హోం మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వంలో కేంద్ర హోంమంత్రి శ్రీ అమిత్ షా మార్గదర్శకత్వంలో భారత వీసా నిబంధనలను సులభతరం చేసిన కేంద్ర ప్రభుత్వం

వీసా నిబంధనల సరళీకరణలో భాగంగా ప్రధాన వీసా కేటగిరీలు 13 నుంచి 9కి, ఉప కేటగిరీలు 49 నుంచి 23కి తగ్గింపు

విదేశీ పర్యాటకుల రాకను ప్రోత్సహించటం, వైద్య పర్యాటకాన్ని, విదేశీ విద్యార్థుల రాకను మరింత మెరుగుపరచటం సరళీకరణ ప్రక్రియ ప్రధాన ఉద్దేశం

23 వీసా ఉప కేటగిరీల దరఖాస్తు ఫారాల్లో పూరించాల్సిన ఫీల్డుల సంఖ్య 65 శాతం నుంచి 70 శాతానికి తగ్గింపు... తద్వారా సులభంగా, వేగంగా, దరఖాస్తుదారులకు అనుకూలంగా దరఖాస్తు ప్రక్రియ

ఈ మార్పుల వల్ల తగ్గనున్న వీసా రకాల మధ్య గందరగోళం... పర్యాటకులు, రోగులు, విద్యార్థులు, పరిశోధకులు, పెట్టుబడిదారులు, వ్యాపార నిపుణులకు వీసా నిబంధనల సరళీకరణ

స్పష్టమైన, నిర్దిష్ట ప్రయోజన ఆధారిత వీసా ఐచ్ఛికాల ద్వారా భారత్‌తో చట్టబద్ధమైన ప్రయాణం, విద్య, ఆరోగ్య సంరక్షణ, ఆర్థిక సంబంధాలను బలోపేతం చేయటమే లక్ష్యం

నాడు పోస్టు చేయడమైనది: 11 NOV 2026 7:39PM by PIB Hyderabad

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వంలో కేంద్ర హోంమంత్రి శ్రీ అమిత్ షా మార్గదర్శకత్వంలో భారత వీసా నిబంధనలను కేంద్ర ప్రభుత్వం సరళీకరించింది. భారత్‌ను సందర్శించే విదేశీయుల అవసరాలకు తగినట్లుగా, మరింత సమగ్రంగా, పొందికగా, స్పష్టంగా ఉండేలా ఈ చర్య తీసుకున్నారు. కేంద్ర హోంశాఖ ఆగస్టు 27, 2026న ప్రధాన వీసా కేటగిరీలను 13 నుంచి 9కి, ఉప-కేటగిరీలను 49 నుంచి 23కి తగ్గించింది. అంతకుముందు 2025 అక్టోబర్‌లో చేపట్టిన సరళీకరణ ప్రక్రియకు కొనసాగింపుగా ఈ చర్యను చేపట్టింది. ఆ సమయంలో ప్రధాన వీసా కేటగిరీలను 22 నుంచి 13కి, ఉప-కేటగిరీలను 63 నుంచి 49కి తగ్గించారు. భారత వీసా నిబంధనల సరళీకరణ ప్రక్రియలో భాగంగా అభివృద్ధి చెందిన దేశాల వీసా వ్యవస్థలు, ప్రపంచ స్థాయి ప్రమాణాలను భారత ప్రభుత్వం అధ్యయనం చేసింది.

ఒకే విధమైన పర్యటనా ప్రయోజనాలను విలీనం చేయటం ద్వారా విదేశీయుల అవసరాలకు తగిన వీసా కేటగిరీని సులభంగా గుర్తించేందుకు, స్పష్టతను పెంపొందించేందుకు వీలవుతుంది. తద్వారా వీదేశీయుల రాకపోకలు పెరుగుతాయి.

ప్రస్తుతం ఈ-వీసా ప్రక్రియలో 13 ఉప-కేటగిరీల్లో ఎలక్ట్రానిక్ ట్రావెల్ ఆథరైజేషన్ ద్వారా దరఖాస్తుల ప్రక్రియ జరుగుతోంది. ప్రస్తుతం ఈ-వీసా సౌకర్యం 172 దేశాల పౌరులకు అందుబాటులో ఉంది.

సందర్శకుల వీసా: స్వల్పకాలిక, దీర్ఘకాలిక పర్యటనలకు మరింత వెసులుబాటు

సంప్రదాయ పర్యాటక రంగానికి మించి అనుమతించిన విస్తృత శ్రేణి ప్రయోజనాలను ప్రతిబింబించేలా గతంలోని టూరిస్టు వీసాను 'విజిటర్ వీసా'గా మార్చారు. దరఖాస్తుదారులు ప్రతిపాదిత సందర్శన స్వభావం, కాలవ్యవధికి తగిన వీసాను ఎంచుకునేలా ఈ కేటగిరీని వీ-1, వీ-2 రెండు ఉప-కేటగిరీలుగా విభజించారు.

