2026 నవంబర్ 20 నుంచి 28 వరకు గోవాలో జరగనున్న 57వ భారత అంతర్జాతీయ చలనచిత్రోత్సవం (ఇఫి)లో ప్రతిష్ఠాత్మకమైన ఐసీఎఫ్‌టీ-యునెస్కో గాంధీ మెడల్ కోసం పది భారతీయ, అంతర్జాతీయ కల్పిత కథా చిత్రాలు పోటీపడనున్నాయి. ఈ చిత్రాలు శాంతి, సహనం, సానుభూతి, సామాజిక న్యాయం, విభిన్న సంస్కృతుల మధ్య సంభాషణ వంటి ఇతివృత్తాలను ఆవిష్కరిస్తాయి. ఈ ఏడాది ఉత్సవ ప్రధాన ఇతివృత్తమైన ‘సరిహద్దులు లేని కథలు’కు అనుగుణంగా ఈ చిత్రాలను ఎంపిక చేశారు.
యునెస్కో ఆధ్వర్యంలో పారిస్‌లోని అంతర్జాతీయ చలనచిత్ర, టెలివిజన్, ఆడియోవిజువల్ కమ్యూనికేషన్ మండలి (సీఐసీటీ–ఐసీఎఫ్‌టీ) సహకారంతో 46వ ఇఫిలో ఈ అవార్డును ప్రవేశపెట్టారు. అహింస, సహనం, అంతర్ సాంస్కృతిక అవగాహన, శాంతి సంస్కృతి వంటి మహాత్మా గాంధీ ఆదర్శాలను ప్రతిబింబించే చిత్రాలకు ఈ పురస్కారాన్ని అందజేస్తారు.
నలుగురు సభ్యులతో కూడిన అంతర్జాతీయ జ్యూరీకి అల్జీరియాకు చెందిన ప్రొఫెసర్ (డాక్టర్) అహ్మద్ బెడ్జౌయి నేతృత్వం వహించనున్నారు. ఆయన విశ్వవిద్యాలయ ఆచార్యుడిగా, చలనచిత్ర దర్శకుడిగా, నిర్మాతగా, సినీ విమర్శకుడిగా సేవలందిస్తున్నారు. జ్యూరీలోని ఇతర సభ్యులు అర్జెంటీనా/ఫ్రాన్స్‌కు చెందిన మరియా క్రిస్టినా ఇగ్లేసియాస్, యునెస్కో సాంస్కృతిక విభాగంలో గతంలో ప్రోగ్రామ్ అధిపతిగా పనిచేశారు. లక్సెంబర్గ్‌కు చెందిన జార్జెస్ డుపాంట్, సీఐసీటీ–ఐసీఎఫ్‌టీ మాజీ డైరెక్టర్ జనరల్, భారత్‌కు చెందిన అంతర్జాతీయ ప్రశంసలు పొందిన చలనచిత్ర దర్శకుడు, ఐసీఎఫ్‌టీ సభ్యుడు మనోజ్ కదామ్ ఉన్నారు.
ఈ ఏడాది పోటీకి ఎంపికైన పది చిత్రాలు విభిన్న సాంస్కృతిక నేపథ్యాల నుంచి వచ్చిన కథలను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నాయి. మానవ సంబంధాలు, సామాజిక సవాళ్లు, ఉమ్మడి విలువలను ఈ చిత్రాలు ప్రతిబింబిస్తాయి.
అంతర్జాతీయ చిత్రాల విభాగంలో ఎమిలీ అతెఫ్ దర్శకత్వం వహించిన ‘కాల్ మీ క్వీన్’ ఉంది. జర్మనీ, ఫ్రాన్స్, యూకే, కెన్యా సంయుక్త నిర్మాణమైన ఈ చిత్రం 1990వ దశకంలోని నైరోబీ నేపథ్యంలో సాగుతుంది. ఎయిడ్స్ వ్యాధి నిర్ధారణ, సామాజిక అన్యాయాన్ని ఎదుర్కొంటున్న ఓ ఒంటరి తల్లి, అనూహ్యంగా ఏర్పడిన స్నేహం ద్వారా ఎలా ధైర్యాన్ని పొందిందన్నది ఈ చిత్ర కథాంశం. ఇఫిలో ఈ చిత్రం తొలిసారిగా భారత్‌లో ప్రదర్శితం కానుంది.
