తొలి సూర్యకిరణం మెరిసిన క్షణానికి, తెరపై తొలి దృశ్యం ఆవిష్కృతమైన ఘడియకూ మధ్య ఎక్కడో ఒక చోట యావత్ ప్రపంచం మమేకం కాగల కారణం ద్యోతకమవుతుంది. అలాంటి విశ్వవేదికగా గోవా నేడు ముస్తాబైంది. అరేబియా సముద్రపు అలల తళతళలు నేపథ్యంగా ప్రముఖ దర్శకులు, వెండితెర వేలుపులు, సినీ ప్రేమికులు ఇక్కడ కొలువుదీరారు. విభిన్న సంస్కృతుల సంగమానికి, ఊహాశక్తి రెక్కలు విప్పార్చుకునే అద్భుత సన్నివేశానికి ఇది వేదికైంది.
గోవాలోని డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీ స్టేడియంలో కనులు మిరుమిట్లు గొలిపే ప్రారంభోత్సవంతో భారత 57వ అంతర్జాతీయ చలనచిత్రోత్సవం (ఇఫీ) విశ్వకథా వీధిలోకి ఆహ్వానం పలికింది. మొత్తం 86 దేశాల నుంచి 150కి పైగా చిత్రాలతో చలనచిత్ర మాధ్యమ అపార సమ్మోహన శక్తి సందడి చేస్తోంది. ‘విశ్వజనీన కథలు’ ఇతివృత్తంగా ఎగసిన ఉత్సవ స్ఫూర్తి ఇక్కడ భౌగోళిక సరిహద్దులను చెరిపేసి, సాంస్కృతిక విభేదాలను పటాపంచలు చేస్తుంది. భిన్న స్వరాలను ఒకే గళంలో పలికిస్తూ సమష్టి అనుభూతిగా మలచగల సినీ మాధ్యమ అసాధారణ సామర్థ్యం విశ్వవ్యాప్తమవుతోంది.
ఈ సందర్భంగా గోవా ముఖ్యమంత్రి శ్రీ ప్రమోద్ సావంత్ సభికులనుద్దేశించి మాట్లాడుతూ- గోవా సాంస్కృతిక కేలండర్‌లో 22 ఏళ్ల నుంచీ ఇఫీ అంతర్భాగంగా విరాజిల్లుతున్నదని చెప్పారు. సరిహద్దులను అధిగమించి సంస్కృతులను ఏకం చేయగల చలనచిత్ర మాధ్యమం అపార శక్తిని ఈ వేడుక చాటుతున్నదని పేర్కొన్నారు. ఈ ఉత్సవాల ఇతివృత్తాన్ని భారత ప్రాచీన తాత్త్విక ప్రబోధం ‘వసుధైవ కుటుంబకం’తో ముడిపెడుతూ- “భిన్న సంస్కృతుల సమ్మేళన అనుభూతిని పంచడానికి మనందరినీ ఇలాంటి సమష్టి వేదికపై ఏకం చేయగల అవకాశం సినిమా మనకు కల్పిస్తుంది” అన్నారు.
ఇక బ్రిక్స్ సినిమా విభాగంలో ‘రామాయణ్’కు చోటు దక్కడం భారత్‌కే గర్వకారణమని అభివర్ణించారు. భారతీయ సినిమా… ప్రత్యేకించి మరాఠీ, కొంకణి, గోవా చిత్రాల వైభవ ప్రదర్శనలో ఇఫీ పోషిస్తున్న పాత్రను ఆయన ప్రముఖంగా ప్రస్తావించారు. గోవా యువత మరింతగా సినిమా రంగంలోకి అడుగుపెట్టేందుకు ఈ గుర్తింపు ప్రేరణగా నిలిచి వారి కథలను జాతీయ-అంతర్జాతీయ ప్రేక్షకులకు చేరువ చేయగలదని ఆయన ఆశాభావం వెలిబుచ్చారు.
