ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ రూపకర్తలు, సినీ ప్రియులు, సృజనాత్మక ప్రతిభావంతులను ఒకే వేదికపైకి తీసుకువచ్చే 57వ భారత అంతర్జాతీయ చలన చిత్రోత్సవం (ఇఫి)-2026 నవంబర్ 20 నుంచి 28 వరకు గోవాలో జరుగుతుంది. 'ఎల్లలు లేని కథలు' ఇతివృత్తంతో ఈ ఉత్సవాన్ని నిర్వహిస్తున్నారు. ఈ చలన చిత్రోత్సవానికి పెరుగుతున్న ప్రపంచవ్యాప్త ఆదరణను ప్రతిబింబిస్తూ... 137 దేశాల నుంచి 1,900కి పైగా చిత్రాలు ప్రవేశం కోసం దరఖాస్తు చేసుకున్నాయి. అలాగే 86 దేశాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న 150కి పైగా అంతర్జాతీయ చిత్రాలను ఈ వేదికపై ప్రదర్శిస్తారు. ఇది సంస్కృతుల మధ్య పరస్పర మార్పిడికి, విభిన్న కథాకథనాలకు, చలనచిత్ర నైపుణ్యానికి అద్భుతమైన వేదికగా నిలుస్తుంది.
గోవాలోని తాజ్ సిడే డి గోవా హారిజాన్ వేదికగా 57వ అంతర్జాతీయ చలన చిత్రోత్సవం (ఇఫి)-2026 ప్రారంభ విలేకరుల సమావేశం జరిగింది. గోవా ముఖ్యమంత్రి డాక్టర్ ప్రమోద్ సావంత్ ఈ సమావేశాన్ని ప్రారంభించి భారత, అంతర్జాతీయ చలన చిత్రాలను కీర్తిస్తూ ఉత్సవానికి సంబంధించిన కార్యక్రమ వివరాలను ఆవిష్కరించారు. ఇఫితో గోవాకున్న అనుబంధం పట్ల ఆయన గర్వం వ్యక్తం చేస్తూ... రాష్ట్ర సాంస్కృతిక గుర్తింపులో, వార్షిక క్యాలెండర్‌లో ఈ చలన చిత్రోత్సవం అంతర్భాగమని అభివర్ణించారు. చలనచిత్ర రంగానికి చెందిన ప్రపంచ ప్రముఖులకు స్వాగతం పలికేందుకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున అన్ని ఏర్పాట్లు పూర్తయినట్లు తెలిపారు. ప్రదర్శన వేదికలు, రవాణా సౌకర్యాలు, ఆతిథ్యం, ఇతర ప్రజా సదుపాయాల కోసం చేసిన ఏర్పాట్ల గురించి వివరించారు.
ఎంటర్‌టైన్‌మెంట్ సొసైటీ ఆఫ్ గోవా వైస్ చైర్‌పర్సన్ ఎం డెలిలా ఎం లోబో, కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వశాఖ కార్యదర్శి శ్రీ చంచల్ కుమార్, ఎన్ఎఫ్‌డీసీ చైర్మన్ శ్రీ కృష్ణ కుమార్, ఇఫి-2026 ఫెస్టివల్ డైరెక్టర్ శ్రీ అశుతోష్ గోవారికర్, సమాచార, ప్రసార మంత్రిత్వశాఖ అదనపు కార్యదర్శి శ్రీ ప్రభాత్, ఫీచర్ ఫిల్మ్ జ్యూరీ చైర్మన్ శ్రీ మధుర్ భండార్కర్, నాన్-ఫీచర్ ఫిల్మ్ జ్యూరీ చైర్మన్ శ్రీ హిమాన్షు శేఖర్ ఖాటువా, ఎంటర్‌టైన్‌మెంట్ సొసైటీ ఆఫ్ గోవా సీఈఓ శ్రీ దీపక్ మాండేకర్, ఎన్ఎఫ్‌డీసీ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ ధీరజ్ సింగ్, పీఐబీ వెస్ట్ జోన్ డీజీ స్మితా వత్స్ శర్మ తదితరులు విలేకరుల సమావేశానికి హాజరయ్యారు.
