రహదారి రవాణా, హైవేల మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

అవగాహన కార్యక్రమంలో భాగంగానే వాహన బీమా పునరుద్ధరణ ఎస్ఎంఎస్ అలర్ట్‌లు.. టోల్ ప్లాజాల వద్ద ఎలాంటి జరిమానాలు, పెనాల్టీలు ఉండవు: స్పష్టం చేసిన ఎన్‌హెచ్ఏఐ

సమాచార ప్రసారం కోసమే ప్రతిపాదిత కార్యక్రమం.. సకాలంలో వాహన పునరుద్ధరణ, వాహన యజమానుల్లో బాధ్యతాయుత ధోరణిని ప్రోత్సహించడమే లక్ష్యం

నాడు పోస్టు చేయడమైనది: 19 NOV 2026 2:58PM by PIB Hyderabad

వాహన బీమా పునరుద్ధరణకు సంబంధించి ప్రస్తుతం కొంతమంది జాతీయ రహదారుల వినియోగదారులకు అందుతున్న ఎస్ఎంఎస్ నోటిఫికేషన్లు.. ప్రతిపాదిత ప్రజా అవగాహన కార్యక్రమం కోసం జరుగుతున్న పరీక్ష ప్రక్రియలో భాగమేనని భారత జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ స్పష్టం చేస్తోంది.

ఈ కార్యక్రమం పూర్తిగా సమాచార, సలహా పూర్వకమైనదేనని ఎన్‌హెచ్ఏఐ వెల్లడిస్తోంది. ఈ అలర్ట్‌లకు సంబంధించి టోల్ ప్లాజాల వద్ద చలాన్లు జారీ చేయడం లేదా జరిమానాలు విధించడం వంటి నిబంధనలేవీ లేవు. టోల్ ప్లాజాల వద్ద జరిగే తనిఖీలు లేదా జరిమానా చర్యలతో ఈ ఎస్ఎంఎస్ వ్యవస్థకు సంబంధం లేదని వినియోగదారులకు సంస్థ హామీ ఇస్తోంది. వాహనదారులకు తమ మోటార్ బీమా పాలసీల గడువు ముగియబోయే తేదీల గురించి ముందస్తుగా తెలియజేయడం, నిరంతర బీమా రక్షణ ఉండేలా సకాలంలో పునరుద్ధరించుకునేలా ప్రోత్సహించడమే ఈ నోటిఫికేషన్ల ఉద్దేశం.

ముందస్తు రిమైండర్ల ద్వారా అవగాహన కల్పించి.. వాహన యజమానులు బాధ్యతాయుతంగా నడుచుకునేలా ప్రోత్సహించడం, చట్టబద్ధమైన రహదారి భద్రత నిబంధనలను పాటించేలా చూడడం ఎన్‌హెచ్ఏఐ లక్ష్యం. ఇలాంటి కార్యక్రమాల ద్వారా వినియోగదారుల్లో రహదారులపై క్రమశిక్షణను పెంపొందించడానికీ, విస్తృతమైన రహదారి భద్రతా వ్యవస్థను బలోపేతం చేయడానికి ఎన్‌హెచ్ఏఐ ఎల్లప్పుడూ కట్టుబడి ఉంది.  

***


(రిలీజ్ ఐడి: 2338581) సందర్శకుల సూచీ సంఖ్య : : 8
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Gujarati , Urdu , हिन्दी , Marathi , Bengali , Bengali-TR , Tamil , Kannada