  • వీ-1 వీసా: ఇతర అర్హత గల సందర్శక కార్యకలాపాలతో పాటు వ్యాపార సమావేశాలు, వైద్య సంప్రదింపులు, ఆరోగ్య శిబిరాలు, స్వల్పకాలిక వైద్య చికిత్స, భారతీయ భాషలు, సంగీతం, కళలు, హస్తకళలకు సంబంధించిన స్వల్పకాలిక కోర్సుల వంటి వాటికి ఈ వీసా వర్తిస్తుంది. 30 రోజుల కాలపరిమితితో పలుమార్లు దేశాన్ని సందర్శించే సదుపాయంతో ఈ వీసాను మంజూరు చేస్తారు.

  • వీ-2 వీసా: ఈ రకమైన వీసా దీర్ఘకాలిక సందర్శనలకు ఉద్దేశించినది. నిర్దేశించినట్లుగా 1, 5, పదేళ్ల కాలపరిమితితో మంజూరు చేస్తారు. ఇది వీ-1 ద్వారా అనుమతించే కార్యకలాపాలతో పాటు పర్వతారోహణ కోసం పలుమార్లు దేశాన్ని సందర్శించేలా ఆరు నెలల కాలపరిమితితో వీసాని మంజూరు చేస్తారు.

స్వల్పకాలిక పర్యటనలకు సంబంధించి విస్తృత కార్యకలాపాలను ఒకే కేటగిరీలోకి చేర్చటం ద్వారా ప్రయాణికులు వీసాను ఎంచుకోవటం సులభతరం అవుతుంది. ఒకే పర్యటనలో విహారయాత్రతో పాటు వ్యాపార సమావేశాలు, వైద్య సలహాలు, ఆరోగ్య శిబిరాలు, సాంస్కృతిక అభ్యాసం, స్వల్పకాలిక యోగా కోర్సుల కోసం ప్రయాణికులు వీసాను సులభంగా ఎంచుకోవచ్చు. పదేపదే భారత్‌ను సందర్శించేవారికి దీర్ఘకాలిక వీ-2 ఆప్షన్ నిరంతర సౌలభ్యాన్ని అందిస్తుంది. పర్వతారోహణ చేసే వారి ప్రత్యేక అవసరాల నిమిత్తం ప్రత్యేకమైన నిబంధనలను పొందుపరిచారు.

మెడికల్ వీసా: నిరంతర సంరక్షణ, తరచూ సందర్శనల సౌలభ్యం

సంప్రదాయ, ఆయుష్ విధానాల ద్వారా చికిత్స పొందేందుకు వైద్య వీసా విధానంలో ప్రత్యేక నిబంధనలున్నాయి. ఆయుష్ విధానాలు కాకుండా ఇతర వైద్య చికిత్సలను ఎం-1 వీసా, ఆయుష్ విధానాల ద్వారా చికిత్సకు ఎం-3 వీసా వర్తిస్తాయి. ఎం-1, ఎం-3 వీసాలతో పాటు వాటి ఈ-వీసాలను సాధారణంగా ఒక ఏడాది కాలపరిమితితో పలుమార్లు దేశాన్ని సందర్శించే సదుపాయంతో మంజూరు చేస్తారు. దీనికి అనుగుణంగా మెడికల్ అటెండెంట్ వీసా నిబంధనలు కూడా ఉన్నాయి. దీని ప్రకారం ఎం-1, ఎం-3 వీసాదారుల సహాయకుల కోసం వరుసగా ఎం-2, ఎం-4 వీసాలను మంజూరు చేస్తారు.

తరచూ వైద్యులను సంప్రదించాల్సి వచ్చినప్పుడు, తదుపరి పరీక్షలు, దశలవారీగా చికిత్సలు అవసరమైనప్పుడు ఈ ఏర్పాటు రోగులకు మెరుగైన సౌలభ్యాన్ని అందిస్తుంది. చికిత్స సమయంలో పదేపదే వీసా దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరాన్ని మల్టీపుల్ ఎంట్రీ సదుపాయం తగ్గిస్తుంది. అదే సమయంలో ప్రత్యేక ఆయుష్ నిబంధన సరైన చికిత్స మార్గాన్ని ఎంచుకునేందుకు దరఖాస్తుదారులకు సహాయపడుతుంది. అటెండెంట్ వీసాలు అందుబాటులో ఉండటం వల్ల రోగుల వెంట వచ్చేవారికి వెసులుబాటు ఉంటుంది. ప్రధానమంత్రి 'హీల్ ఇన్ ఇండియా' దార్శనికతకు అనుగుణంగా భారతదేశంలో వైద్య పర్యాటకాన్ని ఇది ప్రోత్సహిస్తుంది.

