ప్రజాస్వామ్యం, స్వేచ్ఛ, గుర్తింపు, చరిత్ర, సమకాలీన ప్రపంచ సమస్యలను స్పృశించే బ్రిక్స్ దేశాల చిత్రాలను ప్రదర్శించేందుకు ‘ఫిల్మ్స్ ఫ్రం బ్రిక్స్’ అనే ప్రత్యేక విభాగాన్ని 57వ భారత అంతర్జాతీయ చలనచిత్రోత్సవం (ఐఎఫ్ఎఫ్ఐ)-2026లో ఏర్పాటు చేశారు. ఆయా ప్రాంతాల చరిత్రలు, సామాజిక వాస్తవాలు, వ్యక్తిగత ప్రయాణాల ఆధారంగా రూపొందిన ఈ చిత్రాలు అక్కడి సమాజాల దృక్పథాలను ప్రతిబింబిస్తాయి.
వివిధ దేశాలు, భాషలు, శైలులకు చెందిన 21 చిత్రాలను ప్రదర్శనకు ఎంపిక చేశారు. ఇవి స్వేచ్ఛ, గుర్తింపు, సామాజిక అసమానత, కుటుంబం, సంఘర్షణ, వలసలు, అనుబంధాలకు సంబంధించిన కథలను అందిస్తాయి. వీటిలో అనేక చిత్రాలు ప్రజాస్వామ్య అనుకూల ఉద్యమాల నుంచి బానిసత్వం, వలస పాలనకు వ్యతిరేకంగా సాగిన పోరాటాల వరకు.. కీలకమైన పోరాటాలను, మార్పులను గుర్తు చేస్తాయి.
‘అమాడియో అండ్ ది హైపోథెటికల్ న్యూ వరల్డ్’ అనే బ్రెజిల్ చిత్రం... 1830ల్లో బ్రెజిల్లో నివసించిన ఆఫ్రికన్ ఆవిష్కర్త కథను ఊహాత్మకంగా చూపిస్తుంది. బానిసత్వంలో మగ్గుతున్న ప్రజలకు విముక్తి కల్పించేందుకు చేసే పోరాటంలో అతడి ఆవిష్కరణ ఎలా భాగమైందో ఈ సినిమా వివరిస్తుంది. ‘‘ది సీ స్పీక్స్ హిజ్ నేమ్’’ అనే ఇండోనేషియా చిత్రం... 1998లో జరిగిన ప్రజాస్వామ్య అనుకూల ఉద్యమంలో మాయమైన ఓ విద్యార్థి ఉద్యమకారుని కథను, సమాధానాల కోసం కుటుంబం చేసే అన్వేషణను వివరిస్తుంది. 19వ శతాబ్దం మధ్య కాలంలో కలహారి ఎడారి ప్రాంతం నేపథ్యంలో తెరకెక్కిన దక్షిణాఫ్రికా చిత్రం ‘ది ట్రెక్’... వలస వాద పాలనలో దౌర్జన్యాలను ప్రదర్శిస్తుంది.
సమకాలీన అంశాలకు సైతం ఈ విభాగంలో చోటు దక్కింది. ఉగాండా-యూకే సంయుక్తంగా రూపొందించిన ‘డ్రీమింగ్ ఆఫ్ సెరెనాడా’ డాక్యుమెంటరీ... తండ్రీకూతుళ్ల మధ్య అనుబంధం ద్వారా వాతావరణ మార్పుల గురించి వివరిస్తుంది. అలాగే వర్షారణ్య ప్రాంతాలపై వరదల ప్రభావాన్ని తెలియజేస్తుంది. ఖాట్ సాగు, వినియోగంతో ముడిపడి ఉన్న సమాజాలను ఇథియోపియా, అమెరికాలకు చెందిన ‘ఫయా దాయి’ చిత్రం ఆవిష్కరిస్తుంది. వారి జీవనోపాధి, సామాజిక వాస్తవాలను, యువత ఆకాంక్షలను ఈ చిత్రం తెలియజేస్తుంది. ఇరాన్ చిత్రమైన ‘పౌల్ట్రీ ఫామ్’ ఇరాక్ నుంచి సరైన పత్రాలు లేకుండా వలస వచ్చిన బాలుడి కథను చెబుతుంది. తప్పిపోయిన తన స్నేహితుడి కోసం అతడు చేసే అన్వేషణ అతని ప్రాణాలకు ముప్పు తెస్తుంది.
