57th International Film Festival of India 2026
20 – 28 Nov 2026

ఎల్లలు లేని కథా ప్రపంచం: ఇఫీ 2026లో తమిళ, తెలుగు చలన చిత్రాల విశ్లేషణ

నాడు పోస్టు చేయడమైనది: 17 NOV 2026 8:53PMby PIB Hyderabadరిలీజ్ ఐడి: 2337732Views: 34

57వ భారత అంతర్జాతీయ చలనచిత్రోత్సవంలో (ఇఫీ) తమిళ, తెలుగు చలనచిత్రాలు ప్రముఖంగా నిలిచాయి. ఇవి సామాజిక సమస్యలు, కుటుంబ సంబంధాలు, మానవీయ విలువలు, వ్యక్తిగత పోరాటాలు, సాంస్కృతిక సంప్రదాయాలను అన్వేషించే విభిన్నమైన కథనాలను ఆవిష్కరిస్తున్నాయి. ఫీచర్, నాన్-ఫీచర్ విభాగాల్లో రెండు భాషల కథలను ఒకే వేదికపైకి తెచ్చిన ఈ కథలు.. సాంకేతికత, విద్య నుంచి పర్యావరణ పరిరక్షణ, కుటుంబ బంధాలు, వ్యక్తిగత ఆకాంక్షలు, రాజకీయ జీవితం వరకు విస్తరించిన ఇతివృత్తాలపై దృష్టి సారిస్తున్నాయి. 

తమిళ చలనచిత్రాలపై అవలోకనం

తమిళ చిత్రాల జాబితాలో సమకాలీన, సాంప్రదాయ సామాజిక నేపథ్యాలతో కూడిన కథలు ఉన్నాయి. కన్నన్ ఎస్ దర్శకత్వం వహించిన స్క్రోల్ చిత్రం స్మార్ట్‌ఫోన్ వ్యసనానికి బానిసైన అరవింద్ అనే యువకుడి చుట్టూ తిరుగుతుంది. అతను 'డోపా రష్' అనే యాప్‌లో చేరిన తర్వాత అతని జీవితం కలవరపరిచే మలుపు తీసుకుంటుంది. వరుస టాస్క్‌లు, బహుమతుల ద్వారా స్మార్ట్‌ఫోన్ వ్యసనాన్ని అధిగమించాలని ఈ యాప్ వినియోగదారులకు సవాలు విసురుతుంది. అయితే ఈ సవాళ్లు క్రమంగా వింతగా, భయానకంగా మారడంతో ఆ గేమ్ పాల్గొనేవారి జీవితాలను తన నియంత్రణలోకి తీసుకోవడం ప్రారంభిస్తుంది. తద్వారా వ్యసనం నుంచి బయటపడాలనే ప్రయత్నం కాస్తా ఒక భయానక అనుభవంగా మారుతుంది.

శివకుమార్ మురుగేశన్ దర్శకత్వం వహించిన 'తాయ్ కిళవి' (గాడ్ మదర్) చిత్రానికి కుటుంబ సంబంధాలు, పరిష్కారం కాని విభేదాలు ప్రధాన ఇతివృత్తాలుగా ఉన్నాయి. ఒక చిన్న గ్రామంలో తన కుమార్తె, మనవడితో కలిసి నివసిస్తున్న 70 ఏళ్ల దృఢ సంకల్పం గల ‘పావునుతాయి’ అనే మహిళ కథను ఈ చిత్రం ఆవిష్కరిస్తుంది. కొందరికి భయంగాను, మరికొందరికి గౌరవప్రదంగాను కనిపించే ఆమె చాలా ఏళ్లుగా తన ముగ్గురు కుమారులకు దూరంగా ఉంటోంది. ఆమె అకస్మాత్తుగా తీవ్ర అనారోగ్యానికి గురికావడంతో ఆమె కుమారులు తిరిగి ఇంటికి వస్తారు. ఇది పరిష్కారం కాని కుటుంబ విభేదాలు, బాధాకరమైన జ్ఞాపకాలను మళ్లీ తెరపైకి తెస్తుంది. గతం మళ్లీ ఆవిష్కృతం కావటంతో దీర్ఘకాలంగా దాగి ఉన్న ఒక రహస్యం క్రమంగా వెలుగులోకి వచ్చి తమ సంబంధాల పట్ల ఆ కుటుంబానికి ఉన్న ఆలోచనను మార్చేస్తుంది.

