భారతీయ ప్రధాన స్రవంతి హిందీ చలనచిత్ర పరిశ్రమకు కేంద్రంగా ఉన్న ముంబయి.. బాలీవుడ్‌తో సమానంగా ఉత్తేజకరంగా దూసుకుపోతున్న మరాఠీ సినీ సంప్రదాయానికి కూడా నిలయమై వెలుగొందుతోంది. చక్కని కథనాలు, వాస్తవిక దృక్పథం, బలంగా వేళ్లూనుకున్న సాహిత్య విలువలతో మరాఠీ సినిమా ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకుంది. ఘనమైన చలనచిత్ర వారసత్వాన్ని సగర్వంగా ప్రకటించేలా మరాఠీ సినీ వైవిధ్యాన్ని ప్రదర్శించేందుకు 57వ భారత అంతర్జాతీయ చలనచిత్రోత్సవం (ఇఫీ) వేదికగా నిలవబోతున్నది. చిరతరమైన ఈ సినీ పరంపరను వేడుకగా చేసుకొనే తరుణమిది. సమకాలీన ఫీచర్, నాన్ ఫీచర్ చిత్రాల ప్రదర్శనతోపాటు సినీ దిగ్గజాలను స్మరించుకుంటూ కార్యక్రమం ఆసాంతం మరాఠీ సినిమా ఘనతను బలంగా చాటబోతున్నది.
ఈ ఏడాది ఇఫీ వేడుకల్లోని ‘ఇండియన్ పనోరమా’ విభాగానికి ఏడు మరాఠీ చిత్రాలు ఎంపికయ్యాయి. వాటితోపాటు శతజయంతి నివాళి విభాగంలో భాగంగా ఒక ప్రఖ్యాత క్లాసిక్ చిత్రాన్ని (పునరుద్ధరించబడిన రూపంలో), ‘గాలా ప్రీమియర్స్’ విభాగంలో మరో మరాఠీ చిత్రాన్ని కూడా ప్రదర్శిస్తారు.

ఫీచర్ చిత్రాల విభాగంలో ఎంపికైన మహేశ్ లిమాయే దర్శకత్వం వహించిన ‘ఆది అనంత్’ ఒక వర్ధమాన నటుడికి, అతడి తాతకు మధ్య ఉండే సున్నితమైన భావోద్వేగ బంధాన్ని ఆవిష్కరిస్తుంది. పెద్దవారి సంరక్షణలో ఎదురయ్యే సవాళ్లను, కుటుంబ బాధ్యతలను, అలాగే నిజమైన విజయమంటే ఏమిటో కళ్లకు కట్టినట్లు చూపే ఈ చిత్రంలో అశోక్ సరాఫ్, సంకర్షణ్ కర్హాడే, సఖి గోఖలే, యోగేశ్ శిర్సాట్ ప్రధాన పాత్రలు పోషించారు.
ఇండియన్ పనోరమాలోని ప్రధాన స్రవంతి చిత్రాల విభాగంలో విభిన్న కథాంశాలతో కూడిన రెండు చిత్రాలు ప్రదర్శితం కానున్నాయి. ప్రవీణ్ విఠల్ తర్డే రచించి, దర్శకత్వం వహించిన ‘దేవల్ బంద్ 2’.. రైతు అయిన భర్తను కోల్పోయిన ఒక మహిళ కథ ద్వారా వ్యవసాయ రంగ సంక్షోభాన్ని హృద్యంగా ఆవిష్కరిస్తుంది. అలాగే సమీర్ తివారీ దర్శకత్వం వహించిన ‘బాప్యా’.. స్వగ్రామానికి తిరిగొచ్చిన ట్రాన్స్‌జెండర్ కథానాయకుడి జీవితాన్ని వివరిస్తుంది. ఈ చిత్రం కుటుంబ బంధాలు, లింగపరమైన గుర్తింపు అంశాలను సమర్థంగా మేళవించింది.
ఇఫీలో భారతీయ ఫీచర్ చిత్రాలకు సంబంధించి.. ‘ఉత్తమ తొలి చిత్ర దర్శకుడు’ విభాగంలో ఎంపికైన చిత్రాల్లో జీజీవిషా కాలే దర్శకత్వం వహించిన ‘తిఘీ’ ఒకటి. హృదయాన్ని కదిలించే ఈ కుటుంబ కథా చిత్రం మానవ సంబంధాలు, త్యాగం, బయటకు చెప్పలేని భావోద్వేగాల తాలూకు వేదనను బలంగా ఆవిష్కరించడం ఈ చిత్ర విశేషం.

