గృహ నిర్మాణం మరియు పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ
నాడు పోస్టు చేయడమైనది:
11 NOV 2026 8:31PM by PIB Hyderabad
న్యూఢిల్లీలోని విజ్ఞాన్ భవన్ వేదికగా జరిగిన 'స్వచ్ఛ సర్వేక్షణ్ 2025–26 పురస్కారాల' ప్రదానోత్సవంలో భాగంగా... దేశంలోనే అత్యంత స్వచ్ఛమైనవిగా ఎంపికైన నగరాలకు భారత రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము పురస్కారాలు ప్రదానం చేశారు. గృహ నిర్మాణ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ పరిధిలోని పట్టణ అభివృద్ధి విభాగం ఈ కార్యక్రమాన్ని నిర్వహించింది. కేంద్ర గృహ నిర్మాణ, పట్టణ వ్యవహారాల శాఖ, విద్యుత్ శాఖ మంత్రి శ్రీ మనోహర్ లాల్... గృహ నిర్మాణ, పట్టణ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి శ్రీ తోఖాన్ సాహుల సమక్షంలో విజేతలను సత్కరించారు. ఈ ఏడాది కింది 5 విభాగాల కింద మొత్తం 60 జాతీయ పురస్కారాలను ప్రకటించారు.
స్వచ్ఛ్ షెహర్ జోడి
క్లీన్ సిటీస్ ఆఫ్ సూపర్ స్వచ్ఛ్ లీగ్
5 జనాభా కేటగిరీల్లో స్వచ్ఛ్ షెహర్
స్వచ్ఛ నదీతీర పట్టణం
స్వచ్ఛ సముద్రతీర పట్టణం
క్లీన్ హిమాలయన్ సిటీ
రాష్ట్ర తొలి స్వచ్ఛ నగరం
ఈ కార్యక్రమంలో భారత రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము మాట్లాడుతూ... కేవలం ఏ ఒక్క సంస్థ కృషి వల్ల మాత్రమే పరిశుభ్రతను సాధించలేమనీ, దీనికి సంబంధిత వర్గాలన్నింటి క్రియాశీల భాగస్వామ్యం అవసరమని వ్యాఖ్యానించారు. పౌరుల భాగస్వామ్యం, ప్రవర్తనలో మార్పు, పరిపాలనలో జవాబుదారీతనం, ప్రజలు నిరంతరం నిమగ్నమవ్వాల్సిన ప్రాముఖ్యతను ఆమె ఉద్ఘాటించారు. చిన్న వయస్సు నుంచే పిల్లల్లో పరిశుభ్రత సంబంధిత విలువలను పెంపొందించాల్సిన అవసరాన్ని ప్రముఖంగా ప్రస్తావించారు. ప్లాస్టిక్ వ్యర్థాల నిర్వహణ వంటి అంశాలను పాఠశాల పాఠ్యాంశాల్లో చేర్చాలని సూచించారు. పిల్లలు, యువతతో నిరంతర సంభాషణనూ ప్రోత్సహించాలని ఆమె పిలుపునిచ్చారు. పౌరులు, స్థానిక పరిపాలన యంత్రాంగాలు, పారిశుధ్య కార్మికులు కలిసి పనిచేసినప్పుడు... పారిశుధ్య కార్మికుల క్షేత్రస్థాయి సూచనలకు, పౌరుల అభిప్రాయాలకు తగిన ప్రాధాన్యత ఇచ్చినప్పుడు మాత్రమే పారిశుధ్య రంగంలో అర్థవంతమైన పురోగతి సాధ్యమవుతుందని రాష్ట్రపతి పేర్కొన్నారు. నగరాలు నూతన ఆవిష్కరణలను పంచుకోవడానికి, పరిష్కారాలను పరీక్షించడానికి, ఉన్నత ప్రమాణాలతో కూడిన పట్టణ పరిశుభ్రతను సాధించడంలో పరస్పరం మద్దతునిచ్చుకోవడానికి వీలు కల్పించే 'స్వచ్ఛ షెహర్ జోడి' కార్యక్రమం సహకార అభ్యాసంలో కొత్త కోణమని శ్రీమతి ద్రౌపది ముర్ము ప్రశంసించారు.
