నాడు పోస్టు చేయడమైనది:
12 NOV 2026 2:44PM by PIB Hyderabad
కేంద్రీయ విద్యాలయ సంఘటన్ (కేవీఎస్)కు చెందిన మూడు ప్రధాన డిజిటల్ కార్యక్రమాలను కేంద్ర విద్యాశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి నేడు న్యూఢిల్లీలో ప్రారంభించారు. వీటిలో ‘సమీక్ష’ ఏఐ బాట్‌తో కూడిన కృత్రిమ మేధ (ఏఐ) అనుసంధానిత విద్యా సమీక్ష కేంద్రం (వీఎస్‌కే), కేవీఎస్-సంవాద్ పేరెంట్ కనెక్ట్ యాప్, వెబ్ పోర్టల్, కేవీఎస్ పూర్వ విద్యార్థుల అనుసంధాన వేదికలు ఉన్నాయి. సాంకేతికత ఆధారిత, పారదర్శక, సమర్థవంతమైన పరిపాలన దిశగా కేవీఎస్ ప్రయాణంలో ఇది కీలక మైలురాయిగా నిలుస్తుంది.
జాతీయ విద్యా విధానం (ఎన్‌ఈపీ) 2020 లక్ష్యాల సాధనకు, డిజిటల్ ఇండియా దార్శనికతను ముందుకు తీసుకెళ్లేందుకు ఈ కార్యక్రమాలు గణనీయమైన ముందడుగు అని కేంద్ర మంత్రి పేర్కొన్నారు. ఈ కార్యక్రమాలను రూపొందించిన బృందాన్ని అభినందించిన ఆయన.. మరింత విస్తృతంగా అమలు చేసేందుకు వాటిని బలోపేతం చేసి, ఇతరులకు ఆదర్శంగా నిలిచేలా ప్రోత్సహించాలని సంబంధిత భాగస్వాములకు సూచించారు. ప్రతి కేంద్రీయ విద్యాలయంలోని అన్ని తరగతులు, ప్రాంతాలకు ఈ కార్యక్రమాలను విస్తరించాలని పిలుపునిచ్చారు. నిరంతర అభ్యాస విధానాన్ని అనుసరిస్తూ, ఫలితాలను అంచనా వేయాలని, మెరుగుదల అవసరమైన అంశాలను గుర్తించి పరిష్కరించాలని సూచించారు.
కేవలం కేవీఎస్‌కే పరిమితం కాకుండా, పాఠశాల విద్యా వ్యవస్థలోని విద్యార్థులందరికీ ప్రయోజనం చేకూరేలా ఈ కార్యక్రమాలను పాఠశాల విద్య, అక్షరాస్యత విభాగం (డీఓఎస్‌ఈఎల్) సహకారంతో విస్తరించాలని శ్రీ ప్రహ్లాద్ జోషి సూచించారు. ఉపాధ్యాయుల సామర్థ్య పెంపునకు శిక్షణ ఎంతో ముఖ్యమని పేర్కొంటూ, ఉపాధ్యాయులకు సంబంధించిన సమగ్ర శిక్షణ సమాచారాన్ని వేదికలో పొందుపరచాలని సూచించారు. ఇందులో ఉపాధ్యాయుల శిక్షణ స్థితి, శిక్షణ మధ్య వ్యవధి, గతంలో పొందిన శిక్షణ వివరాలు, భవిష్యత్తులో అవసరమైన శిక్షణ వివరాలు ఉండాలని తెలిపారు. ఈ సమాచారాన్ని ఆన్‌లైన్ వేదికలో అనుసంధానించడం ద్వారా శిక్షణ కార్యక్రమాలను మెరుగ్గా పర్యవేక్షించడంతోపాటు, సకాలంలో శిక్షణ అందేలా చూడవచ్చని ఆయన పేర్కొన్నారు.