గోవాను ఓ సమగ్ర చలనచిత్ర నిర్మాణ కూడలిగా మలచాలన్న సంకల్పాన్ని వివరిస్తూ- “సినిమాల చిత్రీకరణ ఆద్యంతం ఇక్కడే పూర్తికాగల సానుకూల గమ్యంగా గోవా ఎదగాలన్నది మా ఆకాంక్ష” అని డాక్టర్ సావంత్ ప్రకటించారు. రాష్ట్ర చలనచిత్ర వ్యవస్థ బలోపేతం దిశగా ‘గోవా ఫిల్మ్ షూటింగ్ చట్టం-2021’ సహా ఆన్‌లైన్ ఏకగవాక్ష అనుమతుల విధానం అమలు చేస్తున్నామని ఆయన గుర్తుచేశారు. అలాగే, చిత్రనిర్మాతలకు ఆర్థిక సహాయ పథకాలు కూడా తాము చేపట్టిన కీలక చర్యలలో భాగంగా ఉన్నాయన్నారు. చిత్రీకరణ పూర్వ, నిర్మాణానంతర, ‘వీఎఫ్‌ఎక్స్’ సదుపాయాలతోపాటు చలనచిత్ర విద్యా సౌకర్యాల సహితంగా ‘ఫిల్మ్ సిటీ’ నిర్మాణం దిశగా తాము ప్రణాళిక రచిస్తున్నామని ఆయన వెల్లడించారు.
యానిమేషన్, కృత్రిమ మేధ, వర్చువల్ ప్రొడక్షన్ రంగాల్లో సాంకేతిక పురోగమనం వల్ల అందివస్తున్న కొత్త అవకాశాలను ఆయన ప్రస్తావించారు. శరవేగంగా పురోగమించే ప్రపంచ చలనచిత్ర పరిశ్రమలో కీలక భాగమయ్యేలా యువ సృజనాత్మక ప్రతిభను తీర్చిదిద్దాలని గోవా లక్ష్యనిర్దేశం చేసుకున్నదని ప్రకటించారు.
ప్రముఖ నటుడు, పార్లమెంటు సభ్యుడు రవికిషన్ తన ప్రసంగంలో ఇఫీ ఇతివృత్తం ‘విశ్వజనీన కథల’ను ప్రస్తావించారు. దేశంలోని వివిధ ప్రాంతాలు, భాషలలో దాదాపు 700 చిత్రాలలో నటించిన తన అనుభవం దృష్ట్యా ఈ ఇతివృత్తం తననెంతో ఆకట్టుకున్నదని ఆయన చెప్పారు. భాష లేదా భౌగోళిక ప్రాదేశికతతో నిమిత్తం లేకుండా సినిమాలోని వాస్తవికత, భావోద్వేగం, ఆకట్టుకునే కథ వంటి కీలకాంశాలతోనే ప్రేక్షకులు మమేకమవుతారని ఆయన వ్యాఖ్యానించారు.
“ప్రపంచంలో ఎక్కడో ఓ మూల పుట్టిన కథ వేల మైళ్ల దూరాన ముడిపడ గలదు. అదే సినీ మాయాజాలం” అన్నారు. సరిహద్దులకు అతీతంగా సార్వజనీన మానవ అనుభవాలను కలబోయగల దాని శక్తి అపారమని ఆయన అభివర్ణించారు. చలనచిత్ర నిర్మాణంలో భారత్ ప్రపంచంలోనే అగ్రస్థానంలో నిలుస్తుందని రవికిషన్ గుర్తుచేశారు. ఈ దేశపు చైతన్యపూరిత పరిశ్రమ బలోపేతంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ సమర్థ నాయకత్వం ప్రశంసార్హమని పేర్కొన్నారు.
కేంద్ర సమాచార-ప్రసార మంత్రిత్వశాఖ కార్యదర్శి శ్రీ చంచల్ కుమార్ మాట్లాడుతూ- భౌగోళిక హద్దులను దాటి భిన్న సంస్కృతులు, దృక్కోణాలను ఏకం చేయగల శక్తి సినిమాకు ఉందని చెప్పారు. ఇఫీ కేవలం చలనచిత్రోత్సవం మాత్రమే కాదంటూ- “సంస్కృతులు, ఆలోచనలు, జ్ఞాపకాలు, మానవీయ అనుభవాల సంగమ క్షేత్రమిది” అని అభివర్ణించారు.
అలాగే, “ఆ నో భద్రాః క్రతవో యంతు విశ్వతః” (అన్ని దిక్కుల నుంచీ మాకు మంగళకర, శుభస్కర ఆలోచనలు రావాలి) అనే ఋగ్వేద భావనను ఆయన ఉటంకించారు. దీని ప్రకారం ప్రపంచానికి తలుపులు తెరవడం ద్వారా భారత అస్తిత్వం మరింత సుసంపన్నం కాగలదని స్పష్టం చేశారు. భారత సాంస్కృతిక శక్తిని అత్యంత ప్రభావవంతంగా వ్యక్తీకరించగల మాధ్యమాలలో సినిమా ఒకటని పేర్కొన్నారు. రష్యా, స్పెయిన్ చిత్రాలు సహా బ్రిక్స్ దేశాల నుంచి 21 చిత్రాల ద్వారా ఇఫీ-2026లో ఈ సాంస్కృతిక ఆదానప్రదాన స్ఫూర్తి ప్రతిబింబిస్తున్నదని చెప్పారు.