కేంద్ర గృహ నిర్మాణ, పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీ మనోహర్ లాల్ మాట్లాడుతూ... ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ దార్శనిక నాయకత్వంలో స్వచ్ఛ భారత్ మిషన్ ఒక దేశవ్యాప్త ప్రజా ఉద్యమంగా రూపుదిద్దుకుందన్నారు. ఇది పట్టణ పారిశుధ్యాన్ని మార్చడంతో పాటు పౌరుల భాగస్వామ్యాన్నీ ప్రోత్సహించిందని పేర్కొన్నారు. 2014 నుంచి సాధించిన పురోగతిని ప్రముఖంగా ప్రస్తావిస్తూ... పట్టణ వ్యర్థాల శుద్ధి 16 శాతం నుంచి 80 శాతానికి పెరిగిందనీ, ఇంటింటి నుంచి వ్యర్థాల సేకరణ కవరేజీ 44 శాతం నుంచి 96 శాతానికి పైగా పెరిగిందనీ ఆయన పేర్కొన్నారు. పాత వ్యర్థాల డంప్సైట్ల పునరుద్ధరణతో దాదాపు 11,000 ఎకరాల పట్టణ భూమి ఉత్పాదక వినియోగానికి అందుబాటులోకి వచ్చిందని కేంద్ర మంత్రి వివరించారు.
తమ తమ రాష్ట్రాల్లోని నగరాలు, పట్టణాలకు ర్యాంకులు ఇచ్చేందుకు రాష్ట్ర స్థాయిలోనూ స్వచ్ఛ సర్వేక్షణ్ పోటీలను నిర్వహించాలని రాష్ట్రాలను కేంద్ర మంత్రి ప్రోత్సహించారు. తద్వారా పట్టణ స్థానిక సంస్థల మధ్య ఆరోగ్యకరమైన పోటీని పెంపొందించడంతో పాటు, చిన్న పట్టణాలు తమ పరిశుభ్రతా ప్రమాణాలను మెరుగుపరుచుకునేలా ప్రోత్సహించవచ్చని శ్రీ మనోహర్ లాల్ పేర్కొన్నారు.
2016లో 73 నగరాలతో ప్రారంభమైన స్వచ్ఛ సర్వేక్షణ్... 2025-26 నాటికి 4,751 నగరాలకు విస్తరించిందని కేంద్ర మంత్రి తెలిపారు. నానాటికీ మెరుగవుతున్న ఈ కార్యక్రమ స్థాయిని, ప్రభావాన్ని శ్రీ మనోహర్ లాల్ ప్రముఖంగా ప్రస్తావించారు. ఈ ఏడాది సర్వేలో 2.70 కోట్ల మంది పౌరులు తమ అభిప్రాయాలను అందించారన్నారు. 1,700కు పైగా చిన్న నగరాలు తమ ర్యాంకులను మెరుగుపరుచుకున్నాయనీ, 350కి పైగా నగరాలూ 500కు పైగా స్థానాలు మెరుగుపరుచుకున్నాయని ఆయన తెలిపారు. ప్రవర్తనా మార్పు ప్రాముఖ్యతను ప్రముఖంగా ప్రస్తావిస్తూ... కేవలం ర్యాంకులను మెరుగుపరచడంలోనే కాకుండా... పరిశుభ్రతను ఒక శాశ్వత అలవాటుగా, సామూహిక బాధ్యతగా మార్చడం స్వచ్ఛ సర్వేక్షణ్ నిజమైన విజయం అవుతుందని కేంద్ర మంత్రి అన్నారు. స్వచ్ఛతా హి సేవా-2026లో దాదాపు 2.10 కోట్ల మంది పౌరులు పాల్గొనడం, 33,000కు పైగా ప్రత్యేక శిబిరాల ద్వారా సుమారు 17 లక్షల మంది సఫాయిమిత్రలకు ప్రయోజనాలు చేకూరడం, విజ్ఞాన యాత్రల్లో దాదాపు 4 లక్షల మంది పిల్లలు పాల్గొనడం వంటి విషయాలనూ ఆయన ప్రముఖంగా ప్రస్తావించారు.