భారత్ తరఫున మూడు చిత్రాలు పోటీలో నిలిచాయి. సర్ఫరాజ్ ఆలం దర్శకత్వం వహించిన ‘కబీర్ సర్ కా ఆఖ్రీ లెసన్’ (కబీర్ సర్) చిత్రంలో వినయ్ పాఠక్ ప్రధాన పాత్ర పోషించారు. సాంకేతిక పరిజ్ఞానం విస్తరిస్తున్న ప్రస్తుత కాలంలో అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న సవాళ్లను ఈ చిత్రం ఆవిష్కరిస్తుంది. ఈ చిత్రం ప్రపంచ ప్రీమియర్‌గా ప్రదర్శితం కానుంది. కన్నన్ ఎస్ దర్శకత్వం వహించిన ‘స్క్రోల్’ చిత్రం స్మార్ట్‌ఫోన్ వ్యసనాన్ని ఇతివృత్తంగా తీసుకుంది. స్క్రీన్ వినియోగ సమయాన్ని నియంత్రించేందుకు యాప్ ఆధారిత గేమ్‌ను ఉపయోగించే ఓ యువకుడి కలవరపరిచే అనుభవాల ద్వారా ఈ అంశాన్ని చూపిస్తుంది. ముస్కాన్ అస్తానా తొలి దర్శకత్వ చిత్రమైన ‘సేవ్ మిచ్చర్’.. ఆర్థిక, వ్యక్తిగత సమస్యలను ఎదుర్కొంటున్న ఓ దుకాణదారుడి కథ ద్వారా కుటుంబంలో తలెత్తే ఉద్రిక్తతలు, పోటీ, తిరిగి సఖ్యత సాధించడం వంటి అంశాలను ఆవిష్కరిస్తుంది.
హైతీ, ఫ్రాన్స్, బెల్జియం, లక్సెంబర్గ్, కెనడా సంయుక్త నిర్మాణమైన ‘మేరీ మడేలీన్’ చిత్రానికి జెస్సికా జెనియస్ దర్శకత్వం వహించారు. స్వతంత్ర భావాలున్న ఓ మహిళకు, యువ సువార్తికుడికి మధ్య క్రమంగా అభివృద్ధి చెందే సంబంధం ద్వారా విశ్వాసం, సామాజిక సంప్రదాయాలు, వ్యక్తిగత స్వేచ్ఛ వంటి అంశాలను ఈ చిత్రం చర్చిస్తుంది. 2026 ఫెస్టివల్ డి కాబోర్గ్‌లో ఈ చిత్రం గ్రాండ్ ప్రిక్స్ డ్యూ జ్యూరీ అవార్డును గెలుచుకుంది. ఇఫిలో ఆసియా ప్రీమియర్‌గా ప్రదర్శితం కానుంది.
ఘనా-అమెరికన్ చిత్రనిర్మాత అమర్తేయ్ ఆర్మర్ దర్శకత్వం వహించిన ‘అవర్ టైమ్ విల్ కమ్ (ఈగో రీచ్ వీ ఆల్)’ చిత్రం, తల్లిదండ్రి కోసం అక్రాకు ప్రయాణించే ఇద్దరు అనాథల కథను చెబుతుంది. 2026 లోకార్నో చలనచిత్రోత్సవంలో ఈ చిత్రం ‘పార్డో ఫర్ చేంజ్’, ‘పార్డో ఫర్ బెస్ట్ పెర్ఫార్మెన్స్’ అవార్డులను గెలుచుకుంది. ఇఫిలో ఆసియా ప్రీమియర్‌గా ప్రదర్శితం కానుంది.