విద్యార్థి వీసా: విద్య, పరిశోధన కోసం స్పష్టమైన మార్గాలు

విద్యార్థి వీసా విభాగాన్ని రెండు విస్తృత ఉప-విభాగాలుగా ఏకీకృతం చేశారు. పాఠశాల, గ్రాడ్యుయేట్, పోస్ట్-గ్రాడ్యుయేట్ స్థాయి విద్యను ఎస్-1 వీసా కవర్ చేస్తుంది. భారతీయ విశ్వవిద్యాలయాల్లో పీహెచ్‌డీ, పరిశోధనలు చేసే విద్యార్థులకు... సందర్శక అధ్యాపకులకు... పరిశోధనలు, శాస్త్రీయ, మానవశాస్త్ర యాత్రలు, ఇంటర్న్‌షిప్‌లు, విద్యార్థి ఎక్స్‌చేంజ్ కార్యక్రమాలు వంటి ఇతర నిర్దిష్ట విద్యావసరాల కోసం భారత్‌కు వచ్చే విదేశీ పరిశోధక విద్యార్థులకు ఎస్-2 వీసా వర్తిస్తుంది.

 ‘స్టడీ ఇన్ ఇండియా’ పోర్టల్ ద్వారా భారతీయ విద్యా సంస్థల్లో చేరిన విదేశీ విద్యార్థులకు ఈ-ఎస్1 వీసాను ఐదేళ్ల వరకు లేదా వారి కోర్సు కాలపరిమితి వరకు (వీటిలో ఏది తక్కువైతే అది) మంజూరు చేస్తారు. ఈ వీసా ద్వారా వారు ఎన్నిసార్లు అయినా దేశంలోకి వచ్చి వెళ్లేందుకు అనుమతి ఉంటుంది. విద్యార్థులకు సులభంగా అర్థమయ్యే వీసా విధానాన్ని అందించడంతో పాటు, వారి చదువులకు సంబంధించిన ప్రణాళికలను నిశ్చింతగా రూపొందించుకోవడానికి ఈ నిబంధనలు వీలు కల్పిస్తాయి. కోర్సు కాలపరిమితికి అనుగుణంగా ఎక్కువ కాలం వీసా చెల్లుబాటు ఉండటం వల్ల మధ్యలో అనుమతులు పొందాల్సిన ఇబ్బందులు తగ్గుతాయి. తమ చదువు కొనసాగిస్తున్న సమయంలో అర్హులైన విద్యార్థుల రాకపోకలు సులభతరం అవుతాయి.

బిజినెస్ వీసా: పెట్టుబడులు, ప్రత్యేక కార్యకలాపాలకు సంబంధించి మరింత స్పష్టమైన నిబంధనలు

బిజినెస్ వీసా విభాగాన్ని బీ-1, బీ-2 పేర్లతో రెండు ఉప-విభాగాలుగా ఏకీకృతం చేశారు. దేశంలో పారిశ్రామిక, వ్యాపార సంస్థలను స్థాపించాలనుకునే విదేశీ పౌరులు సహా... దీర్ఘకాలిక, లైసెన్స్ ఆధారిత వ్యాపార కార్యకలాపాలకు బీ-1 వీసా వర్తిస్తుంది. ప్రొడక్షన్ ఇన్వెస్ట్‌మెంట్ బిజినెస్, సదస్సులు, క్రీడలు, ప్రదర్శనాత్మక కళలు, సినిమాలకు సంబంధించిన స్వల్పకాలిక, ఒప్పంద ఆధారిత వ్యాపార కార్యకలాపాలకు బీ-2 వీసా వర్తిస్తుంది.