భారత, అంతర్జాతీయ చలనచిత్ర రంగానికి ఇఫి ప్రధాన వేదికగా ఎదిగిందని సమాచార, ప్రసార మంత్రిత్వశాఖ కార్యదర్శి శ్రీ చంచల్ కుమార్ అన్నారు. ఇది చలనచిత్ర రంగంలో అత్యుత్తమ ప్రతిభను, సాంస్కృతిక మార్పిడిని, విభిన్న గళాలతో సముచితమైన అనుసంధానాన్ని ప్రోత్సహిస్తోందని పేర్కొన్నారు. "కథలకు చిరునామా ఉండవచ్చు... కానీ భావోద్వేగాలకు సరిహద్దులు ఉండవు" అనే ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ వ్యాఖ్యను ఆయన ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నారు. ఈ భావనను మరింత వివరంగా చెబుతూ… ఈ ఏడాది ఇతివృత్తమైన 'ఎల్లలు లేని కథలు' గురించి, భౌగోళిక, భాషా, సాంస్కృతిక అడ్డంకులను అధిగమించటంలో సినిమాకున్న సామర్థ్యాన్ని స్పష్టం చేశారు. వివిధ భాషలు, సంస్కృతులు, వర్గాల్లో విస్తరించిన భారతదేశ గొప్ప కథను చెప్పే సంప్రదాయాలను కూడా ఆయన ప్రస్తావించారు. 57వ ఇఫి అంతర్జాతీయ చలనచిత్ర వేదికపై ఉత్సవాల స్థానాన్ని మరింత పటిష్టం చేస్తుందనే విశ్వాసాన్ని వ్యక్తం చేశారు.
భౌగోళిక, భాషా, సాంస్కృతిక హద్దులను చెరిపేసి, సార్వత్రిక మానవ భావోద్వేగాలతో కథలు చెప్పటం ద్వారా ప్రేక్షకులను అనుసంధానించే చిత్రరంగ శక్తిని వివరిస్తూ... ఫెస్టివల్ డైరెక్టర్ అశుతోష్ గోవారికర్ 'ఎల్లలు లేని కథలు' ఇతివృత్తాన్ని వివరించారు.
ఈ చలనచిత్రోత్సవానికి సంబంధించిన ప్రపంచవ్యాప్త విస్తృతి, విభిన్న చిత్రాల ప్రదర్శన, మారుతున్న గుర్తింపును ప్రస్తావిస్తూ... ఎన్‌ఎఫ్‌డీసీ ఎండీ ధీరజ్ సింగ్ ఈ ఉత్సవ సమగ్ర దృక్పథాన్ని వివరించారు.
57వ ఎడిషన్‌లోని ముఖ్యాంశాలు
ప్రారంభ చిత్రం
ప్రఖ్యాత దర్శకుడు పావెల్ పావ్లికోవ్‌స్కీ తెరకెక్కించిన 'ఫాదర్‌ల్యాండ్' ఈ చిత్రోత్సవానికి ప్రారంభ చిత్రంగా ఎంపికైంది. 1949లో నోబెల్ బహుమతి గ్రహీత థామస్ మన్, ఆయన కుమార్తె ఎరికా యుద్ధానంతరం విభజనకు గురైన జర్మనీలో చేసిన ప్రయాణం నేపథ్యంలో ఈ చిత్రం సాగుతుంది. ఆ కాలపు రాజకీయ, వ్యక్తిగత విభేదాలను ఇది తెలియజేస్తుంది. ఈ చిత్రం కేన్స్- 2026 చలనచిత్రోత్సవంలో 'ఉత్తమ దర్శకుడి అవార్డు'ను గెలుచుకోవటంతో పాటు సిడ్నీ ఫిల్మ్ ప్రైజ్-2026కు కూడా నామినేట్ అయింది.