ఈ ఏడాది చిత్రోత్సవ ఇతివృత్తం ‘విశ్వజనీన కథలు’ గురించి మాట్లాడుతూ- “ప్రపంచంలోని ఒక ప్రాంతంలో పుట్టిన కథ.. భావోద్వేగం, ఊహాశక్తి, మానవ అనుభవం ఆలంబనగా మరొక ప్రాంతంలోనూ తన ఉనికిని చాటగలదు” అన్నారు. ఈ ఏడాది వేడుకలలో 52 మంది మహిళా దర్శకులు సహా 62 మంది తొలిసారి దర్శకుల చిత్రాలు ప్రదర్శితమవుతాయని పేర్కొన్నారు. తద్వారా కొత్త గళాలకు, సార్వజనీన కథనాలకు ప్రాధాన్యంలో ఇఫీ నిబద్ధత ప్రస్ఫుటమవుతుందని ఆయన చెప్పారు.
అనంతరం చిత్రోత్సవ డైరెక్టర్ అశుతోష్ గోవారికర్ ప్రసంగిస్తూ- సాంకేతికంగా ప్రపంచమంతా అత్యంత చేరువైనప్పటికీ... సాంస్కృతికంగా మనుషులు ఒంటరిగా మిగిలే వైరుధ్యం నేడు కనిపిస్తోందని ఆయన విశ్లేషించారు. అయితే, దీనికి అతీతంగా మానవాళిని ఏకీకృతం చేయగల శక్తి సినిమాకు ఉన్నదని ఆయన స్పష్టం చేశారు. ‘విశ్వజనీన కథలు’ ఇతివృత్తం వెనుక గల తాత్త్వికతను వివరిస్తూ- ప్రస్తుత విభజన రేఖలు మనం గీసుకున్నవేనని గుర్తుచేశారు. “ఈ భౌగోళిక హద్దులు మనం పటాలపై గీసుకున్న గీతలు మాత్రమే కాదు… మన చుట్టూ మనం అల్లుకున్న అలవాట్లు, కట్టుబాట్లు కూడా” అని వ్యాఖ్యానించారు.
ఈ అడ్డుగోడలను సినిమా కూలదోసే తీరును వివరిస్తూ- “అపరిచిత భాషలోని సినిమా పాత్రలతో ప్రేక్షకులు తాదాత్మ్యం చెందితే వారి మధ్య సరిహద్దులు గీసిన దూరం తక్షణం అదృశ్యమవుతుంది. అంటే- పాస్‌పోర్ట్ లేకుండా ఏ హద్దునైనా అధిగమించగల కొన్ని అరుదైన అంశాలలో కథ కూడా ఒకటన్న మాట!” అని గోవారికర్ విశదీకరించారు. ఈ దృక్పథానికి జీవం పోస్తూ ఇఫీ ప్రస్తుత వేడుకలలో 9 వరల్డ్, 2 ఇంటర్నేషనల్, 24 ఏషియన్, 116 ఇండియన్ ప్రీమియర్ల సహిత విస్తృత జాబితాలోని సినిమాలను ప్రదర్శిస్తున్నట్లు తెలిపారు. దేశాలు, సినీ శకాలు, వర్ధమాన గళాలు- ఈ ఉత్సాహభరిత ఆతిథ్య నగరం హద్దులను అధిగమించడంలో ఈ వేడుక సార్వత్రిక ఆహ్వానంగా నిలుస్తుందన్నారు.
నేటి ప్రారంభోత్సవ వేడుకకు రాజ్యసభ సభ్యుడు శ్రీ సదానంద్ మహాలు షెట్ తనవడే, సియోలిమ్ ఎమ్మెల్యే -గోవా ఎంటర్‌టైన్‌మెంట్ సొసైటీ ఉపాధ్యక్షురాలు శ్రీమతి డెలిలా లోబో, గోవా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ వి.కందవేలు, జాతీయ చలనచిత్ర అభివృద్ధి సంస్థ (ఎన్‌ఎఫ్‌డీసీ) చైర్మన్ శ్రీ జి.కృష్ణకుమార్, ప్రసార భారతి ఛైర్మన్ శ్రీ ప్రసూన్ జోషి, ఎన్‌ఎఫ్‌డీసీ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ ధీరజ్ సింగ్, గోవా ఎంటర్‌టైన్‌మెంట్ సొసైటీ సీఈఓ శ్రీ దీపక్ బందేకర్ తదితర ప్రముఖులు హాజరయ్యారు.
