డాక్యుమెంటరీ చిత్ర నిర్మాణం... కేవలం వాస్తవాలను చిత్రీకరించడం మాత్రమే కాదు.. ప్రజల నమ్మకాన్ని గెలుచుకోవడం, వారి జీవితానుభవాలను అర్థం చేసుకోవడం, వారి జీవితాలను తెరపై ఎలా చూపిస్తున్నామనే విషయంలో బాధ్యత వహించడం కూడా ఇందులో భాగమే. ఒకవైపు వినిపించని గొంతులను, కఠిన వాస్తవాలను డాక్యుమెంటరీ సినిమా ప్రేక్షకులకు దగ్గర చేస్తుండగా, మరోవైపు నిజ జీవితాలను చిత్రీకరించేటప్పుడు కళాత్మక స్వేచ్ఛ, గోప్యత, నైతిక బాధ్యత వంటి ముఖ్యమైన ప్రశ్నలు కూడా తలెత్తుతాయి.
57వ భారత అంతర్జాతీయ చలనచిత్రోత్సవం (ఇఫి) సందర్భంగా పనాజీలోని కళా అకాడమీలో ‘ఫ్రమ్ విట్‌నెస్ టు చేంజ్: ది సోషల్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ డాక్యుమెంటరీ సినిమా’ (సాక్షి నుంచి మార్పు వరకు: డాక్యుమెంటరీ సినిమా సామాజిక బాధ్యత) అనే అంశంపై నిర్వహించిన ప్రత్యేక ముఖాముఖి చర్చలో ఈ ప్రశ్నలే ప్రధానంగా ప్రస్తావనకు వచ్చాయి. ప్రముఖ ఫ్రెంచ్ చిత్ర దర్శకురాలు, కథా రచయిత జూలీ బెర్టుసెల్లి ఈ కార్యక్రమంలో జాతీయ అవార్డు గ్రహీత, భారతీయ చిత్రనిర్మాత హవోబమ్ పబన్ కుమార్‌తో సంభాషించారు.
డాక్యుమెంటరీ చిత్ర నిర్మాణాన్ని ఒక అత్యంత ఆత్మీయమైన ప్రక్రియగా బెర్టుసెల్లి అభివర్ణించారు. సినిమాలు వాటిలోని పాత్రల జీవితాలపై లోతైన ప్రభావాన్ని చూపుతాయని, కొన్ని సందర్భాల్లో వారిని ప్రమాదంలోకి కూడా నెట్టవచ్చని పేర్కొన్నారు. ప్రజల నమ్మకాన్ని పెంచుకోవడం, ఆయా వర్గాలతో సమయం గడపడం, కెమెరా సమక్షంలో వారు సౌకర్యవంతంగా ఉండేలా చేయడం చాలా ముఖ్యమని ఆమె చెప్పారు. ప్రజలను వారి రోజువారీ పరిసరాల్లో గమనించడం ద్వారా తమను తాము ఎలా చూసుకుంటారు, సమాజం తమని ఎలా చూడాలని కోరుకుంటారనే విషయాలను చిత్రనిర్మాతలు అర్థం చేసుకోవడానికి వీలవుతుందని ఆమె అభిప్రాయపడ్డారు.
సామాజిక మార్పును ప్రభావితం చేసే సినిమా సామర్థ్యంపై స్పందిస్తూ.. సినిమాలు రాత్రికి రాత్రే సమాజాన్ని మార్చలేకపోవచ్చు కానీ, వ్యక్తుల ఆలోచనా దృక్పథాలను తీర్చిదిద్ది మార్పును ప్రోత్సహించగలవని బెర్టుసెల్లి అన్నారు. “కొంతమంది ఆలోచనల్లో నేను ఒక చిన్న ఆలోచనా బీజాన్ని నాటగలిగితే, అదే ఎంతో గొప్ప విషయం” అని ఆమె వ్యాఖ్యానించారు. ఆశను రేకెత్తించే, సానుకూల ఉదాహరణలను చూపించే చిత్రాలనే తాను ఇష్టపడతానని, అవి మార్పు సాధ్యమేనని ప్రజలు నమ్మేలా స్ఫూర్తినిస్తాయని ఆమె తెలిపారు.
తన సృజనాత్మక ప్రక్రియ గురించి వివరిస్తూ.. ఆసక్తిని రేకెత్తించే ఊహించని పరిచయాలు, ప్రదేశాలు లేదా అంశాల నుంచే తరచుగా డాక్యుమెంటరీ ఆలోచనలు పుట్టుకొస్తాయని బెర్టుసెల్లి వివరించారు. తన చిత్రాలైన స్కూల్ ఆఫ్ బాబెల్, సిన్స్ ఓతార్ లెఫ్ట్‌లను ప్రస్తావిస్తూ.. నిజ జీవిత అనుభవాలే తన సినిమాలకు తరచుగా కేంద్ర బిందువుగా నిలుస్తాయని ఆమె పేర్కొన్నారు. నిధుల సేకరణ కోసం స్క్రిప్ట్‌లు, ప్రతిపాదనలు అవసరమైనప్పటికీ, అసలు చిత్రనిర్మాణ ప్రక్రియ మాత్రం నిజ జీవితంలోని ఊహించని మలుపులకు అనుగుణంగా సాగుతుందని ఆమె స్పష్టం చేశారు.