57వ ఇఫి-2026 మిడ్-ఫెస్ట్ చిత్రంగా 'ఐ మ్యాటర్' ఎంపిక 57వ అంతర్జాతీయ చలన చిత్రోత్సవం (ఇఫి)-2026లో అలీనా సెర్బన్ దర్శకత్వం వహించిన 'ఐ మ్యాటర్' చిత్రాన్ని మిడ్-ఫెస్ట్ చిత్రంగా ప్రదర్శిస్తారు. రొమేనియా, జర్మనీ, బెల్జియం దేశాలు సంయుక్తంగా నిర్మించిన 101 నిమిషాల నిడివి గల ఈ చిత్రంలో రొమేనియన్, రోమనీ భాషల్లో సంభాషణలున్నాయి. ఈ చలన చిత్రోత్సవానికి విభిన్న యూరోపియన్ సినిమా దృక్పథాన్ని ఇది తీసుకువస్తుంది.
గాలా ప్రీమియర్లు
గాలా ప్రీమియర్ల విభాగంలో 14 ప్రదర్శనలు ఉంటాయి. 87 దేశాల భాగస్వామ్యంతో ఎంపిక చేసిన చిత్రాలను ఇందులో ప్రదర్శిస్తారు. విభిన్నమైన చలనచిత్ర కథలను, అత్యుత్తమ చిత్రనిర్మాణ ప్రతిభను వీక్షించే అవకాశాన్ని ఇది ప్రేక్షకులకు కల్పిస్తుంది.
ప్రత్యేక అతిథి దేశం: స్పెయిన్
స్పెయిన్‌ను ప్రత్యేక అతిథి దేశంగా 57వ భారత అంతర్జాతీయ చలనచిత్ర మహోత్సవంలో పాలుపంచుకుంటున్నది. ఇందులో భాగంగా నాలుగు స్పానిష్ చిత్రాలను ప్రదర్శిస్తున్నారు. ఇందులో జైమీ లోరెంట్ దర్శకత్వం వహించిన 'ది బ్యాడ్ సన్', 'ట్రినిడాడ్', పెడ్రో అల్మోడోవర్ దర్శకత్వం వహించిన 'బిట్టర్ క్రిస్మస్', జైమీ మచియా దర్శకత్వం వహించిన 'పెర్సెగుయెండో ఎ మైఖేల్' చిత్రాలున్నాయి. ఈ ఎంపిక స్పానిష్ చలనచిత్ర రంగాన్ని, వైవిధ్యభరితమైన కథాకథనాన్ని చాటిచెబుతుంది. ఈ చిత్రాలు స్పానిష్ సినీ రూపకర్తలను, వారి సినిమా దృక్పథాన్ని ఇఫి ద్వారా అంతర్జాతీయ వేదికపైకి తీసుకువస్తాయి.
భాగస్వామ్య దేశం: రష్యా
57వ అంతర్జాతీయ చలనచిత్రోత్సవానికి (ఇఫి) భాగస్వామ్య దేశంగా రష్యా వ్యవహరిస్తోంది. రష్యన్ సినిమా వైవిధ్యాన్ని, సృజనాత్మకతను ప్రతిబింబించే నాలుగు చిత్రాల ప్రత్యేక ప్రదర్శన ఇందులో ఉంటుంది. ప్రదర్శించే చిత్రాల్లో 'ఫోర్', 'న్యూ హోమ్', అనస్తాసియా కుజినా దర్శకత్వం వహించిన 'బో బో', 'సిడ్నీ లుమెట్ బర్త్‌డే' ఉన్నాయి. ఈ వేదిక భారత, అంతర్జాతీయ ప్రేక్షకులకు సమకాలీన రష్యన్ సినిమా నిర్మాణం గురించి తెలుసుకునేందుకు, అభివృద్ధి చెందుతున్న చలనచిత్ర రంగాన్ని ఆస్వాదించేందుకు, సినిమా మాధ్యమం ద్వారా భారత్-రష్యా మధ్య సాంస్కృతిక, కళాత్మక మార్పిడిని అభినందించేందుకు సువర్ణావకాశాన్ని అందిస్తుంది.