టర్కీ చిత్రనిర్మాత ఫైసల్ సోయ్సల్ దర్శకత్వం వహించిన ‘రహ్మా’ చిత్రం ఓ పురావస్తు శాస్త్రవేత్త కథను చెబుతుంది. తొమ్మిదేళ్ల సిరియా అనాథ బాలికతో ఆమెకు అనూహ్యంగా ఏర్పడిన అనుబంధం భావోద్వేగ స్వస్థతకు దారితీయడంతోపాటు, జీవితాన్ని చూసే ఆమె దృక్పథంలో మార్పు తీసుకొస్తుంది. ఈ చిత్రం ఇఫిలో ఆసియా ప్రీమియర్‌గా ప్రదర్శితం కానుంది.
లైలా మర్రాక్చి దర్శకత్వం వహించిన ‘స్ట్రాబెర్రీస్’ (లా మాస్ దుల్సే) చిత్రం స్పెయిన్‌లో కాలానుగుణంగా స్ట్రాబెర్రీల సేకరణ పనులు చేసే ఇద్దరు మొరాకో మహిళల కథను చెబుతుంది. పని ప్రదేశంలో వేధింపులు, దోపిడీకి వ్యతిరేకంగా నిలబడేందుకు వారిలో ధైర్యం ఎలా పెరిగిందన్నది ఈ చిత్ర సారంశం. ఫ్రాన్స్, మొరాకో, స్పెయిన్, బెల్జియం సంయుక్త నిర్మాణమైన ఈ చిత్రం ఇఫిలో తొలిసారిగా భారత్‌లో ప్రదర్శితం కానుంది.
మరో టర్కీ చిత్రం ‘ది ఫార్మ్’ (సుట్ చిఫ్ట్లిగి)కు ఎలిఫ్ ఎడా దర్శకత్వం వహించారు. ఓ పాడి పరిశ్రమలో అప్పుడే పుట్టిన దూడలను వాటి తల్లుల నుంచి వేరు చేయడాన్ని చూసి కలత చెందిన 12 ఏళ్ల బాలిక, అనాథగా మారిన ఓ పశువైద్య శిక్షణార్థితో కలిసి గర్భంతో ఉన్న ఆవులను విడిపించేందుకు ప్రయత్నిస్తుంది. ఈ చిత్రం ఇఫిలో తొలిసారిగా అంతర్జాతీయంగా ప్రదర్శితం కానుంది.
లూ పో-షున్ దర్శకత్వం వహించిన తైవాన్-సింగపూర్ సంయుక్త నిర్మాణం ‘విల్ యూ స్టిల్ బి మై ఫ్రెండ్’ (రి గువాంగ్) చిత్రం.. భిన్న నేపథ్యాలకు చెందిన 13 ఏళ్ల ఇద్దరు బాలుర మధ్య స్నేహాన్ని ఆవిష్కరిస్తుంది. పెద్దల మధ్య నెలకొన్న ఉద్రిక్తతలు వారిద్దరినీ విడదీసే పరిస్థితులు కల్పించినప్పటికీ, వారి స్నేహం ఎలా కొనసాగిందన్నది ఈ చిత్ర కథాంశం. ఇఫిలో ఈ చిత్రం తొలిసారిగా భారత్‌లో ప్రదర్శితం కానుంది.
ఈ విభిన్న చిత్రాల ఎంపిక ద్వారా 57వ ఇఫిలో ఐసీఎఫ్‌టీ–యునెస్కో గాంధీ మెడల్ పోటీ, వివిధ సంస్కృతులు, భౌగోళిక సరిహద్దులకు అతీతంగా కరుణ, పరస్పర గౌరవం, శాంతియుత సహజీవనం, ఉమ్మడి మానవీయ విలువలను ప్రోత్సహించే కథలను ఒకే వేదికపైకి తీసుకొస్తోంది.
***