విద్యను అందుబాటులోకి తీసుకురావడం అనే అంశాన్ని ప్రస్తావిస్తూ సత్యశివ దర్శకత్వం వహించిన 'అరివు' చిత్రం 1996 నేపథ్యంలో సాగుతుంది. పశ్చిమ కనుమలలోని ఒక మారుమూల గిరిజన గ్రామంలో ఉపాధ్యాయుడిగా నియమితులైన కదిర్ అనే యువకుడి చుట్టూ ఈ కథ తిరుగుతుంది. ఆడపిల్లలకు చదువు చెబితే గ్రామ దేవతకు ఆగ్రహం కలుగుతుందనే గ్రామస్థుల విశ్వాసం కారణంగా అక్కడ బాలికలకు విద్యనందించటం లేదని అతను గుర్తిస్తాడు. దీనిని మార్చాలని దృఢంగా నిశ్చయించుకున్న అతను ఇంతకుముందెన్నడూ పాఠశాలకు వెళ్లని 13–14 ఏళ్ల వయస్సు గల బాలికల బృందానికి రహస్యంగా పాఠాలు బోధిస్తాడు. పరీక్షలు సమీపిస్తున్న కొద్దీ కదిర్ వారి భయాలను, సామాజిక ఆంక్షలను అధిగమించడంలో సహాయపడి వారు చదువుకునేందుకు మొదటి అడుగులు వేయడానికి మార్గం సుగమం చేస్తాడు.

తమిళ చిత్రాల ఎంపికలో దేశీయ విజ్ఞానం, సంప్రదాయ పద్ధతుల అన్వేషణ కూడా ఉంది. విజీష్ మణి దర్శకత్వం వహించిన 'అట్టపాడి' చిత్రం కేరళలోని పశ్చిమ కనుమలలో నివసించే ఆదివాసీ తెగల సంప్రదాయ వైద్య పద్ధతులను విశ్లేషిస్తుంది. అట్టపాడి ప్రజలు సంరక్షిస్తున్న ఔషధ విజ్ఞానం, అటవీ సంప్రదాయాలను అన్వేషించడానికి అరేబియా నుంచి వచ్చిన సుల్తాన్ అహ్మద్ అల్ మెహమూదీ చుట్టూ ఈ చిత్రం తిరుగుతుంది. దర్శకుడు విజీష్ మణి మార్గదర్శకత్వంలో అతను సంప్రదాయ వైద్యులు, పెద్దలను కలిసి అడవితో వారికి ఉన్న అనుబంధం గురించి తెలుసుకుంటాడు. ఔషధ విజ్ఞానం కోసం అన్వేషణగా ప్రారంభమైన ఈ ప్రయాణం.. క్రమంగా ఆ సమాజపు జీవన విధానం, సాంస్కృతిక వారసత్వంలోకి సాగే ఒక అంతర్గత ప్రయాణంగా రూపుదిద్దుకుంటుంది.

జోయల్ విజయ్ దర్శకత్వం వహించిన 'గూడు' (నెస్ట్) చిత్రానికి పర్యావరణ పరిరక్షణ, సామాజిక భాగస్వామ్యం ప్రధాన ఇతివృత్తాలుగా ఉన్నాయి. తమిళనాడులోని వాచాతి నేపథ్యంలో సాగే ఈ కథలో విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో గ్రామంలోని ఒక ట్రాన్స్‌ఫార్మర్ లోపల గుడ్లతో కూడిన పిచ్చుక గూడు ఉన్నట్లు బయటపడుతుంది. గ్రామ పెద్ద అగస్త్యన్ నాయకత్వంలో వ్యవసాయ పట్టభద్రుడు కదిర్, గ్రామస్థులు ఆ పక్షులను రక్షించడానికి 35 రోజుల పాటు విద్యుత్ లేకుండా ఉండాలని నిర్ణయించుకుంటారు. వ్యక్తిగత కక్షలతో ప్రేరేపితులైన స్థానిక వీఏవో, లింగం అనే వ్యక్తి నుంచి వీరి నిర్ణయానికి తీవ్ర వ్యతిరేకత, విధ్వంసక ప్రయత్నాలు ఎదురవుతాయి. ఈ సవాళ్ల మధ్య ఆ గూడును సురక్షితంగా ఉంచడానికి కదిర్, గ్రామస్థులు కఠినమైన త్యాగాలు చేస్తారు.