ఇఫి-2026లో రెండు నూతన విభాగాలు
సినీ అనుభవాలను మరింత విస్తృతం చేసేందుకు, విభిన్న కథాకథనాల రూపాలను వేడుకగా జరుపుకునేందుకు 57వ భారత అంతర్జాతీయ చలనచిత్రోత్సవం (ఇఫి)-2026 ఈ ఏడాది రెండు నూతన విభాగాలను ప్రవేశపెట్టింది. మొదటి విభాగం యానిమేషన్ ద్వారా అయిదు అత్యుత్తమ చిత్రాలను ప్రదర్శిస్తారు. ఇది యానిమేటెడ్ సినిమా రంగంలో సృజనాత్మకతను, ఆవిష్కరణలను చాటిచెబుతుంది. ఇక రెండో విభాగం… ఫిల్మ్స్ అబౌట్ ఫిల్మ్స్ కూడా అయిదు చిత్రాలను ప్రదర్శిస్తుంది. చలనచిత్ర నిర్మాణ కళా నైపుణ్యాలను ముందుకు తీసుకువచ్చే లక్ష్యంతో ప్రముఖ సినీ రూపకర్తల సూచనల మేరకు దీన్ని ఏర్పాటు చేశారు.
ఇఫి-2026లో బ్రిక్స్ దేశాల సినిమాలకు ప్రత్యేక ప్రాధాన్యత
57వ భారత అంతర్జాతీయ చలనచిత్రోత్సవం (ఇఫి) 2026లో మరో ముఖ్య ఆకర్షణగా బ్రిక్స్ దేశాల సినిమాలకు ప్రత్యేక ప్రాధాన్యం ఇవ్వనున్నారు. బ్రిక్స్ విభాగంలో ప్రారంభ చిత్రంగా భారత్‌కు చెందిన రామాయణం ప్రదర్శితం కానుంది. ఈ విభాగంలో మొత్తం 11 సభ్య దేశాలకు చెందిన చిత్రాలతో పాటు భాగస్వామ్య దేశాల చిత్రాలను కూడా ప్రదర్శించనున్నారు. దీని ద్వారా బ్రిక్స్ దేశాల విభిన్న చలనచిత్ర సంప్రదాయాలు, కథా కథన శైలులను వీక్షకులు తెలుసుకునే అవకాశం లభించనుంది.
ఇండియన్ పనోరమా
భారతీయ సినిమా విభాగంలో భాగంగా 18 విభిన్న భాషల్లో మొత్తం 76 చిత్రాలను ప్రదర్శించనున్నారు. ఇది దేశంలోని వైవిధ్యభరితమైన కథా సంప్రదాయాలు, సృజనాత్మక ప్రతిభకు అద్దం పడుతుంది.
ఈ విభాగంలో చిత్రాల ఎంపిక కోసం ఫీచర్ ఫిల్మ్ కేటగిరి నుంచి 404 చిత్రాలు, నాన్-ఫీచర్ విభాగం నుంచి 358 చిత్రాలు దరఖాస్తు చేసుకున్నాయి. ఉత్తమ వెబ్ సిరీస్ (ఓటీటీ) విభాగంలో 46 అర్హమైన ఎంట్రీలు అందాయి.
https://static.pib.gov.in/WriteReadData/userfiles/file/2026/nov/image008_20261113143545_57ab2a.gif
https://static.pib.gov.in/WriteReadData/userfiles/file/2026/nov/image009_20261113143551_7ebd76.gif
ఇఫి-2026లో ‘ధురంధర్’, ‘బికమింగ్’ చిత్రాలతో ప్రారంభం కానున్న ఇండియన్ పనోరమా
57వ భారత అంతర్జాతీయ చలనచిత్రోత్సవం 2026లో ఇండియన్ పనోరమా విభాగం హిందీ ఫీచర్ ఫిల్మ్ ధురంధర్, లడఖీ భాషలో రూపొందిన నాన్-ఫీచర్ ఫిల్మ్ బికమింగ్ చిత్రాలతో ప్రారంభం కానుంది. విభిన్న భాషా, చలనచిత్ర నేపథ్యాలకు చెందిన ఈ రెండు చిత్రాలను ప్రారంభ చిత్రాలుగా ఎంపిక చేయడం ద్వారా భారత్‌లోని వైవిధ్యభరితమైన కథా సంప్రదాయాలను గౌరవించడంతో పాటు, సరిహద్దులు లేని సినిమాను ప్రోత్సహించాలన్న ఇఫి లక్ష్యం ప్రతిబింబిస్తోంది.