యంత్రాలను అమర్చడం, వాటి కార్యాచరణను ప్రారంభించడం, నాణ్యత తనిఖీలు, అత్యవసర నిర్వహణ, ఉత్పత్తి, ఐటీ, ఈఆర్‌పీ వ్యవస్థల విస్తరణ, శిక్షణ, సరుకు రవాణా వ్యవస్థ అభివృద్ధి, ప్లాంట్ రూపకల్పన, ఏర్పాటు, ఉన్నత స్థాయి యాజమాన్యం, సాంకేతిక పరిజ్ఞానం, సేవల బదిలీ వంటి సాంకేతిక సహాయక కార్యకలాపాల కోసం భారతీయ కంపెనీలు నియమించుకునే విదేశీ విషయ నిపుణులు, ఇంజనీర్లు, సాంకేతిక సిబ్బంది కోసం ప్రత్యేక నిబంధనను రూపొందించారు. అటువంటి సిబ్బందికి ఈ-వీసా ప్లాట్‌ఫారమ్ ద్వారా బీ-2 విభాగం కింద ‘ప్రొడక్షన్ ఇన్వెస్ట్‌మెంట్ బిజినెస్ వీసా’ను మంజూరు చేస్తారు. గతంలో దీనిని ఈ-బీ4 వీసా పేరుతో మంజూరు చేసేవారు.

స్వల్పకాలిక ఒప్పంద పనులతో పోలిస్తే, దీర్ఘకాలిక పెట్టుబడులను ప్రణాళిక చేసేటప్పుడు ఈ వ్యత్యాసం వ్యాపారాలకు మరింత స్పష్టతను ఇస్తుంది. సాంకేతిక నిపుణుల కోసం ప్రత్యేక కేటాయింపు, పారిశ్రామిక సౌకర్యాలను ఏర్పాటు చేయడం, వాటిని కార్యాచరణలోకి తీసుకురావడం, సాంకేతిక పరిజ్ఞానాన్ని బదిలీ చేయడం, సిబ్బందికి శిక్షణ ఇవ్వడం, ఉత్పత్తికి మద్దతునివ్వడం కోసం నైపుణ్యాన్ని సకాలంలో వినియోగించడాన్ని ఇది సులభతరం చేస్తుంది. తద్వారా కంపెనీలు, విదేశీ నిపుణులు భవిష్యత్తును అంచనా వేసే సామర్థ్యాన్ని మెరుగుపరుస్తుంది.

సరళమైన, ఉద్దేశ-ఆధారిత వీసా విధానం

మొత్తంగా... ఈ మార్పుల వల్ల వివిధ వీసా విభాగాల మధ్య ఉండే గందరగోళం తగ్గుతుంది. సందర్శకులు, రోగులు, విద్యార్థులు, పరిశోధకులు, పెట్టుబడిదారులు, వ్యాపార నిపుణులు ఈ విధానాన్ని అర్థం చేసుకోవడం మరింత సులభతరం అవుతుంది. నిర్దిష్ట అర్హతలు, నిబంధనలకు లోబడి... మరింత స్పష్టమైన, అవసరాలకు తగిన వీసా ఎంపికలను అందించడం ద్వారా భారత్‌తో చట్టబద్ధమైన ప్రయాణాలు, విద్య, వైద్యం, ఆర్థిక కార్యకలాపాలను ప్రోత్సహించడమే ఈ హేతుబద్ధీకరణ ప్రధాన ఉద్దేశం.

భారత్‌ను సందర్శించే విదేశీ పౌరుల సౌలభ్యం కోసం సరళీకరించిన వీసా దరఖాస్తు ఫారంలు

23 వీసా విభాగాలు, ఉప-విభాగాలకు సంబంధించిన దరఖాస్తు ఫారంలను సరళీకరించడానికి, హేతుబద్ధీకరించడానికి కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఒక సమగ్ర ప్రక్రియను చేపట్టింది. దీని ద్వారా 23 వీసా విభాగాలు, ఉప-విభాగాల దరఖాస్తులన్నింటిలో పొందుపరచాల్సిన వివరాలను 65 నుంచి 70 శాతం వరకు తగ్గించారు. వీసా ప్రక్రియకు అత్యవసరమైన వివరాలను అడిగే విధానాన్ని కొనసాగిస్తూనే... దరఖాస్తు ఫారంను సులభతరం చేయడం, విదేశీ పౌరుల నుంచి సేకరించే సమాచారాన్ని గణనీయంగా తగ్గించడం ఈ ప్రక్రియ ప్రధాన ఉద్దేశం. దీనివల్ల దరఖాస్తుదారులు ఫారం నింపడానికి పట్టే సమయం, శ్రమ తగ్గడమే కాకుండా... వీసా దరఖాస్తులను మరింత క్షుణ్ణంగా పరిశీలించడానికి, వేగంగా పరిష్కరించడానికి వీలుండటంతో పరిపాలనా సామర్థ్యం మెరుగవుతుంది.