తెలుగు చిత్రాల విభాగం

తెలుగు చిత్రాల జాబితాలో పర్యావరణ సమస్యలు, కుటుంబ సంబంధాలు, ప్రేమ, వ్యక్తిగత ఆశయాలు, మానవీయ విలువలు, రాజకీయాలకు సంబంధించిన కథలు ఉన్నాయి. సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వం వహించిన 'సింగ్ గీతం' చిత్రం ప్రతాప్ మన్నెం అనే వ్యక్తి చుట్టూ తిరుగుతుంది. తన తండ్రి వదిలివెళ్లిన బంగారు గనులలో తన వాటాను దక్కించుకోవడానికి అతను 'కుబేరపురం' అనే మైనింగ్ గ్రామానికి తిరిగి వస్తాడు. అక్కడ గనుల విస్తరణ ప్రణాళికలతో గ్రామంలోని చివరి చెట్టును కూడా నాశనం చేయడానికి సిద్ధమైన ఒక మాజీ వ్యాపార భాగస్వామితో ప్రతాప్‌కు విభేదాలు తలెత్తుతాయి. దురాశ, ఘర్షణలు పెరుగుతున్న క్రమంలో ప్రతాప్ తన కుటుంబ గతానికి సంబంధించిన నిజాలను తెలుసుకుని పరివర్తన చెందడం ప్రారంభిస్తాడు. చివరకు గ్రామస్థులు.. ఐక్యత, త్యాగం, ప్రకృతిని కాపాడుకునేందుకు ఉన్న ప్రాముఖ్యతను గుర్తిస్తారు.

అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన 'మన శంకర వరప్రసాద్ గారు' (అవర్ మిస్టర్ శంకర్ వరప్రసాద్) చిత్రంలో కుటుంబ సంబంధాలు, ఎడబాటు, తిరిగి కలవడం వంటి అంశాలు ఉన్నాయి. ఈ కుటుంబ కథా చిత్రం శంకర్ వరప్రసాద్ అనే అంకితభావం గల జాతీయ భద్రతా అధికారి చుట్టూ తిరుగుతుంది. అతను తన కుటుంబానికంటే విధినే మిన్నగా భావించడం వల్ల తన భార్య, పిల్లలకు దూరమవుతాడు. ఆరేళ్ల తర్వాత తన పిల్లలు చదువుతున్న పాఠశాలలో విధుల్లో చేరడం ద్వారా వారితో తన సంబంధాన్ని తిరిగి పొందేందుకు అతను ప్రయత్నిస్తాడు. తన కుటుంబానికి తీవ్రమైన ముప్పు ఎదురైనప్పుడు వారిని రక్షించే బాధ్యత అతనికి వస్తుంది. ఆ ప్రమాదాన్ని ఛేదించే క్రమంలో అతను తన గతాన్ని దాటుతూ తన ప్రియమైన వారిని కాపాడుకుంటూ వారి నమ్మకాన్ని తిరిగి గెలుచుకోవాల్సి ఉంటుంది.

రవివర్మ నంబూరి దర్శకత్వం వహించిన 'చెన్నై లవ్ స్టోరీ' చిత్రానికి ప్రేమ, ఎడబాటు ప్రధాన ఇతివృత్తాలుగా ఉన్నాయి. గత సంబంధం తాలూకు బాధ నుంచి బయటపడటానికి కష్టపడుతున్న నివి చుట్టూ ఈ కథ తిరుగుతుంది. అనాథ అయిన స్టీవెన్‌ను ఆమె కలుస్తుంది. అతని ప్రేమ, ఆప్యాయత క్రమంగా ఆమె జీవితంలోకి మళ్లీ సంతోషాన్ని తీసుకువస్తాయి. వారి మధ్య విభేదాలు ఉన్నప్పటికీ వారు ప్రేమలో పడి వివాహం చేసుకోవాలని నిర్ణయించుకుంటారు. అయితే వారి పెళ్లి రోజే జరిగిన ప్రమాదంలో స్టీవెన్ మరణిస్తాడు. అతని ఆకస్మిక మరణాన్ని అంగీకరించలేక నివి తీవ్ర దుఃఖం, ఆగ్రహంతో కుంగిపోతుంది. ఎప్పటికీ తనతోనే ఉంటానని ఇచ్చిన మాటను కాదని అతను ఎందుకు వెళ్లిపోయాడో అర్థం చేసుకోలేక సంఘర్షణ పడుతుంది.