పట్టణ పారిశుధ్యంలో సహకారాన్ని బలోపేతం చేయడానికి, శ్రేష్ఠతను ప్రోత్సహించడానికి ఉద్దేశించిన అనేక కొత్త కార్యక్రమాలను కేంద్ర మంత్రి వివరించారు. స్వచ్ఛ షెహర్ జోడి కార్యక్రమం కింద... జ్ఞానాన్ని పంచుకోవడానికి, పారిశుధ్య ఫలితాలను మెరుగుపరచడానికి 70 మార్గదర్శక నగరాలను 191 శిక్షణ నగరాలతో జత చేసినట్లు ఆయన పేర్కొన్నారు. విస్తృత భాగస్వామ్యాన్ని నిర్ధారించడానికి, నదీతీర పట్టణాలు, సముద్రతీర పట్టణాలు, హిమాలయ ప్రాంత నగరాల కోసం ప్రత్యేక పురస్కార విభాగాలను ప్రవేశపెట్టినట్లు కేంద్ర మంత్రి తెలిపారు. ఐదు జనాభా వర్గాల్లో గుర్తింపునూ ఆయన ప్రస్తావించారు. ప్రగతి-50 కార్యక్రమాన్ని ప్రముఖంగా ప్రస్తావిస్తూ... సాంకేతికత వినియోగం, నిరంతర పర్యవేక్షణ ద్వారా 50 నగరాలను మోడల్ క్లీన్ సిటీలుగా అభివృద్ధి చేస్తామని శ్రీ మనోహర్ లాల్ అన్నారు. పురస్కారాలను గెలుచుకున్న అన్ని నగరాలు, పట్టణ స్థానిక సంస్థలు, సఫాయిమిత్రలను అభినందిస్తూ... పరిశుభ్రతను పట్టణ జీవితంలో అంతర్భాగంగా మార్చడానికి... స్వచ్ఛభారత్, వికసిత్ భారత్ దార్శనికతలను సాకారం చేయడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని కేంద్ర మంత్రి పునరుద్ఘాటించారు.
ఎంవోహెచ్‌యూఏ, డీవోయూడీ కార్యదర్శి శ్రీ సతేంద్ర సింగ్ మాట్లాడుతూ... గత దశాబ్ద కాలంలో స్వచ్ఛ సర్వేక్షణ్ ద్వారా పట్టణ పారిశుధ్య సేవల మదింపు, మెరుగుదల బలోపేతమైన తీరును వివరించారు. ఈ మిషన్ కింద క్షేత్రస్థాయిలో స్పష్టమైన ఫలితాలను సాధించిన తీరునూ ఆయ ప్రస్తావించారు. స్వచ్ఛ సర్వేక్షణ్ కేవలం ఒక మదింపు మాత్రమే కాదనీ... అది స్వచ్ఛ భారత్ ఆశయానికి కట్టుబడి ఉన్న లక్షలాది మంది ప్రజల సమష్టి గళమని ఆయన పేర్కొన్నారు. "పరిశుభ్రత సాధనలో మన నగరాలు, పౌరుల అద్భుత కృషిని నేడు వేడుకగా జరుపుకొంటున్నాం" అని శ్రీ సతేంద్ర సింగ్ అన్నారు.