కార్తీక్ ఆర్యన్, సాయి పల్లవి సహా పలువురు సినీ ప్రముఖులతో కూడిన తారాతోరణం కార్యక్రమ శోభకు అదనపు సొబగులు అద్దింది. ప్రారంభోత్సవంలో భాగంగా అంతర్జాతీయ పోటీ విభాగం జ్యూరీ ఛైర్మన్ ఆనంద్ ఎల్.రాయ్‌తో పాటు సభ్యులు బొగ్దాన్ మురేసాను, సోల్ బెరుయెజో పిచోన్-రివియర్, మరియా అలెజాండ్రా రోజాస్, రచ్చపూమ్ బూన్‌బుంచాచోక్‌లను ఘనంగా సత్కరించారు. ఇండియన్ పనోరమా ఫీచర్ చిత్రాల విభాగం ఛైర్‌పర్సన్ శ్రీ మాధుర్ భండార్కర్, నాన్-ఫీచర్ చిత్రాల విభాగం ఛైర్‌పర్సన్ శ్రీ హిమాంశు శేఖర్ ఖటువాలను కూడా సన్మానించారు.
అంతర్జాతీయ సంగీత ప్రదర్శనతో ప్రారంభోత్సవానికి మరింత శోభ
ప్రారంభోత్సవ వేడుకలో సార్వజనీన భాషగా సినిమా ప్రాధాన్యాన్ని రుజువు చేసే పలు సంగీత, సాంస్కృతిక ప్రదర్శనలు ప్రేక్షకులను అలరించాయి. మూడుసార్లు గ్రామీ అవార్డు విజేత-సంగీత దర్శకుడు రికీ కేజ్ నేతృత్వాన సింఫోనిక్ ఆర్కెస్ట్రా, ‘సంగీతంతో ముడిపడిన సినీ ప్రపంచం” ఇతివృత్తంగా కచేరీ నిర్వహించారు. ఈ ప్రదర్శన భిన్న సంస్కృతులు, కథన సంప్రదాయాల గుండా ప్రేక్షకులను ఓ సంగీత ప్రపంచంలో ఓలలాడించింది. భాషా, భౌగోళిక సరిహద్దులను అధిగమించగల సినిమా సామర్థ్యాన్ని ఇది చాటిచెప్పింది.
సంగీత సంప్రదాయాలు, సామరస్యం, సాంస్కృతిక ఆదానప్రదానలలో భాగంగా వివిధ దేశాల సంగీతకారులు పాల్గొన్న ‘ఎల్లలు లేని సంగీతం’ అంతర్జాతీయ సంగీత విభావరిని కూడా నిర్వహించారు. ఈ ఉత్సవానికి ప్రతీక అయిన నెమలి చిహ్నాన్ని ‘బియాండ్ ది ఫ్రేమ్’ పేరిట ప్రత్యేక నృత్య ప్రదర్శనలో ఏర్పాటు చేశారు. భిన్న కదలికలు, కళాత్మక వ్యక్తీకరణ ద్వారా ఇఫీ చిహ్నానికి ఇది జీవం పోసింది.
వేవ్స్ ఫిల్మ్ బజార్ 20 ఏళ్ల ఉజ్వల ప్రస్థానం
భారతీయ సినిమాను ప్రపంచ అవకాశాలతో అనుసంధానిస్తూ రెండు దశాబ్దాలుగా కొనసాగుతున్న ఈ వేడుకలో భాగంగా 20వ వేవ్స్ ఫిల్మ్ బజార్ కూడా నవంబరు 20న గోవాలో ప్రారంభమైంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రత్యేక ఆడియో-విజువల్ కార్యక్రమం సినిమా వ్యాపారం, సహ-నిర్మాణం, ఫైనాన్సింగ్, నెట్‌వర్కింగ్, ప్రపంచ సహకారంలో తన అద్భుత ప్రస్థానాన్ని, సేవలను ప్రదర్శించింది. జాతీయ చలన చిత్రాభివృద్ధి సంస్థ ఆధ్వర్వాన నిర్వహిస్తున్న వేవ్స్ ఫిల్మ్ బజార్ 2007లో 18 దేశాల నుంచి 204 మంది ప్రతినిధులతో మొదలై, 40కి పైగా దేశాల నుంచి 2,500 మందికి పైగా సినీ నిపుణులను ఒకచోటకు తెచ్చే ప్రముఖ అంతర్జాతీయ వేదికగా ఎదిగింది.