తన సినీ ప్రయాణాన్ని గుర్తుచేసుకుంటూ.. క్రిజ్‌టోఫ్ కీస్లోవ్‌స్కీ, రిథీ పాన్, బెర్ట్రాండ్ టావెర్నియర్ వంటి ప్రముఖ దర్శకుల వద్ద దాదాపు 15 ఏళ్ల పాటు సహాయ దర్శకురాలిగా పనిచేసినట్లు బెర్టుసెల్లి తెలిపారు. ఈ క్రమంలో రష్యా, జార్జియా, కంబోడియా వంటి దేశాల్లో పనిచేసే అవకాశం లభించిందని, అక్కడి విభిన్న సంస్కృతులు, సినిమా నిర్మాణ పద్ధతుల గురించి ఎన్నో అనుభవాలు పొందానని చెప్పారు.
తన గ్రామంలో అంటరానితనం, పితృస్వామ్యం వంటి సున్నితమైన సామాజిక అంశాలపై డాక్యుమెంటరీ తీయాలనుకుంటున్న యువ దర్శకుడు అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ.. ప్రజల నమ్మకాన్ని పొందడం, వారితో నిరంతరం సంబంధాలు కొనసాగించడం చాలా ముఖ్యమని బెర్టుసెల్లి చెప్పారు. డాక్యుమెంటరీ తీసే సమాజంపై దర్శకులకు నిజమైన ఆసక్తి ఉండాలని, తాము ఎందుకు ఈ చిత్రాన్ని తీస్తున్నారో అక్కడి ప్రజలకు స్పష్టంగా వివరించాలని సూచించారు.
డాక్యుమెంటరీ చలనచిత్ర నిర్మాణంపై అంతర్జాతీయ దృక్పథాన్ని వివరిస్తూ.. ఈ విభాగానికి ఫ్రాన్స్ అందిస్తున్న సంస్థాగత మద్దతును, ముఖ్యంగా సినిమా టికెట్ల ద్వారా వచ్చే ఆదాయంలో కొంత భాగాన్ని చిత్ర నిర్మాణానికి కేటాయించడం, థియేటర్లలో సినిమాలు ప్రదర్శించే కాలానికి ప్రత్యేక నిబంధనలు ఉండటం వంటి అంశాలను ప్రస్తావించారు. రాబోయే సంవత్సరాల్లో పారిస్‌లో భారతీయ డాక్యుమెంటరీ చిత్రాల ప్రత్యేక ప్రదర్శన ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయని తెలిపారు. భారత్‌కు గొప్ప డాక్యుమెంటరీ చిత్ర నిర్మాణ సంప్రదాయం ఉందని కొనియాడారు.
కృత్రిమ మేధ వినియోగం పెరుగుతుండటంపై బెర్టుసెల్లి ఆందోళన వ్యక్తం చేశారు. సృజనాత్మకత, కాపీరైట్ హక్కులు, పర్యావరణంపై కృత్రిమ ప్రభావం గురించి ఆమె ప్రస్తావించారు. ముఖ్యంగా నీరు, విద్యుత్ వినియోగం పెరగడం వంటి సమస్యలను వివరించారు. ఏఐపై అతిగా ఆధారపడితే మానవ జ్ఞాపకశక్తి, స్వతంత్ర ఆలోచన, సహజమైన సృజనాత్మకత దెబ్బతినే ప్రమాదం ఉందని హెచ్చరించారు.
డాక్యుమెంటరీ సినిమాల ప్రత్యేకతను వివరిస్తూ.. కృత్రిమ మేధ అనుకరించలేని వాస్తవ మానవ సంబంధాలలోని సహజ భావోద్వేగాలు, నిశ్శబ్దాలు, హావభావాలు, లోపాలను అది ఒడిసిపడుతుందని ఆమె అన్నారు.
నమ్మకం, నైతిక బాధ్యత, మానవ సంబంధాల అవగాహనతో కూడిన ప్రక్రియే డాక్యుమెంటరీ చిత్ర నిర్మాణమని ఈ సమావేశం ద్వారా స్పష్టమైంది. సమాజం దృష్టికి రాని వాస్తవాలను ప్రజల ముందుకు తీసుకురావడంలో, అర్థవంతమైన మార్పును ప్రోత్సహించడంలో సినిమాలకు ఉన్న ప్రాధాన్యాన్ని కూడా ఈ కార్యక్రమం చాటిచెప్పింది.
ఇఫిలోయిడ్‌ను ఇక్కడ చదవండి: https://www.pib.gov.in/iffi/57/iffiLoid.aspx?yr=2026&lang=1®=48
***