స్వచ్ఛ సర్వేక్షణ్ 2025–26 ఫలితాలు పట్టణ భారతం అంతటా బలమైన పురోగతిని ప్రతిబింబిస్తున్నాయి. 350కి పైగా పట్టణ స్థానిక సంస్థలు తమ స్థానాలను 500కి పైగా ర్యాంకులు మెరుగుపరుచుకున్నాయి. ఈ పరివర్తనలో చిన్న నగరాలు కీలక చోదకాలుగా నిలిచాయి. 50,000 కంటే తక్కువ జనాభా ఉన్న 1,700కు పైగా పట్టణ స్థానిక సంస్థలు 2024–25తో పోలిస్తే తమ ర్యాంకులను గణనీయంగా మెరుగుపరుచుకున్నాయి. నిరంతర ప్రయత్నాలు, పౌరుల భాగస్వామ్యం అన్ని పరిమాణాల పట్టణాల్లో స్వచ్ఛతా ఉద్యమాన్ని వేగవంతం చేస్తున్నాయని ఇది నిరూపిస్తోంది.
సహకార ప్రయత్నాలు, సహచర అభ్యసనంలో శ్రేష్ఠతను కనబరిచిన మెంటర్ నగరం అహ్మదాబాద్ - మెంటీ నగరం సనంద్... మెంటర్ ఇండోర్ - మెంటీ దీపాల్పూర్... మెంటర్ తిరుపతి - మెంటీ కుప్పంలను స్వచ్ఛ్ షెహర్ జోడి పురస్కార విభాగంలో అగ్రశ్రేణి జోడీలుగా ప్రకటించారు. మెంటర్ నగరం (ఎస్ఎస్ 2024-25 పురస్కార గ్రహీత)- దాని జత మెంటీ నగరంల సంయుక్త స్కోరు ఆధారంగా తొలి 3 స్వచ్ఛ్ షెహర్ జోడీలను ఎంపిక చేశారు. ఇది స్వచ్ఛ్ షెహర్ జోడీ కార్యక్రమం కింద రెండు నగరాల ఉమ్మడి పనితీరును, సహకార ప్రయత్నాలనూ ప్రతిబింబిస్తుంది. తద్వారా మార్గదర్శకత్వ ఫలితాలతో పాటు మొత్తంగా పరిశుభ్రత, సేవల పంపిణీలో మెరుగుదలనూ గుర్తిస్తుంది. తక్కువ స్కోరు సాధించిన నగరాలు తమ పనితీరును మెరుగుపరుచుకోవడానికి అత్యుత్తమ పనితీరు కనబరిచిన నగరాలు చేయూతనివ్వాలనేది ఈ జోడి పురస్కార ఉద్దేశం. పట్టణ శ్రేష్ఠత, పరిశుభ్రత దిశగా సాగే ప్రయాణాన్ని సమష్టిగా ముందుకు తీసుకెళ్లేందుకు... జ్ఞానం, అనుభవం, ఉత్తమ పద్ధతులను ఒక నగరం నుంచి మరొక నగరానికి అందించడం ఈ కార్యక్రమ లక్ష్యం. భారత కాలాతీత గురు-శిష్య సంప్రదాయంలో పాతుకుపోయిన 'ప్రతి ఒక్కరూ - ఒకరికి నేర్పించండి' అనే నినాదం స్ఫూర్తిగా 2024-25 పురస్కారాల ప్రదానోత్సవం తర్వాత ఈ కార్యక్రమం ప్రారంభమైంది.
మహారాష్ట్రలోని నవీ ముంబై, గుజరాత్‌లోని సూరత్, ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడ నగరాలు 'సూపర్ స్వచ్ఛ లీగ్'లో అత్యంత పరిశుభ్రమైన నగరాలుగా తొలి మూడు స్థానాల్లో నిలిచాయి.
స్వచ్ఛమైన నగరాల కొత్త తరానికి నాంది పలుకుతూ... పది లక్షలకు పైగా జనాభా కలిగిన నగరాల విభాగంలో జీవీఎంసీ విశాఖపట్నం, జబల్పూర్, లక్నోలు దేశంలోని అత్యుత్తమ 'స్వచ్ఛ నగరాలు'గా నిలిచాయి.