ఉత్తమ తొలి ఫీచర్ చిత్రాల పోటీ
57వ భారత అంతర్జాతీయ చలనచిత్రోత్సవం (ఇఫి)లో ఉత్తమ తొలి ఫీచర్ చిత్రాల పోటీని నిర్వహిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా కొత్తగా ఎదుగుతున్న దర్శకులను, వారి వినూత్న చలనచిత్ర దృక్పథాలను ప్రోత్సహించే ఈ పోటీలో వివిధ దేశాలకు చెందిన ఏడు చిత్రాలు ప్రదర్శితం కానున్నాయి. వీటిలో జర్మనీకి చెందిన ఫేడింగ్ మ్యాన్, భారత్‌కు చెందిన ది స్లెడ్జ్, బెల్జియంకు చెందిన పారిస్, ఈజిప్ట్‌కు చెందిన ది బ్లాక్ సీ, ఫ్రాన్స్, ఇటలీ సంయుక్తంగా రూపొందించిన ఎల్ ఏజ్ డోర్ (ది గోల్డెన్ ఏజ్), భారత్‌కు చెందిన బర్డ్స్ ఆన్ ఐస్, చైనాకు చెందిన అట్లాంటిక్ చిత్రాలు ఉన్నాయి. తొలిసారిగా ఫీచర్ చిత్రాలకు దర్శకత్వం వహించిన వారికి తమ ప్రతిభను ప్రదర్శించేందుకు, విస్తృత గుర్తింపు పొందేందుకు, ప్రపంచవ్యాప్త ప్రేక్షకులతో మమేకమయ్యేందుకు ఈ పోటీ అంతర్జాతీయ వేదికగా నిలుస్తుంది. కొత్త ప్రతిభను ప్రోత్సహించడం, భవిష్యత్తు తరం చలనచిత్ర దర్శకులను తీర్చిదిద్దడంపై ఇఫికి ఉన్న నిబద్ధతను ఈ పోటీ చాటుతోంది.
https://static.pib.gov.in/WriteReadData/userfiles/file/2026/nov/image010_20261113143557_b4d97b.gif
మహిళా దర్శకులు, తొలి చిత్రాల దర్శకులు, వర్ధమాన ప్రతిభకు ప్రాధాన్యం
వినూత్న దృక్పథాలు, విభిన్న కథా కథనాలను ప్రోత్సహించే లక్ష్యంతో 57వ ఇఫిలో 52 మంది మహిళా దర్శకులు, 62 మంది తొలి చిత్రాల దర్శకులు తమ చిత్రాలతో భాగస్వాములు కానున్నారు. భారతీయ, అంతర్జాతీయ సినిమా రంగంలో విస్తరిస్తున్న సృజనాత్మకతకు ఇది నిదర్శనం. పోటీ విభాగాల్లో 10 మంది మహిళా దర్శకులు, 12 మంది తొలి చిత్రాల దర్శకుల ప్రతిభకు ప్రత్యేకంగా ప్రాధాన్యం ఇవ్వనున్నారు. మహిళల స్వరాలకు మరింత ప్రాధాన్యం కల్పించడం, కొత్త ప్రతిభను ప్రోత్సహించడం, భవిష్యత్తు తరం కథకులకు అంతర్జాతీయ వేదికను అందించడంపై చలనచిత్రోత్సవం నిబద్ధతను ఇది ప్రతిబింబిస్తోంది.
క్రియేటివ్ మైండ్స్ ఆఫ్ టుమారో (సీఎంఓటీ)
క్రియేటివ్ మైండ్స్ ఆఫ్ టుమారో కార్యక్రమం ఆరో సంచికలో భాగంగా 13 విభిన్న చలనచిత్ర నిర్మాణ విభాగాలకు చెందిన ఎంపిక చేసిన 100 మంది ప్రతిభావంతులు పాల్గొననున్నారు.
