీసుకెళ్లడం’’ అనే అంశంపై మొదటి ప్యానెల్ చర్చ జరుగుతుంది. దీనిలో సంబంధిత మంత్రిత్వ శాఖలు, సంస్థల ప్రతినిధులు పాల్గొంటారు. దీనిలో మహిళల సమస్యలపై సమన్వయాన్ని, ఉమ్మడి కార్యాచరణను బలోపేతం చేయడంపై చర్చిస్తారు. ‘‘క్షేత్రస్థాయి మహిళా నాయకులు: అనుభవాలు, ఆవిష్కరణలు, ముందున్న మార్గం’’ అనే అంశంపై రెండో ప్యానెల్ చర్చ నిర్వహిస్తారు. ఇది తమ అనుభవాలను, సిఫారసులను పంచుకొనే వేదికను క్షేత్రస్థాయి మహిళా నాయకులకు అందిస్తుంది.

నయీ చేతన 4.0 మదింపు నివేదిక

జాతీయ ప్రారంభోత్సవం సందర్భంగా నయీ చేతన 4.0 మదింపు నివేదికను విడుదల చేయనున్నారు.  మునుపటి విడతలో ఈ కార్యక్రమ పనితీరు మదింపును, అందులో నేర్చుకున్న ముఖ్యమైన అంశాలను ఈ నివేదిక వివరిస్తుంది. భవిష్యత్ ప్రచార కార్యక్రమాలను మరింత సమర్థవంతంగా రూపొందించడానికి, బలోపేతం చేయడానికి ఈ అంశాలు ఉపయోగపడతాయి.

ఈ కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర స్థాయి వీడియోల ప్రదర్శన, ఉత్తమ విధానాలపై ప్రజెంటేషన్లు కూడా ఉంటాయి. లింగ సమానత్వం దిశగా సామాజిక భాగస్వామ్యంతో చేపడుతున్న కార్యక్రమాలు, అనుసరిస్తున్న విధానాలను ఇవి తెలియజేస్తాయి. ప్రచారం కోసం ప్రత్యేకంగా రూపొందించిన వీడియోలను కూడా ఈ సందర్భంగా విడుదల చేస్తారు.

నయీ చేతన కార్యక్రమాన్ని గ్రామీణాభివృద్ధి మంత్రిత్వశాఖ పరిధిలోని డీఏవై–ఎన్ఆర్ఎల్ఎం 2022లో ప్రారంభించింది. ఈ కార్యక్రమం మొదలైన నాటి నుంచి లింగ ఆధారిత హింస (జీబీవీ)ను పరిష్కరించే, వివక్షాపూరితమైన సామాజిక కట్టుబాట్లను సవాలు చేసే, లింగ సమానత్వాన్ని ప్రోత్సహించే జాతీయ స్థాయి సామాజిక ఉద్యమంగా రూపుదిద్దుకుంది. నయీ చేతన 5.0 ద్వారా మంత్రిత్వశాఖలు, రాష్ట్ర ప్రభుత్వాలు, సామాజిక సంస్థలు, ఇతర భాగస్వాముల మధ్య సమన్వయ కార్యాచరణను బలోపేతం చేయడమే మంత్రిత్వశాఖ లక్ష్యం. దీని ద్వారా మహిళల ఆర్థిక భాగస్వామ్యం, భద్రత, స్వీయ నిర్ణయాధికారానికి అనుకూల వాతావరణాన్ని కల్పించేందుకు మంత్రిత్వ శాఖ కృషి చేస్తోంది. వివక్షాపూరిత సామాజిక కట్టుబాట్లను తొలగించి, సమానత్వాన్ని, ఉమ్మడి బాధ్యతను ప్రోత్సహించడంలో పురుషులు, బాలురు, యువత క్రియాశీలకంగా పాల్గొనేలా కూడా ఈ ప్రచార కార్యక్రమం ప్రోత్సహిస్తుంది. 

***


(రిలీజ్ ఐడి: 2340437) సందర్శకుల సూచీ సంఖ్య : : 7
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: Nepali , Gujarati , Assamese , English , Urdu , हिन्दी , Marathi , Tamil , Kannada