స్వచ్ఛ సర్వేక్షణ్ 2025-26 పురస్కారాల్లో నదీతీర, సముద్రతీర పట్టణాలతో పాటు కొండ-హిమాలయ నగరాలనూ చేర్చి ఈ కార్యక్రమ పరిధిని మరింత విస్తరించారు. ఉత్తరాఖండ్‌లోని రుద్రపూర్, జమ్మూ కాశ్మీర్‌లోని జమ్మూ, షోపియాన్లను తొలి 3 పరిశుభ్రమైన హిమాలయ నగరాలుగా ప్రకటించారు. నదీతీరాలు, సముద్ర తీరప్రాంతాలు, జలాశయాలు ప్రకృతిపరమైన, సాంస్కృతిక వారసత్వంలో అంతర్భాగం. వాటి పరిశుభ్రత... పర్యావరణ సుస్థిరతకు మాత్రమే కాకుండా పౌర సమాజాల ఆరోగ్యం, జీవనోపాధికీ అత్యవసరం. దీనికి అనుగుణంగా... స్వచ్ఛ నదీతీర పట్టణాల విభాగంలో తొలి 3 ర్యాంకులను వరుసగా రేవా (మధ్యప్రదేశ్), బిలాస్పూర్ (ఛత్తీస్‌గఢ్), వారణాసి (ఉత్తరప్రదేశ్)లకు ప్రదానం చేశారు. స్వచ్ఛ సముద్రతీర పట్టణాల పురస్కారాలు ఒడిశాలోని పూరీ, కేరళలోని అలప్పుజ, మహారాష్ట్రలోని రత్నగిరికి లభించాయి.
వివిధ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో అత్యుత్తమ పనితీరు కనబరిచిన 30 నగరాలకు 'స్టేట్ ఫస్ట్ స్వచ్ఛ సిటీ పురస్కారం' అందించారు. ఈ పురస్కారాల కోసం కేంద్రపాలిత ప్రాంతాలను రెండు వర్గాలుగా విభజించారు: (i) 5 వరకు పట్టణ స్థానిక సంస్థలు ఉన్నవి (ii) 5 కంటే ఎక్కువ పట్టణ స్థానిక సంస్థలు ఉన్నవి.
స్వచ్ఛ సర్వేక్షణ్ 10వ ఎడిషన్‌లో భాగంగా... పట్టణ స్థానిక సంస్థలను 10 కీలక రంగాల్లోని 43 సూచికల ఆధారంగా అంచనా వేశారు. వీటిలో వ్యర్థాల విభజన, సేకరణ, రవాణా, ఘన వ్యర్థాల నిర్వహణ, కంటికి కనిపించే పరిశుభ్రత, పారిశుధ్య సౌకర్యాల లభ్యత, బురద తొలగింపు సేవల యాంత్రీకరణ, పర్యావరణ వ్యవస్థ బలోపేతం, సంస్థాగత ప్రమాణాలు, మురుగునీటి నిర్వహణ, స్వచ్ఛత కోసం ప్రచారం, పారిశుధ్య కార్మికుల సమగ్ర సంక్షేమం, పౌరుల అభిప్రాయం, ఫిర్యాదుల పరిష్కారం వంటివి భాగంగా ఉన్నాయి. 3,000 మందికి పైగా శిక్షణ పొందిన మదింపుదారులు, రియల్-టైమ్ జీపీఎస్-ఆధారిత పర్యవేక్షణ మద్దతుతో దేశవ్యాప్తంగా విస్తృతమైన క్షేత్రస్థాయి మూల్యాంకనాలను చేపట్టారు. సాక్ష్యాధారాల సమర్పణ నుంచి ధ్రువీకరణ వరకు... మొత్తం మదింపు ప్రక్రియను పూర్తిగా డిజిటల్, పారదర్శక, కఠిన నాణ్యతా-హామీ గల విధాన ప్రణాళిక ద్వారా నిర్వహించారు. ఇది ప్రతి దశలో విశ్వసనీయతను, స్థిరత్వాన్ని నిర్ధారించింది.
*****