ఈ కార్యక్రమంలో ప్రత్యేకంగా రూపొందించిన మాస్టర్ క్లాసులు, వర్క్‌షాప్‌లు, ముఖాముఖి చర్చలు, 48 గంటల చలనచిత్ర నిర్మాణ సవాలు, సీఎంఓటీ ప్రతిభ శిబిరం వంటివి నిర్వహించనున్నారు. ప్రముఖ దర్శకులు, చలనచిత్ర పరిశ్రమ నిపుణులతో పాల్గొనేవారు నేరుగా సంభాషించే అవకాశం ఉంటుంది. తమ సృజనాత్మక ఆలోచనలను ప్రదర్శించడంతో పాటు, మీడియా, వినోద పరిశ్రమలో అందుబాటులో ఉన్న అవకాశాలను అన్వేషించనున్నారు.
వేవ్స్ ఫిల్మ్ బజార్
చిత్ర దర్శకులు, నిర్మాతలు, కొనుగోలుదారులు, పంపిణీదారులు, చలనచిత్ర పరిశ్రమకు చెందిన వివిధ వర్గాల ప్రతినిధులను ఒకే వేదికపైకి తీసుకురావడం ద్వారా పరస్పర సహకారం, సంయుక్త నిర్మాణాలు, వ్యాపార అవకాశాలను ప్రోత్సహించేందుకు వేవ్స్ ఫిల్మ్ బజార్ దోహదపడనుంది.
ఈ బజార్‌లో కొనుగోలుదారులు, నిర్మాణ సంస్థలు సహా ఆహ్వానితులైన 150 మంది పాల్గొననున్నారు. ఇందులో భాగంగా స్క్రీన్‌రైటర్స్ ల్యాబ్, కో-ప్రొడక్షన్ మార్కెట్, వ్యూయింగ్ రూమ్, వర్క్ ఇన్ ప్రోగ్రెస్ ల్యాబ్ వంటి కీలక కార్యక్రమాలను నిర్వహించనున్నారు.
https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/2026/nov/image011_20261113143603_e18e91.jpg
వేవ్స్ బజార్‌లో నాలెడ్జ్ సిరీస్ భాగస్వామిగా వ్యవహరిస్తున్న నెట్‌ఫ్లిక్స్.. చలనచిత్ర పరిశ్రమ సామర్థ్యాల పెంపునకు మద్దతు అందించనుంది. భారత్‌లో విజువల్ ఎఫెక్ట్స్ (వీఎఫ్‌ఎక్స్) సామర్థ్యాలను బలోపేతం చేయడం, భవిష్యత్తు అవసరాలకు సిద్ధమైన ప్రతిభావంతుల బృందాన్ని తీర్చిదిద్దడం కోసం ప్రభుత్వంతో కలిసి చేపడుతున్న కార్యక్రమాలను ప్రదర్శించనుంది. ఇందులో భాగంగా పుష్పక్ విమాన్ ప్రత్యేక ప్రీమియర్, రే గన్ అంతర్జాతీయ ప్రదర్శనతో పాటు వర్ధమాన సృజనాత్మక ప్రతిభకు మద్దతునిస్తూ, పరిశ్రమలో అవకాశాలను పెంపొందించే పిచింగ్ సెషన్లలోనూ పాల్గొననుంది.
మాస్టర్ క్లాసులు, ప్యానెల్ చర్చలు, ఇంటరాక్టివ్ కార్యక్రమాలు
ఇఫి 2026లో భాగంగా 2026 నవంబర్ 21 నుంచి 27 వరకు కళా అకాడమీలో 14 సెషన్లు నిర్వహించనున్నారు. వీటిలో మాస్టర్ క్లాసులు, వర్క్‌షాప్‌లు, ప్యానెల్ చర్చలు, రెట్రోస్పెక్టివ్‌లు (గత చిత్రాల ప్రత్యేక ప్రదర్శనలు), ముఖాముఖి సంభాషణలు, ఇంటర్వ్యూ సెషన్లు ఉంటాయి.
