కొన్ని ప్రయాణాలు భౌగోళిక సరిహద్దులను దాటి సాగితే… మరికొన్ని జ్ఞాపకాలు, అస్తిత్వం, ఆత్మీయ అనుబంధాల లోతుల్లోకి సాగుతాయి. చరిత్రను, అత్యంత వ్యక్తిగతమైన మానవ సంబంధాలను మేళవించి ప్రముఖ పోలిష్ దర్శకుడు పావెల్ పావ్లికోవ్స్కీ రూపొందించిన ‘ఫాదర్ల్యాండ్’ చిత్రం 57వ భారత అంతర్జాతీయ చలనచిత్రోత్సవానికి (ఐఎఫ్ఎఫ్ఐ) ప్రారంభ చిత్రంగా ఎంపికైంది. గోవాలో తొమ్మిది రోజుల పాటు జరగనున్న ఈ ప్రపంచ సినిమా వేడుకలకు ఈ చిత్రం ఒక చక్కని ఆరంభాన్ని ఇవ్వనుంది.
ప్రచ్ఛన్న యుద్ధం తీవ్రస్థాయిలో ఉన్న 1949 వేసవి కాలం నేపథ్యంలో ఈ చిత్రం సాగుతుంది. నోబెల్ బహుమతి గ్రహీత, ప్రముఖ జర్మన్ రచయిత థామస్ మాన్, ఆయన కుమార్తె ఎరికా (నటి, రచయిత్రి, ర్యాలీ డ్రైవర్) మధ్య అనుబంధాన్ని 'ఫాదర్ల్యాండ్' ఆవిష్కరిస్తుంది. అమెరికాలో పదహారేళ్ల ప్రవాస జీవితం తర్వాత తిరిగి జర్మనీకి వచ్చిన థామస్ మాన్, తన కుమార్తెతో కలిసి ఒక నల్లటి బ్యూక్ కారులో సాహసోపేతమైన రోడ్ ట్రిప్‌కు బయలుదేరుతారు. యుద్ధం వల్ల ఛిన్నాభిన్నమైన జర్మనీ గుండా సాగే వీరి ప్రయాణం... అమెరికా ఆధీనంలో ఉన్న ఫ్రాంక్ఫర్ట్ నుంచి సోవియట్ నియంత్రణలో ఉన్న వీమర్ వరకు కొనసాగుతుంది.
విడిపోయిన జర్మనీ గుండా సాగే ఈ తండ్రీకూతుళ్ల ప్రయాణంలో... యుద్ధం మిగిల్చిన బాహ్య గాయాల కంటే లోతైన విషయాలనూ వారు ఎదుర్కొంటారు. ఈ ప్రయాణం వారి సొంత కుటుంబంలోని అంతర్గత విభేదాలను, అగాధాలనూ వారి కళ్ళముందు ఉంచుతుంది. భావోద్వేగాలతో నిండిన ఈ కథనం ద్వారా... వ్యక్తిగత అనుబంధాలు, చరిత్ర, 'ఇల్లు' (మాతృభూమి) అనే భావనల మధ్య గల సున్నితమైన సంబంధాలను ఈ చిత్రం అద్భుతంగా ఆవిష్కరిస్తుంది.
సాండ్రా హుల్లర్, హాన్స్ జిష్లర్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ 82 నిమిషాల డ్రామా చిత్రం పోలండ్, జర్మనీ, ఇటలీ, ఫ్రాన్స్ దేశాల సంయుక్త నిర్మాణంలో రూపుదిద్దుకుంది. పూర్తిగా బ్లాక్ అండ్ వైట్ ఫార్మాట్లో తెరకెక్కిన ఈ చిత్రం... 57వ భారత అంతర్జాతీయ చలనచిత్రోత్సవం వేదికగా తొలిసారిగా భారతీయ ప్రేక్షకుల ముందుకు రానుంది.
యూరోపియన్ చరిత్రలోని ఒక కీలక ఘట్టం నేపథ్యంలో... చరిత్రను, మానవ సంబంధాలను అత్యంత ఆత్మీయంగా ఆవిష్కరించే దర్శకుడు పావెల్ పావ్లికోవ్స్కీ శైలికి 'ఫాదర్ల్యాండ్' ఒక కొనసాగింపు. ఈ చిత్రాన్ని ఇప్పటికే 2026లో జరిగిన కేన్స్, శాన్ సెబాస్టియన్, టెల్యురైడ్ వంటి ప్రతిష్ఠాత్మక అంతర్జాతీయ చలనచిత్రోత్సవాల్లో ప్రదర్శించారు. ఈ చిత్రం విమర్శకుల నుంచి మంచి ప్రశంసలు అందుకుంది. కేన్స్ చిత్రోత్సవంలో పావ్లికోవ్స్కీకి 'ఉత్తమ దర్శకుడు' పురస్కారాన్నీ అందించింది.
'ఫాదర్ల్యాండ్' చిత్రంతో 57వ భారత అంతర్జాతీయ చలనచిత్రోత్సవం... భౌగోళిక, సాంస్కృతిక సరిహద్దులకు అతీతమైన కథల ప్రయాణానికి శ్రీకారం చుట్టనుంది. విభిన్న ప్రపంచాలను, దృక్పథాలను సినిమా ఒకే వేదికపైకి తీసుకువస్తున్న తరుణంలో... ‘సరిహద్దులకు అతీతమైన కథలు’ అనే ఇతివృత్తంతో సాగనున్న ఈ ఏడాది చిత్రోత్సవానికి ఈ ప్రారంభ చిత్రం ఒక అత్యంత సముచితమైన ఆరంభాన్ని అందిస్తుంది.
***