వైవిధ్యమైన కథాంశాలతో కూడిన మరో మూడు మరాఠీ చిత్రాలు.. ఇండియన్ పనోరమా నాన్ ఫీచర్ విభాగంలో ప్రదర్శితం కాబోతున్నాయి. అమిత్ పట్కర్ దర్శకత్వం వహించిన ‘పనిష్‌మెంట్’... ఒకదానికొకటి ఎలాంటి సంబంధమూ లేనట్టుగా అనిపించే రెండు దొంగతనాల వల్ల కలిగిన అపరాధ భావనను, దాని పరిణామాలను విశ్లేషిస్తుంది. సంతోష్ దవఖర్ తెరకెక్కించిన ‘స్కై ట్రీ’ (అభల్-వృక్ష్).. కరువు పరిస్థితుల మధ్య ఒక గ్రామీణుడి ఆశలను ప్రతిబింబిస్తుంది. అలాగే నిపుణ్ ధర్మాధికారి దర్శకత్వం వహించిన ‘ది మూన్’ (చందోబా).. విటిలిగో సమస్యతో పోరాడుతున్న ఒక యువకుడి ఇబ్బందులను, ఆ పరిస్థితి పట్ల సమాజం చూపే వివక్షను కళ్లకు కడుతుంది.
ఇండియన్ పనోరమా విభాగంలో ఎంపికలతోపాటు.. జాతీయ అవార్డు గ్రహీత దీపక్ గవాడే దర్శకత్వం వహించిన ‘తు ఆహెస్ నా’ చిత్రం గాలా ప్రీమియర్స్ విభాగంలో ప్రదర్శితం కానుంది. ఈ చిత్రం దుఃఖం, ఏకాంతం, వ్యక్తిగత గుర్తింపు వంటి సున్నితమైన అంశాలను స్పృశిస్తూ.. జీవితానికి అసలైన అర్థాన్ని చేకూర్చే అనూహ్య మానవ సంబంధాల గొప్పతనాన్ని ఆవిష్కరిస్తుంది.
మరాఠీ కథాకథనం కేవలం సినిమాలకే పరిమితం కాకుండా.. ఇఫీలోని ఉత్తమ వెబ్ సిరీస్ విభాగంలోనూ స్థానాన్ని సంపాదించుకుంది. చంద్రకాంత్ లతా గైక్వాడ్ దర్శకత్వం వహించిన 'దేవ్‌ఖేళ్' అనే వెబ్ సిరీస్ ఈ విభాగంలో ఎంపికైంది. ఒక తీరప్రాంత గ్రామంలో జరిగే ఓ క్రతువుతో ముడిపడి ఉన్న వరుస హత్యల చుట్టూ తిరిగే ఉత్కంఠభరితమైన క్రైమ్ థ్రిల్లర్ ఇది. మూఢనమ్మకాల వెనుక దాగి ఉన్న భయానక నిజాలను వెలికితీసేలా సాగుతుంది.

మరాఠీ సినిమా ఘనమైన వారసత్వాన్ని చాటిచెప్పేలా.. శతజయంతి ఉత్సవాల విభాగంలో విఖ్యాత నటుడు సూర్యకాంత్ మాంధారే జయంతి సందర్భంగా ఆయనకు ఘనంగా నివాళి అపిస్తున్నారు. ఇందులో భాగంగా జాతీయ చలనచిత్ర వారసత్వ మిషన్ కింద నేషనల్ ఫిల్మ్ ఆర్కైవ్ ఆఫ్ ఇండియా (ఎన్ఎఫ్ఏఐ) పునరుద్ధరించిన 1965 నాటి ఆయన మరాఠీ చిత్రం ‘సాధి మనసే’ను ప్రదర్శించనున్నారు. అలాగే హిందీ, మరాఠీ చిత్రాల్లో తనదైన చిరస్మరణీయ అభినయంతో ప్రేక్షకులను అలరించిన దివంగత నటుడు నానా పటేకర్ జ్ఞాపకార్థం ‘హోమేజ్ (నివాళి)’ విభాగాన్ని ఆయన చిత్రాల కోసం కేటాయించారు. 57వ ఇఫీ వేదికగా ప్రదర్శించనున్న ఆయన హిందీ చిత్రం ‘దీక్ష’, మీరామార్ బీచ్‌లో ఏర్పాటు చేయనున్న ఆయన అద్భుత మరాఠీ చిత్రం ‘నటసమ్రాట్’ ఓపెన్ ఎయిర్ ప్రదర్శన ద్వారా.. భారతీయ చలనచిత్ర రంగానికి ఈ దిగ్గజ నటుడు అందించిన అసమాన సేవలను ప్రేక్షకులు మరోసారి స్మరించుకునే అవకాశం లభిస్తుంది.
***