ఇఫీ-2026 విశేషాలు
భారత 57వ అంతర్జాతీయ భారత చలనచిత్రోత్సవం ‘విశ్వజనీన కథలు’ అనే స్ఫూర్తిదాయక ఇతివృత్తం కింద 86 దేశాల నుంచి 150కి పైగా చిత్రాలను ప్రదర్శిస్తూ సినిమా రంగానికి ఒక అద్భుత వేడుకగా మారింది. మొత్తం 137 దేశాల నుంచి వచ్చిన 1,900కు పైగా దరఖాస్తుల నుంచి ఎంపిక చేసిన చిత్రాల్లో ‘ఫాదర్‌ల్యాండ్’ను ప్రారంభ చిత్రంగా ప్రదర్శించారు. ఇక వేడుకల మధ్య భాగంలో ‘ఐ మ్యాటర్’, ముగింపు చిత్రంగా ‘వీ ఆర్ ఆల్ స్ట్రేంజర్స్’ ప్రదర్శనతో ఆకట్టుకునే చలనచిత్రోత్సవ ప్రస్థానం సమాప్తమవుతుంది.
సినిమా అనుభవానికి కొత్త కోణాలను జోడిస్తూ, ఈసారి యానిమేషన్, ‘ఫిల్మ్స్ అబౌట్ ఫిల్మ్స్’ అనే రెండు ఉత్తేజకర విభాగాలను పరిచయం చేస్తున్నారు. ఇందులో గౌరవ అతిథి దేశంగా స్పెయిన్ ప్రధాన పాత్ర పోషిస్తుండగా, రష్యా భాగస్వామ్య దేశంగా ఉంది. అలాగే, బ్రిక్స్ సినిమాల ప్రదర్శన వర్ధమాన ప్రపంచ కథనాల విభిన్న సినిమాలతో సందడి చేస్తుంది. ఇండియన్ పనోరమా కింద 18 భాషలలో 76 చిత్రాలను ప్రదర్శన ద్వారా దేశీయ కథన సంప్రదాయాల వైభవాన్ని మరింతగా చాటుతారు.
నవతరం ప్రతిభకు పదును, సార్వజనీనతకు ప్రోత్సహించడంపై బలమైన నిబద్ధతతో 52 మంది మహిళా దర్శకులు, 62 మంది తొలిసారి దర్శకులకు ఈ వేడుక స్థానం కల్పించింది. ‘క్రియేటివ్ మైండ్స్ ఆఫ్ టుమారో’ ఆరో సంచిక కింద 13 విభాగాలలో 100 మంది యువ చిత్రనిర్మాతలకు మార్గనిర్దేశం చేస్తూ భావితరం సృజనాత్మక యువతకు సాధికారత కల్పిస్తారు. ఈ కార్యక్రమానికి అనుబంధంగా, 14 మాస్టర్‌క్లాస్‌లు, ప్యానెల్ చర్చలు సహా అభ్యాసం, సహకారం, సంభాషణ, సృజనాత్మక ఆదానప్రదానం దిశగా ఉత్సాహభరిత వేదిక అందుబాటులో ఉంటుంది.
ఈ చలనచిత్రోత్సవం సినిమా ప్రదర్శనలకు మించి సంస్కృతులు, దృక్కోణాలు, సృజనాత్మక గళాల మహా సంగమం. సరిహద్దులకు అతీతంగా ప్రపంచాన్ని ఏకీకృతం చేయగల సినిమా శక్తిసామర్థ్యాలను ఇది పునరుద్ఘాటిస్తుంది. అన్నింటినీ మించి ఎల్లలు లేని సినిమా భాష… అవధుల్లేని కథాకథనాలతో భావోద్వేగాలను ప్రేరేపిస్తుంది. ఈ తొమ్మిది రోజుల బహుముఖ కథావిష్కరణ సాగుతున్న కొద్దీ- ప్రపంచ దేశాల మధ్య సరిహద్దులు ఉంటాయిగానీ, చీకటి నిండిన సినిమా థియేటర్‌లో ప్రసరించే సన్నని వెలుగు రేఖ మనందర్నీ సమష్టిగా కలల ప్రపంచంలోకి తీసుకెళ్తుందన్న వాస్తవం స్పష్టం.
***