ఈ సెషన్లలో చిత్ర దర్శకులు, కళాకారులు, చలనచిత్ర పరిశ్రమ నిపుణులు ఒకచోటి చేరి డాక్యుమెంటరీ సినిమాలు, దేశాల సరిహద్దులు దాటి చిత్ర నిర్మాణం, ప్రపంచ సినిమాను తీర్చిదిద్దుతున్న మహిళలు, కథా కథనం, నటీనటుల ఎంపిక, సబ్‌టైటిలింగ్, అభివృద్ధి చెందుతున్న చలనచిత్ర నిర్మాణ పద్ధతులు తదితర అంశాలపై చర్చించనున్నారు.
శతజయంతి నివాళులు, పునరుద్ధరించిన క్లాసిక్ చిత్రాలు
ప్రముఖ చిత్ర నిర్మాతలు, కళాకారుల సేవలను స్మరించుకుంటూ శతజయంతి నివాళులు, గత చిత్రాల ప్రత్యేక ప్రదర్శనలు, పునరుద్ధరించిన క్లాసిక్ చిత్రాలను ఈ చలనచిత్రోత్సవంలో వేడుకగా ప్రదర్శించనున్నారు.
ప్రముఖ చిత్ర దర్శకుడు ఆండ్రెజ్ వాజ్డా శతజయంతి సందర్భంగా ప్రత్యేక నివాళిగా ఆయన రూపొందించిన అయిదు చిత్రాలను ప్రదర్శించనున్నారు. అలాగే పునరుద్ధరించిన క్లాసిక్ చిత్రాల విభాగంలోనూ అయిదు సినిమాలను ప్రదర్శించనున్నారు. దీని ద్వారా చలనచిత్ర చరిత్రలో విశేష ప్రాధాన్యం పొందిన సినిమాలను మరోసారి వీక్షించే అవకాశం ప్రేక్షకులకు లభించనుంది.
https://static.pib.gov.in/WriteReadData/userfiles/file/2026/nov/image012_20261113143609_165fd8.gif
చలనచిత్రోత్సవ వేదికలు, ప్రజల భాగస్వామ్యం
57వ భారత అంతర్జాతీయ చలనచిత్రోత్సవం (ఇఫి).. గోవాను సందడితో కూడిన చలనచిత్ర గమ్యస్థానంగా మార్చనుంది. తొమ్మిది రోజుల పాటు నాలుగు ప్రాంతాల్లోని 13 ఇండోర్ స్క్రీన్‌లపై సినిమాల ప్రదర్శనలు జరగనున్నాయి. పనాజీలోని ప్రధాన ఉత్సవ కేంద్రంలో ఐనాక్స్, మాక్వినెజ్, సామ్రాట్, అశోక థియేటర్లలో ఏడు స్క్రీన్‌లతో పాటు, పోర్వోరిమ్‌లోని ఐనాక్స్ స్క్రీన్‌లు, మార్గావోలోని ప్రసిద్ధ రవీంద్ర భవన్, పొండాలోని మ్యాజిక్ మూవీ థియేటర్లలోనూ ప్రదర్శనలు నిర్వహించనున్నారు. విభిన్న ప్రదర్శనా వేదికలు, 4,000 మందికి పైగా ప్రేక్షకులు కూర్చునే మొత్తం సామర్థ్యంతో, ప్రపంచ సినిమా వైభవాన్ని గోవా అంతటా ఉన్న ప్రేక్షకులకు మరింత చేరువ చేయనుంది ఇఫి.
శతజయంతి వేడుకలు
ఇఫి 2026లో భారతీయ సినిమా రంగానికి చెందిన ప్రముఖుల శతజయంతి వేడుకలను ఘనంగా నిర్వహించనున్నారు. దిగ్గజ దర్శకులు శక్తి సామంత, రాజ్ ఖోస్లా, నటులు ఉత్తమ్ కుమార్, సూర్యకాంత్ మాంధారే, ప్రేమ్ నజీర్, రాజ్ కుమార్, ప్రముఖ సంగీత దర్శకులు ఓపీ నయ్యర్, రవి సేవలను స్మరించుకుంటూ నివాళులర్పించనున్నారు. భారతీయ సినిమా, సంగీత వారసత్వాన్ని తీర్చిదిద్దడంలో వారు అందించిన విశిష్ట సేవలను, చిరస్మరణీయ కీర్తిని ఈ ఉత్సవం గౌరవించనుంది.