భారతీయ వీసా విధానంలో చేసిన అన్ని మార్పుల అమలు కోసం కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఐటీ వ్యవస్థలను ఆధునికీకరిస్తోంది. ఈ ఏడాది చివరి నాటికి కొత్త హేతుబద్ధీకరణ నిబంధనల ప్రకారం వీసాలు మంజూరు చేస్తారు.

సవరించిన వీసా విధానంలో ప్రస్తుతం కింది తొమ్మిది ప్రధాన విభాగాలు ఉన్నాయి:

క్ర.స.

ప్రధాన వీసా కేటగిరీ

మంజూరు చేసే ప్రయోజనం

1

బిజినెస్ వీసా

 

 

భారతదేశంలో పారిశ్రామిక, వ్యాపార సంస్థలను స్థాపించడం వంటి దీర్ఘకాలిక వ్యాపార కార్యకలాపాలు. క్రీడలు, సాంస్కృతిక/వాణిజ్య ప్రదర్శనల్లో పాల్గొనడం, ప్రొడక్షన్ ఇన్వెస్ట్‌మెంట్ బిజినెస్, సదస్సులకు హాజరు కావడం, డాక్యుమెంటరీలు, ప్రకటన చిత్రాలు సహా సినిమాల చిత్రీకరణ వంటి స్వల్పకాలిక వ్యాపార కార్యకలాపాలు.

2

డిప్లొమాటిక్ వీసా

భారతదేశంలో నియమితులైన, భారతదేశాన్ని సందర్శించే ఐక్యరాజ్యసమితి దౌత్యవేత్తలు సహా ఇతర దౌత్యవేత్తలు, వారిపై ఆధారపడిన కుటుంబ సభ్యులు.

3

వర్క్ వీసా

భారతీయ కంపెనీలు, సంస్థల్లో దీర్ఘకాలిక ఉపాధి, ప్రభుత్వేతర సంస్థల్లో పనిచేయడం, మిషనరీ కార్యకలాపాలు.

4

జర్నలిస్ట్ వీసా

భారత గుర్తింపు గల జర్నలిస్టులు

5

మెడికల్ వీసా

ఆయుష్ వైద్య విధానాల ద్వారా సహా ఇతర ఇన్సెంటివ్, ఆసుపత్రిలో చేరి చికిత్స పొందడం కోసం భారత్ వచ్చే విదేశీయులు, వారి సహాయకులు.

6

అధికారిక వీసా

భారతదేశంలో నియమితులైన లేదా భారత పర్యటనకు వచ్చే ఐక్యరాజ్యసమితి దౌత్యేతర అధికారులు సహా ఇతర దౌత్యేతర అధికారులు, వారిపై ఆధారపడిన కుటుంబ సభ్యులు.

7

విద్యార్థి వీసా

పాఠశాల, గ్రాడ్యుయేట్, పోస్ట్-గ్రాడ్యుయేట్ స్థాయి చదువులు. యోగా, వేద సంస్కృతి, భారతీయ సంగీతం, నృత్యంలో అధ్యయనాలు. బౌద్ధమత అధ్యయనాలు. భారతీయ భాషలు, భారతీయ విజ్ఞాన వ్యవస్థల అధ్యయనం. పరిశోధన, ఇంటర్న్‌షిప్, విద్యార్థి ఎక్స్‌చేంజ్ కార్యక్రమాలు.

8

సందర్శకుల వీసా

పర్యాటకం, వ్యాపార సమావేశాలు, వైద్య సంప్రదింపులు, వెల్‌నెస్ రిట్రీట్‌లతో కూడిన స్వల్పకాలిక కార్యకలాపాలు. రవాణా, పర్వతారోహణ.

9

ఇతర వీసా

భారత సంతతి వ్యక్తులు, వారి జీవిత భాగస్వాములు, పిల్లలు. ఆరోవిల్ ఫౌండేషన్ వంటి నిర్దిష్ట సంస్థల్లో చేరడానికి వచ్చేవారు. వివిధ దీర్ఘకాలిక వీసాలపై వచ్చే విదేశీ పౌరులపై ఆధారపడిన కుటుంబ సభ్యులు. ఆఫ్ఘనిస్తాన్ పౌరులకు ఇచ్చే బస వీసా. పొరుగు దేశాలకు చెందిన కొన్ని వర్గాల పౌరులకు ఇచ్చే దీర్ఘకాలిక వీసా. ఇతర ఏ వీసా విభాగంలోనూ చేర్చని వివిధ ఇతర అవసరాల కోసం వచ్చేవారు.

 

***


(రిలీజ్ ఐడి: 2335413) సందర్శకుల సూచీ సంఖ్య : : 10
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , हिन्दी , Assamese , Punjabi , Gujarati , Odia , Tamil , Kannada , Malayalam