కుటుంబం, గుర్తింపు, వ్యక్తిగత ఎంపికలు మరో ప్రధాన ఇతివృత్తంగా నిలిచాయి. ఓ యువతి, ఆమె బామ్మ, తప్పిపోయిన ఆమె సోదరి చుట్టూ సాగే కథనాన్ని సౌదీ అరేబియా చిత్రమైన ‘హిజ్రా’ ప్రదర్శిస్తుంది. వారి ప్రయాణం కుటుంబ రహస్యాలను, తరాల మధ్య ఉన్న అంతరాలను బయటపెడుతుంది. దహన సంస్కారాల తర్వాత తారుమారైన అస్థికల చుట్టూ చైనా చిత్రం ‘ఎంబర్స్’ కథ సాగుతుంది. ఇద్దరు మహిళల జీవితాల్లోని నష్టం, మరణం లాంటి అంశాలను ఈ చిత్రం స్పృశిస్తుంది. వారసత్వంగా వచ్చిన సంగీత సంప్రదాయాలకు, ప్రదర్శనకారిణి కావాలన్న తన కలకు మధ్య నలిగిపోతున్న ఆండియన్ ఆదివాసీ తెగకు చెందిన యువతి కథను బొలీవియా-పెరూ నిర్మాణంలో తెరకెక్కిన ‘ది కాండోర్ డాటర్’ చిత్రం వివరిస్తుంది. లాగోస్‌లో నివసించే యువ టాక్సీ డ్రైవర్ కథను నైజీరియా-యూకే సంయుక్తంగా నిర్మించిన ‘లేడీ’ ప్రదర్శిస్తుంది. కొందరు సెక్స్ వర్కర్లతో ఆమెకు ఏర్పడిన పరిచయం ఆమెను సంఘీభావం, ఆత్మశోధన వైపు ఎలా నడిపించిందో ఈ చిత్రం వివరిస్తుంది.
ఆదిత్య ధర్ దర్శకత్వం వహించిన ‘ఆర్టికల్ 370’ భారత్ తరఫున ఎంపికయింది. 2016లో కశ్మీర్లో నెలకొన్న అనిశ్చిత పరిస్థితుల నేపథ్యంలో తెరకెక్కింది. 370వ అధికరణను రద్దు చేసే లక్ష్యం చుట్టూ ఈ కథ సాగుతుంది. 72వ జాతీయ చలనచిత్రోత్సవాల్లో ఉత్తమ చిత్రం, ఉత్తమ నటి, ఉత్తమ సంగీతం విభాగాల్లో ఈ చిత్రానికి మూడు పురస్కారాలు లభించాయి.
ఈ విభాగంలో ఎంపికయిన చిత్రాల్లో ‘కిండిక్ (ది కార్డ్)’ (కజకిస్థాన్), ‘బరాకోవా’ (క్యూబా, ఇటలీ), ‘బో బో’ (రష్యన్ ఫెడరేషన్), ‘సేఫ్ ఎగ్జిట్’ (ఈజిప్ట్, జర్మనీ, లిబియా, ఖతార్, ట్యునీషియా), ‘9 టెంపుల్స్ టు హెవెన్’ (థాయిలాండ్, సింగపూర్, ఫ్రాన్స్, నార్వే, చైనా, హాంగ్ కాంగ్, ఇండోనేషియా, ఖతార్), ‘కాటన్’ (ఉజ్బెకిస్థాన్), ‘బాగా: టుమారో బిలాంగ్స్ టు నో వన్’ (మలేషియా), ‘1982’ (వియత్నాం), ‘అండ్ ది స్నో వాస్ ఫాలింగ్’ (బెలారస్), ‘బాబ్’ (యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్) ఉన్నాయి.
విభిన్న దేశాల సినిమా దృక్పథాలను మొత్తం 21 సినిమాలు ప్రేక్షకులకు పరిచయం చేయనున్నాయి. దేశ సరిహద్దులను దాటి సాగే ఈ కథలు స్వేచ్ఛ, అనుబంధం, జ్ఞాపకం, నిలకడ, మార్పు లాంటి అంశాలను స్పృశిస్తాయి.
గోవాలోని వివిధ వేదికల్లో 2026 నవంబర్ 20 నుంచి 28 వరకు 57వ భారత అంతర్జాతీయ చలనచిత్రోత్సవాలు జరుగుతాయి. దీనిలో 86 దేశాలకు చెందిన 150కిపైగా అంతర్జాతీయ చిత్రాలను ప్రదర్శిస్తారు. పోటీ, పోటీయేతర విభాగాలు, ఎంపిక చేసిన చిత్రాలు, పాత చిత్రాలు, నివాళులు, ఇతివృత్థ ఆధారిత ప్రదర్శనల ద్వారా వివిధ సినిమా శైలులు, దేశాలు, భాషలకు చెందిన చిత్రాలను ఈ ఉత్సవం ఒక్కచోట చేరుస్తుంది. తద్వారా విభిన్న సంస్కృతుల వినిమయం, సినిమా నైపుణ్యాలకు వేదికగా నిలుస్తుంది.
* * *