ప్రఖ్యాత సినీరూపకర్త అలీనా షెర్బాన్ రచన, దర్శకత్వంలో తెరకెక్కిన బహుభాషా నాటక చిత్రం ఐ మ్యాటర్. 57వ భారత అంతర్జాతీయ చలన చిత్రోత్సవం (ఇఫి)లో మిడ్-ఫెస్ట్ చిత్రంగా దీన్ని ప్రదర్శిస్తారు. రొమేనియా, జర్మనీ, బెల్జియం దేశాలు కలిసి రూపొందించిన 101 నిమిషాల ఈ చిత్రం... గుర్తింపు, కుటుంబం, అనుబంధం, గతం తాలూకు పరిస్థితులను అధిగమించి ఉజ్వల భవిష్యత్తును వెతుక్కోవటం వంటి అంశాలను వివరిస్తుంది. రొమేనియన్, రోమానీ భాషల్లో సంభాషణలున్న ఈ సినిమా... ఈ ఫెస్టివల్‌కు విలక్షణమైన యూరోపియన్ చలనచిత్ర దృక్పథాన్ని తీసుకువస్తుంది.
అనాథాశ్రమాన్ని విడేందుకు సిద్ధమవుతున్న రోమా యువతి రెబెకా కథ ఇది. ఆమె తండ్రి జైలు నుంచి విడుదల కానుండటంతో తను ఎప్పుడూ కోరుకున్న కుటుంబాన్ని కనుక్కొని, జీవితంలో నూతన అధ్యాయాన్ని ప్రారంభించాలని ఆశిస్తుంది. నటనలో పైచదువుల కోసం విశ్వవిద్యాలయంలో ప్రవేశం లభించటంతో ఆమెలో కొత్త ఆశలు చిగురిస్తాయి. భవిష్యత్తును తానే తీర్చిదిద్దుకునే అవకాశం వస్తుంది. అయితే తనకు పరిచయం లేని కొత్త ప్రపంచంలో అడుగుపెడుతున్న తరుణంలో గతంలోని చేదు అనుభవాలు మళ్లీ ఎదురై ఆమె కఠినమైన నిర్ణయాలు తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది.
స్థిరమైన కుటుంబ వాతావరణం లేకుండా పెరిగే పిల్లల భావోద్వేగ సవాళ్లను, గుర్తింపు కోసం చేసే అన్వేషణను, సమాజంలో తనకంటూ స్థానాన్ని సంపాదించుకోవాలనే సంకల్పాన్ని రెబెకా ప్రయాణం ద్వారా 'ఐ మ్యాటర్' చిత్రం వివరిస్తుంది. ఒక రోమా యువతి జీవితానుభవాల నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం... సామాజిక భాగస్వామ్యం, ఆత్మగౌరవం, వ్యక్తిగత స్వేచ్ఛ వంటి అంశాలను చర్చిస్తుంది.
ఈ చిత్రం ద్వారా ప్రముఖ నటి, నాటక రచయిత్రి అలీనా షెర్బాన్ తొలిసారిగా ఫీచర్ ఫిల్మ్‌కు దర్శకురాలిగా వ్యవహరించారు. బుకారెస్ట్‌లోని నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ థియేటర్ అండ్ ఫిలిం నుంచి పట్టభద్రురాలైన ఆమె... న్యూయార్క్ యూనివర్సిటీలోని టిస్చ్ స్కూల్ ఆఫ్ ఆర్ట్స్, లండన్‌లోని రాయల్ అకాడమీ ఆఫ్ డ్రమాటిక్ ఆర్ట్స్‌లోనూ శిక్షణ పొందారు. ఆమె తీసిన గత చిత్రాల్లో కేన్స్ చలనచిత్రోత్సవంలో ప్రదర్శించిన 'అలోన్ ఎట్ మై వెడ్డింగ్', పలు 'ఉత్తమ నటి' పురస్కారాలు పొందిన 'జిప్సీ క్వీన్' ఉన్నాయి. వెనిస్ చలన చిత్రోత్సవంలో ప్రదర్శించిన 'హౌస్‌కీపింగ్ ఫర్ బిగినర్స్' చిత్రంలోనూ ఆమె నటించారు.
సెప్టెంబరు 2026లో జరిగిన 83వ వెనిస్ అంతర్జాతీయ చలన చిత్రోత్సవంలోని 'వెనిస్ స్పాట్‌లైట్' విభాగంలో ప్రదర్శించిన 'ఐ మ్యాటర్' చిత్రం... ప్రతిష్ఠాత్మక 'అర్మానీ బ్యూటీ ఆడియెన్స్ అవార్డు'ను సొంతం చేసుకుంది. ఈ చిత్రంలో రెబెకా పాత్రలో దేనిసా ఫర్కాస్ నటించగా, సోరిన్ మిహాయ్, ఏంజెలీనా పావెల్, వనేసా డాన్సియా, రైసా మిహాయ్, అలెగ్జాండ్రు స్టాన్‌కు, అలీనా బెర్జున్‌టియాను, నటాలియా కాలిన్ తదితరులు ఇతర ప్రధాన పాత్రల్లో నటించారు.
ఇఫి-2026లో 'మిడ్-ఫెస్ట్' ప్రదర్శనగా 'ఐ మ్యాటర్' చిత్రాన్ని నవంబరు 24న సాయంత్రం 4:30 గంటలకు పీవీఆర్ ఐనాక్స్ పంజిమ్ (ఆడిటోరియం 1), పీవీఆర్ ఐనాక్స్ పోర్వోరిమ్ (ఆడిటోరియం 1)లో ఒకే సమయంలో ప్రదర్శిస్తారు. ఈ చిత్ర దర్శకురాలు అలీనా షెర్బాన్, ప్రధాన నటి దేనిసా ఫర్కాస్ ప్రత్యేక అతిథులుగా ఈ వేడుకకు హాజరవుతారు. స్క్రీనింగ్ రోజున పీవీఆర్ ఐనాక్స్ పంజిమ్‌లో చిత్ర బృందం కోసం ప్రత్యేకంగా రెడ్-కార్పెట్ వేడుకను నిర్వహిస్తారు.
గోవాలో పలు వేదికలపై నవంబర్ 20 నుంచి 28 వరకు జరగనున్న 57వ భారత అంతర్జాతీయ చలనచిత్రోత్సవం (ఇఫి)లో 86 దేశాల నుంచి 150కి పైగా అంతర్జాతీయ చిత్రాలను ప్రదర్శిస్తారు. వివిధ పోటీ, పోటీయేతర విభాగాలు, ప్రత్యేక ప్యాకేజీలు, గతంలోని ప్రత్యేక చిత్రాల ప్రదర్శనలు, నివాళులు, ఇతివృత్త ప్రదర్శనల ద్వారా వివిధ దేశాలు, భాషలు, శైలికి సంబంధించిన చిత్రాలను ఈ వేదిక ఒకచోట చేర్చుతుంది. ఇది సాంస్కృతిక భాగస్వామ్యం, చలనచిత్ర నైపుణ్యానికి అద్భుతమైన వేదికను అందిస్తుంది.
***