ధనుష్ దండు దర్శకత్వం వహించిన 'వై, వాణి?' చిత్రం వ్యక్తిగత ఆకాంక్షల సాధనను ప్రధాన అంశంగా ఆవిష్కరిస్తుంది. హైదరాబాద్‌లో ఎడిటర్‌గా పనిచేస్తూ వృత్తిపరమైన జీవితంలో అసంతృప్తితో ఉండే వాణి అనే యువతి కథను ఈ చిత్రం చెబుతుంది. ముంబయిలో ఒక డాక్యుమెంటరీపై పనిచేసే అవకాశం లభించినప్పుడు ఆమె తన చిత్రనిర్మాణ కలను సాకారం చేసుకోవాలని నిర్ణయించుకుంటుంది. అయితే ఆమె తీసుకున్న ఈ నిర్ణయం తన ప్రియుడు అరుణ్, చిత్రనిర్మాత సాహిత్‌లతో ఆమెకు ఉన్న సంబంధాలలో సవాళ్లను సృష్టిస్తుంది. ఆ ప్రాజెక్ట్.. వారి రాజీలు వారి సొంత భయాలను ప్రతిబింబిస్తుంది. కుటుంబ అంచనాలు, అపరాధ భావనతో సంఘర్షణ పడుతూనే వాణి చివరకు తన నిర్ణయాల పట్ల సరికొత్త అవగాహనను పొంది తన కలను అనుసరిస్తుంది.

ప్రవీణ్ దర్శకత్వం వహించిన 'విన్' చిత్రం చదరంగం ఆట ద్వారా ఆలోచనా విధానం, స్వీయ-క్రమశిక్షణకు ఉన్న ప్రాముఖ్యతను అన్వేషిస్తుంది. తల్లి వద్ద ఏళ్లపాటు కఠిన శిక్షణ పొందిన తర్వాత తాను ఆడే ప్రతి చదరంగం ఆటలో గెలవాలని కోరుకునే 18 ఏళ్ల నెపోలియన్ చుట్టూ ఈ కథ తిరుగుతుంది. తన సామర్థ్యంపై ఎంతో నమ్మకంతో ఒక పెద్ద చదరంగం టోర్నమెంట్‌లోకి అడుగుపెట్టిన నెపోలియన్.. ప్రశాంతంగా ఆలోచించే గాయత్రి అనే పదేళ్ల బాలిక చేతిలో ఓడిపోతాడు. ఆ ఓటమిని అంగీకరించలేక అతను ఆమెకు మరోసారి సవాలు విసురుతాడు. గెలుపు కంటే ఆటను బాగా ఆడటమే ముఖ్యమని గాయత్రి అతనికి అర్థమయ్యేలా చెబుతుంది. ఫలితంపై ఆసక్తి లేకుండా తన కర్తవ్యాన్ని నిర్వర్తించాలని ప్రోత్సహిస్తూ ఆమె నెపోలియన్‌కు భగవద్గీత బోధనలను పరిచయం చేస్తుంది. నెపోలియన్ క్రమంగా తన అహాన్ని నియంత్రించుకొని చదరంగాన్ని కొత్త కోణంలో చూడటం నేర్చుకుంటాడు.

దేవా కట్టా దర్శకత్వం వహించిన 'మాయసభ' చిత్రానికి లేదా వెబ్‌సిరీస్‌కు రాజకీయం, భావజాలం, స్నేహం నేపథ్యంగా నిలుస్తాయి. 1970ల మధ్యకాలం నాటి ఆంధ్రప్రదేశ్ నేపథ్యంలో సాగే ఈ సిరీస్ ఆదర్శవాద విద్యార్థి నాయకుడైన కాకర్ల కృష్ణమ నాయుడు (కేకేఎన్), శక్తిమంతమైన కుటుంబం నుంచి వచ్చిన యువకుడు ఎం.ఎస్. రామి రెడ్డి (ఎంఎస్ఆర్) అనే ఇద్దరు యువకుల కథను అనుసరిస్తుంది. విభిన్న నేపథ్యాలున్నప్పటికీ వారు స్నేహితులుగా మారి మార్పు తీసుకురావాలనే ఆశతో రాజకీయాల్లోకి ప్రవేశిస్తారు. అయితే కుల విభేదాలు, అవినీతి, డబ్బు, అధికార పోరాటాలతో కూడిన రాజకీయ జీవిత వాస్తవాలను వారు త్వరగానే ఎదుర్కొంటారు. వారి ప్రభావం పెరిగే కొద్దీ వారి ఆదర్శాలకు పరీక్ష ఎదురవుతుంది. వ్యక్తిగత ఆకాంక్షలు వారి స్నేహాన్ని ప్రభావితం చేయడం ప్రారంభిస్తాయి. రాజకీయం, భావజాలం, అధికారం, ఒకే పదవి కోసం పోటీ పడుతున్నప్పుడు ఇద్దరు స్నేహితులు ఐక్యంగా ఉండగలరా అనే అంశాలను ఈ సిరీస్ అన్వేషిస్తుంది.