ఏఐ అనుసంధానిత విద్యా సమీక్ష కేంద్రం
ఏఐ అనుసంధానిత విద్యా సమీక్ష కేంద్రం (samiksha.kvs.gov.in) విద్యార్థులు, సిబ్బంది హాజరు, విద్యా ప్రగతి, పాఠశాల మౌలిక సదుపాయాలు, ప్రవేశాల వివరాలకు సంబంధించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు డ్యాష్‌బోర్డుల రూపంలో అందిస్తుంది. ఇందులోని ‘సమీక్ష’ ఏఐ బాట్ డేటాను విశ్లేషించి, లోపాలను గుర్తించడంతోపాటు, వాటి పరిష్కారానికి తగిన చర్యలను సూచిస్తుంది. తద్వారా సమాచార ఆధారిత నిర్ణయాలను సకాలంలో తీసుకునేందుకు వీలవుతుంది.
కేవీఎస్-సంవాద్ పేరెంట్ కనెక్ట్ యాప్, వెబ్ పోర్టల్
కేవీఎస్-సంవాద్ పేరెంట్ కనెక్ట్ యాప్, వెబ్ పోర్టల్ (samvaad.kvs.gov.in) పాఠశాలలకు, తల్లిదండ్రులకు మధ్య అనుసంధానాన్ని మరింత బలోపేతం చేస్తుంది. విద్యార్థుల హాజరు, సిలబస్ బోధనలో పురోగతి, విద్యా ఫలితాలు, అభ్యాస వనరులు, డిజిటల్ విద్యార్థి గుర్తింపు కార్డులను ఎప్పటికప్పుడు అందుబాటులో ఉంచుతుంది. బోనఫైడ్, సీఈఏ ధ్రువపత్రాలు, విద్యార్థుల సెలవుల కోసం తల్లిదండ్రులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. విద్యార్థులు, ఉపాధ్యాయుల డైరీలను కూడా వీక్షించవచ్చు. ఈ విధానం ద్వారా పత్రాల పని తగ్గడంతోపాటు, అనవసరంగా పాఠశాలలకు వెళ్లాల్సిన అవసరం తగ్గుతుంది. అదే సమయంలో తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల మధ్య సమాచార మార్పిడి మరింత మెరుగుపడుతుంది.
కేవీఎస్ పూర్వ విద్యార్థుల వేదిక
కేవీఎస్ పూర్వ విద్యార్థుల వేదిక (alumni.kvs.gov.in) మాజీ విద్యార్థులు తమ పాఠశాలలు, తోటి విద్యార్థులతో తిరిగి అనుసంధానమయ్యేందుకు ప్రత్యేక వేదికగా ఉపయోగపడుతుంది. తమ విజయాలు, అనుభవాలను పంచుకోవడంతోపాటు, మార్గదర్శకత్వం, కెరీర్ సలహాలు, విద్యాసంస్థల అభివృద్ధికి తోడ్పడే అవకాశాన్ని కల్పిస్తుంది.
కేవీఎస్ ప్రధాన కార్యాలయంలోని ఐటీ సర్వీసెస్ సెల్ ఈ డిజిటల్ వేదికలను అంతర్గతంగా అభివృద్ధి చేసింది. తల్లిదండ్రులు, విద్యార్థులు, ఉపాధ్యాయులు, పరిపాలనా సిబ్బందికి అవసరమైన సమాచారం, సేవలను ఒకే క్లిక్‌తో అందుబాటులోకి తీసుకురావడం, తద్వారా వారి సమయం, శ్రమను ఆదా చేయడం ఈ వేదికల లక్ష్యం. విద్యా సేవలను మరింత అందుబాటులోకి తీసుకురావడం, ప్రజల అవసరాలకు వేగంగా స్పందించడం, పారదర్శకత, సమర్థతను పెంపొందించడంలో కేవీఎస్ నిబద్ధతను ఈ కార్యక్రమాలు తెలియజేస్తాయి.
***