https://static.pib.gov.in/WriteReadData/userfiles/file/2026/nov/image013_20261113143615_55a91a.gif
https://static.pib.gov.in/WriteReadData/userfiles/file/2026/nov/image014_20261113143620_193e40.gif
ఆంథోనీ చెన్ దర్శకత్వం వహించిన ‘వి ఆర్ ఆల్ స్ట్రేంజర్స్’ చిత్రంతో ముగియనున్న 57వ ఇఫి
ఆంథోనీ చెన్ దర్శకత్వం వహించిన ‘వి ఆర్ ఆల్ స్ట్రేంజర్స్’ చిత్రం 57వ భారత అంతర్జాతీయ చలనచిత్రోత్సవం ముగింపు చిత్రంగా ప్రదర్శితం కానుంది. సింగపూర్‌కు చెందిన ఈ చిత్రం 157 నిమిషాల నిడివి కలిగి ఉంది. మాండరిన్, ఆంగ్ల భాషల్లో రూపొందిన ఈ చిత్రం సమకాలీన సింగపూర్ సినిమా నుంచి ఒక విశిష్టమైన చిత్రంగా ఉత్సవాలకు ముగింపును అందించనుంది.
భారత అంతర్జాతీయ చలనచిత్రోత్సవం (ఇఫి) గురించి
1952లో ప్రారంభమైన భారత అంతర్జాతీయ చలనచిత్రోత్సవం ఆసియాలోనే అత్యంత పురాతనమైన, ప్రముఖ అంతర్జాతీయ చలనచిత్రోత్సవాల్లో ఒకటి. కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ, గోవా ప్రభుత్వం, ఎంటర్‌టైన్‌మెంట్ సొసైటీ ఆఫ్ గోవా సంయుక్తంగా ఈ ఉత్సవాన్ని నిర్వహిస్తున్నాయి. ప్రపంచ సినిమా రంగంలోని ఉత్తమ చిత్రాలను ప్రదర్శించడంతో పాటు, భారతీయ చిత్రాలు, ప్రతిభను అంతర్జాతీయ వేదికపై ప్రోత్సహించడం ఈ ఉత్సవం లక్ష్యం. ప్రతి ఏడాది గోవాలో జరిగే ఈ చలనచిత్రోత్సవం సృజనాత్మక ఆలోచనల పరస్పర మార్పిడికి, కొత్త ప్రతిభావంతులను పరిచయం చేయడానికి, సినిమా ద్వారా సాంస్కృతిక అవగాహనను పెంపొందించడానికి వేదికగా నిలుస్తోంది.
https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/2026/nov/image015_20261113143626_775d04.jpg
జాతీయ చలనచిత్ర అభివృద్ధి సంస్థ (ఎన్‌ఎఫ్‌డీసీ) గురించి
భారత జాతీయ చలనచిత్ర అభివృద్ధి సంస్థ (ఎన్‌ఎఫ్‌డీసీ).. సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని ప్రభుత్వ రంగ సంస్థ. 1975లో స్థాపించిన ఈ సంస్థ భారతీయ సినిమాను ప్రోత్సహించడంలో, స్వతంత్ర చిత్ర నిర్మాతలకు మద్దతు అందించడంలో, అంతర్జాతీయ భాగస్వాములతో సంయుక్త నిర్మాణాలకు సహకరించడంలో కీలక పాత్ర పోషిస్తోంది. మీడియా, వినోద రంగాల్లో భారతీయ సృజనకారులను అంతర్జాతీయ మార్కెట్లతో అనుసంధానిస్తూ, సహకార అవకాశాలను కల్పించే వేవ్స్ ఫిల్మ్ బజార్ నిర్వహణ బాధ్యతలను కూడా ఎన్‌ఎఫ్‌డీసీ చేపడుతోంది.
https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/2026/nov/image016_20261113143632_61153e.jpg