భక్త కన్నప్ప: స్వర్ణోత్సవ వేడుక

ఇఫీ 2026 స్వర్ణోత్సవ విభాగంలో ఒక ప్రత్యేక ప్రదర్శన కూడా తెలుగు చిత్రాల ఎంపికలో భాగంగా ఉంది. 1976 మే 26న విడుదలైన బాపు దర్శకత్వం వహించిన 'భక్త కన్నప్ప' 50 సంవత్సరాలు పూర్తి చేసుకుంటోంది. చలనచిత్రోత్సవ స్వర్ణోత్సవ వేడుకల్లో భాగంగా ఈ చిత్రం కొత్త ప్రింట్ (రిస్టోర్డ్ వర్షన్) మళ్లీ ప్రేక్షకుల ముందుకు వస్తోంది.

ఈ చిత్రం ప్రఖ్యాత శైవ భక్తుడైన కన్నప్ప నాయనార్ కథను మళ్లీ తెరకెక్కించింది. గిరిజన పెద్ద చేతిలో పెరిగిన నాస్తికుడైన వేటగాడు తిన్నడుగా అర్జునుడు జన్మిస్తాడు. గ్రామ పెద్ద కుమార్తె నీలను వివాహం చేసుకునే అవకాశం అతనికి లభిస్తుంది. అయితే గ్రామ దేవుడి ముందు తలవంచడానికి నిరాకరించడంతో ఆ పెళ్లి ఆగిపోతుంది. అతను శివుడిని కలిసిన సమయంలో భక్తికి ఉన్న నిజమైన లోతును క్రమంగా తెలుసుకున్నప్పుడు అతని జీవితం మారుతుంది. క్లైమాక్స్‌లో శివలింగం నుంచి రక్తం కారకుండా ఆపడానికి అతను తన సొంత కళ్లను సమర్పిస్తాడు. ఇది ఆచారాలు, సంప్రదాయాలకు అతీతమైన భక్తిని తెలియజేస్తోంది. మొదట కన్నడలో తెరకెక్కించిన ఈ చిత్రం ఉత్తమ ఆడియోగ్రఫీ విభాగంలో జాతీయ చలనచిత్రోత్సవ పురస్కారాన్ని గెలుచుకుంది. ఈ చిత్రం గొప్పదనం, బహిరంగ ప్రదేశాల చిత్రీకరణకు ప్రసిద్ధి చెందింది.

మొత్తంగా ఈ కథలు ఈ ఏడాది ఇతివృత్తమైన 'ఎల్లలు లేని కథా ప్రపంచం' స్ఫూర్తిని పునరుద్ఘాటిస్తున్నాయి. తమిళ, తెలుగు భాషల్లో ఉన్న ఈ కథలు.. అవి వేళ్లూనుకున్నభాషా, సాంస్కృతిక ప్రపంచాలను దాటి ఎంతో దూరం ప్రయాణిస్తాయి. ఒక యువ ఉపాధ్యాయుడి పోరాటాలు, కుటుంబ బంధాలు, కలల సాధన, పర్యావరణ పరిరక్షణ, రాజకీయ జీవితంలోని క్లిష్టతలు లేదా భక్తికి ఉన్న శాశ్వత శక్తి వంటి అంశాలను అన్వేషించినప్పటికీ ఈ చిత్రాలు ప్రతిచోటా ప్రేక్షకులు అనుబంధం పెంచుకోగలిగే అనుభవాలు, భావోద్వేగాలను తెలియజేస్తాయి. భాష ఒక కథను చెప్పే విధానాన్ని రూపొందించగలదేమో గానీ అర్థమయ్యే, అనుభూతినందించే స్థాయిని అది ఎప్పటికీ పరిమితం చేయలేదని ఇవి మనకు గుర్తుచేస్తాయి. ఈ వైవిధ్యభరితమైన సినిమా స్వరాల ద్వారా భాషా, సాంస్కృతిక సరిహద్దులను అధిగమించే సినిమా శక్తిని, విభిన్న ప్రపంచాల నుంచి వచ్చిన కథలను ప్రతిచోటా ఉన్న ప్రేక్షకులకు చేరువ చేయడాన్ని ఇఫీ వేడుకగా జరుపుకుంటుంది.

***


Great films resonate through passionate voices. Share your love for cinema with #IFFI2026 and #StoriesWithoutBorders. Tag us @pibindia on Instagram and @PIB_India on X, and we will help amplify your festival moments!

For accredited journalists, critics, bloggers, and vloggers seeking 1-on-1 interviews with filmmakers and festival juries, write to us at:
iffi.mediadesk@pib.gov.in with the subject line: Take One with PIB.


Official Release ID: 2337732
•
Media Centre: Goa
•
Festival Dates: Nov 20 – 28, 2026